చండీ యాగం ఎందుకు చేస్తారు? | Why will do chandi yagam! | Sakshi
Sakshi News home page

చండీ యాగం ఎందుకు చేస్తారు?

Jun 3 2018 12:52 AM | Updated on Jun 3 2018 12:52 AM

Why will do chandi yagam! - Sakshi

యాగం అంటే అదో పెద్ద క్రతువు. వేదకాలంలో మాత్రమే సాధ్యమయ్యే ఆచారం. కానీ యాగానికి వచ్చే ఫలితం దృష్ట్యా ఇప్పటికీ కొందరు ఎన్ని వ్యయప్రయాసలకి ఓర్చయినా సరే యాగం చేయాలని సంకల్పిస్తూ ఉంటారు. వాటిలో ప్రముఖంగా వినిపించేది చండీయాగం!

ఎవరీ చండి?
చండి అంటే ‘తీవ్రమైన’ అన్న అర్థం వస్తుంది. అందుకనే సానుకూలమైన, ప్రతికూలమైన మాటలు రెండింటికీ ఈ పదాన్ని వాడతారు. చండి అన్న దేవత గురించి పురాణాలలో అనేకమైన ప్రస్తావనలు కనిపిస్తాయి. పూర్వకాలంలో శుంభ, నిశుంభులు అనే రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు, చండి అవతారాన్ని ధరించిందట. తన శౌర్యంతో ఆమె శుంభ, నిశుంభులనే కాకుండా వారి సేనాధిపతులైన చండముండాసురులను కూడా సంహరించింది.

మార్కండేయ పురాణంలో దుర్గాదేవిని స్తుతిస్తూ సాగే ఏడువందల శ్లోకాల స్తుతిని దుర్గాసప్తశతి అంటారు. దీనికే చండీసప్తశతి అని కూడా పేరు. హోమగుండంలో అగ్నిప్రతిష్టను గావించి ఈ దుర్గాసప్తశతి మంత్రాలను జపించడంతో చండీయాగం సాగుతుంది. చండీదేవికి ప్రీతిపాత్రమైన నవాక్షరి వంటి మంత్రాలను కూడా ఈ సందర్భంగా జపిస్తారు. యాగంలో ఎన్నిసార్లు దుర్గాసప్తశతిని వల్లెవేస్తూ, అందులోని నామాలతో హోమం చేస్తారో... దానిని బట్టి శత చండీయాగం, సహస్ర చండీయాగం, ఆయుత (పదివేలు) చండీయాగం అని పిలుస్తారు.

పూర్వం రాజ్యం సుభిక్షంగా ఉండాలనీ, ప్రజలంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలనీ, ఆపదలు తొలగిపోవాలనీ, శత్రువులపై విజయం సాధించాలనీ... చండీయాగం చేసేవారు. రాచరికాలు పోయినా, చండీయాగం పట్ల నమ్మకం మాత్రం ఇంకా స్థిరంగానే ఉంది. అందుకే ఇప్పటికీ స్తోమత ఉన్నవారు, రాజకీయ నాయకులు ఈ యాగాన్ని తలపెడుతూ ఉంటారు. కొందరు సంపన్నులు ఇండ్లలో కూడా చండీయాగం చేయిస్తుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement