తప్పయిపోయింది స్వామీజీ..!

Swamiji Goodness honesty patience truthfulness non violence - Sakshi

ఆయన ఒక స్వామీజీ. నీతి, నిజాయితీ, ఓర్పు, సత్యవాక్పాలన, అహింసల విశిష్టతలను, వాటిని పాటించడం వల్ల సమాజానికి కలిగే మంచిని చక్కగా వివరిస్తున్నారు. అందరూ శ్రద్ధగా వింటున్నారు. ఓ ఆకతాయికి కొంటె బుద్ధి పుట్టింది. భక్తి ఉన్నవాడిలా నటిస్తూ, స్వామీజీ దగ్గరకు వెళ్లి వినయంగా నమస్కరించాడు. చిరునవ్వుతో ఏమిటన్నట్టు చూశారు స్వామీజీ. ‘‘స్వామీ, నాదో సందేహం. దయచేసి తీరుస్తారా?’’ అనడిగాడు. ‘‘చెప్పు నాయనా’’ అన్నారు స్వామీజీ  చల్లగా.  ‘‘ముక్కోటి దేవతలు అని అంటూ ఉంటారు కదా, వారి పేర్లు చెబుతారా’’ అన్నాడు. స్వామీజీకి అతని ఉద్దేశ్యం అర్థమైనా కోపం తెచ్చుకోలేదు. ‘‘అలాగే నాయనా! తప్పకుండా చెబుతాను. అయితే ఒక నిబంధన. నేను ఏకబిగిన చెప్పుకుని పోతూ ఉంటాను.నువ్వు నిద్రాహారాలను వదిలేసి మరీ స్వయంగా రాసుకోవాలి. పూర్తయిన తర్వాత తిరిగి నాకు చదివి వినిపించాలి.సిద్ధమేనా మరి?’’అనడిగారు స్వామీజీ.

అతనికి దిమ్మ తిరిగినట్లయింది. ‘ఇంటి దగ్గర తన తాత, నాయనమ్మ రామకోటి, శివకోటి కొన్ని ఏళ్లుగా రాస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. కోటి నామాలకే అంత సమయం పడితే, మూడు కోట్ల నామాలను పూర్తి చేసేసరికి నేను ముసలివాడిని కావడం ఖాయం. ఆయన్నేదో ఇరుకున పెట్టాలనుకుంటే చివరకు నేనే ఇరుక్కుపోయేలా ఉన్నానే, తప్పయిపోయింది.’ అనుకున్నాడు. వెంటనే చెంపలు వేసుకుంటూ, ‘క్షమించండి స్వామీ, కొంటెతనం కొద్దీ అలా అడిగాను. మీరు ముక్కోటి నామాలనూ చెప్పినా, రాసుకునేంత ఓపిక గానీ, ఆసక్తి గానీ లేవు నాకు’’ అన్నాడు. స్వామీజీ చిరునవ్వుతో ‘‘నాయనా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తులను అనేక అంశలుగా భావించి వివిధ నామాలతో, రూపాలతో పూజిస్తుంటారు. నిజానికి ముక్కోటి దేవతలు అని మాట వరసకుఅనేదేకానీ, నిజంగా మూడుకోట్ల మంది దేవతలున్నారని కాదు. నువ్వు నిజంగా తెలుసుకునేందుకు అడిగి ఉంటే నువ్వు పెరుగుతావని సంతోషించేవాడిని. కానీ నన్నేదో ఇబ్బంది పెట్టాలనుకుని అడిగావు. ఇంకొకరిని తక్కువ చేయడానికి నీ తెలివితేటలను ఎప్పుడూ ఉపయోగించకూడదు. అర్థమైందా?’’ అన్నారు. అర్థమైందన్నట్లుగా మరోసారి లెంపలు వేసుకుంటూ, ఈసారి భక్తితో మనస్ఫూర్తిగా స్వామీజీకి నమస్కరించాడు. 
 డి.వి.ఆర్‌. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top