దాచిన బంగారం

Special story on family - Sakshi

ఒక వ్యక్తి రోజూ తన ఇంటికి దగ్గర్లో ఉన్న పూలతోటకు వెళ్లొచ్చేవాడు. రోజూ అతడు అక్కడికి వెళ్లిరావడం దేనికంటే.. ఇంట్లోని బంగారు నగలు, నాణేలను అతడు ఆ తోటలోనే ఒక చోట గొయ్యి తవ్వి దాచిపెట్టాడు. అవి అక్కడ భద్రంగానే ఉన్నాయా అని చూసుకోడానికి వెళ్లేవాడు. వెళ్లి, ప్రతి రోజూ ఆ బంగారు నగల్నీ, నాణేలను గొయ్యిలోంచి పైకి తీసి, లెక్క పెట్టుకుని తిరిగి ఆ గొయ్యిలోనే పూడ్చి పెట్టి వచ్చేవాడు. కొన్నాళ్లుగా ఇదంతా గమనిస్తున్న ఓ దొంగ, ఓ రోజు ఆ గొయ్యి తవ్వి నగల్నీ, నాణేలను దోచుకెళ్లాడు. మర్నాడు తోటలోకి వెళ్లి చూసిన ఆ ‘బంగారయ్య’కు గుండె గుభిల్లుమంది. లబోదిబోమని మొత్తుకున్నాడు. ‘‘దేవుడా నా కష్టార్జితం అంతా దొంగల పాలయ్యింది’’ అని శోకాలు పెట్టాడు. ఆ శోకాలు విన్న బాటసారి ఒకరు బంగారయ్య దగ్గరకు వచ్చి ‘‘ఏం జరిగిందయ్యా.. ఎందుకు దుఃఖిస్తున్నావు?’’ అని అడిగాడు. బంగారయ్య విషయం చెప్పాడు. 

‘‘ఇంట్లోనే దాచుకోలేకపోయావా? అవసరం అయినప్పుడు ఆ బంగారం  నీకు అందుబాటులో కూడా ఉండేది’’ అన్నాడు బాటసారి. ఆ మాటకు బంగారయ్యకు కోపం వచ్చింది. ‘‘ఖర్చు చెయ్యడానికైతే బంగారాన్ని దాచుకోవడం ఎందుకు?’’ అన్నాడు. ఆ మాటకు బాటసారి ఆశ్చర్యపోయాడు. ఒక రాయి తీసుకుని, బంగారయ్య బంగారం దాచుకున్న గొయ్యిలోకి విసిరేసి, ‘‘గోతిలో పడిన ఆ రాయికి ఎంత విలువుందో, గోతిలో పాతిపెట్టిన నీ బంగారానికి అంతే విలువ ఉంటుంది. ఇందులో బాధపడేందుకు ఏముందీ. ఇంటికి వెళ్లిపో’’ అనుకుంటూ వెళ్లిపోయాడు. జీవితానికి పొదుపు అవసరమే. భవిష్యత్తుకు బంగారమూ అవసరమే. అయితే అవసరాలకు ఉపయోగించని పొదుపు, అవసరాలకు బయటికి తియ్యని బంగారం.. రెండూ.. ఏ విలువా లేని రాళ్లతో సమానం. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top