పర్యాటక ఆహారం | Sakshi
Sakshi News home page

పర్యాటక ఆహారం

Published Fri, Sep 26 2014 9:44 PM

Tourism Food

ప్రపంచంలో... రకరకాల మనుషులు...
  రకరకాల మనస్తత్వాలు... రకరకాల ప్రదేశాలు...
 రకరకాల వాతావరణాలు... అవే కూరలకు ఒక్కో చోట ఒక్కో పేరు...  ఒక్కో చోట ఒక్కో రకమైన వంట...
 ఊరు పేరు మారినా... రంగు, రుచి మారినా...
 అందరి లక్ష్యం... వండి తినడమే... ఆహారాన్ని ఆస్వాదించడమే!
 నేడు ప్రపంచ పర్యాటక దినం... ఈ సందర్భంగా ప్రపంచ దేశాలలో దొరికే పలురకాల వంటలు... మీరూ ప్రయత్నించండి.... కాదేదేశమూ రుచికి అనర్హం అనుకోండి...

 
 చైనా - కుంగ్ పావో చికెన్
 
కావలసినవి:
స్కిన్‌లెస్, బోన్‌లెస్ చికెన్ - కప్పు (ముక్కలు చేయాలి); సాయ్ సాస్ - 2 టేబుల్ స్పూన్లు; నువ్వుల నూనె - 2 టేబుల్ స్పూన్లు; కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు (2 టేబుల్ స్పూన్ల నీళ్లలో కలపాలి); ఎండు మిర్చి ముద్ద - టేబుల్ స్పూను; వైట్ వెనిగర్ - టీ స్పూను; బ్రౌన్ సుగర్ - 2 టీ స్పూన్లు; ఉల్లికాడల తరుగు - అర కప్పు; వెల్లుల్లి తరుగు - టేబుల్ స్పూను; వాటర్ చెస్ట్‌నట్స్- 2 టేబుల్ స్పూన్లు; పల్లీ తురుము- టేబుల్ స్పూను.
 
తయారీ:
ఊరబెట్టడానికి: ఒక పాత్రలో టేబుల్ స్పూను సాయ్ సాస్, టేబుల్ స్పూను నూనె, టేబుల్ స్పూను నీళ్లలో కలిపిన కార్న్‌ఫ్లోర్ వేసి కలిపి, అందులో చికెన్ ముక్కలు వేసి సుమారు గంటసేపు ఊరనిచ్చాక, కింద నుంచి పైకి బాగా కలిపి, మూత పెట్టి ఫ్రిజ్‌లో అర గంటసేపు ఉంచాలి  
 
సాస్ తయారీ:
చిన్న పాత్రలో టేబుల్ స్పూన్ సాయ్ సాస్, టేబుల్ స్పూను నూనె, టేబుల్ స్పూను కార్న్‌ఫ్లోర్ కలిపిన నీళ్లు, ఎండు మిర్చి ముద్ద, వెనిగర్, పంచదార వేసి బాగా కలిపి ఉల్లికాడల తరుగు, వెల్లుల్లి తరుగు, నీళ్లు, చెస్ట్‌నట్స్ తురుము, పల్లీల తురుము వేసి బాగా కలిపి, బాణలిలో వేసి స్టౌ మీద ఉంచి చిక్కగా అయ్యేవరకు కలుపుతుండాలి  
 
ఫ్రిజ్‌లో నుంచి చికెన్ మిశ్రమం తీసి, వేరే పాన్‌లో వేసి స్టౌ మీద ఉంచి, చికెన్ తెల్లగా మారేవరకు బాగా కలిపి, సాస్ తయారవుతున్న పాత్రలో వేసి కలపాలి
 
అన్ని పదార్థాలు ఉడికి, కూర బాగా దగ్గర పడ్డాక దించేయాలి.
 
ఎగ్‌లెస్ మార్బుల్ కేక్
 
కావలసినవి:

బటర్ - 150 గ్రా; మెత్తగా చేసిన పంచదార పొడి - 150 గ్రా; పాలు - ముప్పావు కప్పు; వెనిగర్ - 3 టీ స్పూన్లు; మైదా పిండి - 150 గ్రా; వెనిలా ఎసెన్స్ - టీ స్పూను; కోకో పొడి - టేబుల్ స్పూను; బేకింగ్ పౌడర్ - ఒకటిన్నర టీ స్పూను;
 
ఐసింగ్ కోసం... బటర్ - 50 గ్రా; ఐసింగ్ సుగర్ - 100 గ్రా; కరిగించిన చాకొలేట్ - 50 గ్రా.; కోకో - 2 టీ స్పూన్లు; అలంకరించడానికి స్వీట్లు - తగినన్ని.
 
తయారీ:
ఒక పాత్రలో పంచదార, బటర్ వేసి గిలక్కొట్టాలి  పాలు, వెనిగర్ జత చేసి మరోమారు గిలక్కొట్టి, మిశ్రమాన్ని రెండు భాగాలు చేయాలి (టేబుల్ స్పూను మిశ్రమాన్ని పక్కన ఉంచాలి)
 
 ఒక సగంలో టేబుల్ స్పూను మైదా పిండి, ఒక సగంలో కోకో వేయాలి  
 
 కేక్ ప్లేట్‌లో ఈ మిశ్రమాలను ఒక దాని మీద ఒకటి ఉంచాలి  
 
 180 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేసిన అవెన్‌లో ఈ ట్రే ఉంచి, సుమారు 25 నిమిషాలు బేక్ చేసి, బయటకు తీసి చల్లారనివ్వాలి  
 
 ఐసింగ్ కోసం ఇచ్చిన పదార్థాలను బాగా గిలక్కొట్టి, కేక్ మీద వేయాలి  
 
 పండ్ల ముక్కలతో అలంకరించాలి.
 
మొఘలాయీ బిర్యానీ బాద్షాహీ
 
కావలసినవి:

మటన్ - అర కేజీ; బాస్మతి బియ్యం - పావు కేజీ; నిమ్మరసం - 3 టేబుల్ స్పూన్లు; బాదం పప్పుల తరుగు - 2 టేబుల్ స్పూన్లు; పుదీనా ఆకులు - 10; బటర్ - కప్పు; కొత్తిమీర - కొద్దిగా; జీలకర్ర - అర టేబుల్ స్పూను; ఉల్లి తరుగు - అర కప్పు; ఏలకులు - 2; నూనె - టేబుల్ స్పూను; వెల్లుల్లి రేకలు - 2; అల్లం ముక్క - చిన్నది; కుంకుమ పువ్వు - అర టేబుల్ స్పూను; పచ్చి మిర్చి తరుగు - అర టేబుల్ స్పూను; కారం - అర టేబుల్ స్పూను; దాల్చిన చెక్క - చిన్న ముక్క; పెరుగు - అర కేజీ; పాలు - 125 మి.లీ; నీళ్లు - 3 కప్పులు
 
 తయారీ:
 బియ్యం కడిగి నానబెట్టాలి  
 
 బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి
 
 కొద్దిగా నీళ్లలో కుంకుమ పువ్వు వేసి కలపాలి  
 
 అల్లం, ఎండు మిర్చి, వెల్లుల్లి, బాదంపప్పులను మిక్సీలో వేసి ముద్ద చేయాలి  
 
 బాణలిలో బటర్ వేసి కరిగాక తయారుచేసి ఉంచుకున్న ఈ ముద్ద వేసి వేయించాలి  మటన్, ఉప్పు జత చేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉంచాలి  
 
 నీళ్లు పోసి బాగా ఉడికించాలి. (సుమారు ఒక కప్పు గ్రేవీ ఉండేవరకు ఉడికించాలి)  
 
 ఒక పెద్ద పాత్రలో నీళ్లలో ఉప్పు, బియ్యం వేసి ఉడికించాలి
 
 పెరుగును ఒక వస్త్రంలో గట్టిగా కట్టి ఉన్న నీరంతా పోయేలా పిండేయాలి  
 
 లవంగాలు, ఏలకులు, జీలకర్ర, పుదీనా, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర పెరుగులో వేసి కలపాలి  
 
 కుంకుమ పువ్వు నీరు, నిమ్మరసం రెండింటినీ మటన్‌లో వేసి కలపాలి  
 
 సగం అన్నాన్ని మటన్ మీద వేసి, వేయించి ఉంచుకున్న ఉల్లి తరుగు వేసి మళ్లీ పైన అన్నం వేయాలి  
 
 పాలు, కొద్దిగా పెరుగు వేసి మూత ఉంచాలి  
 
 సుమారు గంటసేపు స్టౌ మీద ఉంచి దించేయాలి  
 
 వేడివేడిగా వడ్డించాలి.
 
 సేకరణ: డా. వైజయంతి
 

Advertisement
 
Advertisement
 
Advertisement