ముచ్చటగా మూడు వంటలు

Tasty Snacks With Easy Steps - Sakshi

స్నాక్‌ సెంటర్‌

శనగపప్పు దోసెలు
కావలసినవి: ఆలూ మసాలా కర్రీ – 2 కప్పులు (ముందుగా రెడీ చేసుకోవాలి), బియ్యం – 4 కప్పులు, శనగ పప్పు – ఒకటిన్నర కప్పులు , మినప్పప్పు – 1 కప్పు, మెంతులు – 1 టీ స్పూన్‌, పంచదార – ఒక టీ స్పూన్‌, ఉప్పు – సరిపడా
తయారీ: శనగ పప్పు, బియ్యం, మినప్పప్పులను విడివిడిగా 5 గంటల పాటూ నానబెట్టుకోవాలి. తర్వాత అన్నింటినీ కలిపి మిక్సీలో పేస్ట్‌లా చేసుకుని రాత్రంతా పక్కన పెట్టుకోవాలి. మరునాడు నెయ్యితో దోసెలు వేసుకుని పైన ఆలూ మసాలా కర్రీని పెట్టి మడుచుకోవాలి.  వీటిని కొబ్బరి చట్నీతో తింటే భలే రుచిగా ఉంటుంది.

మీల్‌ మేకర్‌ పకోడీ
కావలసినవి: మీల్‌ మేకర్‌ – అర కప్పు, మొక్కజొన్న పిండి – అర కప్పు, బియ్యప్పిండి – అర కప్పు , శనగపిండి – అర కప్పు, ఉల్లిపాయ తరుగు – 1 కప్పు, కారం – అర టీ స్పూన్, నిమ్మరసం – 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు – 2 టీ స్పూన్లు, నూనె – డ్రీప్‌ ఫ్రైకి సరిపడా, నీళ్లు – కొద్దిగా, ఉప్పు – తగినంత
తయారీ: ముందుగా వేడి నీళ్లలో మీల్‌ మేకర్‌ వేసుకుని పది లేదా పదిహేను నిమిషాల పాటూ నానబెట్టుకోవాలి. తర్వాత నీళ్లు పిండిన మీల్‌ మేకర్స్‌ తురుముకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో మీల్‌ మేకర్‌ తురుము, మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ఉల్లిపాయ తరుగు, నిమ్మరసం అన్ని వేసుకుని కాస్త నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌ షేప్‌లో చేసుకుని.. మరుగుతున్న నూనెలో వేసుకుని దోరగా వేయించుకోవాలి.

ఆపిల్‌ హల్వా
కావలసినవి: ఆపిల్‌ – 3, పంచదార – ముప్పావు కప్పు, నెయ్యి – 1 కప్పు, ఏలకుల పొడి – అర టీ æస్పూను, జీడిపప్పు ముక్కలు – 1 టీ స్పూ న్, బాదం ముక్కలు – 1 టీ స్పూన్‌
తయారీ: ముందుగా ఆపిల్స్‌ శుభ్రం చేసుకుని, తొక్కలు తొలగించి మిక్సీ పట్టుకుని గుజ్జులా చేసుకోవాలి. స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. పాత్రపెట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ నెయ్యి వేసుకుని వేడి కాగానే.. జీడిపప్పు ముక్కలు, బాదం ముక్కలు వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ నెయ్యిలో ఆపిల్‌ గుజ్జు వేసుకుని బాగా కలపాలి. స్టవ్‌ మంట తగ్గించి పది నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ ఉండాలి. తర్వాత పంచదార వేసి బాగా కలపాలి. ఇప్పుడు గరిటెతో తిప్పుతూ మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఉండాలి. ఆపిల్‌ మిశ్రమం దగ్గరపడగానే.. ఏలకుల పొడి, జీడిపప్పు ముక్కలు, బాదం ముక్కలు కూడా అందులో కలుపుకుని గరిటెతో తిప్పుతూ 2 నిమిషాలకు ముందే దించేసుకోవచ్చు.
సేకరణ: సంహిత నిమ్మన

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top