విశ్లేషణం: అందమైన మొండివాడు! | Indian novelist Salman Rushdie is a stubborn person | Sakshi
Sakshi News home page

విశ్లేషణం: అందమైన మొండివాడు!

Jan 19 2014 5:18 AM | Updated on Sep 2 2017 2:45 AM

విశ్లేషణం: అందమైన మొండివాడు!

విశ్లేషణం: అందమైన మొండివాడు!

సాటానిక్ వెర్సెస్... ఈ పేరు వింటే చాలు ఒక వర్గం ఆగ్రహోదగ్రమవుతుంది. ఈ నవల రాసినందుకు సల్మాన్ రష్దీకి మరణశిక్ష వేస్తూ ఫత్వా కూడా జారీ అయ్యింది.

సాటానిక్ వెర్సెస్... ఈ పేరు వింటే చాలు ఒక వర్గం ఆగ్రహోదగ్రమవుతుంది. ఈ నవల రాసినందుకు సల్మాన్ రష్దీకి మరణశిక్ష వేస్తూ ఫత్వా కూడా జారీ అయ్యింది. దాంతో రష్దీ చాలాకాలం అజ్ఞాత జీవితం గడపాల్సి వచ్చింది. తన రచనలతో కోట్లాదిమంది పాఠకులను మెప్పించిన రష్దీ అందమైన మగువల మనసులనూ దోచుకున్నాడు. ఒకటికాదు రెండు కాదు నాలుగు వివాహాలు చేసుకున్నాడు. ఈ ప్రఖ్యాత, వివాదాస్పద రచయిత మనసేమిటో ఈ వారం తెలుసుకుందాం.
 
 బాడీలాంగ్వేజ్ ఆధారంగా వ్యక్తిత్వాన్ని విశ్లేషించేటప్పుడు ఒక్కో కదలికను విడివిడిగా తీసుకోలేం. సమయం, సందర్భం, మొత్తంగా ఆ వ్యక్తి కదలికలను పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడే మనకు ఆ వ్యక్తి అసలైన వ్యక్తిత్వం అర్థమవుతుంది. సల్మాన్ రష్దీ మాట్లాడుతున్నప్పుడు గమనిస్తే... రష్దీ సూటిగా చూస్తూ కనిపిస్తారు. తల, శరీరం కొంచెం కుడివైపుకు వంగి ఉంటాయి. కాలుమీద కాలు వేసుకుని దర్జాగా కూర్చుని ఉంటాడు. నిల్చుని మాట్లాడుతున్నప్పుడు ఒక జేబులో చేయి పెట్టుకుని, లేదా నడుముపై చేయి పెట్టుకుని ధారాళంగా మాట్లాడతాడు. మాట్లాడే సమయంలో చేతులు ఓపెన్‌గా ఉంటాయి.
 
  మాట్లాడే మాటలకు అనుగుణంగా చేతి కదలికలు ఉంటాయి. అప్పుడప్పుడూ గడ్డాన్ని నిమురుకుంటూ లేదా చూపుడువేలుతో పెదవులను తాకుతూ మాట్లాడతాడు. అప్పుడప్పుడూ చక్కగా నవ్వుతాడు. వీటన్నింటినీ సమగ్రంగా విశ్లేషించినప్పుడు... రష్దీ ఓ ఆలోచనా జీవి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కూర్చునే లేదా నిల్చునే విధానం ఆయన స్వేచ్ఛాపరత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని... ఇంకా చెప్పాలంటే ఆయన మొండితనాన్ని వ్యక్తంచేస్తాయి. తనను చంపేయాలంటూ ఫత్వా జారీ చేసినా... తాను రాసిన రాతకు కట్టుబడి ఉన్నాడే తప్ప... ఆ రాతలను ఉపసంహరించుకోకపోవడం, క్షమాపణ చెప్పకపోవడంలో ఈ ఆత్మవిశ్వాసాన్ని, మొండితనాన్ని గమనించవచ్చు. మాట్లాడే మాటకు తగ్గట్టుగా ఉండే చేతి కదలికలు ఆయన నిజాయితీకి అద్దం పడతాయి. మనసులో ఉన్నదే మాట్లాడతాడనే విషయాన్ని వెల్లడిస్తాయి. అప్పుడప్పుడూ గడ్డాన్ని నిమురుకోవడం ఆయన దీర్ఘాలోచన చేస్తారని చెబుతుంది. వేళ్లతో పెదవులను తాకడానికి ఆలోచనలను దాచుకుంటున్నారనే అర్థమున్నా... రష్దీ బాడీ లాంగ్వేజ్ మొత్తాన్ని సమగ్రంగా చూసినప్పుడు అది ఆయన దీర్ఘాలోచనలో భాగమనే తెలుస్తుంది. ఇక తనపైన తానే జోక్ చేసుకోవడం, హాయిగా నవ్వడం ఆయన ఓపెన్‌గా, ఉల్లాసంగా ఉంటాడనే విషయాన్ని వ్యక్తంచేస్తాయి.
 
 విలువలే బలం...
 రష్దీ అందగాడనే విషయంలో ఎలాంటి సంకోచం అక్కర్లేదు. ఆయన మాటలు మరింత అందంగా ఉంటాయి. చాలా అందంగా, స్వేచ్ఛగా, ధారళంగా మాట్లాడతాడు. తాను ప్రాముఖ్యం ఇవ్వదలచుకున్న విషయాన్ని నొక్కిచెప్తాడు. దాని ప్రాముఖ్యతకు తగ్గట్టుగా చేతి కదలికలూ ఉంటాయి. రష్దీ బలం ఆయన రచనలో లేదు.. ఆయన నమ్మిన విలువల్లో ఉంది. ఆ విలువలు మతానికి, ప్రాంతానికి, దేశానికీ అతీతమైనవి. ఆ విషయం ఆయన మాటల్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
 
  మనం ఏమిటనేది జీవితం మనకు చెప్తుంది.
  ఒక భావాన్ని విమర్శించే అవకాశం లేనప్పుడు భావస్వేచ్ఛకు అర్థమేలేదు.
  పుస్తకం ప్రపంచానికి అద్దంలాంటిది. నీకు ఇష్టంలేకపోతే వదిలేయ్ లేదంటే నువ్వో పుస్తకం రచించు.
  ఆలోచనలు బాధాకరమై ఉన్న సమయాల్లో కార్యాచరణే సరైన మందు.
  నేను జీవిస్తున్న ప్రపంచం గురించి చెప్పడానికి నాకు దేవుడనే భావన అవసరంలేదు.
  రచన అనేది కేవలం తార్కికంగా ఆలోచించి చేసేది కాదు. పుస్తకాలు తమ రచనలను తామే ఎంచుకుంటాయి.
  రాసేసమయంలో నీ ఆత్మ (సెల్ఫ్)తో నువ్వు కలిసిపో, అక్షరాలు అవే దొర్లుతాయి.
  పవిత్రత అనే భావన ఏ సంస్కృతికీ సరికాదు. ఎందుకంటే అది.. అభివృద్ధి, మార్పులను నేరాలుగా చూస్తుంది.
 
 ... ఇవన్నీ రష్దీ వివిధ సందర్భాల్లో చెప్పిన మాటలే. వీటన్నింటినీ పరిశీలించినప్పుడు స్వేచ్ఛ పట్ల అతనికున్న విశ్వాసం ఎంత గట్టిదో అర్థమవుతుంది. అంతేకాదు దేవుడు, దెయ్యం, మతంలాంటి వాటికన్నా మనిషి, మానవత్వమే అతను నమ్మిన విలువలనే విషయం స్పష్టమవుతుంది. ఇక నాలుగు వివాహాలంటారా... అందగాడు, అందంగా మాట్లాడగలవాడు, మనసున్నవాడు... ఇక మగువలకు నచ్చకుండా ఉంటాడా?!
 - విశేష్, సైకాలజిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement