మరపురాని జ్ఞాపకం

Memorable memory - Sakshi

పిల్లల కథ

రామాపురం  జమీందారు రెడ్డెన్నగారిది పెద్ద మండువా లోగిలి ఇల్లు .  ఇంటి చుట్టూ ఫలసాయానికి వచ్చే చెట్లు, ఇంటి ముందు చక్కని పూలతోట, ఖాళీ స్థలాల్లో పచ్చగడ్డి మొలిచి కన్నుల పండుగగా ఉండేది. ఆ ఇంట్లో తెల్లగా, బొద్దుగా ఉన్న ఓ కుక్కపిల్ల కూడా ఉండేది. ఆ కుక్కపిల్ల ముఖాన బొట్టు పెట్టినట్లు .. నుదుటి మీద నల్లని మచ్చ. అదే దానికి అందం. ఆ ఇంట్లో దానిది ఆడింది ఆట.. పాడింది పాట.
 రెడ్డెన్నగారు  దాన్ని తన స్నేహితుని ఇంటి నుంచి పాలుతాగే వయసులో ఉన్నప్పుడే తెచ్చుకున్నారు. దానికిప్పుడు అయిదేళ్లు. జిమ్మి అని పేరుపెట్టి  ఎంతో ప్రేమగా  పెంచుకునేవారు.  జిమ్మి తన యజమాని పట్ల, ఆ కుటుంబసభ్యుల పట్ల ఎంతో విశ్వాసంతో ఉండేది.లంకంత ఇంట్లో తిరుగుతూ అల్లారుముద్దుగా పెరుతున్న జిమ్మి మనసులో ఓ సామాన్యమైన  కోరిక ఎప్పుడూ మెదులుతూ ఉండేది. తోటలో నిలబడి ఇంటికి రక్షణగా ఉన్న గేటు నుంచి  బయటకి చూస్తే.. వీధిలో  కుక్కలు కనిపించేవి. వాటికి తిండి సరిగ్గా దొరక్క బక్కచిక్కినట్లు ఉన్నా, స్వేచ్ఛగా తిరుగుతూ, తోటి స్నేహితులలో కలసి ఆటలాడుకోవడం, పోట్లాడుకోవడం చాలా సరదాగా అనిపించేది. ఇక్కడ తనకు ఏ లోటూ లేకపోయినా ఒంటరిది. ఎçప్పుడైనా గేటుకి దగ్గరగా వెళ్లి, తోటి స్నేహితులను పలకరించాలనుకున్నా ఇంట్లోంచి ఎవరో ఒకళ్లు చూసి  పిలిచేవాళ్లు. ఆ పిలుపులకి తోటమాలి రంగయ్య పరిగెత్తుకుంటూ వచ్చి గొలుసుతో పెరట్లో ఉన్న చెట్టుకి కట్టేసేవాడు. అందుకే వేరే కుక్కలతో కలసి ఆడుకునే సరదా దానికి తీరలేదు.ఓ రోజు జమీందారు గారింట్లో ఆ ఇంటి చిన్నపాప పుట్టినరోజు వేడుక. అతిథులు వస్తూ ఉండడంతో గేటు తెరిచే ఉంచారు. అతి«థి సత్కారాల్లో మునిగిపోయి, జిమ్మి సంగతి మరచిపోయారు ఇంట్లోవాళ్లు.వచ్చిన జనాలను తప్పించుకొని తిరుగుతున్న  జిమ్మికి, ఇంటి బయట ఉన్న ఇసుకగుట్ట మీద కొన్ని కుక్కలు ఆడుకోవడం కనిపించింది. గేటు తీసివుండడంతో సంతోషంగా వాటి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. అవి రోజూ చూస్తున్న కుక్కే కాబట్టి జిమ్మిని తమ జట్టులో కలుపుకున్నాయి. అలా ఆడుతూ ఆడుతూ ముందుకు పరుగులు తీశాయి. కాస్త దూరం వెళ్లేసరికి పక్కవీధిలో పెద్దకుక్కలు.. జిమ్మిని చూసి  కొత్త కుక్క ఎక్కడి నుంచో వచ్చిందని వెంటబడి తరమ సాగాయి. దాంతో జిమ్మి భయపడిపోయి కనిపించిన దిక్కుకి పిక్క బలం కొద్దీ దౌడు తీసింది.  అలా ఎంత దూరం పరుగు తీసిందో.. ఎక్కడికి వచ్చిందో తెలీదు. పరిగెత్తి, పరిగెత్తి బాగా అలసిపోయి నీరసపడిపోయింది.

అప్పటికి చీకటి పడిపోయింది. భయమేసి ఇల్లు గుర్తొచ్చింది. ఇంటికి ఎంత దూరంలో ఉందో తెలుసుకోలేకపోయింది. ఆ రాత్రంతా బిక్కుబిక్కుమంటూ ప్రాణభయంతో గడిపింది.  తెల్లవారింది.మళ్లీ ఇల్లు గుర్తొచ్చింది. ఆకలి వేసింది. పాలు, బిస్కెట్లు ఇచ్చేదెవరు? అన్నం పెట్టేదెవరు? అక్కడికి దగ్గర్లో చిన్న హోటలుకు చేరుకుంది. అది నారాయణ హోటలు. అక్కడ ఊర కుక్కలతో గొడవపడుతూ ఎంగిలి మెతుకులు తింటూ రెండురోజులు గడిపింది. ఆలనాపాలనా లేని బతుకు ఎంత దుర్భరమో అప్పుడే తెలిసింది. ఇన్ని రోజులూ  తనకా కష్టం ఏమిటో తెలిసింది కాదు. వడ్డించిన విస్తరి లాంటి జీవితం. కానీ ఇప్పుడు  కుక్కలు చింపిన విస్తరి అయింది. ఎంత తిరిగినా దానికి తన  యజమాని రెడ్డెన్న ఇంటి జాడ తెలియలేదు.  అక్కడక్కడే తిరుగుతున్న జిమ్మిని చూసి ఆ హోటలుకు వచ్చిన వాళ్లందరూ అడిగారు. ‘‘నారాయణా కొత్తగా కుక్కను పెంచుతున్నావా?’’ అని. దాంతో నారాయణకు జిమ్మి అంటే ఆసక్తి కలిగింది. ఎవరిదో జాతికుక్క దారితప్పి ఇటు వచ్చేసింది. యజమానులెవరో వచ్చి తీసుకుపోతారు అనుకున్నాడు ఇన్నాళ్లు. రోజులు గడుస్తున్నా  దానికోసం ఎవరూ రాకపోవడంతో ఓరోజు ఇంటికే తీసుకెళ్లాడు. జిమ్మిని చూసి నారాయణ కొడుకు మున్నా ఎంతో సంతోషపడ్డాడు. సుబ్రహ్మణ్యం అని పేరు కూడా పెట్టేసుకున్నాడు. మున్నా దాన్ని అసలు నేల మీద వదిలేవాడు కాదు. అదృష్టం కొద్దీ మళ్లీ దానికొక ఆశ్రయం దొరికింది. ప్రేమగా సాకేవాళ్లు దొరికారు.అలా నాలుగేళ్లు గడిచాయి. జిమ్మి మనసులో జమీందారు రెడ్డెన్న గారి జ్ఞాపకం అలానే ఉంది. రెడ్డన్నగారిని మళ్లీ ఎప్పుడైనా చూడగలనా! లేదా! అని విచారిస్తోంది.ఓ రోజు అనుకోకుండా రెడ్డెన్నగారి తోటమాలి రంగన్న, నారాయణ హోటలుకు  భోజనానికి వచ్చాడు. రంగయ్యను జిమ్మి పోల్చుకుంది. అతని కాళ్లను నాలుకతో నాకుతూ, తోక ఊపుతూ, అతని చుట్టూ తిరగసాగింది.  వయసు మళ్లిన రంగయ్య జిమ్మిని గుర్తించలేకపోయాడు. ఏదో కుక్క మీద పడుతుంది అనుకున్నాడు.అల్లరి చేస్తుందని మున్నా దాన్ని గుంజకు కట్టేయడంతో ఉన్న చోటే కూర్చుండిపోయింది.  భోజనం చేసి రంగయ్య వెళ్లిపోయాడు. జిమ్మి రంగయ్యతో పాటు వెళ్లిపోవాలనుకుంది. రంగయ్య వెళ్లిన దారి వైపే దృష్టి పెట్టింది. కాలువ గట్టు మీద ఉన్న వంతెన మీదుగా వెళ్లడం గమనించింది.గొలుసు విప్పిన తరువాత ఇన్నాళ్లూ పెంచినందుకు కృతజ్ఞతగా మున్నా కాళ్లను నాకి, ముద్దులు పెట్టుకొని రంగయ్య వెళ్లిన దారినే పరుగందుకుంది. మున్నా ‘సుబ్బు.. సుబ్రహ్మణ్యం’ అంటూ పిలవసాగాడు.

అయినా ఆగలేదు. కాలువ గట్టు మీదుగా, వంతెన మీదుగా పరుగుతీసింది. అలా పరుగులు తీసి  కాలువలూ, చెట్లూ, పుట్టల్ని దాటుకుంటూ రామాపురం పొలిమేరకు చేరుకుంది. ఆ పొలిమేరలో ఆంజనేయస్వామి గుడి ఉంది.  ఆ గుడిని అçప్పుడప్పుడు చూసేది. ఇక అక్కడ నుంచి దానికి అంతా కొట్టిన పిండే. వీధులు దాటుకుంటూ.. ఊరి పెద్ద చెరువును దాటుకుంటూ,  పెద్ద ఇనుపగేటున్న మండువా లోగిలికి వచ్చేసింది. ‘‘భౌ .. భౌ’’ మంటూ మొరగసాగింది. రెడ్డెన్న గారి భార్య రుక్మిణమ్మ బయటికొచ్చింది. అలవాటైన అరుపు.. కాలంతో పాటు ఎదిగిన  జిమ్మి బాగా ఎత్తుగా, బలంగా రాజసం ఉట్టిపడేలా నుదుటి మీద మచ్చతో అలానే ఉంది. గేటు తెరవడంతో ఒక్క ఉదుటన ఆమెను చుట్టేసి, కాళ్లను నాకి ఇంట్లోకి దౌడు తీసింది. ‘‘కుయ్‌ .. కుయ్‌’’ మంటూ ఇల్లంతా గొడవ గొడవగా తిరిగింది. గదులన్నీ చూసుకుంది. ఇంటిల్లపాదీ దాని చుట్టూ మూగిపోయారు. దాని సంతోషానికి, వాళ్ల సంతోషానికి అంతులేదు. కాళ్ల మీద నిలబడి, చేతులందించింది. దాని భాషలో ఊసులాడింది.రెడ్డెన్న గారిని అస్సలు వదలలేదు. ఇంత జరుగుతున్నా.. ఇన్ని సంవత్సరాల తరువాత తిరిగివచ్చింది మన జిమ్మినేనా! కాదా! జిమ్మినే అయితే ఇన్నాళ్లు ఎక్కడుంది? అన్న అనుమానం కూడా వచ్చింది.  ‘‘ఉండండి. నేనో పరీక్ష పెడతాను’’ అని  రుక్మిణమ్మగారు ‘‘ జిమ్మీ.. ఇదివరకు  నువ్వు ఎక్కడ పడుకునే దానివో..  అక్కడికి వెళ్లి ఓసారి పడుకో’’ అన్నారు.ఆ మాటని అర్థం చేసుకున్న దానిలా రెడ్డెన్న గారి ‘దివాన్‌’ కిందకు వెళ్లి పడుకుంది, తనదైన పంథాలో రాజసం ఉట్టిపడేలా.. ఎప్పటిలా... 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top