స్వావలంబన స్వాప్నికుడు... | International electronic products | Sakshi
Sakshi News home page

స్వావలంబన స్వాప్నికుడు...

Feb 4 2017 11:16 PM | Updated on Sep 5 2017 2:54 AM

స్వావలంబన స్వాప్నికుడు...

స్వావలంబన స్వాప్నికుడు...

అంతర్జాతీయ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల విశ్వవిపణిలో ఈసీఐఎల్‌ స్థాపన ద్వారా భారత్‌ సత్తా చాటిన దార్శనికుడు అయ్యగారి సాంబశివరావు.

స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలో శైశవ దశలో ఉన్న అణుశక్తికి ఉగ్గుపాలు పట్టిన శాస్త్రవేత్త ఆయన.
ఆధునిక సాంకేతిక ఆవిష్కరణల ఆసరగా తెలుగు గడ్డపై ఉపాధి కల్పనకు పాటుపడిన దార్శనికుడు.
కాకలు తీరిన వ్యాపార వేత్త కాకున్న ‘ఈసీఐఎల్‌’ను స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా బ్రాండ్‌ నేమ్‌ను కట్టబెట్టిన నిత్య కృషీవలుడు డా.ఎ.ఎస్‌.రావు.


అంతర్జాతీయ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల విశ్వవిపణిలో ఈసీఐఎల్‌ స్థాపన ద్వారా భారత్‌ సత్తా చాటిన దార్శనికుడు అయ్యగారి సాంబశివరావు. ఈసీఐఎల్‌ వ్యవస్థాపకులు ఎ. ఎస్‌. రావుగా ఆయన అందరికి సుపరిచితులు. పశ్చిమ గోదావరి జిల్లా, మోగల్లు గ్రామంలో 1914లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. తోటి విద్యార్థుల పుస్తకాలను తీసుకొని రాత్రిళ్లు వీధి దీపాల కింద చదివి పరీక్షలకి సిద్దమయ్యేవారు. ట్యూషన్లు చెప్పిన సొమ్ము ఫీజుకు సరిపోక గుడి గంట స్థంభం దగ్గర చీకటి పడ్డాక చేయి చాచి ఆ డబ్బుతో ఫీజు కట్టి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. బి.ఎస్‌.సి., ఎం.ఎస్‌. సీ పూర్తి చేసిన బెనారస్‌ యూనివర్శిటీలోనే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. 1946లో యూనివర్సిటీ ఉపకులపతిగా ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సాంబశివరావు ప్రతిభను గుర్తించి పై చదువుల కోసం టాటాలకు సిఫారసు చేశారు. వారు రూ. 12 వేల ఉపకార వేతనం ఇస్తే అమెరికా వెళ్లి స్టాన్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో చేరారు. అవి సరిపోక నెలకు 20 డాలర్ల వేతనంతో గాజు సామాను శుభ్రపరిచే పనికి, గంటకు డాలరు వేతనంతో క్యాంటీన్‌లో పనికి కుదిరారు. రెండేళ్ల తరువాత ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీతో తిరిగొచ్చి హోమి బాబా ఆశీస్సులతో ఆటమిక్‌ ఎనర్జీ స్టాబ్లిష్‌ మెంట్‌లో చేరారు. పాశ్చాత్య దేశాలు దిగ్భ్రాంతి చెందేలా ఏడాదిలో స్వదేశీ పరిజ్ఞానంతో అప్సర న్యూక్లియర్‌ రియాక్టర్‌ని డిజైన్‌ చేశారు. భారతదేశంలోనే కాక యావత్‌ ఆసియా ఖండంలోనే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రప్రథమ రియాక్టరు ఇది.

చైనాతో యుద్ధం దరిమిలా సంభవించిన పరిణామాలతో అణు, రక్షణ పరిశ్రమలో ఎలక్ట్రానిక్స్‌ ప్రాధాన్యతను గుర్తెరిగిన ప్రభుత్వం 1967లో బొంబాయిలో ఎలక్ట్రానిక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసింది. దీనికి రావు ఎండీగా ఉన్నారు. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు డైరెక్టర్లు వారి రాష్ట్రాలకే ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమను తరలించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ఇసిఐఎల్‌ను హైదరాబాద్‌కు తరలిస్తే స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించవచ్చని రావు  భావించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న బాల్‌ఠాక్రే నేతృత్వంలోని 5 వేల మంది శివసేన కార్యకర్తలు రావుగారు కార్యాలయంలో ఉండగా చుట్టుముట్టారు. ఈ పరిశ్రమను తరలించటం వల్ల మహారాష్ట్ర యువత ఉద్యోగాలను కోల్పోతుందని ఆర్థికంగా తీరని నష్టం జరుగుతుందని బాల్‌ఠాక్రే ఉద్యమం నడిపారు. రావుగారు లక్ష్యపెట్టకుండా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అండదండలతో ఇసిఐఎల్‌ను హైదారబాద్‌కు తరలించారు.  బొంబాయి ఆటమిక్‌ ఎనర్జీ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో ఉన్న కొంతమంది ఇంజనీర్లను కూడా వెంటతెచ్చి  సనత్‌నగర్‌లో షెడ్డులు వేసి పని నడిపించారు.

అప్పట్లో హైదరాబాద్‌ ప్రాంతంలో హైస్కూల్‌ విద్యను మాత్రమే పూర్తి చేసుకున్న యువకులను ఉద్యోగులుగా తీసుకొని ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అందించటంలో రావు కార్యకుశలత అమోఘం. ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల రూపకల్పన, అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్‌ అన్ని విభాగాల్లోను స్వావలంబనే లక్ష్యంగా ఆయన శ్రమించారు. స్వదేశీ పరిజ్ఞానంతో డిజిటల్‌ కంప్యూటర్, దేశీ టివి, ఆటోమేటిక్‌ మేసేజ్‌ స్విచ్చింగ్‌ వ్యవస్థ, ఈవీఎం (ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌), విమానాల్లో వాడే కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌లను దేశంలోనే తొలిసారి తయారు చేసిన ఖ్యాతి ఇసిఐఎల్‌కు దక్కటం రావు ముందు చూపుకు  తార్కాణం. రక్షణ, పౌర విమానయాన, టెలి కమ్యూనికేషన్, బ్యాంకింగ్, వ్యవసాయం, ఆయిల్, విద్యుత్‌ రంగాలకు సంబంధించిన పలు యంత్ర పరికరాలను ఈ సంస్థ తయారు చేస్తోంది.   ఇవన్నీ ఒకెత్తయితే భారతదేశపు మొదటి చంద్రమండల ప్రయోగం చంద్రయాన్, మంగళ్‌యాన్‌ కోసం నిర్మించిన 32 మీ. డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ యాంటెన్నా నిర్మాణం ఇసిఐఎల్‌ను ఆకాశమంతెత్తున నిలిపింది. అంటార్కిటాకాలోని మైత్రి స్టేషన్‌లో శాట్‌కామ్‌ యాంటెన్నా, లడాఖ్‌లో ఖగోళ పరీక్షల కోసం నిర్మించిన 21 మీటర్ల టెలిస్కోప్‌ ఇసిఐఎల్‌ సాంకేతిక సామర్థ్యానికి మచ్చు తునకలు.

చిన్న షెడ్‌లో ప్రారంభమైన కంపెనీ ఆస్తుల విలువ నేడు రూ. 2400 కోట్లకు, వార్షికాదాయం రూ. 1200 కోట్లకు చేరింది.ఎఎస్‌రావు గారు 1978 వరకు ఇసిఐఎల్‌కు ఎండీగా ఉన్నారు. రిటైరయినప్పుడు ఎలాంటి లాంఛనపాయ్రయమైన సంప్రదాయాలకూ తలవొగ్గక, రోజూలానే డ్యూటీ నుంచి ఇంటికి వెళ్లిపోవటాన్ని చూసి కార్మికలోకంతో పాటు  మేనేజ్‌మెంటు కూడా అవాక్కైంది. ఇసిఐఎల్‌ ఉద్యోగులు ఆయన మీదున్న గౌరవంతో తాము నిర్మించుకున్న హౌసింగ్‌ సొసైటీకి డా. ఎఎస్‌రావు నగర్‌గా నామకరణం చేశారు. ఒక రోజు చేతి సంచితో బస్సులో వెళుతున్న రావు గారు ఎఎస్‌ రావు నగర్‌కు టికెట్‌కావాలన్నారు. ఆయన్ను గుర్తుపట్టిన కండక్టర్‌ ఆయన నిరాండంబరతను అందరికి చాటాడు. ఆయన  కృషికి గుర్తింపుగా 1960లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్‌ అవార్డులు వరించాయి. 2003లో ఆయన పరమపదించారు. 2014లో ఆయన నూరవ జన్మదినం సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement