వికారినామ సంవత్సర (సింహ రాశి) రాశిఫలాలు

2019 To 2020  Leo Zodiac Sign Horoscope - Sakshi

సింహ రాశి (ఆదాయం  8, వ్యయం  14, రాజపూజ్యం 1, అవమానం  5)

సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పంచమంలో శని కేతువుల సంచారం, పంచమ, షష్ఠమంలో గురుగ్రహ సంచారం, ఏకాదశంలో రాహుగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహణాలు ప్రధానమైన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. ధైర్యం, సాహసంతో కూడిన నిర్ణయాలు లాభిస్తాయి. కష్టపడి అనుకున్నది సాధిస్తారు. సాంకేతికవిద్యలో రాణిస్తారు. ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థలో సీటు డొనేషన్‌ ప్రాతిపదికన లభిస్తుంది. ఆర్థికసంస్థలలో పనిచేస్తున్నవారు ప్రతివిషయంలోనూ జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో ప్రమోషన్‌ లభిస్తుంది. బదిలీ వేటు తప్పకపోవచ్చు. మీ ప్రాధాన్యతను తగ్గించడానికి ప్రయత్నాలు జరిగినా అవి తాత్కాలికమే. మళ్ళీ అనుకున్న స్థానంలోకి రాగలుగుతారు. స్త్రీలతో భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీ మంచితనాన్ని అసమర్థతగా భావించిన వాళ్ళు కీలక సమయంలో మీ చేతిలో భంగపడతారు. ప్రభుత్వపరంగా ఆర్థికంగా మంచి మేలును పొందగలుగుతారు. కొన్ని ప్రతిష్ఠాత్మకమైన కాంట్రాక్టులు లభిస్తాయి. నిర్మాణ సంబంధమైన పనులు చురుకుగా సాగటం వల్ల ఆర్థిక పరిస్థితి దారిన పడుతుంది. లైసెన్సులు, లీజులు పొడిగింపబడతాయి. ఉన్నతాధికారులు, ఉన్నతస్థాయిలో ఉన్న స్నేహితుల వల్ల మేలు పొందగలుగుతారు. ఎంత సంపాదించినా చేతిలో ధనం మిగులదు. సహోదర సహోదరీవర్గంలోని వారికి మీ పరపతి ఉపయోగించి ఉద్యోగం ఇప్పించగలుగుతారు. మీ కుటుంబ బాధ్యతలను విస్మరించరు. అదే మీకు శ్రీరామరక్ష. మీ బంధువర్గంలో పదేపదే మీ నుండి ఆర్థికసాయం ఆశిస్తున్న వాళ్ళు విసిగించడం మొదలుపెడతారు. ఆధ్యాత్మికవేత్తలతో, సాహితీవేత్తలతో, కళారంగాలతో సాన్నిహిత్యం పెరుగుుతుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో మానసిక ఆనందం పొందగలుగుతారు.

కొన్ని కార్యక్రమాలు చేపట్టి పలువురి ప్రశంసలు అందుకుంటారు. ఒక గౌరవనీయమైన పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. పరిశోధన రంగుంలోని వారికి అనుకూలంగా ఉంది. మేధావులతో, సామర్థ్యం కలిగిన వారితో విభేదాలు ఏర్పరచుకోకండి. పలుకుబడి కలిగిన కీలకమైన వ్యక్తులను మీవైపు మలచుకోవడంలో విజయం సాధిస్తారు. మీ కీర్తిప్రతిష్ఠలకు మచ్చ రాకుండా జాగ్రత్త వహించండి. వ్యూహ, ప్రతివ్యూహాలను రచించడంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటారు. మీ వైరివర్గాన్ని బోల్తా కొట్టించడానికి మీరు పన్నిన వ్యూహం ఫలిస్తుంది. శుభకార్యాల విషయమై కార్యానుకూలత కోసం గట్టిగా ప్రయత్నిస్తారు, మంచి ఫలితాలు వస్తాయి. వృద్ధులైన తల్లిదండ్రులను ప్రేమగా చూడడం ధర్మమే అవుతుంది. కానీ మీ విషయంలో ఇది పెద్ద అపరాధంలా పరిగణింపబడుతుంది. కుటుంబ విషయాలలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. సంతాన పురోగతి బాగున్నప్పటికీ వాళ్ళలో క్రమశిక్షణ లోపిస్తుంది. అతి గారాబం చెడు తెచ్చిందని భావిస్తారు. ఈ విషయంలో జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు ఏర్పడతాయి. నూతన భాగస్వాములతో నూతన వ్యాపారాలు బాగుంటాయి. వ్యాపారంలో నూతన బ్రాంచీలు నెలకొల్పుతారు. ఫైనాన్స్‌ స్కీములు, లక్కీ డ్రాలు, షేర్లు, కోడిపందాలు, గుర్రపుపందాలు, పేకాట, క్రికెట్‌ బెట్టింగ్స్, రాజకీయ ఫలితాల బెట్టింగుులకు దూరంగా ఉండడం ఎంతైనా శ్రేయస్కరం. ఋణాలు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు జాగ్రత్తలు అవసరం. పెద్దమొత్త్తంలో ఋణాలు తీసుకుంటారు, తీరుస్తారు. కానీ మీకు రావలసిన ధనం మాత్రం నిలిచిపోతుంది. వెన్నుపోటుదారులు స్నేహితులలోనే ఉన్నారన్న విషయం ఆలస్యంగా తెలుసుకుంటారు. పోటీపరీక్షలలో విజయం సాధించి మంచి ఉద్యోగం పొందుతారు. నామినేటెడ్‌ పదవులు లభిస్తాయి. కుటుంబంలోనివారి ఆరోగ్య విషయమై ప్రత్యేక శ్రద్ధ, ఖర్చులు సూచిస్తున్నాయి. సిగరెట్స్‌ కాల్చడం, కాఫీలు, టీలు ఎక్కువసార్లు త్రాగడం, క్రమశిక్షణలేని భోజన సంభవం. దురాలవాట్లకు దూరంగా ఉండండి, మేలు జరుగుతుంది. మీ కష్టానికి తగిన ఫలితం కొన్ని సందర్భాలలో లభిస్తుంది. కీర్తిప్రతిష్టలు దక్కుతాయి.

ఏమాత్రం శ్రమించని సోమరిపోతులకు కూడా మీతో సరిసమానమైన ప్రతిఫలాలు లభిస్తాయి. ఇది మీకు నిరాశ కలిగించే అంశం. మీకు లభించిన స్థానానికి సంతోషించలేని పరిస్థితిగా పరిణమిస్తుంది. వృత్తి ఉద్యోగాలపరంగా సంవత్సర ప్రథమార్ధంలో కొన్ని సాంకేతిక సమస్యలను విజయవంతంగా ఎదుర్కొంటారు. మీ మీద ఆరోపణలు చేసినవారి నిజస్వరూపం బయటపడుతుంది. మీరు చాలామందికి అర్థంకాని మనిషి అవుతారు. అబద్ధాలు, నమ్మకద్రోహం విసుగు కలిగిస్తాయి. మౌనంగా మీ పని మీరు చేసుకుపోతారు. ఎన్నో బాధలను అంతరంగంలో దాచుకుని పైకి నిండుగా నిదానంగా కనిపిస్తారు. విడాకులు, భార్యాభర్తలు విడిపోవటం వంటి సమస్యలు మనోవేదనకు కారణం అవుతాయి. అంతరంగిక చర్చలు, రహస్య విషయాలు బయటకి పొక్కడం వల్ల ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి వస్తుంది. సహచరవర్గం వల్ల, ముఖ్యమైన అధికారుల వల్ల ఈ రకమైన ఇబ్బందులను అధిగమించగలుగుతారు. పోలీసు కేసులు, చిల్లర అభియోగాలతో చట్టపరమైన సమస్యలలో చిక్కుకున్న మీ వారిని రక్షించవలసిన బాధ్యత మీపైన పడుతుంది. మీ పరపతి దుర్వినియోగం అవుతుంది. వేళకు తిండి, నిద్ర కరువవుతాయి. ఇది ఆరోగ్యం మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. తలనొప్పి, పార్శ్వపు నొప్పి కొంత ఇబ్బందికి గురిచేస్తాయి. ఫాస్ట్‌ఫుడ్స్, బేకరీల వ్యాపారాలు, హాస్టళ్ళ నిర్వహణ మొదలైనవి మధ్యస్థంగా ఉంటాయి. హోల్‌సేల్‌ వ్యాపారాలు, సుగంధద్రవ్య వ్యాపారాలు బాగుంటాయి. ఉద్యోగపరంగా సంస్థ నుండి ఒకరిని తొలగించవలసిన పరిస్థితి వస్తుంది. దానికి మీరే బాధ్యులని మీపై దుష్ప్రచారం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాలపరంగా అనవసరమైన బాధ్యతలు నెత్తినపడతాయి. వ్యాపారంలో రొటేషన్‌ బాగున్నా భాగస్వాముల ప్రవర్తన వల్ల సంస్థకు ఆశించిన లాభాలు రావు. ప్రభుత్వ అధికారులు మీ వైరివర్గం చేతిలో కీలుబొమ్మలుగా మారి మీకు ఇబ్బందులు సృష్టిస్తారు. సహోదర సహోదరీవర్గానికి చెందిన బాధ్యతలు మీ నెత్తినపడతాయి. విద్యార్థినీ విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనైనప్పటికీ విజయాన్ని, మంచి ఫలితాలను పొందుతారు. విదేశాలలో ఉన్న మిత్రులకు, రక్తసంబంధీకులకు మేలు చేస్తారు. వారి డబ్బులతో వారి పేరుమీద ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులైన విద్యావంతులకు తాత్కాలికంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా పోటీపరీక్షలలో విజయం సాధించి, మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, గ్రూపు సర్వీసులకు ఎంపిక అవుతారు. రాజకీయరంగంలో ఉన్నవారికి రాజకీయ నిర్ణయాలు లాభిస్తాయి. కొంతమంది ముఖ్యమైన రాజకీయ నాయకులతో విభేదాలు ఏర్పడినా మీదే పైచేయి అవుతుంది. మీరు సంపాదించిన ఒక పెద్దమొత్తాన్ని అంతరంగిక మిత్రుల వద్ద దాచిపెడతారు. కొంతమందితో తిరగవద్దని కుటుంబసభ్యుల నుండి ఒత్తిడి వచ్చినా స్నేహాన్ని వదులుకోవడానికి సిద్ధపడరు. రాత్రిపూట చేసే దీర్ఘాలోచనలు కలిసివస్తాయి.

సహోదర సహోదరీవర్గానికి సహాయ సహకారాలు అందిస్తారు, అండగా నిలుస్తారు. స్త్రీలకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. సమాజంలో గౌరవస్థానాలలో ఉన్నవారికి మీ గురించి చెడుగా చెప్పటం జరుగుతుంది. కొన్ని సమస్యలను ఒంటరిగానే ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయ వ్యూహం ఫలిస్తుంది. మొండిధైర్యంతో సమస్యలను దాటుకొని అనుకూల ఫలితాలను సాధిస్తారు. సంతకాలు చేసిన ఖాళీ చెక్కులను ఇంట్లో ఉంచే సంప్రదాయానికి స్వస్తి చెప్పండి. వైరివర్గంతో హోరాహోరీ పోరాటం జరుపుతారు. తుదికంటా పోరాటంలో మీ శక్తియుక్తుల వల్ల మీరు బలపరిచిన వర్గం విజయం సాధిస్తుంది. మీ వల్ల ఉపయోగం పొందిన వారికంటే నష్టపోయిన వారే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు.  ఆహార నియమాలు పాటిస్తారు. చిన్నచిన్న అరోగ్యు సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొన్ని అవమానాలు ఎదురయ్యే పరిస్థితులున్నాయి. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వాస్తవాలకు అతీతంగా, ఊహాలోకంలో మీరు తీసుకున్న నిర్ణయాలు సక్రమమైన ఫలితాలను ఇవ్వవు. ఏకపక్ష నిర్ణయాలు కలిసిరావు. ఉత్సాహంగా కొన్ని సామాజిక కార్యక్రమాలు ప్రారంభిస్తారు లేక వాటి బాధ్యత తీసుకుంటారు. మీరు అభిమానించే వ్యక్తులు అభివృద్ధి చెందుతారు. కొంతకాలం వారు మీకు దూరంగా ఉంటారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాçసంస్థలు ప్రఖ్యాతి వహిస్తాయి. సాంస్కృతిక, క్రీడారంగాలలో ప్రతిభాపాటవాలు గుర్తింపుకు నోచుకుంటాయి. 

స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. స్వయంకృషితో మంచి విజయాలను నమోదు చేసుకుంటారు. ఇతరుల మీద ఆధారపడి జీవించకుండా స్వతంత్రంగా ఉండాలని మీ భావన. ఇందుకు సంబంధించి మీరు చేసే కృషి ఫలిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో గట్టి పోటీ ఎదుర్కొనవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. లాభాలు, ప్రయోజనాలు సాధారణంగా ఉంటాయి. సహోదర సహోదరీవర్గానికి ఆర్థికంగా సహాయపడతారు. ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఉంటాయి. ఋణాలు చేయడం, తీర్చడం వంటివి జరుగుతూ ఉంటాయి. కార్యాలయంలో చిల్లర మల్లర రాజకీయాలు చికాకు కలిగిస్తాయి. ఎంతకష్టపడ్డా గుర్తింపు లభించదు. విలువైన వస్తువుల భద్రతా విషయంలో జాగ్రత్త వహించండి. చాలామందికి మీరు సంపాదిస్తున్న సంపాదన మీద చూపు తప్ప మీ మీద కాదని గ్రహించండి. కళా, సాంస్కృతిక రంగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. అవార్డులు, రివార్డులు లభిస్తాయి. అలంకార సంబంధమైన వ్యాపార వ్యవహారాలు బాగుుంటాయి.విద్యాసంబంధమైన విషయాలలో గట్టి పట్టుదలతో శ్రమించి అనుకూల ఫలితాలను సాధిస్తారు. మీ వంతు కర్తవ్యాన్ని మీరు సక్రమంగా నిర్వహిస్తారు. ఉద్యోగం సాధించాలన్న పట్టుదల సఫలం అవుతుంది. అయితే కాలేజీలో మీరు అనుకున్న మార్కుల కన్నా తక్కువ వస్తాయి. స్నేహితులలోనూ, బంధువులలోనూ మీ స్థాయిని నిలబెట్టుకుంటారు. మీ చెడు కోరుకునే వారు ఎవరో మీకు బాగా తెలుసు. వాళ్ళకు తగిన విధంగా గుణపాఠం చెబుతారు. విద్యార్థినులకు రీవాల్యుయేషన్, రీకౌంటింగ్‌ కలిసి వస్తుంది. వృద్ధులు, పెద్దలు, తల్లిదండ్రులను గౌరవిస్తారు. వారికి కావలసిన సౌకర్యాలను ఏర్పరుస్తారు. కొన్ని విషయాలలో అలుపెరగని ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. ఫలితాలు ఎలా ఉన్నా కృషిలో మాత్రం లోపం ఉండకూడదని నిర్ణయించుకుంటారు. నామినేటేడ్‌ పదవి లేదా రాజకీయ పదవి లభిస్తుంది. అన్య భాషలు నేర్చుకోవాలన్న కోరిక నెరవేరుతుంది. మార్షల్‌ ఆర్ట్స్, డ్రైవింగ్‌ నేర్చుకుంటారు. సంతాన పురోగతి సంతృప్తికరంగా ఉంటుంది. సంతానానికి మీరు చేసే హితబోధలకు విరుద్ధంగా ఇతరులు సంతానానికి లేనిపోనివి నూరిపోయటం మీ ఆవేదనకు కారణం అవుతుంది. ముఖ్యమైన విషయాలలో భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి. ప్రేమ వివాహల పట్ల మీకున్న భ్రాంతి తొలగిపోతుంది. మీ పేరుమీద ఇతరులు చేసే వ్యాపారాలు లాభిస్తాయి. డాక్టర్లకు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు, మ్యారేజ్‌ బ్యూరోలు నడిపేవారికి అనుకూల కాలం. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూల కాలం. గైనిక్‌ సమస్యలు కొద్దికాలం ఇబ్బంది పెడతాయి. చీటీల వల్ల, ఫైనాన్స్‌ వ్యాపారం వల్ల నష్టపోతారు. స్వగృహం అనే కల నెరవేరుతుంది. వాహన సౌఖ్య ఏర్పడుతుంది. బ్యూటీపార్లర్లు నడిపేవారికి, వస్త్రవ్యాపారులకు, ప్రభుత్వ సహకారంతో చిన్నచిన్న చేతివృత్తులు చేసుకునేవారికి కాలం అనుకూలంగా ఉంది. 
 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top