ఒక్క సిగరెట్‌ కూడా ప్రమాదకరమే! | Sakshi
Sakshi News home page

ఒక్క సిగరెట్‌ కూడా ప్రమాదకరమే!

Published Sat, Dec 24 2016 10:42 PM

ఒక్క సిగరెట్‌ కూడా ప్రమాదకరమే!

చాలా మంది సిగరెట్‌ మానేసే ప్రక్రియలో రోజుకు ఒక్కటే తాగుతుంటామని, అలా క్రమంగా తగ్గిస్తామని అనుకుంటుంటారు. అయితే రోజుకు ఒక్క సిగరెట్‌ మాత్రమే కాదు... సగం సిగరెట్‌ అయినా అది ప్రమాదకరమే అంటున్నారు యూఎస్‌లోని నేషనల్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన నిపుణులు. ఆ సంస్థలోని క్యాన్సర్‌ ఎపిడెమియాలజీ అండ్‌ జెనెటిక్స్‌ విభాగానికి చెందిన మాకీ ఇన్యోయ్‌ చోయ్‌ అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ... ‘‘రెండు... ఒకటి... అనే లెక్కలతో ఏమాత్రం ప్రయోజనం లేదు. సిగరెట్‌ అంటూ ముట్టించాక... అది సగమైనా సరే ప్రమాదకరమే’’ అంటున్నారు. ఆమె ఆధ్వర్యంలో 59 నుంచి 82 ఏళ్ల వయసులో ఉన్న దాదాపు మూడు లక్షల మందిపై ఒక అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయన ఫలితాల గురించి ఆమె మాట్లాడుతూ ‘‘కొంతమంది తమ అలవాటు మానలేక సిగరెట్‌ వెలిగించి,  సగం సిగరెట్‌ అంటూ ఒకటి రెండు పఫ్స్‌ తీసుకుంటారు.

అయితే అస్సలు సిగరెట్‌ తాగని వాళ్లతో పోల్చినప్పుడు ఇలా ఒకటి, రెండు ఫప్స్‌ తీసుకునే 64 శాతం మందికి పొగాకుతో కలిగే ముప్పులన్నీ వస్తుంటాయని హెచ్చరిస్తున్నారామె. ఇలా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే రిస్కు సాధారణ ప్రజల్లో కంటే 12 రెట్లు ఎక్కువని వివరించారు. అలాగే పొగాకు అలవాటు లేని సాధారణ వ్యక్తితో పోలిస్తే సిగరెట్‌ తాగేవాళ్లలో ఎంఫసిమా వంటి శ్వాసకోశ వ్యాధులు వచ్చే రిస్క్‌ సైతం రెండున్రర రెట్లు ఎక్కువని చెబుతున్నారు. స్మోకింగ్‌ను క్రమంగా తగ్గించడం కంటే అకస్మాత్తుగా ఆపేయడం ఏ వయసులో వారికైనా సురక్షితమే అంటున్నారు ఆమెతోపాటు అధ్యయనంలో పాల్గొన్న వైద్య నిపుణులు.

Advertisement

తప్పక చదవండి

Advertisement