గుండెపోటు వస్తే... ఆసుపత్రికి వెళ్లేలోపు ఏం చేయాలి?

What to do when going to hospital if heart attack?

ఫ్యామిలీ డాక్టర్‌

కార్డియాలజీ కౌన్సెలింగ్‌

మా ఊరు సిటీకి కొంచెం దూరంలో ఉంటుంది. నాకు తరచూ ఛాతీనొప్పి వస్తుంటుంది. అది గుండెపోటేమోనని అనుకుంటుంటాను. అలా గుండెపోటు వచ్చి... ఆసుపత్రికి వెళ్లేలోపు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించండి. – రామాచారి, చిట్యాల
రోగికి గుండెనొప్పిగా అనిపిస్తోందని తెలిసిన వెంటనే అతడిచేత ఒక గ్లాసు నీరు తాగించాలి. కొన్నిసార్లు వెంటనే ఈసీజీ తీసే సమయం కూడా ఉండకపోవచ్చు. పరిస్థితి కాస్త తీవ్రంగా ఉందనిపిస్తే వెంటనే డిస్ప్రిన్‌–300 మి.గ్రా. మాత్రను నీటిలో కలిపి తాగించాలి. కూర్చోబెట్టిగానీ, పడుకోబెట్టి కూడా తల కాస్తంత పైకి లేపిగానీ డిస్ప్రిన్‌–300 మి.గ్రా. కలిపిన ద్రావణాన్ని తాగించవచ్చు. ఆ తర్వాత సార్బిట్రేట్‌ మాత్ర వేయాలి. దీంతో వెంటనే నొప్పి తగ్గిపోతుంది. ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా (శరీరానికి ఏమాత్రం శ్రమ కలిగించకుండా) ఏదో ఒక వాహనం మీద రోగిని ఆసుపత్రికి తరలించాలి. రోగి తనంతట తాను తీసుకునే  డిస్ప్రిన్‌ మాత్ర... డాక్టర్లు ఇచ్చే స్ట్రెప్టోకైనేజ్‌ ఇంజెక్షతో సమానంగా పనిస్తుంది. అందుకే గుండెనొప్పి వచ్చినవారికి సార్బిట్రేట్‌ కన్నా డిస్ప్రిన్‌ చాలా ముఖ్యం.

ఆ మాత్రను నీళ్లలో కలిపి  తాగించడం వల్ల... వెంటనే ఒంట్లో అది కలిసిపోతుంది. ఇక డిస్ప్రిన్, సార్బిట్రేట్‌... ఈ రెండూ ఇవ్వడం వల్ల రోగికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. ఈ రెండు టాబ్లెట్లను అందరూ ఇంట్లో ఉంచుకోవడం మంచిది. ఈ ట్యాబ్లెట్లు వేసుకునేలోపు రోగి దగ్గుతూ ఉండటం మరింత మేలు చేస్తుంది. గుండెపోటు వచ్చినప్పుడు తొలి గంట చాలా అమూల్యమైనది. కాబట్టి గుండెనొప్పి వచ్చిన రోగిని, నొప్పి వచ్చిన గంటలోపే హాస్పిటల్‌కు చేర్చడం చాలా ముఖ్యం. కొందరు దడ వచ్చిన వెంటనే కళ్లు తిరిగి పడిపోతారు. గుండెవేగం బాగా తగ్గిపోవడం వల్ల ఇలా పడిపోతారు. దీన్ని ‘సింకోప్‌ అటాక్‌’ అంటారు. ఇది గుండెజబ్బుకు సూచన. గుండెదడతో పడిపోయిన వారు మాత్రం రెండు నిమిషాల్లోనే మళ్లీ తేరుకుని, లేచి నడవగలరు. అయినప్పటికీ ముందుజాగ్రత్తగా వీళ్లకు ఒకసారి ఈసీజీ తీసి, అవసరమైన చికిత్స అందించడం మేలు.

సీఏబీజీ అంటే మరేమిటో కాదు... బైపాస్‌ సర్జరీయే...!
నా వయసు 63. ఒక రోజు ఛాతీనొప్పి తీవ్రంగా వచ్చింది. డాక్టర్లు సీఏబీజీ సర్జరీ చేయాలని అని చెప్పారు. సీఏబీజీ అంటే ఏమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. – ప్రసూన, గుంటూరు
గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే కీలకమైన ధమనుల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు,  రక్తసరఫరా అవరోధం కలగకుండా, సీఏబీజీ అనే సర్జరీ చేసి, రక్తాన్ని ఇతర మార్గాల్లో (బైపాస్‌ చేసిన మార్గంలో) గుండెకండరానికి అందేలా చేసే ఆపరేషనే సీఏబీజీ. మనం ఇంగ్లిష్‌లో సాధారణంగా బైపాస్‌ సర్జరీ అని పిలిచే దీన్ని వైద్యపరిభాషలో కరొనరీ ఆర్టరీ బైపాస్‌ గ్రాఫ్టింగ్‌ అని వ్యవహరిస్తారు. దాని సంక్షిప్తరూపమే ఈ సీఏబీజీ ఆపరేషన్‌. ఇందులో కాళ్లు లేదా చేతులపై ఉన్న రక్తనాళాలను తీసి, గుండెకు అడ్డంకిగా ఏర్పడిన రక్తనాళాలకు ప్రత్యామ్నాయంగా, రక్తాన్ని బైపాస్‌ మార్గంలో అందించేలా అమర్చుతారు. సాధారణంగా ఒక బ్లాక్‌ (అడ్డంకి)ని బైపాస్‌ చేయాలంటే ఒక రక్తనాళం అవసరం. గుండె వద్ద ఉన్న రక్తనాళాన్ని నేరుగా బైపాస్‌ చేసే ప్రక్రియను రీ–వాస్క్యులరైజేషన్‌ అంటారు. ఛాతీకీ కుడి, ఎడమ వైపున ఉన్న రక్తనాళాలను ఇంటర్నల్‌ మ్యామరీ ఆర్టరీ అంటారు. గుండెకు ఎడమవైపున ఉన్న నాళాన్ని లెఫ్ట్‌ యాంటీరియర్‌ డిసెండింగ్‌ అర్టరీ అని అంటారు. ఈ రక్తనాళాన్ని బ్లాక్‌ అయిన నాళాల వద్ద బైపాస్‌ మార్గంలా కలుపుతారు. దీర్ఘకాల ప్రయోజనాలతో పాటు రోగి త్వరగా కోలుకుంటున్నందున ఇప్పుడు బైపాస్‌లోనూ సరికొత్త విధానాన్ని పాటిస్తున్నారు.

బైపాస్‌ సర్జరీ చేయించుకున్న తర్వాత, భవిష్యత్తులో ఇలా మార్చిన రక్తనాళాల్లోనూ కొవ్వు పేరుకోకుండా హృద్రోగులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.  రక్తనాళాల్లో పేరుకున్న బ్లాక్స్‌ను అధిగమించి, రక్తాన్ని గుండెకు చేరవేసేందుకు వీలుగా బైపాస్‌ సర్జరీ చేస్తారు. అంతే తప్ప ఇది చేయడం వల్ల అప్పటికే ఉన్న గుండెజబ్బు తొలగిపోయిందని పేషెంట్‌ అపోహ పడకూడదు. అందుకే రోగి మళ్లీ ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవే... రోగికి హైబీపీ ఉన్నట్లయితే దాన్ని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకునేలా డాక్టర్‌ సూచించిన మందులు తీసుకోవాలి. అలాగే రోగికి డయాబెటిస్‌ ఉంటే, రక్తంలోని చక్కెరపాళ్లు ఎల్లప్పుడూ అదుపులో ఉండేలా మందులు తీసుకుంటూ, కొవ్వులు తక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. పొగతాగే అలవాటు ఉంటే దాన్ని తక్షణం పూర్తిగా మానేయాలి. డాక్టర్లు సూచించిన వ్యాయామాలు చేస్తూ ఉండాలి.
డాక్టర్‌ అనూజ్‌ కపాడియా,
కార్డియాలజిస్ట్, కేర్‌ హాస్పిటల్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్‌

మాంసాహారం మానేయాల్సిందేనా?
నా వయసు 48 ఏళ్లు. నేను మాంసాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను.  కొవ్వులతో కూడిన ఆహారం ఇంత ఎక్కువగా తీసుకోకూడదనీ, దీనివల్ల ఒంట్లో కొలెస్ట్రాల్‌ పేరుకుంటుందనీ, అది ఈ వయసులో గుండె జబ్బులకు దారితీస్తుందని  ఫ్రెండ్స్‌ అంటున్నారు. నాకు తగిన సలహా ఇవ్వగలరు. – ఫయాజ్, నిజామాబాద్‌


కొలెస్ట్రాల్‌ అనే కొవ్వులలో రెండు రకాలు ఉంటాయి. మొదటిది ఒంటికి మేలు చేసే కొవ్వులు. వీటిని హైడెన్సిటీ లైపో ప్రొటీన్‌ (హెచ్‌డీఎల్‌)అంటారు. ఇవి గుడ్డు  తెల్లసొనలో ఉంటాయి. శరీరానికి హానికారకమైన కొవ్వులను ఎల్‌డీఎల్‌ (లోడెన్సిటీ లైపో ప్రొటీన్స్‌) అంటారు. చెడు కొలెస్ట్రాల్‌ వంటి కొవ్వులు గుండెజబ్బులకు ఒక రిస్క్‌ ఫాక్టర్‌. చెడు కొలెస్ట్రాల్‌ పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారం తినేవారిలో, ఫాస్ట్‌ ఫుడ్‌ తీసుకునే వారిలో గుండెజబ్బుల రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. అయితే రక్తంలో ఈ రెండు రకాల కొవ్వులు కలుపుకొని 200 లోపు ఉండాలి. ఎల్‌డీఎల్‌ 100 లోపు, హెచ్‌డీఎల్‌ 40 పైన ఉండాలి. అలాగే ట్రైగ్లిజరైడ్స్‌ అనే మరో రకం కొవ్వులు కూడా గుండెకు హాని చేస్తాయి. ఇవి 150 లోపు ఉండాలి. కొలెస్ట్రాల్‌ మన శరీరంలోకి రెండు రకాలుగా చేరుతుంది. ఒకటి ఆహారం ద్వారా, మరొకటి లివర్‌ పనితీరు వల్ల.

శిశువు పుట్టినప్పుడు 70 మి.గ్రా. కొలెస్ట్రాల్‌ ఉంటుంది. మెదడు నరాల వ్యవస్థ కోసం, శిశువు రెండేళ్ల పాటు ఎదగడానికి ఈ కొలెస్ట్రాల్‌ కొవ్వులు ఉపయోగపడతాయి. ఆ తర్వాత దీని అవసరం అంతగా ఉండదు. అయితే జన్యుతత్వాన్ని బట్టి ఈ కొవ్వులు (మంచి, చెడు ఈ రెండు రకాల కొలెస్ట్రాల్స్‌) ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. వేపుళ్లు, బేకరీ పదార్థాలు, కృత్రిమ నెయ్యి వంటి పదార్థాలను ఎక్కువగా తినేవాళ్లలో ఈ కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇక రక్తంలో కొలెస్ట్రాల్‌ పాళ్లు ఎక్కువగా ఉన్నవారికి... డాక్టర్లు వాటిని అదుపు చేసే మందులు ఇస్తుంటారు. ఈ తరహా మందులు వాడుతున్న వారు వాటిని మధ్యలోనే  ఆపకూడదు. మీరు మాంసాహారం పూర్తిగా మానేయలేకపోతే... కొవ్వులు తక్కువగా ఉండే చేపలు, చికెన్‌ వంటి వైట్‌మీట్‌ తీసుకోండి. వీటిలోనూ చికెన్‌ కంటే చేపలు చాలా మంచిది. కాబట్టి మాంసాహారం తీసుకోవాలనిపిస్తే చేపలు తినడం మేలు. అది కూడా ఉడికించినవే. వేపుడు వద్దు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top