నాకు ఆకలిగా ఉంది

funday story to in this week - Sakshi

కథా ప్రపంచం

‘ఆకలిగా ఉంది బాబుల్లారా! నాకాకలిగా ఉంది....’’ ఒక యువకుడు రైలును పట్టుకొని తాకుతూ అడుక్కుంటున్నాడు. ఒకరు కసురుకుంటున్నారు. ఇంకొకరు విననట్లు తల తిప్పుకుంటున్నారు. మరొకరు ఏమీ లేదన్నట్లు ముఖం పెడుతున్నారు. ఆ యువకుడు ‘‘ఆకలి.. ఆకలి....’’ అంటూనే ఉన్నాడు. నేను నా ఫ్రెండ్‌ కూర్చున్న సీటు దగ్గర కిటికీ పక్కన నిలబడి ఉన్నాను.బయటి నుంచి ‘‘బాబూ ఆకలిగా ఉంది’’ బిచ్చగాడు దీనంగా అడిగాడు. నిజమే బిచ్చం అసహ్యించుకోదగిందే. దానిని నిర్మూలించడానికి అన్ని ప్రయత్నాలు చేయాల్సిందే. చదువుకున్న వాళ్ళు, మేధావులు మాత్రమే ఈ దిశలో ఏదన్నా చెయ్యగలరనీ నేను ఒప్పుకుంటాను. ఒక బిచ్చగాని చేతిలో ఏదైనా వేసినప్పుడు నేను బిచ్చగాడికి గానీ మరొకరికి గానీ సహాయం చెయ్యడం లేదని తెలిసే చేస్తాను. అయినా ఎవరైనా చెయ్యిముందుకు చాచినప్పుడు దాని మీద ఏంతో కొంత పెడతాను. బహుశా బిచ్చగాళ్ళను తిరస్కరించలేకపోవడమో లేక అదొక మంచి తప్పించుకునే మార్గం కావడమో అందుకు కారణం కావచ్చు.నా ఫ్రెండ్‌ ఇందుకు వ్యతిరేకం, ఇలాంటి అంశాల పట్ల ఆవిడ దృష్టి వాస్తవికంగా ఉంటుంది.

‘‘బాబూజీ! ఆకలి’’ అతని గొంతు ఇంకా వినబడుతూనే ఉంది. నాచేయి అప్రయత్నంగానే జేబులోకి పోయింది.నా ముఖ కవళికల్ని గమనించిన నా ఫ్రెండ్‌ నవ్వింది. ‘‘ఈ రకంగా భిక్షం వేసి, మీలాంటి వాళ్ళు వాళ్ళను అవమానిస్తారు. వాళ్ళ పట్ల తప్పుడు సానుభూతి చూపొద్దు. వాళ్ళను ఆకలితో చావనీయండి. అప్పుడే వాళ్ళకు హక్కుల కోసం పోరాడే ధైర్యం వస్తుంది....’’ ఆమె ఎప్పుడూ అనే మాటలు నా చెవిలో మారు మ్రోగుతూనే ఉన్నాయి.కాసేపటికి తెలిసింది మా రైలు ఆలస్యంగా రాబోయే రైలు కోసం ఆగి ఉందని, బయలుదేరడానికి ఆలస్యమవుతుందని. మాకు విసుగొచ్చి బైటకు వచ్చాం. రైల్వే విశ్రాంతి గది దగ్గరలోనే స్టేషన్‌ మాష్టర్‌ క్వార్టర్స్‌కు పక్కనే ఉంది. మేము కాసేపు ప్లాట్‌ఫారం మీద అటు ఇటు తిరిగాం. తర్వాత విశ్రాంతి గది ముందున్న పచ్చికలోకి వెళ్ళాం. నా ఫ్రెండ్‌ తోటమాలివైపు చూచి నవ్వుతూ కొన్ని మొగ్గల్ని కోయడం మొదలుపెట్టింది.‘‘కాయ మొగ్గల్ని కొయ్యకండి బాబూజీ’’ అంటూ మా సమాధానం కోసం ఆగకుండా వెళ్లిపోయాడు తోటమాలి. మేము అలసిపోయి మంచి మొగ్గలుంటాయిలే అనుకొంటూ తిరిగి సీట్లోకి వచ్చాం. మంచి మొగ్గల్ని పిందె మొగ్గల్ని వేరు చేస్తున్నాం.‘‘సూది దారం ఉంటే పూలు కుట్టుకోవచ్చు’’ అంది నా స్నేహితురాలు. నేను విశ్రాంతి గదివైపు చూశాను. అక్కడ నగ్నంగా, అర్ధనగ్నంగా ఉన్నవాళ్ళ గుంపు అగ్గి మంట చుట్టూ తిరుగుతూంది. ఆ బిచ్చగాళ్ళ నుండి సూదీ దారం తీసుకుందాం అనుకున్నాను. అయినా ఇంకొంచెం మర్యాదగల స్థలం కోసం వెతికాను. యాభై అడుగుల దూరంలో ఒక చిల్లర వ్యాపారి కనిపించాడు. కొన్ని నిమిషాలకు ముందు ఆకలి.. ఆకలి.. అని అరిచిన బిచ్చగాడు ఇప్పుడు అక్కడ సిగరెట్టు ముట్టించుకుంటున్నాడు. చిల్లర వ్యాపారికి డబ్బు చెల్లించి, గట్టిగా దమ్ము పీల్చి మత్తెక్కిన కళ్ళతో సంచారుల దగ్గరకి వెళ్ళిపోయాడు. నా ఫ్రెండ్‌ మొగ్గలు ఏరడంలో నిమగ్నమైంది. 

మట్టిగొట్టుకుపోయి, చినిగిపోయి పొడవుగా వదులుగా ఉన్న చొక్కా బిచ్చగాడి మోకాళ్ళు దాకా వేలాడుతూ ఉంది. నిక్కరు చిరిగిపోయి ఉంది. తల వెంట్రుకలు దుమ్ము నిండిపోయి ఉన్నాయి. పదహైదు నిమిషాల క్రితం అతని ముక్కుపుటాలు గబ్బుతో నిండి ఉన్నాయి. ఈగలు ముసురుకుని శబ్దం చేస్తున్నాయి. కళ్ళు మురికిగా ఉన్నాయి.‘‘సూది దారం సంపాదించు’’ నా ఫ్రెండ్‌ మాటిమాటికీ అంటోంది.
బిచ్చగాడు తాపీగా తన మనుషుల దగ్గరకి వెళ్ళాడు. అక్కడ కూడా ఇద్దరు కుర్రాళ్ళు – అతని కన్నా అధ్వాన్నంగా ఉన్నారు. వాళ్లాడే ఆట ఆపేసి సిగరెట్‌ కోసం అతని మీద పడ్డారు. అతను వాళ్ళల్లో ఒకడ్ని తన్నాడు. పరిగెత్తి ఇంకొకడిని పడగొట్టాడు. వాళ్ళు ఇద్దరూ ఎనిమిది పదేళ్ళ లోపు వయసు వాళ్ళే. నగ్నంగా, నల్లగా ఎముకల గూడులాంటి శరీరంతో మట్టి జలగల్లాగా ఉన్నారు. మర్రిచెట్టు కింద ఉన్న తన మనుషుల దగ్గరకు పోగానే అతను రొట్టెను అడుగుతాడనుకున్నాడు. ‘ఆకలి.. ఆకలి..’ అతని అరుపులు నా చెవుళ్ళో ఇంకా మారుమోగుతున్నాయి గనుక.ఒక పండు ముదుసలి, వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి. మెడమీద నరాలు తేలియాడుతున్నాయి. కళ్ళు గుంతలు పడ్డాయి. చేతులు వణుకుతున్నాయి. గుంపులో కూర్చుని ఉంది. మహా స్టైల్‌గా సిగరెట్‌ బూడిద రాల్చుకుంటూ తన దగ్గరకి వచ్చిన బిచ్చగాడిని చూచి నవ్వింది. 

‘‘వీడు పెద్ద వాడు అయిపోతున్నాడు. ముసలితనంలో కన్నా వీడు పెరుగుతున్నాడు. సిగరెట్‌ తాగు, మీనాయన హుక్కా తాగేవాడు. అది నీకు చేతకాదు.’’ వృద్ధ వేశ్య ఆమె వైపు తిరిగి ‘‘వాడు సిగరెట్‌ తాగుతున్నాడు. దేన్కి సిగరెట్‌ తాగుతున్నాడు....’’ అంది.నా ఫ్రెండ్‌ ఇంకా పువ్వులు సర్దుతూ.. ‘‘సూదీ దారం దొరికితే బాగుండు’’ అంటోంది.బిచ్చగాడు ఒక దిబ్బమీద కూర్చుని పొయ్యి ఊదుతున్న పదహైదు పదహారేళ్ళ అమ్మాయిని చూస్తున్నాడు. ఆమె పొయ్యి నుంచి తల పైకి ఎత్తినప్పుడల్లా బిచ్చగాడు సిగరెట్‌ను బలంగా పీల్చి పొగను వదులుతున్నాడు. పొగ గాలిలో రింగులు తిరుగుతున్నాది. పచ్చి కట్టెలను ఊది మండించడంలో ఆమె కళ్ళు ఎరుపెక్కాయి. గాలి అన్నివైపుల నుంచి పొయ్యిలోకి దూరుతున్నది. పొయ్యి మీదనున్న కుండపై మూత తీసింది. కుండను కదిలించింది. గరిటనిండా కూర తీసుకుంది. చల్లారే దాకా ఉండి ఉడికిందో లేదో చూద్దామని నోట్లో వేసుకుని, తిరిగి కుండలో వేసి దాన్ని మళ్ళీ కుదిపింది. బిచ్చగాడు ‘‘ఆకలి..’’ అంటాడని అనుకుంటున్నాను. ఆ అమ్మాయి అతనికి తినడానికి ఎంతో కొంత పెడుతుంది. అయితే అతను సిగరెట్‌ తాగడంలో బిజీగా ఉన్నాడు. ఆ అమ్మాయి ఒకసారి తలెత్తి అతడిని చూసింది. 

కాసేపు అయినాక బిచ్చగాడు అక్కడ దాయాలు ఆడుకుంటున్న వాళ్ళ దగ్గరకి వెళ్ళాడు. వాళ్ళలో బాగా ఆడుతున్న అబ్బాయి చెయ్యి చాపాడు. ఆ బిచ్చగాడు సిగరెట్‌ అతని వేళ్ళ మధ్య పెట్టాడు. అతడు దాన్ని అందుకుని గట్టిగా ఒక దమ్ము పీల్చి, సిగరెట్‌ను తిరిగి బిచ్చగాడికి ఇచ్చేశాడు. అతను కాసేపు ఆటను చూచి పోవడానికి పైకి లేచాడు. కానీ, గెలిచే ఆటగాడు అతడ్ని ఆపాడు. బహుశా అతని రాక తనకు అదృష్టం తెచ్చినట్లు ఉంది. ఇతర ఆటగాళ్ళు అతనిని గుర్రుగా చూశారు.‘‘అతడు సిగరెట్‌ తాగుతున్నాడు.’’ ఒకరన్నారు.‘‘ఎందుకు తాగకూడదు? నీకేమిటి బాధ!’’ నవ్వుతూ అడిగిందామె.
‘‘బాబూజీ ఆకలి... ఆకలి....’’ అని అతను ప్రాధేయపడ్డం ఇంకా నా చెవుల్లో వినిపిస్తూనే ఉంది.అప్పుడు ఒక సీనియర్‌ ప్రయాణికుడు ఇచ్చిన సలహా గుర్తుకొచ్చింది. ‘‘పో నాయనా! నీకు చేతనైన పని చేసుకో. ఈ వయసులో అడుక్కోవడం ఏమిటీ?’’ ఒక లావాటి వైశ్యుని మాటలు కూడా గుర్తుకొచ్చాయి. ‘‘నీకు ఉద్యోగం కావాలంటే రా.. మా ఫ్యాక్టరీలో ఇస్తాను.’’‘‘మనకు సూదీ దారం దొరకదనుకుంటాను.’’ అంది మొగ్గలు సర్దటంలో మునిగిపోయిన స్నేహితురాలు. బిచ్చగాడు సిగరెట్‌ తాగుతూనే ఉన్నాడింకా. చిల్లాకట్టె ఆడుతున్న గుంపు దగ్గరికి జోరుగా వెళ్లిపోయాడు. వాళ్లలో కలిసిపోయి వాళ్ల ఆటను చెడగొట్టాలని చూశాడు. పిల్లలు నిరసన తెలిపారు. గొణిగారు. తిట్ల జల్లు కురిపించారు. కాని అతను దుర్మార్గం ఆపలేదు. ఆ పిల్లల్ని బాగా చిరాకు పరచి తల వెంట్రుకలు సర్దుకొని, ఒక అమ్మాయితో కలిసిపోయి ఒక మారుమూల కూర్చున్నాడు. ఒక చేతిలో సిగరెట్‌ పెట్టుకొని, రెండో చెయ్యిని అమ్మాయి భుజమ్మీద వేశాడు.

పొగ దమ్ములాగి ఆమె ముఖంపైకి ఊదాడు. ఆమె కళ్లు, చెవులు మూసుకుంటూంది. ఆ ఆట అలా కొంతసేపు జరిగింది. చివరికి అతను సిగరెట్‌ను ఆ అమ్మాయి పెదవుల మధ్య పెట్టాడు. ఆమె నవ్వుతూ తిరస్కరించింది. కాని అతని బలవంతం మీద ఆమోదిస్తు ఒక దమ్ములాగింది. పైకి లేచింది. విపరీతంగా దగ్గు వచ్చింది. అతను ఆమెను కిందికి లాగాడు. ఆమె నోరు పొగను గక్కింది. కళ్లలో నీళ్లు వచ్చాయి. ముఖం వివర్ణమయింది. అయినా ఆమె లేవడానికి అతను అనుమతించలేదు. కాసేపు వాళ్లు మాట్లాడుకున్నారు. అతను మళ్లీ ఒక దమ్ము లాగమన్నాడు. ఆమె ఒప్పుకోలేదు. అతను వదిలిపెట్టలేదు. ఆమె సిగరెట్‌ వేళ్లలోకి తీసుకుంది. సిగరెట్‌ ఎలా పట్టుకోవాలో అతను పట్టుకొని చూపాడు. ఆమె సిగరెట్‌ పెదవుల మధ్య పెట్టుకొని దమ్ములాగింది. అతను సిగరెట్‌ తీసుకున్నాడు. ఆమె మత్తులో ఉంది. 
నాకు ఆకలి అవుతూంది. రైలు కదిలేట్లులేదు. తర్వాతి స్టేషన్లో తీసుకోవాలనుకున్నాం.. అక్కడైతే శుభ్రంగా ఉంటుందని. రైలెప్పుడు కదులుతుందో ఒక ఉద్యోగిని అడిగాను. అతను నన్ను ఏమాత్రం లెక్కచెయ్యకుండా ‘‘నాకు తెలియదు’’ అన్నాడు. ‘‘సూదీ దారం దొరికిందా?’’ నా ఫ్రెండ్‌. పూలు కట్టుకొని తలలో పెట్టుకోవాలని ఆశగా ఉంది. ఆమెకు సూదీదారం దొరికితే రైలు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయినా ఫర్వాలేదు. ఆమె ఇంకా మొగ్గలలో మునిగిపోయి ఉంది. 

నాకేమీ పాలుపోలేదు. నా కళ్లు మరొక్కసారి మర్రిచెట్టుకింద ఉన్న వాళ్లమీదికి వాలాయి. బిచ్చగాడు కోతి ముందు కూర్చొని సిగరెట్‌ తాగుతున్నాడు. బహుశా ఇది చివరి దమ్ము. ‘‘బాబూజీ! ఆకలి’’ కోతిని చూసి ఆడుకుంటున్నట్లు అన్నాడు. అది ఎగిరి వెల్లకిలాపడి దాని పొట్టను చూపింది. ‘‘నాకు ఆకలిగా ఉంది బాబూజీ!’’ బిచ్చగాడు మరలా అన్నాడు. కోతి తన పొట్టను ముద్దులాడుతూంది. తన చేతులతో తన కడుపు ఖాళీగా ఉందన్నట్లు సూచించింది. బిచ్చగాడు కోతిని తట్టి ఒక కొయ్య ముక్కను దాని పాదంలోకి దోపుతూ ‘‘కరిముదిన్‌ ఎలా సిగరెట్‌ తాగుతాడు?’’ అనడిగాడు. కోతి కర్రముక్కను తీసుకుని వేళ్ల మధ్య పెట్టుకొని, సిగరెట్‌ బూడిదను రాల్చినట్లు ఆడించింది. మళ్లీ నోటిదగ్గర పెట్టుకొని పీల్చింది. తర్వాత నోట్లో నుంచి, చెవులలోంచి పొగవదులుతున్నట్లుగా ముఖం పెట్టింది. ‘‘చూడు కరిముదిన్‌ ఆఫీసులో బాబు ఎలా తాగుతాడు?’’ కరిముదిన్‌ కర్రముక్కను పెదవుల మధ్య పెట్టుకొని దానిని వేలాడించింది. మరో ముక్కతో పేపర్‌మీద రాయడం మొదలుపెట్టింది. ‘‘ఆ బిచ్చగాళ్లను సూదీ దారం అడగలేకపోయారా? దానికి డబ్బులివ్వాలి..’’ నా ఫ్రెండ్‌ ఎట్టకేలకు తన పని ముగించింది. నాకోసం చూస్తూంది. ‘‘బాబూజీ నాకు ఆకలిగా ఉంది’’.ఒక అలిసిపోయిన ముసలి స్వరం దూరం నుంచి వినిపించింది. నేను అటు చూశాను. గుడ్డి ముసలాయన తన ముసలి భార్య భుజం మీద చెయ్యివేసి వస్తున్నాడు. వాళ్లు మా కిటికీ దగ్గరికి వచ్చారు. నేను తల తిప్పుకున్నాను. ఈసారి నా ఫ్రెండ్‌ ఒక నాణెం తీసుకుని ముసలాయన చేతిలో పెట్టింది. ఆ ముసలాయన కలకాలం మాంగల్యంతో బాగా బతుకమ్మా అంటూ వెళ్లిపోయాడు.  కాస్సేపటికి వాళ్ల ప్రార్థన వినబడుతూంది. 

పంజాబీ మూలం: కర్తార్‌ సింగ్‌ దుగ్గల్‌
అనువాదం : రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top