
1969 డిసెంబర్ 19వ తేదీన మద్రాసులోని అన్నా నగర్‌లోని ఒక ఇంటిలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ విప్లవ కారుల రాష్ట్ర కమిటీ సమావేశం రహస్యంగా జరుగుతున్న మొదటి రోజున పోలీసులు దాడిచేసి కొందరు నాయకులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో దేవులపల్లి వెంకటేశ్వరరావు (డీవీ), తరిమెల నాగిరెడ్డి (టీఎన్) తదితరులు ఉన్నారు. చండ్ర పుల్లారెడ్డి అనుకున్న సమయానికి రాని కారణంగా అరెస్టు కాలేదు. సమావేశానికి హాజరైన నాయకులతో పాటు మరి కొంతమంది ముఖ్య నాయకులను కలిపి మొత్తం 68 మందిపై ఆనాడు కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం స్వతంత్ర భారత చరిత్రలో రాజకీయ ప్రేరేపితమైన తొలి కుట్ర కేసును బనాయించింది. దానికి ప్రభుత్వం పెట్టిన పేరు ‘హైదరాబాదు కుట్ర కేసు’. అయితే అది జనంలో ‘నాగిరెడ్డి కుట్ర కేసు’గా బహుళ ప్రచారం పొందింది. దీనికి ముఖ్య కారణం వీరిపై పెట్టిన కేసును డీవీ, టీఎన్‌లు స్వయంగా వాదించి సంచలనం సృష్టించడం.
1969 ఏప్రిల్ నెలలో కృష్ణా జిల్లా అట్లప్రగడలో రహస్యంగా జరిగిన రాష్ట్ర ప్లీనంలో ఆమోదించిన ‘తక్షణ కార్యక్రమం’ డాక్యుమెంట్ ఆధారంగా ప్రభుత్వం ఈ కేసును బనాయించింది. జనతా ప్రజాతంత్ర విప్లవ దశలో కమ్యూనిస్టు విప్లవ కారుల వ్యూహం – ఎత్తుగడల స్థూల రూపమే ఈ తక్షణ కార్యక్రమం. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విప్లవ కమ్యూనిస్టు కమిటీ ప్రకటించిన ‘తక్షణ కార్యక్రమం’ ఆధారంగా ఈ ప్రభుత్వాన్ని కూల్చటానికి వీరు కుట్ర పన్నినట్లు పేర్కొంది. 1970 జూన్‌లో ఈ కేసు విచారణ హైదరాబాద్ అదనపు సెషన్స్ జడ్జి కోర్టులో జరిగిన సందర్భంలో– డీవీ, టీఎన్‌లు ఈ ‘తక్షణ కార్యక్రమా’న్ని పూర్తిగా సమర్థిస్తూ తమ వాదనలను దృఢంగా వినిపించారు. ఈ కేసులో తమకు తీవ్రమైన శిక్షలు పడతాయని తెలిసి కూడా పార్టీ విధానాలను సమర్థించాలనే నిర్ణయం తీసుకుని కమ్యూనిస్టుల విప్లవసంప్రదాయాలకు పట్టం కట్టారు. కోర్టులో 48 మంది ముద్దాయిలను విచారించి 18 మందికి నాలుగు సంవత్సరాల మూడు నెలల కఠిన కారాగార శిక్ష విధించారు. హైకోర్టు కూడా ఈ శిక్షలను నిర్ధారించింది. 1972 మే నెలలో కఠోరమైన బెయిల్ కండిష¯Œ ్సపై జైలులో ఉన్న నాయకులు బయటకు వచ్చారు. 1975 జూన్ 25వ తేదీన ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించడంతో డీవీ, టీఎన్‌లతో సహా కుట్రకేసులో ఉన్న ముఖ్య నాయకులంతా రహస్య జీవితానికి వెళ్లిపోయారు.
డీవీ, టీఎన్ ఈ కుట్రకేసులో జైల్లో ఉన్న కాలంలో జైలును ఒక అధ్యయన కేంద్రంగా మార్చుకున్నారు. ‘కమ్యూనిస్టు విప్లవకారుల వ్యూహం – ఎత్తుగడలు’ అన్న స్టేట్మెంట్‌ను కేసులో ఉన్న అందరి తరఫున తయారుచేసి, విచారణ సందర్భంగా డీవీ వివరించారు. ఈ ప్రకటన ‘డీవీ స్టేట్మెంట్’గా ప్రచారం పొందింది. జైలు జీవితంలో ఉన్న టీఎన్ ‘తాకట్టులో భారతదేశం’ పేరుతో తగిన గణాంక వివరాలతో సమకాలీన ఆర్థిక రాజకీయ పరిణామాలను ‘తక్షణ కార్యక్రమా’నికి అన్వయించి రాసి... స్టేట్మెంట్ రూపంలో కోర్టులో రెండు గంట లపాటు ఎంతో శక్తిమంతంగా వివరించారు.
డీవీ, టీఎన్ కోర్టును తమ రాజకీయాల ప్రచార వేదికగా చేసుకున్న ఫలితంగా ఈ స్టేట్మెంట్లు కొత్త ఒరవడిని సృష్టించాయి. వారు ఇచ్చిన స్టేట్మెంట్లలో ముఖ్యమైనవి: ‘సాయుధ పోరాటాలు జరగకుండా ప్రజాస్వామిక పద్ధతుల్లో భూసంస్కరణలు అమలు జరగటం అసంభవం’, ‘వర్గపోరాటం, ప్రజల సాయుధ విప్లవం ద్వారా పాలకవర్గాన్ని కూలదోయటం తప్పనిసరిగా జరుగుతాయి’, ‘కమ్యూనిస్టు విప్లవకారులమైన మేము ప్రజాయుద్ధ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాం’, ‘మా విప్లవ పంథా రివిజనిస్టుల పార్లమెంటరీ పంథాకు పూర్తిగా భిన్నమైనది, మా పం«థాను గురించి మా తక్షణ కార్యక్రమంలో ప్రకటించాం.’ ప్రభుత్వం కుట్ర కేసు ద్వారా విప్లవకారులపై ఏవైతే ఆరోపణలు చేసిందో... వాటిని అంగీకరిస్తూ కోర్టులో స్టేట్‌మెంట్లు ఇచ్చి విప్లవకారుల ప్రతిష్టను ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు పెంచారు వీరు. డీవీ 1984 జూలై 12న చనిపోగా, టీఎన్ ఎమర్జెన్సీ
కాలంలో రహస్యంగా ఉంటూ అనారోగ్యంతో హైదరాబాదు ఉస్మానియా ఆసుపత్రిలో 1976 జూలై 28న చనిపోయారు. అలా వీరు జూలై మాసంలోనే అమరులవ్వడం యాదృచ్ఛికమే అయినా ఆసక్తిదాయకం. వారికి విప్లవాభివందనాలు.
– ముప్పాళ్ళ భార్గవ శ్రీ సీపీఐ ఎంఎల్ నాయకులు
(రేపు కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి వర్ధంతి)