హ‌క్కుల‌కు దిక్కేది?

Funday cover story of the week 09 dec 2018 - Sakshi

కవర్‌ స్టోరీ

‘నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అని మహాకవి ఏనాడో చెప్పినట్లే చాలా దేశాల్లో మానవ హక్కులకు పూర్తి భరోసా ఇచ్చే పరిస్థితులు నేటికీ లేవు. రాచరిక పాలనలు, నియంతృత్వ పాలనలు అంతరించి, ప్రజాస్వామ్యాన్ని స్వీకరించిన భారత్‌ వంటి దేశాల్లో సైతం మానవ హక్కుల హననం నిత్యకృత్యంగా సాగుతోంది. యుద్ధాలతో విలవిలలాడుతున్న దేశాల్లోను, రాచరిక పాలన కొనసాగుతున్న దేశాల్లోను మానవ హక్కులకు భద్రత ఉండకపోవడం విశేషం కాదు, ప్రజాస్వామిక దేశాల్లో సైతం మానవ హక్కుల హననం కొనసాగుతుండటమే దారుణం. అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా ఘనత చెప్పుకొంటున్న భారత్‌లో కొనసాగుతున్న మానవ హక్కుల హననంపై ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు వేలెత్తి చూపినా మన పాలకుల్లో చలనం లేకపోవడం విడ్డూరం.

బ్రిటిష్‌పాలన అంతమై దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశం ప్రజాస్వామిక విధానాన్ని ఎంచుకుంది. ప్రజల ప్రాథమిక హక్కులకు హామీ ఇస్తూ సొంత రాజ్యాంగాన్ని తయారు చేసుకుంది. సామాజికంగా వెనుకబడిన షెడ్యూల్డ్‌ కులాలకు, షెడ్యూల్డ్‌ తెగలకు రిజర్వేషన్లు కల్పించింది. రాజ్యాంగం వరకు బాగానే ఉన్నా, ఆచరణలో మాత్రం సామాన్యుల హక్కులకు రక్షణ కరువవుతోంది. పాలక వర్గాలు, అధికార యంత్రాంగం సైతం హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి. మరోవైపు కులమతాల పిచ్చి తలకెక్కిన మూర్ఖపు మూకలు అమాయకులపై దాడులు సాగిస్తున్నాయి. సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టం వంటి వివక్షాపూరిత చట్టాలు కొన్ని ప్రాంతాల్లోని ప్రజల హక్కులను హరిస్తున్నాయి. రాజ్యాంగం అమలులోకి వచ్చిన పాతికేళ్లకే 1975లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించడంతో దాదాపు రెండేళ్ల పాటు ప్రజల కనీస హక్కులకు దిక్కులేని దుస్థితి వాటిల్లింది. ఎమర్జెన్సీ పీడ విరగడైనా పెద్ద మార్పులేవీ వచ్చిపడలేదు. దురాగతాలు జరుగుతూనే ఉన్నాయి. అమాయకుల బతుకులు అగమ్యగోచర స్థితిలో మగ్గిపోతూనే ఉన్నాయి.

యమభటులను తలపించే పోలీసులు
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇష్టానుసారం హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న ఉదంతాలు కోకొల్లలుగా ఉంటున్నాయి. శాస్త్రీయ పద్ధతుల్లో నేర పరిశోధన సాగించే బదులు నిందితులపై బలప్రయోగం చేసి నేరాలను ఒప్పించడం మన దేశంలో సర్వసాధారణం. ‘థర్డ్‌ డిగ్రీ’ పేరిట నిందితులను చిత్రహింసలకు గురిచేయడం చట్ట విరుద్ధమైనా, ఇదంతా చాలా మామూలు వ్యవహారంగా కొనసాగుతోంది. నేషనల్‌ లా యూనివర్సిటీ తన అధ్యయనంలో భాగంగా మరణశిక్ష పడ్డ 373 మంది ఖైదీల నుంచి సమాచారాన్ని సేకరించింది. వారిలో 72 మంది ఖైదీలు, పోలీసుల చిత్రహింసలు తాళలేకనే ఏ తప్పూ చేయకున్నా, నేరం చేసినట్టు అంగీకరించామని తెలిపారు. ఇదిలా ఉంటే, పోలీసు కస్టడీలో సంభవించిన మరణాలకు సంబంధించి 50 శాతం కంటే తక్కువ సంఘటనలపై మాత్రమే కేసులు నమోదయ్యాయని నేషనల్‌ లా యూనివర్సిటీ వెల్లడించింది. పోలీసు కస్టడీలో నిందితులను హింసించడం దేశంలో విపరీతంగా కొనసాగుతోందని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్వయంగా అంగీకరించింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2017 ఏప్రిల్‌ నుంచి 2018 ఫిబ్రవరి మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 1,674 మంది కస్టడీలో ఉండగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ మృతుల్లో పోలీసు కస్టడీలో ఉన్నవారు 144 మంది కాగా, జుడీషియల్‌ కస్టడీలో ఉన్నవారు 1530 మంది అని కేంద్ర హోంశాఖ స్వయంగా రాజ్యసభలో వెల్లడించింది. పోలీసు వ్యవస్థలోను, జైళ్ల వ్యవస్థలోను సంస్కరణలు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెప్పుకుంటున్నా, కస్టడీ మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతోందే తప్ప తగ్గుతున్న దాఖలాల్లేవు. దేశవ్యాప్తంగా 2001–10 కాలంలో 14,231 మంది కస్టడీలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. గడచిన దశాబ్దిలో రోజుకు సగటున నాలుగు కస్టడీ మరణాలు సంభవిస్తే, 2017–18లో రోజుకు సగటున ఐదు కస్టడీ మరణాలు సంభవించినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఇదేకాలంలో దేశవ్యాప్తంగా 19 బూటకపు ఎన్‌కౌంటర్లు జరిగినట్లు ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదులు అందాయి. వీటిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లోనే ఆరు బూటకపు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇక జైళ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంటున్నట్లు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) లెక్కలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లు సగటున 14 శాతం అధికంగా ఖైదీలతో కిక్కిరిసి ఉంటున్నాయి. మితిమీరిన రద్దీ కారణంగా పలు జైళ్లలో ఖైదీల అసహజ మరణాలు సంభవిస్తున్నాయి. చాలాచోట్ల రద్దీ కారణంగా ఖైదీలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. కొన్ని జైళ్లలోనైతే మరీ దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి.  దేశవ్యాప్తంగా మొత్తం 1,401 జైళ్లు ఉంటే, వాటిలోని 149 జైళ్లలో సగటున 200 శాతం అధికంగా ఖైదీలు ఉంటున్నారు. తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లా సత్యమంగళం సబ్‌జైలులో 16 మంది ఖైదీలు ఉండేందుకు మాత్రమే తగిన సౌకర్యాలు ఉన్నాయి. ఈ జైలులో 2015 డిసెంబర్‌ 31 నాటికి 200 మంది ఖైదీలు ఉన్నారు. అలాగే మహారాష్ట్రలోని రోహా సబ్‌జైలులో కేవలం ముగ్గురు ఖైదీలకు మాత్రమే తగిన సామర్థ్యం ఉంటే, అందులో ఏకంగా 35 మంది ఉంటున్నారని ఎన్‌సీఆర్‌బీ తన నివేదికలో వెల్లడించింది. జైళ్లలో నెలకొన్న ఈ దుర్భర పరిస్థితులపై దాఖలైన రిట్‌పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. జైళ్లలో ఖైదీలను పశువుల్లా బంధించి ఉంచలేరంటూ వ్యాఖ్యానించింది. ఖైదీలు కూడా మనుషులేనని, కస్టడీలో ఉన్న ఖైదీలకు కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయని తేల్చిచెప్పింది. జైళ్లలో ఖైదీల రద్దీ సమస్యను పరిష్కరించడానికి తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, దానిని 2017 మార్చి 31లోగా సమర్పించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. జైళ్లలో రద్దీపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసినా, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని జైళ్ల పరిస్థితుల్లో నేటికీ ఎలాంటి మెరుగుదల కనిపించడం లేదు.

చిన్నారుల పరిస్థితి మరీ దారుణం
వయోజనుల హక్కులకు భంగం కలిగితే వారు కనీసం తమకు జరిగిన అన్యాయాలపై గొంతెత్తగలరు. ఎంతటి నిస్సహాయతలో ఉన్నా బాహ్యప్రపంచానికి తమ గోడు వినిపించుకోగలరు. న్యాయం కోసం తమకు చేతనైన ప్రయత్నాలు చేయగలరు. అభం శుభం తెలియని చిన్నారులు ఇవేవీ చేయలేరు. ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు అడుగడుగునా హక్కుల ఉల్లంఘనకు గురవుతున్నారు. ఇళ్లలో, బడుల్లో, హాస్టళ్లలో... ఎక్కడ చూసినా వారి హక్కులకు భరోసా లేని పరిస్థితి ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో చిన్నారుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటున్నా, వెనుకబడిన దేశాల్లోను, భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను, యుద్ధ వాతావరణంతో నలిగిపోతున్న దేశాల్లోను చిన్నారుల హక్కులకు రక్షణ కరువవుతోంది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలను అమల్లోకి తెచ్చినా, భారత్‌ సహా చాలా దక్షిణాసియా దేశాల్లోను, ఆఫ్రికన్‌ దేశాల్లోను ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతున్నాయి. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) వెల్లడించిన వివరాల ప్రకారం, 2015–16 నాటికి దేశవ్యాప్తంగా 20–24 ఏళ్ల వయసు గల మహిళల్లో 26.8 శాతం మందికి 18 ఏళ్లు నిండక ముందే పెళ్లిళ్లయ్యాయి. ఇక 25–29 ఏళ్ల వయసు గల పురుషుల్లో  20.3 శాతం మందికి 21 ఏళ్ల నిండక ముందే పెళ్లిళ్లయ్యాయి. వీరందరికీ బాల్యం వీడక ముందే బాధ్యతల భారం నెత్తినపడింది. చిన్నారులపై లైంగిక హింస కూడా మన దేశంలో నానాటికీ పెరుగుతోంది. దేశంలోని ప్రతి ఇద్దరు చిన్నారుల్లో ఒకరు ఏదో ఒక దశలో లైంగిక హింసను ఎదుర్కొన్నట్లు ‘వరల్డ్‌ విజన్‌ ఇండియా’ గత ఏడాది నిర్వహించిన సర్వేలో తేలింది. మన దేశంలో నిరుపేదల కుటుంబాలకు చెందిన పిల్లల్లో చాలామంది బాలకార్మికులుగా వెళ్లదీస్తున్నారు. బాలకార్మిక వ్యవస్థను నిషేధిస్తూ ప్రభుత్వం చట్టాన్ని తెచ్చినా చాలా చోట్ల చిన్నారులను పనిమనుషులుగా, చిన్నా చితకా కర్మాగారాల్లో కార్మికులుగా నియమించుకుంటూ వారితో వారి స్థాయికి మించిన పనులు చేయించుకుంటున్నారు. మన దేశంలో 5–14 ఏళ్ల మధ్య గల చిన్నారుల జనాభా 25.96 కోట్లు. వీరిలో దాదాపు 1.01 కోట్ల మంది బాలకార్మికులుగా పనిచేస్తున్నారు. ఇవి 2011 జనాభా లెక్కల్లో వెల్లడైన వివరాలు. బాల కార్మికుల్లో చాలామంది యజమానుల చేతిలో దూషణలకు, భౌతిక హింసకు గురవుతున్నవారే ఎక్కువమంది. పిల్లలను ఏదోలా చదివించుకుందామని నిరుపేద తల్లిదండ్రులు తమ పిల్లలను సంక్షేమ హాస్టళ్లలో చేరుస్తున్నా, హాస్టళ్లలో పిల్లల భద్రతకు భరోసా ఉండటం లేదు. హాస్టల్‌ నిర్వాహకుల నుంచి దూషణలు, హింస, దారుణమైన భోజనం వంటి బాధలు తప్పడంలేదు. కొన్ని హాస్టళ్లలోనైతే చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతున్న సంఘటనలు తరచు వార్తలకెక్కుతున్నాయి. సంక్షేమ హాస్టళ్లలో చిన్నారులపై జరుగుతున్న ఘాతుకాలకు సంబంధించి సరైన గణాంకాలేవీ అందుబాటులో లేవు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథాశ్రమాలకు చేరిన చిన్నారులది కూడా దాదాపు ఇదే పరిస్థితి. ప్రేమ, ఆప్యాయాతల మధ్య పూర్తి భద్రతతో పెరగాల్సిన చిన్నారులు మూర్ఖులైన పెద్దల కాఠిన్యానికి, దాష్టీకాలకు బలైపోతున్నారు.

►భారత్‌లో చిన్నారుల జనాభా 25.96 కోట్లు    
►బాల కార్మికుల జనాభా 1.01 కోట్లు    
   
(2011 జనాభా లెక్కల ప్రకారం..)
చాలాచోట్ల బాలకార్మికులను ప్రమాదకరమైన పనుల్లో నియమిస్తున్నారు. బిహార్, జార్ఖండ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌లలోని అక్రమంగా నడుపుతున్న అభ్రకం గనుల్లో చిన్నారులతో పనులు చేయిస్తున్నారు. ఎన్‌సీఆర్‌బీ–2015 నివేదిక ప్రకారం కర్మాగారాల్లో జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు బాలకార్మికులు మృతి చెందారు. గనులు, క్వారీల్లో జరిగిన ప్రమాదాల్లో తొమ్మిది మంది బాల కార్మికులు మరణించారు. వీరంతా పద్నాలుగేళ్ల లోపు వయసులోని వారే. 

దళితులు, గిరిజనులు, మైనారిటీలకూ  భద్రత కరువు
దళితులు, గిరిజనులు, మైనారిటీలకు దేశంలో భద్రత కరువవుతోంది. గోవధ ఆరోపణలతో మైనారిటీలపై దాడులు కొన్నేళ్లుగా బాగా పెరిగాయి. ఈ ఏడాది నవంబర్‌ వరకు చూసుకుంటే, దేశవ్యాప్తంగా 38 మూక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 10 మంది మరణించారు. ఈ సంఘటనల్లో పోలీసులు దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. కొన్ని సంస్థలు మత విద్వేషాన్ని రెచ్చగొడుతుండటంతో మూర్ఖపు మూకలు మైనారిటీలపై తరచు దాడులకు తెగబడుతున్నాయి. కుల దురహంకారం తలకెక్కించుకున్న అగ్రవర్ణాల వారు దళితులు, గిరిజనులపై దాడులకు తెగబడుతున్నారు. దేశంలో 1990 దశకం ద్వితీయార్ధం నుంచి దళితులు, మైనారిటీలపై విద్వేషపూరిత దాడులు గణనీయంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా 1964–96 మధ్యకాలంలో మైనారిటీల విద్వేషపూరిత దాడులకు సంబంధించి 38 కేసులు నమోదయ్యాయి. 1997లో కేవలం ఏడాది వ్యవధిలోనే 27 కేసులు, ఆ తర్వాత 1998లో 70 కేసులు నమోదయ్యాయి. ఇక 2017లో ఏకంగా 351 కేసులు నమోదయ్యాయి. ఇక గోసంరక్షకుల పేరిట కొందరు సాగిస్తున్న దాడులు 2014 నుంచి పెరుగుతూ వస్తున్నాయి. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం 2014లో ఇలాంటి నాలుగు సంఘటనలు జరిగాయి. ఫలితంగా దాడులు జరిగిన ప్రాంతాల్లో మత ఘర్షణలు చెలరేగాయి. గోవధ ఆరోపణల పేరిట 2017లో ఏకంగా 11 దాడులు జరిగాయి. గడచిన దశాబ్దకాలంలో.. అంటే 2007–17 మధ్య కాలంలో దళితులపై దాడులు 66 శాతం మేరకు పెరిగినట్లు ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు చెబుతున్నాయి. హక్కుల ఉల్లంఘనలో ఇవి కొన్ని ప్రధాన పార్శా్వలు మాత్రమే. స్థూలంగా చెప్పాలంటే మానవ హక్కుల ఉల్లంఘన మన దేశంలో నిత్యకృత్యంగా సాగుతోంది. 
– పన్యాల జగన్నాథదాసు

నేరాలకు  బలవుతున్న చిన్నారులు
మన దేశంలో చిన్నారులపై జరుగుతున్న నేరాలు నానాటికీ పెరుగుతున్నాయి. చిన్నారులపై లైంగిక దాడులు ఏటేటా పెరుగుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఎన్‌సీఆర్‌బీ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో ప్రతి గంటకు నలుగురు చిన్నారులు లైంగిక అఘాయిత్యాలకు బలవుతున్నారు. చిన్నారులపై నేరాలకు సంబంధించి ఎన్‌సీఆర్‌బీ వెల్లడించిన గణాంకాలు..

చిన్నారులపై నేరాలు
►2006      18,967

►2016    1,06,958

(పదేళ్ల వ్యవధిలోనే చిన్నారులపై నేరాలు 500 శాతం మేరకు పెరిగాయి)
ఈ నేరాల్లో దాదాపు 50 శాతం సంఘటనలు కేవలం ఐదు రాష్ట్రాల్లోనే జరిగాయి. ఆ ఐదు రాష్ట్రాలు: ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌. కిడ్నాపర్ల బారిన పడి ఆచూకీ లేకుండా పోయిన చిన్నారుల సంఖ్య మరింత ఆందోళనకరంగా ఉంది. దేశవ్యాప్తంగా 2016లో 1,11,159 మంది చిన్నారులు ఆచూకీ లేకుండాపోయారు. వీరిలో 41,175 మంది బాలురు. 70,394 మంది బాలికలు ఉన్నారు. 

ఇదీ మన న్యాయం
పోలీసు కస్టడీ మరణాలకు సంబంధించి ఎన్‌సీఆర్‌బీ లెక్కలు మరికొన్ని దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2000–16 మధ్య కాలంలో 1,022 మంది పోలీసు కస్టడీలో మరణించారు. వీటికి సంబంధించి కేవలం 428 ఎఫ్‌ఐఆర్‌లు మాత్రమే నమోదయ్యాయి. వీటికి సంబంధించి కేవలం 234 కేసుల్లో మాత్రమే పోలీసులు చార్జిషీట్లు దాఖలు చేశారు. దాదాపు 50 శాతం పోలీసు కస్టడీ మరణాలపై కనీసం మెజిస్టీరియల్‌ విచారణ సైతం జరగలేదు. ఇన్ని సంఘటనలు జరిగినా, వీటికి సంబంధించి కేవలం 24 మంది పోలీసులకు మాత్రమే కోర్టుల ద్వారా శిక్షలు పడ్డాయి. 

కస్టడీ మరణాలు కొన్ని వాస్తవాలు
2001–10 దేశవ్యాప్తంగా సంభవించిన కస్టడీ మరణాలు  14,231
2001–10 ప్రతిరోజూ సగటున కస్టడీ మరణాలు 4
2017–18 ప్రతిరోజూ సగటున కస్టడీ మరణాలు 5

కస్టడీ మరణాల్లో  టాప్‌ – 5 రాష్ట్రాలు
ఉత్తరప్రదశ్‌ 374
మహారాష్ట్ర 137
పంజాబ్‌ 128
మధ్యప్రదేశ్‌113
బిహార్‌  109

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top