చనిపోతానని బెదిరిస్తున్నాడు... ఎలా?

చనిపోతానని బెదిరిస్తున్నాడు... ఎలా?


కిడ్‌‌స మైండ్‌‌స

మా బాబు మూడో తరగతి చదువు తున్నాడు. చాలా తెలివైనవాడు. కాకపోతే చాలా తిక్క. చిన్న మాట అంటే చాలు... ఉక్రోషం వచ్చేస్తుంది. ఓ మూలకు పోయి ఏడుస్తుంటాడు. ఎంత బతిమాలినా ఆపడు. దగ్గరకు రాడు. మాట్లాడడు. తినమంటే తినడు. గంటల పాటు అలాగే బిగుసుకుపోతాడు. మళ్లీ తనంతట తను రావాలే తప్ప, మేం ఏం చేసినా మామూలవడు. ఈ పద్ధతి ఎలా మార్చాలో చెప్పండి ప్లీజ్.

 - సునంద, రైల్వే కోడూరు

 

 బాబు అలిగినప్పుడు బతిమాలడం బాగా అలవాటయినట్టుగా ఉంది. మీరు డిసిప్లిన్ నేర్పుతున్నప్పుడు తనకి ఇంత ఉక్రోషం రావడం మంచిది కాదు. ఇకపై కొన్నాళ్లు బతిమాలడం మానెయ్యండి. తను అలిగినప్పుడు ఇక చాలు రమ్మని పిలవండి. రాకపోతే మళ్లీ పిలవం అని కూడా చెప్పండి.

 

 అయినా తను అలానే ఉంటే... ఎవరూ తనని లక్ష్యపెట్టకుండా మీ పని మీరు చేసుకోండి. మొదట్లో మీరలా చేయడం చూసి ఇంకా ఎక్కువ అలగొచ్చు. ఎక్కువ బిగుసుకుపోవచ్చు. అయినా మీరు కంగారు పడకుండా అలాగే వదిలెయ్యండి. కొన్ని రోజులకు తనలో తప్పక మార్పు వస్తుంది. అలిగినా అటెన్షన్ దొరకదని అర్థమై నెమ్మదిగా మానేస్తాడు. ఇలా జరగడానికి ఒకట్రెండు నెలలు పట్టవచ్చు. కానీ మీరు ఓపిగ్గా ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.

 

 మా పాప వయసు నాలుగేళ్లు. విపరీతమైన అల్లరి చేస్తోంది. ఆ వయసులో అల్లరి మామూలే కానీ తను చేసే పనులు మరీ ఇబ్బందికరంగా ఉంటున్నాయి. లేని పోని ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీ ఎక్కి, టేబుల్ మీద ఉన్న వంటకాల్లో అవీ ఇవీ కలిపేస్తుంది. కిందకి ఉన్న స్విచ్‌బోర్డుల దగ్గరకు వెళ్లి, ప్లగ్ హోల్స్‌లో వేళ్లు పెడుతుంది. మొన్న బొమ్మలో ఉండే చిన్న బ్యాటరీలు మింగేసింది. ఇంకోసారి మా అత్తయ్యగారి బీపీ ట్యాబ్లెట్ మింగేసింది. ఎంత జాగ్రత్తగా చూసినా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. తనని ఎలా అదుపు చేయాలి?

 - కృష్ణజ్యోతి, రామచంద్రపురం

 

 పాప బాగా హైపర్ యాక్టివ్‌గా ఉంది. ముందు ఇంటిని చైల్డ్ ప్రూఫ్ చెయ్యడానికి ప్రయత్నించండి. ప్లగ్స్‌కి కవర్స్ దొరకుతాయి. వాటితో మూసేయండి. మందులు తనకు అందనత్త ఎత్తులో పెట్టండి. వీలైతే అల్మరాలో పెట్టి తాళం వేసేయండి. కత్తులు, చాకులు లాంటి పదునైన వస్తువుల్ని కూడా పైన ఎక్కడైనా పెట్టుకోండి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి పిల్లలు వాటిని చేజిక్కించు కుంటారు. కాబట్టి తన మీద ఓ కన్నేసి ఉంచడం మంచిది. మరీ ఇబ్బందిగా, భయంగా ఉంటే... చైల్డ్ సైకియాట్రిస్తు దగ్గరకు తీసుకెళ్లండి. వాళ్లు కౌన్సెలింగ్ ఇస్తారు. తద్వారా తన యాక్టివిటీ నిదానంగా తగ్గుతుంది. అప్పటికీ తగ్గకపోతే కనుక, తనకి అటెన్షన్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఉందేమో పరీక్షించాల్సి ఉంటుంది.

 

  మా బాబు ఏడో తరగతి చదువుతున్నాడు. ఇంతకు ముందు చక్కగా చదివేవాడు. కానీ ఈమధ్య సరిగ్గా చదవడం లేదు. ఏమైనా అంటే ఇంట్లోంచి వెళ్లిపోతాను, చచ్చిపోతాను అని బెదిరిస్తున్నాడు. దాంతో చిన్నమాట అనాలన్నా భయమేస్తోంది. కూర్చోబెట్టి చాలాసార్లు కూల్‌గా మాట్లాడి చూశాను. అప్పుడు నువ్వు చెప్పినట్టే వింటానమ్మా అన్నాడు. కానీ మళ్లీ మామూలే. ఇంత చిన్న వయసులో బెదిరించాలన్న ఆలోచన వచ్చిందంటే, నిజంగానే ఏమైనా చేసుకుంటాడేమోనన్న భయం పీడిస్తోంది. ఇప్పుడు నేనేం చేయాలి?

 - మురళీశర్మ, బెంగళూరు

 

 పిల్లలు చదవలేదని కంగారు పడిపోతాం తప్ప దానికి కారణం ఏమిటో చాలాసార్లు ఆలోచించం. ఎప్పుడూ చదివే వాడు ఇప్పుడు సడెన్‌గా మానేశాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. స్కూల్లో టీచర్స్‌తో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ ఏదైనా ఇబ్బంది ఉండవచ్చు. ఏదైనా ఒత్తిడి ఉండవచ్చు. లేదంటే క్లాస్ పెరిగింది కాబట్టి పాఠాలు కష్టంగా అనిపిస్తూ ఉండవచ్చు. కారణం తెలుసుకోకుండా ఫోర్స్ చేస్తే పిల్లలు మరింత ఒత్తిడికి లోనవుతారు. కాబట్టి ముందు కారణం తెలుసుకునే ప్రయత్నం చేయండి.

 

 తన సమస్యను తీరిస్తే బాగా చదువుకో గలుగుతాడు. ఇక బెదిరించడం గురించి. నిజంగా చనిపోవాలని ఉందా లేకపోతే కోపంలో తెలియకుండా ఆ మాట అనేస్తున్నావా అని ఓసారి తనని అడగండి. ఏం చెబుతాడో చూడండి. జవాబు ఏదైనా కూడా ఓసారి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే, తనలో సూసైడల్ టెండెన్సీ ఏమైనా ఉందేమో చూసి, అవసరమైతే కౌన్సెలింగ్ ఇస్తారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే తీసుకెళ్లండి.     

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top