బామ్మ

Funday story of the world 20-01-2019 - Sakshi

కథా ప్రపంచం

నేరు గీతలా మట్టిరోడ్డు, నిలువెత్తు అంబేద్కర్‌ విగ్రహం కలిగిన ప్రాథమిక పాఠశాల, వరుసగా పెంకుటిండ్లు, ఇండ్ల చుట్టూ పంటపొలాలు... అంటూ ఎంతో అందంగా ఉన్నప్పటికీ ‘మోటపాలంజేరి’ ఎప్పుడూ నాకు నచ్చలేదు.ఎప్పటినుండి ఈ అయిష్టత ఏర్పడిందో తెలియదు. ‘‘మోటపాలం వీథికి వెళ్లాలి.’’ అన్న అమ్మతో, ‘‘మోటపాలంజేరి కా?’’ అని ఆటోడ్రైవర్‌ ఆశ్చర్యంగా అడిగిన క్షణం నుండా?కాదు... ఎవరూ లేని దారిలో, ఎదురుగా వచ్చిన సైకిల్‌కు దారివ్వమని బలవంతంగా నా చేతిని పట్టుకొని నొప్పి పుట్టేటట్టుగా బామ్మ నన్ను పక్కకు లాగిన క్షణం నుండా? లేదు... ఎనభైఏళ్ల తాతయ్యను ఇరవైఏళ్ల యువకుడు‘ఒరేయ్‌ షణ్ముగం’ అని పిలిచిన జ్ఞాపకం తప్పైన తరుణంలోనా?.... తెలియటం లేదు. మోటపాలంజేరి నాకు ఎప్పుడూ నచ్చలేదు. ఆ ఊరిమీదున్న అసహనాన్ని బయటపెట్టినప్పుడల్లా బామ్మ అంటుండేది. ‘‘అదేంటే అలా అనేశావు. ఈ మోటపాలెం ఊరిని ఏర్పరచిన మొదటి నలుగురిలో మా నాన్నకూడా ఒకరు. ఆయన ఏర్పాటుచేసినఊరిని కదా నువ్విలా మాట్లాడేశావు?’’  తాత గురించి బామ్మకు ఎప్పుడూ గౌరవభావమే ఉండేది. ఆ చుట్టుపక్కల ఊళ్లకంతా అప్పట్లోనే నాలుగు గుర్రాల చారెట్‌బండి ఉన్నది తాతయ్య ఒక్కడికేనని గొప్పలు చెప్పేది. బుద్ధి తెలిశాక... ‘‘ఆ చారెట్‌బండ్లో ఏ కులంవాళ్లు ఎక్కి వెళ్లేవాళ్లు నానమ్మా?’’ అని అడగాలనిపించేది. ఈ తరంవాళ్ల ముందు ఆమె గొప్పలు ఓడిపోతుందేమోనన్న భయంతోటే అడక్కుండా ఉండిపోయాను.సరదాగా గడపటానికి వీలుకాకపోయినప్పటికీ, మరో దారిలేక, ఆ మోటపాలంజేరిలో నేను ‘ఆలిస్‌’ గానూ, ఆ వాడను ‘వండర్‌ ల్యాండ్‌’ గానూ ఊహించుకొని ఉండాల్సి వస్తుంది.    

ఇంటి వెనక ప్రవహించే పంటకాలవ మీద, ఒక మనిషి మాత్రం వెళ్లేంతగా వెయ్యబడిన ఆ పొడవైన రాతి వంతెన మీద కూర్చుని, కాలవ నీటిలో కాళ్లు తడిసిన క్షణాలు, సమయాలే... నా వండర్‌ ల్యాండ్‌బ్రతుకులోని గొప్ప అనుభూతి తరుణాలు. దాన్ని మార్చటానికి పెద్ద తరుణం ఇప్పటివరకూ మరేదీ రాలేదన్నది అక్షర సత్యం. అయితే దాన్నంతా అధిగమించి ఒక గొప్ప వండర్‌ ల్యాండ్‌ను తనలో దాచుకొంది మోటపాలంజేరిలో ఉన్న మా బామ్మ ఇల్లు. ‘‘ఆ ఇంట్లో అలా నువ్వేం చూశావనీ?’’ అని అమ్మ మొదలు అమ్మమ్మ వరకూ అడిగి విసిగించిన సమయాలు గతించాయి. తెల్లని తెలుపూ కాస్త నీలిరంగూ కలిసి సున్నం కొట్టిన నున్నటి గోడలమీద ఎక్కణ్ణించో తీసుకొచ్చి నాటిన మనీప్లాంట్‌ తీగ. దానితోపాటు బచ్చలి తీగా, అల్యూమినియం డబ్బాలలో పెంచుతున్న పట్టు రోజా, సంపంగి, గోరింటాకుతో కలిసి ఇంద్రధనుస్సులా ఉన్న ఆ ఇంటి ద్వారబంధంలో చెక్కిన కిరీటం ధరించిన సింహం మరిక ఏ ఇంట్లోనూ నేను చూడలేదు.   ఆ సింహాన్ని నేనెంతో ఆసక్తిగా స్పృశించిన రోజులలో, తాతయ్య చిరునవ్వుతోఅనేవారు... ‘‘అంతా మీ బామ్మ ఇష్టమే. ఆమే కదా ఆచారికి ఆ ఆలోచన చెప్పింది!’’ అని.  ఆ తలుపులు మాత్రమే కావు... అంతా బామ్మే చెక్కి ఉంటుందా అని భ్రమించే విధంగా ఆ ఇంటిని నిర్మించుకుంది.పడమరన చూస్తే ఒంటరిగా ఉన్న పెద్ద వంటగది మరో ఇల్లులాగానే ఉంటుంది. నడవ, లోపల ఇల్లు, హాలు అంటూ అన్నీ వేర్వేరు ఇండ్లులాగా... ఒకే ఆవరణలో రెండు ఇండ్లు అన్నట్టుండేవి. ఆ వంటగదే నాకు బోధివృక్షం ఎప్పటికీ! సెలవు దినాల్లో కుటుంబమంతా నడవలోనూ, లోపలి ఇంట్లోనూ, హాల్లోనూ కలిసి ఉంటే... నేను మాత్రం వంటగదిలో కూర్చుని ఉండేదాన్ని. దెబ్బలు తిన్నా, ఏడ్చినా, సంతోష సమయాల్లోనూ, అన్నీ ఆ గదిలోనే. 

వర్షాకాలం అవసరాల కోసం, మండుటెండల్లో చెట్టూ పుట్టా గుట్టా అంటూ అంతా తిరిగి సేకరించిన కట్టెలతో నిండిన వంటగది. పెరుగుతో నిండిన ఉట్టి కుండలు, ఊరబెట్టిన ఊరగాయలు, చింతపండుతో రోజూ బాగా రుద్దిపెట్టిన రాగి మంచినీళ్ల బిందె, రోలూ దాని పక్కనే... బాగా దంచో, లేదా రుబ్బురాతిలో వేసి రుబ్బో, చేసిపెట్టిన మసాలాలతో కూడిన డబ్బాలూ అంటూ ఆ గది మొత్తమూ... నేను పక్కకువాల్చటానికి తగ్గ భుజాలతోటీ, నా తలను ఆప్యాయంగా తడిమే చేతులతోటీ నిండి ఉందన్నట్టుగా అనిపించేది.   ఒకే సమయంలో పదిమంది కూర్చుని భోంచేసే విధంగా ఉన్న ఆ వంటగదిలో ఉన్న మసిపట్టిన కట్టెలపొయ్యికి పైన, బామ్మ అమ్మకు, వాళ్ల అమ్మ పెళ్లి కానుకగా ఇచ్చిన ఒక కత్తిపీట వ్రేలాడుతూ ఉండేది. పూర్తిగా ఇనుముతో చేసిన ఆ కత్తిపీటతో కాయలు కోసినా సరే, కూర కోసినా సరే, జారిపోయి అవిపరుగులు తీసేవి. అంత సన్నగా పదునుగా ఉండేది ఆ కత్తిపీట. ఆశగా కాయలు కొయ్యటానికి ప్రయత్నించి వేలిని కోసుకున్న (ఇంకా ఆ గాయంతో తిరుగుతున్న) ఇష్టం దానిమీద ఉంది నాకు.పళ్లెంమీద కత్తిపీటను పెట్టుకొని బామ్మ కాయలు కోయటం ఎంతో అందంగా ఉండేది. అందులోనూ ఆమె క్యాబేజీ కోసే అన్ని సమయాల్లోనూ నేనే ఆమె మొదటి అభిమానిని. క్యాబేజీలోని ఒక్కో ఆకునూవొలిచి, దాన్ని చెయ్యి పట్టేంతగా ఒకటిగా కలిపి పట్టుకొని, నిదానంగా ఒకే కొలతతో తరిగి తరిగి... ఆ పళ్లెం నిండిపోతున్నప్పుడు, బామ్మ కళ్ల మెరుపులు కోనేట్లో ప్రకాశవంతంగా పూసిన తెల్లతామరలను గుర్తుకుతెచ్చేవి.కాస్త పప్పు, కొన్ని టమోటాలూ, రెండు ఎండుమిరపకాయలూ గిల్లి వేసిన చారూ వేపుడుగా... ఆమెచేసే ఆ క్యాబేజీతోటే, ఒక కుంభం అన్నం తినొచ్చు అని నాన్న అప్పుడప్పుడూ అంటున్నప్పుడు, అదినిజమేనని అనిపిస్తుంటుంది.బామ్మ అద్భుతమైన వంటలకు ఆ కత్తిపీటే కారణమని చాలాకాలం వరకూ నమ్మిన నేను, మా అమ్మకు కూడా  ఇవ్వని ఆ కత్తిపీటను నేను తీసుకెళ్లాలని ఎప్పుడూ ఆశపడేదాన్ని. 

‘‘బామ్మా, నీ పెళ్లి తర్వాతే మీ అమ్మ నీకు ఈ కత్తిపీటను ఇచ్చిందా?’’ ‘‘ఔను. కానీ ఆ కత్తిపీటను వాళ్లమ్మ ఆమెకు పెళ్లి కానుకగా ఇచ్చింది.’’‘‘అయితే నేను పెళ్లిచేసుకొని వెళ్లేప్పుడు దాన్ని నాకిస్తావా బామ్మా?’’పదేళ్లుకూడా పూర్తిగా నిండని నేను అలా అడగ్గానే బామ్మ ఎంతగా నవ్విందనీ? అమ్మ, అత్త, పెద్దమ్మ, వదిన అంటూ అందరినీ దగ్గరకు పిలిచిన బామ్మ... మా నాన్నతో అంది:‘‘నీ కూతురి పెళ్లికి నగలేవీ వద్దట. ఈ కత్తిపీటే కావాలిట’’‘‘నీకెందుకమ్మా ఇవన్నీ. నీకు మిక్సీ, గ్రైండర్, వాషింగ్‌ మెషిన్‌ అంటూ అన్నీ మెషిన్లనే కొనిస్తాగా.’’ అంటూ నా చేతిని పట్టుకొని నాన్న చెప్పిన ఆ క్షణంలో, ఆ కత్తిపీట నాది కాదన్న బాధ ఎక్కువైంది. అది కన్నీరుగా బయటికొచ్చింది. అది చూసి అదిరిపడ్డ బామ్మ... ‘‘మీ తాతయ్య కుటుంబంలో అయిదారు తరాల తర్వాత వరమై పుట్టిన ఆడబిడ్డవు నువ్వు. నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మకూడా ‘ఆడపిల్ల’ అని ముఖం తిప్పుకుంది. నేనే కదా ఆస్పత్రిలోని వాళ్లకంతా మిఠాయి కొని పంచాను. మా కులదేవతవు నువ్వు. నీకు లేనిదా? మా అమ్మ నాకు ఇచ్చిందంతా నీకే!’’ అని నా తలమీద కొట్టి ప్రమాణం చేశాకే నా కన్నీళ్లు ఆగాయి.ఆ కత్తిపీట మీద నాకు ఇష్టముందా లేక బామ్మ వంటమీదా? అని ఎప్పుడూ నాకొక అనుమానం ఉండేది. లేదూ... బామ్మ అద్భుతమైన వంటకు ఆ కత్తిపీటే కారణమన్న కుతూహలమా అన్నదీ అర్థమయ్యేది కాదు అప్పుడు.ఇంట్లో ఏ కాయగూరలూ లేక, కొనటానికి డబ్బుల్లేని సమయంలోకూడా, బామ్మ దానిగురించి పెద్దగా అంగలార్చేది కాదు.వంటగదిలోకెళ్లి, అక్కడ మూటల్లో నింపి ఉన్న బియ్యంలో నుండి ఒక చాటెడు బియ్యం తీసుకొని, మట్టి కుండలో ఒక ఊరు ఊరే తినేంతగా అన్నం పొంగించేది. కొంచెం కూడా అధైర్యపడకుండా పశువులకోసం ఉంచిన తవుడును చేతి నిండుగా జవురుకొని, ఒక పెద్ద చట్టిలో వేసి కొద్దిగా వేయించి, దానితోపాటు కాస్త చింతపండు, మిరపకాయలు వేసి, మూడింటినీ రుబ్బురోల్లో వేసి రుబ్బి, ఐదే ఐదు నిమిషాల్లో పచ్చడి చేసేది. ఎంత అర్థరాత్రి సమయంలోనైనా ఈ ఇంట్లో ఈ భోజనం కచ్చితంగా ఉంటుందన్న నమ్మకాన్ని అందరిలోనూ కలిగేలా చేసింది బామ్మ.  

‘‘కాకరకాయను ఏం చేస్తారు?’’ అని అడిగిన ఆఫీసు ఫ్రెండుతో ‘‘సాంబార్లో వేస్తాను.’’ అన్నప్పుడు ఆమె ముఖంలో కనిపించిన ఆందోళన నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.‘‘చింతపులుసులోనేగా కాకరకాయలు వేస్తారు.’‘‘అలాగా. మా ఇంట్లో సాంబార్లో మాత్రమే కాకరకాయల్ని వేస్తాం. లేదూ దాన్ని పప్పులోవేసి వేపుడు చేస్తాం!’’బామ్మ అలాగే అలవాటు చెయ్యించింది. బామ్మకు పెద్ద కాకరకాయలు అంటూ ఒకటుండటం తెలుసో తెలియదో అని ఆలోచించాను. పొట్టి కాకరకాయల అభిమాని ఆమె. సంతలో నుండి పొట్టిపొట్టి కాకరకాయల్ని ఏరుకొని వచ్చేది. ఒక్కో కాకరకాయనూ అడ్డంగా తరిగి, గింజల్ని తీసేసి,దాన్ని అలాగే ఆ ఇటుకల పొయ్యిదగ్గర కటిక నేలమీద పరిచేది. ‘‘ఏం బామ్మా, కాకరకాయల్ని ఇలా కటిక నేలమీద పరిచావు. మసీ, దుమ్మూ ధూళీ అన్నీ అంటుకుంటాయిగా?’’ అని అడిగినపుడు... ‘‘లేదే, కటికనేల కాకరకాయల్లోని చేదునంతా పీల్చేస్తుంది. తర్వాత పులుసు పెడితే చేదుగా ఉండదు.’’ అని వివరణ ఇచ్చింది.ఆమె ఎలా చెప్పగలిగింది, ఏ ఆధారంతో ఈ కటికనేల చేదునుపీల్చేసే కాన్సెప్ట్‌ పనిచేస్తుంది అని నాకు తెలియలేదు.  అయితే ఆమె పెట్టిన ఏ ఒక్క కాకరకాయ సాంబార్లోనూ చేదు అన్నది కాస్తంత కూడా లేదు అన్నది మాత్రం బాగా తెలుసు.శాఖాహారం మాత్రమే కాదు. మాంసాహారంలోనూ బామ్మ దుమ్ము లేపుతుంది. ‘తామ్రభరణి’లో నీటి ప్రవాహాన్ని ఆపేస్తున్నట్టుగా ప్రకటన వచ్చిన రోజుల్లో ఊరు ఊరంతా  ఏట్లో ఉండేది, నీళ్లు తగ్గిపోగానే తేలిపోయే చేపల్ని పట్టుకోవటానికి. అయితే బామ్మ మాత్రం చేపల్ని పట్టుకునేది కాదు. మారుగా ఏట్లో అడుగుభాగాన ఉండి, తగ్గిపోయిన నీళ్లు కారణంగా పైకి కనిపించటం మొదలుపెట్టే నత్తగుల్లల మీదే బామ్మ చూపులన్నీ ఉండేవి.

ఒక బిందె నిండుగా నింపుకొని వచ్చేది ఆ నత్తల్ని. తర్వాత ఇంటి పెరట్లోని మట్టిలో కూర్చుని, ఆ నత్తల్ని శుభ్రం చెయ్యటం మొదలుపెట్టేది. మూసుకున్న చిప్పల్ని విప్పదీసి, లోపల ఉండే ఆ చిన్ని మాంసాన్ని తీసి, దాన్ని కడిగి ఇంకో చట్టిలో వేసేది. బిందె నిండుగా ఉండే అన్ని నత్తల మాంసాన్ని తీసి, దాన్ని పులుసుగా పెట్టి ఇచ్చేది. మంచు కురిసే రాత్రుల్లో, ఆ కట్టెలపొయ్యి మంటల్లో, వంటగదిలో కూర్చుని, ‘‘తెల్లారన్నమూ  నత్తల పులుసూ’’ తిన్న సమయాలు ఇంకా నాలో నేనే చెప్పుకునే విసుగుపుట్టని కథల్లో ఒకటై నిలుస్తోంది.ఏదో ఒక వర్షం కురుస్తున్న రోజు, హాల్లోని మధ్య స్తంభం దగ్గర కూర్చుని శొంఠి కాఫీ తాగుతున్నప్పుడు బామ్మను అడిగాను: ‘‘నువ్వు పెట్టే శొంఠి కాఫీకూడా ఎందుకు ఇంత బాగుంటుంది? ఇంత టేస్టుగా తాగీ తాగీ నాకే బోర్‌ కొట్టేసేలా ఉంది. నువ్వెందుకు ఇంత బాగా వంటచేస్తావు?’’ అని వరుసగా ప్రశ్నలమీద ప్రశ్నలు అడిగాను.బామ్మ ఏ మానసికస్థితిలో ఉందో, లేదూ వర్షం ఆమెను ఏ గతంలోకి తీసుకెళ్లిందో తెలియదు. మెల్లగానే అయినా ఎంత అద్భుతంగా చెప్పిందనీ?!‘‘మీ తాతయ్య మొదటిభార్య చనిపోవటంతో, ఆమెకు పుట్టిన చిన్ని తమ్ముళ్లందరినీ చూసుకోవటానికి మనిషే లేకుండాపోయారు. మీ తాతయ్య నాకు వరుసకు మేనమామ అవుతారు. ఆయన వయసుకు నేనొక్కదాన్నే సరిపోయాను.మా అక్క చనిపోయినావిడ కన్నా పెద్దది. మా చెల్లెలు చాలా చిన్నది. మరో దారిలేక నన్నే ఇచ్చిపెళ్లి చేసేశారు. అప్పుడు నాకు 16 ఏళ్ల వయస్సుండొచ్చు. పదోతరగతి పూర్తిచేసి టీచర్‌ ట్రైనింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాను. పెళ్లికోసం చదువును ఆపేశాను.(తానే ఆగిపోయానని కొనసాగింపు సమాచారం ఇచ్చింది)స్కూలుకు వెళ్లి పెద్దపెద్ద చదువులంతా చదవటంవల్ల నన్ను వంటింటి వైపే మా అమ్మ అనుమతించేది కాదు. అయితే పెళ్లి నిశ్చయం కాగానే వంటకు అలవాటుపడ్డాను. కానీ పూర్తిగా వంట చెయ్యటం రాలేదు. అన్నం వార్చటం రాలేదు. కాయలు తరగటం తెలియలేదు. మసాలా పెట్టటం తెలియదు. ఉప్పు ఎంత వెయ్యాలో కొలత తెలీదు. ఏమీ తెలియదు. మా అమ్మ భయపడిపోయింది. పెద్ద ఇంటికి కోడలు కాబోతున్నాను, వంట చెయ్యటం రాదంటే ఎలా అని!పెళ్లికి ముందురోజే కడయం నుండి మా పిన్ని ఒకామె వచ్చింది. ఆమె దగ్గర మా అమ్మ ఏడవంది ఒక్కటే తక్కువ. నాకు వండటం రాదు అదీ ఇదీ అని చెప్పుకొని బాధపడింది. పిన్ని వెంటనే మా చిన్నాన్నను పిలిచి, ఇంటి వెనకున్న పంటపొలాల్లో ఎక్కడైనా పసరికపాము ఉంటే, దాన్ని పట్టుకు రమ్మని చెప్పింది. నా అదృష్టం, వెంటనే ఒక పాము దొరికిందట. దాన్ని చిన్నాన్న పట్టుకొచ్చాడు. చనిపోయిన ఆ పసరికపామును నా చేతికిచ్చి దాన్ని ఒలవమంది పిన్ని.
 
కాస్త భయం భయంగానే అనిపించింది. కానీ మరో దారిలేదు. ఆ పసరికపామును మూడునాలుగు సార్లు తడిమి వొలిచేశాను. ఇంట్లోవాళ్లు నా చేతులను శుభ్రంచేసుకోకుండా అలాగే ఒకరోజంతా ఉండిపోయేలా చేసేశారు. భోజనం కూడా నాకు పిన్నీనే తినిపించింది. ‘‘పసరికపాము రక్తం మన చేతిలో ఊరితే, జీవితాంతం మనం చేసే వంటలు దేవామృతంలా ఉంటుంది.’’ అని పిన్ని చెప్పింది. కానీ నేను నమ్మలేదు. అయినప్పటికీ పిన్ని చెబుతోంది కదాని విన్నాను. మరుసటిరోజు పెళ్లి! మీ తాతయ్య ఇంటికెళితే, అందరూ కాఫీ పెట్టమని అడిగారు. అప్పుడూ కాస్త బెల్లంవేసి శొంఠి కాఫీనే పెట్టాను. దాన్ని తాగిన వాళ్లందరికీ సంతోషం. మా అమ్మకు చెప్పలేనంత ఆనందం. ఆ పసరికపామేనే ఇప్పటికీ నేను ఇలా అన్నం వార్చి, పులుసు పెట్టటానికి కారణం.’’ అంది ముక్తాయింపుగా బామ్మ..           ‘‘అందరూ ఇలా చేస్తారా?’’ అన్నాను. ‘‘తెలియదు. మన కులంలో ఇలా చేస్తారు.’’ అంది బామ్మ.‘‘మా అమ్మకు కూడా ఇలా చేశారా, ఏం?’’‘‘ఔను. మీ అమ్మను పిల్లను చూసి నిశ్చయం చేసిన వెంటనే నేనే ఆమెను పసరికపామును పట్టుకొని రమ్మని చెప్పి, వొలవమని చెప్పాను. లేకపోతే మీ నాన్నకు మంచి భోజనం ఎక్కణ్ణించి దొరికుండేది?’’కాలేజీలో ఉన్న నాకు, బామ్మ చెప్పినదంతా ఏడు కొండలు ఏడు సముద్రాల కావల ఒక చిలకలో ఉండే రాక్షసుడి ప్రాణం... లాంటి ఫ్యాంటసీ కథకన్నా గొప్పగా అనిపించింది. ఆ వర్షానికీ, ఆ శొంఠి కాఫీకీ ఆ ‘పసరికపాము’ ఎంతో హాయిగా అనిపించింది. ఆ విషయాన్ని చెప్పగానే ‘‘నిన్ను నేను సరిగ్గా పెంచినట్టు లేను.’’ అని చెప్పి బామ్మ లేచి వెళ్లిపోయింది.  చదువు ముగించుకొని ఉద్యోగం కోసం చెన్నై వెళ్లి, ఒక ఒంటరి జీవితాన్ని అనుభవించటానికి తయారుగా ఉన్న సమయంలో నాలో కలిగిన పెద్ద అనుమానం ఏంటంటే...‘నాకు వంట చెయ్యటం వచ్చా?’ అన్నదే!

వంటింట్లోనే జీవితాన్ని గడిపినా, ఒక్కరోజు కూడా నేను వంటచేసింది లేదనటం కన్నా... బామ్మో, అమ్మనో, అత్తో, పెద్దమ్మో ఎవరూ ఒకరు నన్ను వంట చేసేందుకు అనుమతించలేదన్నది మాత్రం వాస్తవం.చెన్నైలో ఇల్లు చూసి, మిక్సీ, గ్రైండర్, వాషింగ్‌ మెషీన్, ఫ్రిజ్, టి.వి. అన్నీ కొనిచ్చి, టి.నగర్‌ వెళ్లి వంటపాత్రలు కొనిచ్చి, కుకింగ్‌ గ్యాస్‌ బుక్‌ చెయ్యించి, నాకంటూ ఒక వేరే జీవితాన్ని ఏర్పాటు చేసి, అమ్నానాన్నలు అందరూ బయలుదేరి వెళ్లిపోయిన కొన్ని రోజులకు మా ఇంటి వంటగదిలో, నా మొదటి వంట మొబైల్‌ సాయంతో మొదలైంది.బామ్మను అడిగి తెలుసుకొని మరీ సాంబార్‌ పెడుతున్నాను.అలాగే కూరలూనూ. కొబ్బరి పాలను తియ్యటం తెలియక ఏడుపొచ్చేసింది. కొబ్బరి తురుముతున్నప్పుడే చెయ్యి కోసుకుంది. పచ్చి మిరపకాయ కంట్లో పడి మండింది. మూడు గంటల వంటకు నాలుగు గంటలుగా మొబైల్లో పాఠాలు చెబుతోంది బామ్మ. అంతా పూర్తయింది. నాకు నేనే వడ్డించుకొని, మొదటి ముద్ద తినగానే బామ్మకు ఫోన్‌ చేశాను. ‘‘నీలాగానే వండాను బామ్మా. అందులోనూ మొదటిసారే. ఎంతో సంతోషంగా ఉంది. అంత ఆశ్చర్యంగానూ ఉంది’’అన్నాను.బామ్మ నవ్వింది. ‘‘పసరికపాము పరుగెడుతోందే నీ రక్తంలో. పచ్చ నాగినివిగా నువ్వు.’’ అంటూనే ఫోన్‌ పెట్టేసింది. అరచేతిని చూసుకున్నాను. విచ్చుకున్న అరచేతిలో వేలవేల సంవత్సరాల పసరికపాము పాకుతున్నట్టు కనిపించింది. చెప్పటం మరిచిపోయాను. ఆ కత్తిపీటను నా పెళ్లికి ముందే పూర్తిగా నాకే ఇచ్చేసింది బామ్మ. 
తమిళ మూలం : కవితా స్వర్ణవల్లి
 అనువాదం: జిల్లేళ్ళ బాలాజీ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top