వారఫలాలు

varaphalalu inthis week - Sakshi

17 జూన్‌ నుంచి 23 జూన్‌ 2018 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. మొదట్లో కొద్దిపాటి వివాదాలు, సమస్యలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఉపయుక్తమైన సమాచారం అందుతుంది. ముఖ్యమైన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. నూతన విద్య,ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. రాజకీయవర్గాలకు సత్కారాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
అనుకున్న పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పూర్తి కాగలవు. బంధువుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరిస్తారు. గృహ, వాహనాలు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. గులాబి, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో తగాదాలు ఏర్పడవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ముఖ్యమైన పనులు ముందుకు సాగక డీలా పడతారు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు చేజారి నిరాశ చెందుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులకు తొందరవద్దు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. కళారంగం వారికి కొద్దిపాటి చికాకులు తప్పవు. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఉత్సాహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో వివాదాలు తీరతాయి. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు అధిగమిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణయత్నాలు కొలిక్కి వస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. మీపై వచ్చిన ఆరోపణల నుంచి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకమే. వ్యాపారాలలో ముందడుగు వేసి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాల యత్నాలు ఫలిస్తాయి. వారం చివరిలో అనారోగ్యం. సన్నిహితులతో విభేదాలు. పసుపు, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు.  విద్యార్థుల కష్టం వృథా కాదు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వాహనయోగం. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఇంటాబయటా గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు.  ఆరోగ్యసమస్యలు. గులాబి, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పలుకుబడి పెంచుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ప్రత్యర్థులు సైతం విధేయత ప్రకటిస్తారు. మీ వాక్చాతుర్యం అందర్నీ  ఆకట్టుకుంటుంది. సభలు, సమావేశాలలోనూ, వేడుకల్లోనూ పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలలో అనుకున్న పెట్టుబడులు సమకూరి ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో వివాదాలు. ఆకుపచ్చ, తెలుపురంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
వీరికి పట్టింది బంగారమే అన్నట్లుంటుంది. ఏ పని చేపట్టినా విజయవంతంగా కొనసాగుతాయి. ఆప్తులు, బంధువులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పైమెట్టుకు చేరుకుంటారు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. నేరేడు, లేత నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి ఫర్వాలేదనిపిస్తుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. గతాన్ని గుర్తుకు తెచ్చుకుని జీవనశైలిలో మార్పులు చేసుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. కళారంగం వారికి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. ఎరుపు, తెలుపురంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ను పూజించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొన్ని పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. ఆత్మీయులు, బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశపర్చినా అవసరాలు తీరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. గృహ, వాహనయోగాలు. ప్రముఖులతో పరిచయం. అందరిలోనూ సత్తా చాటుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. మిత్రులతో కలహాలు. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగుపడటంతో సంతోషంగా ఉంటారు. పనులు కొంత నెమ్మదిగా పూర్తి కాగలవు. బంధువులతో సత్సబంధాలు నెలకొంటాయి. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వివాహ, ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి చెందుతారు. కళారంగం వారికి మంచి గుర్తింపు రాగలదు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ సంస్థలలో భాగస్వామ్యం లభిస్తుంది. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. నలుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. మీశక్తియుక్తులు కుటుంబసభ్యులకు తెలుస్తాయి. విద్యావకాశాలు పొందుతారు. ఆప్తులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వాహనాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని అంచనాలు నిజం కాగలవు. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో గుర్తింపు పొందుతారు. కళారంగం వారికి యత్నాలుసఫలం. వారం ఫ్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. పసుపు, గులాబి రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో(17 జూన్‌ నుంచి  23 జూన్, 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
పనులు శరవేగంగా పూర్తి చేయడానికి తీరిక లేకుండా శ్రమిస్తారు. వేగమే వేదంగా ముందుకు సాగుతారు. అనుకోని రీతిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి నుంచి మీకు తగిన సహాయం లభిస్తుంది. ఉద్యోగ జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సంయమనం పాటించడం మంచిది. చిన్న చిన్న ప్రలోభాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆత్మనిగ్రహంతో ముందుకు సాగి గమ్యం చేరుకుంటారు. వారాంతంలో కొంత మందకొడిగా ఉంటుంది. పరిస్థితులన్నీ క్రమంగా దారిలోకి వస్తాయి. ఆశించిన ఫలితాలు దక్కాలంటే మరికొంత నిరీక్షణ తప్పదు.
లక్కీ కలర్‌: లేతనీలం

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
మీ ఆలోచనలు కాలం కంటే ముందుగా ఉంటాయి. భవిష్యత్‌ పరిణామాలపై మీ అంచనాలను, ఆలోచనలను మీ సహచరులు అర్థం చేసుకోలేకపోతారు. బంధు మిత్రలతో అనుబంధాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతాయి. ఒంటరిగా ఉంటున్న వారికి కొత్త అనుబంధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో అమోఘంగా రాణిస్తారు. చిక్కు సమస్యలు ఎదురైనా, చాకచక్యంగా వ్యవహరించి, వాటిని ఇట్టే పరిష్కరిస్తారు. అద్భుతమైన పనితీరు కనపరచి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. పదోన్నతుల వల్ల అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

మిథునం (మే 21 – జూన్‌ 20)
జీవితంలో భద్రతను కోరుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో విజయాలను ఆశిస్తారు. ఎటూ తేల్చుకోలేని డోలాయమాన పరిస్థితుల్లో ఊగిసలాడతారు. అనుకున్నట్లుగా పనులు జరగకపోవడంతో కొంత అస్థిమితంగా ఉంటారు. ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా బరువు తగ్గించుకోవడానికి వ్యాయామం బాట పడతారు. వారాంతంలోగా పరిస్థితులు చక్కబడతాయి. వృత్తి ఉద్యోగాల్లోని వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సొంత వ్యాపారాలు, ఇతర స్వయం ఉపాధి మార్గాల్లో ఉన్నవారికి ఆర్థిక లాభాలు బాగుంటాయి.
లక్కీ కలర్‌: లేత ఊదా

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఇంటా బయటా ఒత్తిడుల కారణంగా మానసికంగా కొంత అలజడికి లోనవుతారు. అతి ప్రయాసపై పరిస్థితులను నెమ్మదిగా చక్కదిద్దుకుంటారు. అంతులేని ఆలోచనలతో సతమతమవుతారు. పని మీద దృష్టి కేంద్రీకరించలేకపోతారు. సహచరులతో వాదనలు సాగిస్తారు. ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆరోగ్యం స్వల్పంగా మందగించే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన ద్వారా సాంత్వన పొందాలనుకుంటారు. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి వ్యాయామం వైపు, క్రీడల వైపు దృష్టి సారిస్తారు. ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా మెలగడం మంచిది.
లక్కీ కలర్‌: వెండి రంగు

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఉరకలేసే ఉత్సాహంతో పనులు కొనసాగిస్తారు. లక్ష్య సాధన దిశగా చకచకా ముందుకు సాగుతారు. పనులు పూర్తి చేయడంలో మీ వేగం, సడలని మీ ఉత్సాహం వల్ల సామాజికంగా పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఎదురయ్యే సమస్యలను చాకచక్యంగా అధిగమిస్తారు. అనుకున్న రీతిలో ఆర్థిక లక్ష్యాలను సాధిస్తారు. పెట్టుబడులపై లాభాలను అందుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో పరీక్షలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. విందు వినోదాల్లో, వేడుకల్లో పాల్గొంటారు. మిత్రులతో ఉల్లాసంగా కాలక్షేపం చేస్తారు.
లక్కీ కలర్‌: నారింజ

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
వృత్తి ఉద్యోగాల్లో అత్యుత్తమమైన పనితీరు కనపరుస్తారు. అలాగే, అంతకు మించిన ప్రతిఫలాన్నీ అందుకుంటారు. కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఒక కొత్త వ్యక్తి పట్ల ఆకర్షణ పెంచుకుంటారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. జీవనశైలిని మెరుగుపరుచుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. స్పెక్యులేషన్‌ లావాదేవీలు అనుకూలిస్తాయి. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. సడలని ఉత్సాహంతో విజయాల బాటలో ముందుకు సాగుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాల్సిన పరిస్థితులు ఉంటాయి. 
లక్కీ కలర్‌: లేత గోధుమ రంగు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
వాక్చాతుర్యం, ఇతరులను ఒప్పించే నేర్పు మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. మీ సహజ నైపుణ్యాలతోనే ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. కీలకమైన కార్యక్రమాలకు సారథ్యం వహిస్తారు. కొత్తగా చేపట్టే భారీ ప్రాజెక్టును ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటారు. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. వెన్నునొప్పి, తలనొప్పి వంటి బాధలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. ఆర్థికపరంగా పూర్తిగా కలిసొచ్చే కాలం ఇది. సామాజికంగా పలుకుబడి పెంచుకుంటారు. 
లక్కీ కలర్‌: గులాబి

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ప్రేమానుబంధాలలో తలెత్తిన పొరపొచ్చాలు సమసిపోతాయి. మనసులు కుదుటపడతాయి. ప్రేమానురాగాలు మరింతగా బలపడతాయి. చాలాకాలంగా ఇబ్బందిపెడుతూ వచ్చిన సమస్యల నుంచి తేలికగా గట్టెక్కుతారు. పని ఒత్తిడి నుంచి కొంత విరామం తీసుకుంటారు. మీ కోసం మీరు సమయం కేటాయించుకుంటారు. తీరిక సమయాన్ని అర్థవంతంగా వినియోగించుకుంటారు. విహార యాత్రల కోసం దూర ప్రయాణాలకు వెళ్లే సూచనలు ఉన్నాయి. ప్రతికూలమైన ఆలోచనలను విరమించుకుంటే వృత్తి ఉద్యోగాల్లో మరిన్ని మంచి ఫలితాలను సాధించగలుగుతారు. 
లక్కీ కలర్‌: బూడిద రంగు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
అతిశయాలకు పోయేవారి పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిది. ఇదివరకటి పొరపాట్లను పునరావృతం కానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తారు. ఏకాగ్రత లోపిస్తుంది. కొత్త కొత్త అవకాశాల వైపు దృష్టి సారిస్తారు. ఆర్థిక పరిస్థితిని కొంతవరకు మెరుగుపరచుకుంటారు. కుటుంబంలో పొరపొచ్చాలు తలెత్తవచ్చు. అనవసర వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఇల్లు లేదా స్థలం కొన్న చిరకాల వాంఛను నెరవేర్చుకోగలుగుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు.
లక్కీ కలర్‌: ఎరుపు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
అనుకున్న పనులన్నీ సంతృప్తికరంగా జరుగుతాయి. ఇంతకాలం పడిన శ్రమకు ఇప్పుడు తగిన ఫలితాలను అందుకుంటారు. ఆత్మబంధువు కోసం సాగిస్తున్న అన్వేషణ ఫలిస్తుంది. ఇతరుల ప్రభావం నుంచి బయటపడటానికి ప్రయాస పడాల్సి వస్తుంది. మీపై మానసిక ఆధిపత్యం సాధించడానికి కొందరు పావులు కదుపుతుంటారు. అలాంటి వారిని పసిగట్టి, వారిని దూరం పెట్టడం క్షేమం. శరీరాకృతిపై శ్రద్ధ చూపిస్తారు. వ్యాయామం వైపు మొగ్గుతారు. ఆహార విహారాల్లో ఆరోగ్యకరమైన మార్పులు చేపడతారు. ఆర్థిక లాభాలను ఇచ్చే కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు.
లక్కీ కలర్‌: తుప్పు రంగు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
మీ సహజ స్వభావంతో ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు. కొత్తగా పరిచయమైన వారు సైతం మీ ఆకర్షణలో పడిపోతారు. జీవితం పట్ల, ప్రేమానుబంధాలలోని సంక్లిష్టతల పట్ల ఆత్మావలోకనం చేసుకుంటారు. సామర్థ్యానికి మించిన బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. మనో నిబ్బరం కోల్పోకుండా సవాళ్లను ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగాల్లో అవరోధాలను అధిగమిస్తారు. మెరుగైన పనితీరుతో పురోగతి సాధిస్తారు. ఎలాంటి ప్రయత్నం లేకుండానే కొత్త అవకాశాలు తలుపుతడతాయి. వాటిని అందిపుచ్చుకుని, ఆర్థిక పురోగతికి కొత్త బాటలు వేసుకుంటారు.
లక్కీ కలర్‌: మట్టి రంగు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఉత్సాహంతో ఉరకలేస్తారు. ఆర్థికంగా అంచనాలకు మించిన ఫలితాలను సాధిస్తారు. జనాకర్షణ పెంచుకుంటారు. ఇతరులను తేలికగా ప్రభావితం చేయగలుగుతారు. ఇంట్లో మార్పులకు శ్రీకారం చుడతారు. గడ్డు సమస్యలను పరిష్కరించడంలో కొంత లౌక్యం అవసరమని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ప్రేమానుబంధాల్లో పరీక్షలు ఎదురుకావచ్చు. విద్యార్థులు వినోదాన్ని పక్కనపెట్టి మరింతగా ఏకాగ్రతను పెంచుకోవాల్సి ఉంటుంది.
లక్కీ కలర్‌: లేతాకుపచ్చ
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top