నూట పాతికేళ్ల క్రితం ఒకనాడు

Sri Ramadasu Amarnath Writes on Hampanna - Sakshi

అవి, భారతదేశంలో శ్వేత జాతి ప్రభుత్వం ఒకటిన్నర శతాబ్దకాలం పరిపాలించి, భారతీయులపై దాష్టీకం జరుపుతున్న రోజులు. భారతీయుల గుండెల్లో స్వాతంత్య్ర కాంక్ష రగులుతున్న రోజులు. బ్రిటిష్‌ వాళ్లు వారి పోలీసు బలగాలను ఒక చోటనుండి మరొక చోటుకు తరలించటానికి అనువుగా భారతదేశంలో తొలిసారి రైలుమార్గాన్ని నియమించారు. గుత్తి మార్గంలో కూడా ప్రతి రోజు రైలు వెళుతుంది. అక్కడ మనుషులు నడిచే బాట కలిసేచోట ఒక రైల్వేగేటు ఏర్పాటు చేసి కాపలాదారుణ్ణి నియమించారు. అతడి పేరు గూలపాళ్యం హంపన్న. అతడు విధులు నిర్వహించడానికి ఒక రాతిగూడును నిర్మించారు. గేటు కాపలాదారుడు రైలు వచ్చే సమయంలో గేటువేసి పచ్చజెండా చూపిస్తేనే కాని రైలు వెళ్ళదు. ఆ రైల్వే గేటుకు దగ్గర్లోనే గుత్తికొండ ఉంది. దానిపైన పడిపోయిన కోట కనిపిస్తూ ఉంటుంది. పలకరింపుతో ఆ దారినపోయే వారందరికీ దగ్గరయ్యాడు హంపన్న.

గుత్తిలోని పల్లెపడుచు నాగులమ్మ. అందగత్తె. గుణవతి. పల్లెలో ఆమె లేకుండా ఏ పనీ జరుగదు. పెళ్ళి, పేరంటం, కొలుపులు అన్నిట్లోనూ నాగులమ్మ గలగల నవ్వుతూ కనిపించేది. ఆమె రూపం విశ్వంగారి వర్ణనలో ఇలా ఉంటుంది:
కురులు ముడిచి ముద్ద కొప్పును జెక్కి, గో
రంట పూలగుత్తి నంట దురిమి
కోల దోసగింజ కుంకుమ బొట్టుతో
లక్ష్మివోలె నాగులమ్మ వచ్చె.

తెలుగు పడుచుల ముగ్ధ మనోహరత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. జడకొప్పులో గోరంటపూలు తురిమి, దోసగింజ కుంకుమ బొట్టుతో నాగులమ్మ లక్ష్మీదేవిలా ఉంది.

ఆ బాటలో ప్రతిరోజు పొలం పనులకు వెళ్ళే నాగులమ్మ హంపన్న రూపానికీ గుణానికీ ముగ్ధురాలైంది. ఇద్దరూ పరస్పరం ప్రేమించుకున్నారు. హంపన్నను నాగులమ్మ ‘మామా!’ అని పిలిచేది. వారిద్దరు కలిసి ఆకువక్కలు వేసుకొనేవారు. ఆకు వక్క నమలటం రాయలసీమలో అప్పుడు సాధారణం. అందునా స్త్రీపురుషులు కలిసి ఆకు వక్క వేసుకోవటం ప్రేమికులకే చెల్లుతుంది.

ఒకనాడు నాగులమ్మ తన స్నేహితురాలు లచ్చమ్మతో కలిసి సాయంత్రం వేళ ఆ బాటలో నడుస్తూ ఉంది. అప్పటికి సూర్యుడు అస్తమిస్తున్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ నిదానంగా నడుస్తుండటంతో వేగంగా నడిచే రైతుకూలిజనం వారి కంటే ముందుగా వెళ్ళిపోయారు. బాటలో వాళ్లిద్దరే మిగిలిపోయారు. చీకటి పడుతుందేమోనన్న భయంతో వడివడిగా నడవటం మొదలు పెట్టారు. అల్లంత దూరంలో రైలుగేటు కనిపిస్తోంది. ఈలోపు దారిలో ఆరుగురు తెల్ల సైనికులు ఎదురు పడ్డారు. వారి చేతిలో ఆయుధాలున్నాయి. తప్ప తాగి ఉన్నారు. పడుచులిద్దరూ భయంతో పరుగులు పెట్టారు. తెల్ల సైనికులు వెంట పడ్డారు. అది ఆడపడుచుల మానానికి హాని కలిగించే పరిణామం.

నాగులమ్మకు హంపన్న గుర్తుకు వచ్చాడు. ‘మామా!’ అంటూ వెర్రికేక వేసి గసపెడుతూ రైలుగేటు దగ్గరికి చేరుకున్నారు. ఆ వెనుకనే తెల్ల సైనికులు. అక్కడ తెలుగు పౌరుషానికి నిలువెత్తు విగ్రహంలా మెలితిరిగిన మీసంతో తీక్షణమైన కళ్ళతో వీరభద్రుడిలా నిల్చొని ఉన్నాడు హంపన్న. నాగులమ్మ లచ్చమ్మ ఒక్క ఉదుటున రాతిగూడులో ప్రవేశించి తలుపులు వేసుకున్నారు. పరిస్థితిని కనురెప్పపాటుకాలంలో అర్థం చేసుకున్నాడు హంపన్న. అతడి చేయి గాలిలో లేచింది. ప్రక్కనున్న చెట్లపాదుకు నిలబెట్టిన వెదురుగడను అందుకొని గిరగిరా తిప్పుతూ తెల్ల సైనికులను ఎదుర్కొన్నాడు. ఈ పరిణామానికి తెల్ల సైనికుల మత్తు వదిలిపోయింది. మదం బుసలు కొట్టింది. హంపన్నపై దాడికి దిగారు. హంపన్న ప్రళయ కాల రుద్రుడిలా విజృంభించి ఒక్క కర్రతోనే వారందరినీ గాయపరిచాడు.

హంపన్నను ఎదుర్కోవటం వారికి కష్టమైంది. వారు రెండుగా చీలిపోయి వెనుక నుండి, ముందు నుండి హంపన్న తలపై మోది తల పగులగొట్టారు. రక్తస్రావంతో హంపన్న నేలపై పడగా అతనిని వదిలిపెట్టి రాతిగూడులో దాక్కున్న పడుచులను ఎలాగైనా ఎత్తుకు పోవాలని దాని తలుపులు బద్దలు కొట్టసాగారు. లోపల లచ్చమ్మ, నాగులమ్మ భయంతో కేకలు వేయసాగారు. అబలల ఆర్తనాదం రక్తపు మడుగులో పడివున్న హంపన్నకు వినిపించింది. ఒంట్లోని నరాల శక్తినంతటిని కూడదీసుకొని ఉప్పెనలా లేచాడు. దాంతో చేతిలో ఆయుధంతో ఉన్న తెల్ల పిరికిపంద హంపన్నను గురిపెట్టి కాల్చాడు. పిస్తోలు శబ్దం, అబలల ఆక్రందనలతో ఆ పరిసరాలన్నీ మారు మ్రోగాయి. సూర్యుడు అస్తమించాడు. తెలుగు వీరుడు నేలకొరిగాడు. దూరంగా వెళుతున్న పల్లెజనం ఆ శబ్దానికి పరుగు పరుగున వచ్చారు. తెల్ల సైనికులు పారిపోయారు.

తమ ఆప్తుడు హంపన్నను ఆ స్థితిలో చూసి జనం బావురుమన్నారు. అతని ప్రాణాలు దక్కించుకోవాలని వారి అమాయకపు ఆశ. దగ్గర్లో ఆసుపత్రి లేదు. అచేతనంగా ఉన్న హంపన్నను గుత్తి హాస్పిటల్‌కు చేర్చారు. అక్కడ మంచి మనసు గల మిషనరీలు, మిస్సమ్మలు హంపన్నకు వైద్యం చేశారు. అయినా ఫలితం దక్కలేదు. తన మామను సజీవుడుగా చూడాలని పక్కనే ఉన్న నాగులమ్మ కనులు మూతపడలేదు.

చివరికి అక్టోబర్‌ 5న హంపన్న తన నాగులమ్మను వదలి తుదిశ్వాస విడిచాడు. ఈ దయనీయ గాథను గేయ, పద్య రూపంలో కరుణరస స్ఫోరకంగా మలచిన విశ్వం శైలిని దేంతో పోల్చినా సరితూగదు. హంపన్న మరణించిన పిదప నాగులమ్మను వర్ణిస్తూ–
హంస లేచిపోయె, హంపన్న లేడింక
నాగులమ్మ వెఱి మామ మామయన్న మాటొక్కటే కాని,
వేఱుమాట పల్క నేరదయ్యె

అని అంటాడు. తను ప్రాణప్రదంగా ప్రేమించిన మామ ఇక లేడు అని తెలుసుకొని పిచ్చిదానిలా ‘మామా! మామా!’ అని అరుస్తూ నాగులమ్మ కొండల దారిపట్టింది.

నాగులు మామా యనగా
నగములు మామా యన్నవి.
నాగులు మామా యనగా
ఖగములు మామా యన్నవి.
నాగులు మామా యనగా
మృగములు మామా యన్నవి.
నాగులు మామా యన భూ
నభోంతరము దద్దరిల్లె.

‘మామా!’ అని నాగులమ్మ ఆర్తధ్వని చేయగానే కొండలు, పక్షులు, జంతువులు అంతేకాదు భూతలం కూడా తిరిగి మామా! అని అరిచాయి. అంటే ప్రతిధ్వనించాయి అని కవితా భావన. నాగులమ్మ ఏమైంది?

మతి చలించిన నాగులమ్మలిక పడుచు
కానలో బడిపోయె నెక్కటియె నపుడు
ఆమె కనబడ దీనాటి కైన నచట
వినబడును మామ యను మాట వీనులున్న.

మతి చలించటంతో మామా అని అరుస్తూ అడవిలో కలిసిపోయిన నాగులమ్మ జాడ ఈనాటికీ తెలియదు. చెవులున్న వారికి అక్కడ మామా అనేమాట వినిపిస్తుంది. మనసు గల వారికి నాగులమ్మ దీనస్వరం హృదయంలో ప్రతిధ్వనిస్తుంది అని ఒక కొత్త భావాన్ని కవి సూచించారు.

గుత్తి బాట ప్రక్కనే హంపన్న సమాధి చేయబడ్డాడు. తెల్ల దొరల్లో మంచి మనసు కలవారు నల్ల వారితో కూడా కలిసి వచ్చి నమ్రతతో ఆ వీర యోధునికి నివాళులు అర్పించారు. అతని వీరమరణానికి గుర్తుగా శిలాఫలకాన్ని ఆంగ్ల భాషలో చెక్కించారు.

గుత్తి బాట ప్రక్క గడివోలె హంపన్న
జ్ఞాపకమ్మ సేయు శాసనమ్ము
కలదు నేడు గూడ, కంపల మధ్యలో
నాటి సంఘటన కదోటు గుఱుతు.
ఆ వీరగల్లు గుడిలో
కావలి హంపన్న ఆత్మ కాపురముండన్‌
తావెక్కడ చాలును? భర
తావనియే వాని ఆలయమ్మగును గదా?

ఈనాటికీ హంపన్న సమాధి దర్శనమిస్తుంది. తెలుగు యోధుడు హంపన్న అతివల మానాన్ని రక్షించుట కోసం ప్రాణత్యాగం చేశాడు. విశ్వం గారు ఈ కావ్యాన్ని ముగిస్తూ–
ధన్యుడు హంపన్న, ధన్యము గుత్తి
ధన్యమాతని జీవితమ్ము, దివ్యమ్ము;
ధన్యమీ కావ్యమ్ము, ధన్యుడు కవియు
ధన్యుడు కృతిపతి, ధన్యము తెనుగు

అన్నారు. నిజం చెప్పాలంటే ఈ కావ్యాన్ని చదివిన ప్రతి పాఠకుడూ ధన్యుడే.
- శ్రీరామదాసు అమరనాథ్‌
9603367178

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top