గుండె బ్యాంకులో వెలుగు నింపండి!

Fill the lamp in the heart bank - Sakshi

 హావ్‌ ఫన్‌

ఒక్కసారి గుండె మీద చేయి వేసుకుని ఆలోచించండి!మీ గుండెలో ఏముంది?కష్టం నష్టం నిరాశ నిస్పృహమన రోజువారీ జీవితంలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అది మనల్ని బాధకు గురిచేస్తూనే ఉంటుంది.కొప్పడతాం.తిట్టుకుంటాం.ఏమిటిదంతా అనుకుంటాం!అన్నీ గుండె బ్యాంకులో పడేస్తూ ఉంటాం.కష్టాన్నీ కన్నీళ్లనీ చిరాకుల్నీ పరాకుల్నీ... ఎన్నింటినో దాచుకుంటూ ఉంటాం. అందుకే మన గుండెలు కరడు గట్టిపోయాయి.అంతా కటిక  చీకటి!ఓ దట్టమైన అరణ్యంలో ఓ గుహను ఊహించుకోండి. అందులో వందల ఏళ్లుగా చీకటి రాజ్యమేలుతుంటుంది. ఎటు చూసినా చిక్కటి చీకటి. నల్లటి చీకటి.అటుగా వెళ్లిన బాటసారి ఓ అగ్గిపుల్ల... ఒకే ఒక అగ్గిపుల్ల వెలిగించగానే చీకటి చెప్పాపెట్టకుండా పారిపోతుంది. అంతేతప్ప, ఏళ్లు గడిచింది కాబట్టి ఆ గుహలోకి వెలుగు తనంత తాను రాదు. మన గుండెలోని చీకటిని కూడా తొలగించుకోవాల్సింది మనమే.

ఆ కాగడా ఏదైనా కావొచ్చు.అప్పుడు పూసిన వేపపువ్వో, వగరుగా ఉన్న మామిడిపిందో, తియ్యటి చెరుకుగడో, లేత చింతచిగురో, చిన్నకూతురి చిరునవ్వో, స్నేహితుడి ఆత్మీయ పలకరింపో, తాతయ్య చెప్పిన మంచిమాటో... ఏదైనా సరే.ఓ విషయం గమనించారా!ఇన్నాళ్లూ రాజ్యమేలాను అని చీకటి భీష్మించుకుని అది తన అధికారం అనుకుని మన గుండె గుహలో ఉండిపోదు. మీరు ఓ కాంతివంతమైన ఆలోచనను తలుచుకున్న మరుక్షణం అది మాయమైపోతుంది. అందుకే, మీ గుండె బ్యాంకులో ప్రతి రోజూ ప్రతి పూటా ఏదో ఒక చిరువెలుగునైనా దాచుకుంటూ ఉండండి. ఆ వెలుగే పెరిగి మీకు దారిచూపుతుంది. జీవితం పట్ల కొత్త ఆశ కలిగిస్తుంది.

మీ ఎడిటర్ రామ్, ఫన్‌డే – ఫ్యామిలీ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top