భయపెడుతున్న ‘భ్రష్టత్వం’

 Abk prasad writes opinion for justice chelameswar - Sakshi

♦ రెండో మాట
జస్టిస్‌ చలమేశ్వర్‌ తన పరిధిలో, ఉన్న అవకాశంలో న్యాయవ్యవస్థ పరువును కాపాడటానికి చేసిన ప్రయత్నం ధర్మబద్ధమే. ఇంతకుముందు కూడా జవహర్‌లాల్‌ నెహ్రూ యూని వర్సిటీ విద్యార్థి నాయకులపై అధికారుల దురుసు ప్రవర్తన, కోర్టు ఆవరణలోనే విద్యార్థి నాయకులపై జరిగిన దాడి ధోరణి పట్ల, వీరిపై ‘దేశద్రోహం’ ఆరోపణలను సంధించడానికి సిద్ధమైనప్పుడు కూడా జస్టిస్‌ చలమేశ్వర్‌ ‘ఇంతకూ ఈ దేశంలో ఏం జరుగుతోందో తెలుసుకోగోరుతున్నాం’ అని ధర్మాసనం తరఫున పరోక్షంగా ఒక ప్రశ్న లేవనెత్తారు.

‘ప్రజా బాహుళ్యానికి సామాజిక న్యాయం అందించడం అనే పదానికి ప్రకాశవంతమైన అర్థం ఉంది. కానీ ఆ అర్థాన్ని అవగతం చేసుకోలేని, రాజకీయ పరిజ్ఞానం లేని న్యాయమూర్తులు జీవితానికి అధికార వికేంద్రీకరణ ఎంత ప్రాథమిక అవసరమో గుర్తించలేరు. ప్రజలకు సన్నిహితం కాలేని ప్రజాస్వామ్యం ఒక పేరడీగా మిగిలిపోతుంది. న్యాయమూర్తులకు సామ్యవాద సామాజిక తాత్త్విక దృక్పథం కొరవడినా అది పరిహాసంగా మిగిలిపోక తప్పదు. కులీన వర్గ డంబాచారులైన ఇలాంటి న్యాయమూర్తులు, అధికారిక పదవుల కోసం, జీతానికి మించిన అదనపు సౌకర్యాల కోసం, అధికారిక జీతభత్యాల కోసం అవినీతి పాలైనప్పుడు తమను శాశ్వతంగా రక్షించగల ఏర్పాటు కోసం అంగలారుస్తారు.’– జస్టిస్‌ వీఆర్‌ కృష్ణయ్యర్‌ (సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి,లీగల్‌ స్పెక్ట్రమ్, 2011)

ప్రజాస్వామ్య వ్యవస్థకు చెందిన నాలుగు ప్రధాన అంగాలు– శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పత్రికలు– గడచిన డెబ్బయ్‌ఏళ్లలో భ్రష్టుపట్టిపోయాయి. దేశంలో సంభవిస్తున్న అనేక పరిణామాలే ఇందుకు నిదర్శనం.’– జస్టిస్‌ చలమేశ్వర్‌ (సుప్రీంకోర్టు న్యాయమూర్తి, 20–12–2017)

జస్టిస్‌ చలమేశ్వర్‌ అభిప్రాయపడుతున్నట్టు ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ఉద్దేశించిన ఆ నాలుగు స్తంభాలు ‘భ్రష్టుపట్టిపోవడానికి’ కారణాలు ఏమై ఉంటాయి? త్యాగాలతో, పోరాటాలతో భారత ప్రజానీకం స్వాతం త్య్రం సాధించుకుంది. కానీ ఆ స్వరాజ్య లక్ష్యానికి అనుగుణమైన సాంఘిక, ఆర్థిక వ్యవస్థను ఏర్పరచుకోవడంలో పాలక వర్గాలు విఫలం కావడమే ఆ భ్రష్టత్వానికి వెనుక ఉన్న కారణాలలో ప్రధానమైనది. పాలకులు ధనిక వర్గానికి చెందినవారు కావడం, లేదా ధనికవర్గం నుంచి పాలకులు కొన్ని ప్రయోజనాలను ఆశించడం కూడా కారణమే. రాజకీయ పక్షాలను (ఏ బ్రాండ్‌ అయినా కూడా), శాసన వేదికలను, పత్రికలను, న్యాయ వ్యవస్థలను కూడా ధనికవర్గ పాలకులు తమ ప్రయోజనాలకు అనుకూలంగా మలుచుకుం టారు. దీని ఫలితమే జస్టిస్‌ చలమేశ్వర్‌ వ్యాఖ్య.

మూలాలలోకి వెళితే.....!
ఈ నాలుగు ముఖ్య వ్యవస్థల మీద జస్టిస్‌ చలమేశ్వర్‌ బాహాటంగా విమర్శనాస్త్రాలు సంధించడానికి ఇటీవల సంభవించిన పరిణామాలే కారణం. రెండు మూడే అయినా అత్యంత బాధాకరమైనవి. అధికార స్థాయిలోనే బరితెగించినవి. అవి– 1. ఒడిశాలోని ఒక వైద్య కళాశాల ప్రవేశాల విషయంలో జరిగిన అవకతవకల మీద సీబీఐ కేసు పెట్టింది. అందులో భాగంగానే ఈ అవకతవకలతో సంబంధం ఉందన్న ఆరోపణతో ఆ రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తిని అరెస్టు చేసింది. ఈ వ్యవహారంలో పదవీ విరమణ చేసిన ఆ న్యాయమూర్తికి అంటిన ‘మకిలి’ మొత్తం న్యాయవ్యవస్థకే అంటుకున్నదనీ, కాబట్టి క్షుణ్ణంగా విచారణ జరపవలసిందేనని సుప్రీంకోర్టు సుప్రసిద్ధ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్నే జస్టిస్‌ చలమేశ్వర్‌ పరిశీలించి, ఆరోపణ తీవ్రమైనది కాబట్టి ఐదుగురితో కూడిన ధర్మాసనం విచారించాలని నిర్ణయించారు. కానీ గౌరవ ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా ఈ నిర్ణయాన్ని పక్కన పెట్టి వేరే ధర్మాసనాన్ని ఏర్పాటుచేశారు. అదే సమయంలో జస్టిస్‌ చలమేశ్వర్‌ సూచించిన ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి పేరు లేదు. ఈ పరిణామం మీద రకరకాల వ్యాఖ్యానాలు వెలువడినాయి.

జస్టిస్‌ చలమేశ్వర్‌ పేర్కొన్నట్టు ఆ నాలుగు వ్యవస్థల ‘భ్రష్టత్వా’నికి కారణమైన 2వ అంశం– అరుణాచల్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కలిఖోపుల్‌ (47) ఆకస్మిక మరణం, అనంతర పరిణామాలు. ఆధిపత్యం పోరులో అధికార, విపక్షాల కుట్రలకు బలైనవారు కలిఖోపుల్‌. దీని మీద ఏ వైపు నుంచీ ప్రతిస్పందన రాలేదు. రాజకీయ పార్టీల నుంచి, పత్రికల నుంచి, శాసనసభ్యుల నుంచి, పౌర సమాజం నుంచి కూడా స్పందన రాలేదు. ఆయన పేదరికం నుంచి స్వయంకృషితో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినవారు. తనకు వేదన కలిగించిన అంశాలను ఆత్మహత్య చేసుకోవడానికి ఒకరోజు (ఆగస్ట్‌ 8, 2016)ముందు 60 పేజీలలో రాసిపెట్టారు.

ఏడు మాసాల తరువాత ఆయన భార్య ద్వారా అవి సాక్షాత్తు ఢిల్లీలో వెలుగు చూసినప్పటికీ స్పందించినవారే కరువయ్యారు. కనుకనే ఈ ‘భ్రష్టాచార’ వ్యవస్థలోని పరిణామాల నుంచి దేశానికీ, ప్రజాస్వామ్యానికీ ఇప్పట్లో మోక్షం ఉండకపోవచ్చుననిపిస్తుంది. కానీ అలాంటి ఒక కుదుపు కోసమే, పాలక వ్యవస్థకు ఒక గుణపాఠం నేర్పడానికే ప్రజా బాహుళ్యం ఎదురుతెన్నులు కాస్తోంది. కనుకనే జ్ఞాన సంపన్నులైన పలువురు మాజీ న్యాయమూర్తులు ‘సామాజిక న్యాయం కలుగజేసేందుకు అధికార వికేంద్రీకరణ జరగడమే అత్యంత ప్రాధాన్యం గల ప్రాథమిక న్యాయం అవుతుంది. ఇందుకుగాను ప్రజాస్వామిక న్యాయవ్యవస్థ ఎలాంటి విభేదం లేకుండా ఏకవాక్యంతో, సాధికారికంగా, ఏకముఖంగా ముందడుగు వేయాల్సి ఉంద’ని అభిప్రాయపడ్డారు (‘జడ్జెస్‌ ఆన్‌ ఏ సింగిల్‌ బెంచ్‌ ‘‘ఎ హండ్రెడ్‌ మిలియన్‌ ఇండియన్స్‌ ఆస్కింగ్‌ ఫర్‌ జస్టిస్‌’).

ఇందుకు సమర్థన అనిపించేటట్టు ఇటీవల రాజ్యసభలో ముగ్గురు (కాంగ్రెస్‌) సభ్యుల పదవీ విరమణ సందర్భంగా సీనియర్‌ సభ్యుడు కరణ్‌సింగ్‌ (మిగతా ఇద్దరు; జనార్దన్‌ ద్వివేది, పర్వెజ్‌ హష్మి) కొన్ని వాస్తవాలు వెల్లడించారు. ‘ఇప్పుడు సభలో జరుగుతున్నవి చర్చలు కావు, తరచుగా అడ్డంకులు, అవరోధాలు, విచ్ఛిన్నతలూ. కానీ గతంలోనో! హిరేన్‌ ముఖర్జీ, మధులిమాయె, నా«థ్‌పాయ్, వాజ్‌పేయి, భూపేష్‌ గుప్తా వంటి హేమాహేమీలు జరిపినవి ప్రతిభావంతమైన చర్చల’ని ఆయన గుర్తుచేసి వెళ్లారు.

ధర్మాసన చైతన్యం ప్రజానుకూలమే
న్యాయవ్యవస్థలో ధర్మాసన చైతన్యాన్ని ప్రదర్శించడంలో పతంజలి శాస్త్రి, గజేంద్ర గడ్కర్, వీఆర్‌ కృష్ణయ్యర్, భగవతి, రాజేంద్ర సచార్‌ లాంటి న్యాయమూర్తుల ప్రతిభా సంపన్నతను దేశం గుర్తించింది. నేటి ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా హయాంలో ధర్మాసన చైతన్యం ప్రజానుకూల దిశలోనే సాగుతోంది. ఆధార్, గోప్యత అంశమే అందుకు నిదర్శనం. పౌరులను ‘కూపీ’లకు, నిఘాలకూ గురిచేస్తూ బీజేపీ పాలకులు ‘ఆధార్‌’ను చూపాలన్న నిబంధన సుప్రీంకోర్టులో చర్చకు వచ్చినప్పుడు వ్యక్తి స్వేచ్ఛ ‘గోప్యమైన’ హక్కు అనీ, అది అనుల్లంఘనీయమనీ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కానీ పాలకవర్గ పరోక్ష జోక్యంవల్లగానీ, ధర్మాసన చైతన్యంలో వచ్చిన సడలింపుల వల్లగానీ ఆ దశ మసకబారుతున్న సూచనలూ కన్పిస్తున్నాయి. ఒడిశా వైద్య కళాశాల ప్రవేశాల కేసులో ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌ ఏర్పాటు కావాలన్న జస్టిస్‌ చలమేశ్వర్‌ ఆదేశం అమలు కాకపోవడానికి కారణం ఇంతవరకు తెలియదు.

ఇదే కాదు, గతంలో కూడా సుప్రీంకోర్టులోని 16మంది ప్రధాన న్యాయమూర్తులలో 8 మందిపై అవినీతి ఆరోపణలతో ప్రశాంత్‌ భూషణ్‌ సమర్పించిన అఫిడవిట్‌ ఇప్పటికీ ఓ మూలన పడి ఉంది. ఈ విషయంలో జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని భూషణ్‌ సవాలు విసిరినా ధర్మాసన చైతన్యంలో మార్పులేదు. ఈ పరిణామం మీదనే జస్టిస్‌ కృష్ణయ్యర్‌ తన ‘లీగల్‌ స్పెక్ట్రమ్‌’లో ‘భూషణ్‌ బ్లాక్‌మెయిల్‌’ అన్న వ్యంగ్య శీర్షికతో ప్రచురించారు. ‘సుప్రీం న్యాయవ్యవస్థకు చెందిన తీవ్ర అవినీతి ఆరోపణలు నైతిక బలాన్ని దిగజార్చాయి. ప్రజలు నిర్ఘాంతపోయారు. ప్రశాంత్‌ భూషణ్‌ జ్యుడీషియరీపై చేసిన దాడిని పట్టించుకొనకపోతే అది అనైతికం. రాజ్యాంగ ఆదేశాలపట్ల అపచారం. బుద్ధుడు, గాంధీ మన సాంస్కృతిక మహనీయులయినప్పుడు మన సుప్రీం న్యాయమూర్తులకు అలాంటి నైతిక బలమే ఉండొద్దా? ఈ పరి ణామం తన ప్రతిపత్తికి సిగ్గుచేటైనదిగా ఇప్పటికిప్పుడే– ఎప్పుడో రేపు కాదు, పార్లమెంటు భావించవద్దా? వెంటనే చర్యకు దిగవద్దా? భూషణ్‌ కోర్టుకు సవాలు విసిరారు సాహసంతో, ఆ సవాలును అందుకునే పక్షంలో ఆయనపై కోర్టు ధిక్కారం నేరాన్ని ప్రకటించాలి’అని జస్టిస్‌ కృష్ణయ్యర్‌ ప్రకటించాల్సి వచ్చింది.

మరో మంచి ప్రయత్నం
ఆ స్థాయిలో కాకపోయినా జస్టిస్‌ చలమేశ్వర్‌ తన పరిధిలో, ఉన్న అవకాశంలో న్యాయవ్యవస్థ పరువును కాపాడటానికి చేసిన ప్రయత్నం ధర్మబద్ధమే. ఇంతకుముందు కూడా జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి నాయకులపై అధికారుల దురుసు ప్రవర్తన, కోర్టు ఆవరణలోనే విద్యార్థి నాయకులపై జరిగిన దాడి ధోరణి పట్ల, వీరిపై ‘దేశద్రోహం’ ఆరోపణలను సంధించడానికి సిద్ధమైనప్పుడు కూడా జస్టిస్‌ చలమేశ్వర్‌ ‘ఇంతకూ ఈ దేశంలో ఏం జరుగుతోందో తెలుసుకోగోరుతున్నాం’ అని ధర్మాసనం తరఫున పరోక్షంగా ఒక ప్రశ్న లేవనెత్తారు. ఇలాంటి చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకొనబట్టే కాబోలు, జస్టిస్‌ కృష్ణయ్యర్‌ ఒక సందర్భంలో ‘జడ్జీలయినంత మాత్రాన వారికి రాజకీయాలుండవా, పైకి కనపడని రాజకీయాలంటూ అసలుండవా?’ అని ప్రశ్నిం చారు. చాలామంది న్యాయమూర్తులు ‘తాము రాజకీయాలకు అతీతులమని చెప్పుకుంటారు. కానీ వారు రాజ్య పాలనలో మూడవశక్తి, రాజ్యాంగ రాజకీయాలు వారిని పాలిస్తూంటాయ’ని ఆయన గుర్తు చేశారు.

ఈ కారణం చేతనే ప్రపంచ ప్రఖ్యాత న్యాయమూర్తి లార్డ్‌ జస్టిస్‌ స్క్రూటన్‌ కూడా ‘జడ్జీలకు రాజకీయ తత్త్వశాస్త్ర పరిజ్ఞానం విధిగా ఉండాల’ న్నారు. కనుకనే కృష్ణయ్యర్‌ ఉద్దేశంలో ‘మనది సోషలిస్టు, సెక్యులర్‌ ప్రజాస్వామ్య గణతంత్ర రిపబ్లిక్‌ అని మన రాజ్యాంగం లక్ష్య నిర్దేశం చేసింది కాబట్టి, రాజ్యాంగ రాజకీయ తాత్వికతతో ఏకీభవించే జడ్జీలను మాత్రమే రిపబ్లిక్‌ నియమించుకోవాలి. ఎందుకని? అలా నిర్దేశించిన రాజ్యాంగం కిందనే జడ్జీలు నియమించబడ్డారు కాబట్టి’. కానీ రాజ్యాంగాన్ని మార్చడం కోసమే అధికారంలోకి వచ్చామని బీజేపీ ప్రకటించుకుంటున్నందునే ఏ నియమ నిబంధనలూ అది పాటించడం లేదు. ఇక్కడే పొంచి ఉంది అసలు ప్రమాదం. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్‌ పోలీస్‌ స్టేషన్లు కాషాయం రంగు అద్దుకుంటున్నాయని, ముస్లిం హజ్‌ ఆఫీసుల మీద కాషాయం రంగులు బలవంతంగా పూస్తున్నారని వార్తలు విస్తారంగా (8.1.18) వెలువడుతున్నాయి. ఈ సందర్భంగా కథకుడు గోపీచంద్‌ ఒక రచనకు పెట్టిన పేరు గుర్తుకొస్తోంది: ‘ఈ దేశం ఏమయ్యేట్టు?’!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

abkprasad2006@yahoo.co.in  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top