బేబీ బ్రెయిన్‌ అంటే? 

funday health counciling - Sakshi

సందేహం

గర్భిణీ స్త్రీలు ఎదుర్కొనే ‘బేబీ బ్రెయిన్‌’ సమస్య గురించి తెలియజేయగలరు. ఈ సమస్యకు సంబంధించిన లక్షణాలను ఎలా తెలుసుకోవాలి?
– విజీ, జగిత్యాల

సాధారణంగా బేబీ బ్రెయిన్‌ సమస్యను ప్రెగ్నెన్సీ బ్రెయిన్, అలాగే మొమ్మోసియా అని కూడా అంటారు. ఇది యాభైశాతం గర్భిణీలలో ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుందనే దానికి చాలా కారణాలు ఉంటాయి. ఇంకా తెలియని కారణాల కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సమయంలో వచ్చే కొత్త మార్పులు, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్‌ హార్మోన్లు అధికంగా ఉండటం, ఇంకొక జీవం వస్తుందన్న ఆందోళన, ఒత్తిడి, ఆనందం, అలసట, నిద్ర సరిగా లేకపోవడం, వారిని ఎలా పెంచాలి, ఎలా ఉండాలి అనే సందేహాలు, అలా వాటి గురించే ఆలోచిస్తూ ఉండటం వల్ల ఏకాగ్రత లేకపోవడం జరుగుతుంది. కొన్ని విషయాలను మరచిపోవడం వంటిది కూడా జరుగుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం. అలాగే ధ్యానం, యోగా, నడక వంటి చిన్నచిన్న వ్యాయామాలు చెయ్యడం వల్ల కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

∙గర్భిణీ స్త్రీలలో spontaneous subarachnoid hemorrhage సమస్య పెరుగుతుందని ఇటీవల చదివాను. దీని గురించి వివరంగా తెలియజేయగలరు.
–  ఆర్‌.రజిత, వరంగల్‌

spontaneous subarachnoid hemorrhage అంటే మెదడుకి, స్కల్‌బోన్‌ (పుర్రె ఎముక)కి మధ్యలో ఉండే Arachnoid పొర కింద ఉన్నట్టుండి బ్లీడింగ్‌ అవ్వడం. ఈ సమస్య గర్భిణీ స్త్రీలకు మాత్రమే కాకుండా ఎవరికైనా రావచ్చు. ఇది ఈ మధ్యకాలంలో నాలుగు శాతం నుంచి ఆరు శాతానికి పెరిగింది. Arachnoid పొర కింద ఉండే రక్తనాళాల్లోని కొన్నింటిలో aneurysm (అంటే రక్తనాళాల్లో కొంతభాగం వ్యాకోచించి కొద్దిగా ఉబ్బి ఉండటం) ఉండి, అది ప్రెగ్నెన్సీలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల, బీపీలో మార్పుల వల్ల ఇంకా బాగా ఉబ్బి, ఉన్నట్టుండి పగిలి రక్తస్రావం అవ్వడం జరుగుతుంది. అలాగే కొందరిలో arteriovenous malformationsఅంటే మంచి రక్తం, చెడు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు కలవడం) ఉండి, అవి పగలడం, ఇంకా కొన్ని తెలియని కారణాల వల్ల spontaneous subarachnoid hemorrhage జరుగుతుంది. ఇది ఉన్నట్టుండి జరుగుతుంది కాబట్టి ముందుగానే గుర్తించడం చాలా కష్టం. తలకి దెబ్బ తగలడం వల్ల  Arachnoid పొర కింద జరిగే బ్లీడింగ్‌ను Subarachnoid Hemorrhage  అంటారు. ఉన్నట్టుండి విపరీతమైన తలనొప్పి, కళ్లు తిరగడం, వికారం, వాంతులు, కళ్లు కనిపించకపోవడం, స్పృహ కోల్పోవడం, ఫిట్స్‌ రావటం వంటి ప్రమాదకరమైన లక్షణాలు ఉంటాయి. బ్లీడింగ్‌ వల్ల మెదడుకి రక్త సరఫరా తగ్గడం, రక్తం గడ్డకట్టి మెదడుని అదిమెయ్యడం, మెదడు మీద ఒత్తిడి పెరిగి పైన చెప్పిన లక్షణాలు ఏర్పడతాయి. ఈ సమస్యను గుర్తించడానికి సీటీ స్కాన్, ఎమ్‌ఆర్‌ఐ, ఆంజియోగ్రామ్‌ వంటి పరీక్షలు చేయవలసి ఉంటుంది. ఇది ఎమర్జన్సీ కండీషన్‌ కాబట్టి వెంటనే హాస్పిటల్‌లో అడ్మిట్‌ చేసి, చికిత్స చేయవలసి ఉంటుంది. ఎంత జాగ్రత్తగా చికిత్స అందించినా కొందరిలో పరిస్థితి విషమించి ప్రాణాంతకం అయ్యే అవకాశాలు ఉంటాయి.

∙వేసవికాలంలో గర్భిణీ స్త్రీలు తీసుకునే జాగ్రత్తలు, ఆహారం గురించి వివరంగా తెలియజేయగలరు.
– జెఎల్, హైదరాబాద్‌

వేసవి కాలంలో మామూలు వారికే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక గర్భవతులకైతే ఇబ్బంది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వారిలో ఉండే నీరసం, చిన్నచిన్న నొప్పులు, ఆయాసం వంటి ఇబ్బందులు వేసవి కాలంలో ఇంకా ఎక్కువగా ఉంటాయి. డీహైడ్రేషన్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలి (కనీసం 2–3 లీటర్లు). అలాగే మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు కూడా తీసుకోవాలి. ఆహారంలో వేపుళ్లు, నూనె, మసాలా పదార్థాలు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు తీసుకోవాలి. ఎండలో వీలైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉండాలి. తెల్లవారుజామున, సాయంకాలం బాగా చల్లపడిన తర్వాత వాకింగ్‌ చెయ్యడం ఆరోగ్యకరం. కాటన్‌ బట్టలు, తేలికగా, లూజుగా, లేత రంగుల బట్టలనే వేసుకోవడం మంచిది. బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్‌ లోషన్, సన్‌గ్లాసెస్, గొడుగు లేదా టోపీ వాడాలి. మధ్యాహ్న సమయాల్లో ఒక గంటసేపు నిద్రపోవాలి. ఎండకు కాళ్లవాపులు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. కాళ్లను ఎత్తుపై పెట్టుకొని కూర్చోవడం, పడుకునేటప్పుడు కాళ్ల కింద దిండును పెట్టుకుంటే కొద్దిగా ఉపశమనం లభిస్తుంది.
- డా‘‘ వేనాటి శోభ
రెయిన్‌బో హాస్పిటల్స్‌ హైదర్‌నగర్‌ హైదరాబాద్‌ 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top