చినుకు చినుకుల జీవధార | Funday Special Story On Rain | Sakshi
Sakshi News home page

చినుకు చినుకుల జీవధార

Jul 27 2025 4:56 AM | Updated on Jul 27 2025 4:56 AM

Funday Special Story On Rain

ప్రకృతి సహజ పరిణామమైన రుతుచక్ర భ్రమణంలో ఏటా వర్షర్తువు వస్తుంది. వర్షాకాలం ఏటా రావడం తథ్యమే అయినా, వాన రాకడలో తరచుగా ముందు వెనుకలు జరుగుతుంటాయి. ‘వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికీ తెలియదు’ అని మనకో సామెత ఉంది. ఎప్పుడు కురుస్తాయో తెలియని వాన రాక కోసం ఒక్కో ఏడాది రైతులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఒక్కో ఏడాది వానలు పుష్కలంగా కురుస్తుంటాయి. ఒక్కో చోట అనావృష్టి కరవు కాటకాలను సృష్టిస్తుంది. ఒక్కో చోట అతివృష్టి వరదలతో ముంచెత్తి పెనునష్టాన్ని కలిగిస్తుంది. వానలు తెచ్చిపెట్టే కష్టనష్టాలు ఎలా ఉన్నా, వానలు లేనిదే మనుగడ సాగించడం అసాధ్యం. ఈ భూమ్మీద మనుషులతో పాటు పశుపక్ష్యాదులు, చెట్లు చేమలు వంటి సమస్త జీవులు బతకాలంటే, వానలు కురవాల్సిందే!

వానలే లేకుంటే మనం నివసించే ఈ భూమి కూడా మిగిలిన గ్రహాల మాదిరిగా జీవరహిత గోళంగానే మిగిలి ఉండేది. వానల వల్లనే భూమి మీద జీవజాలం ఏర్పడింది. వానల వల్లనే భూమి మీద నాగరికతలు ఏర్పడ్డాయి. తొలినాటి మానవులకు వాన ఒక ప్రకృతి అద్భుతం. 

ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై, చిటపట చినుకులతో మొదలై, క్రమంగా పుంజుకుని జడివానగా మారే దృశ్యం ఇప్పటికీ ఒక అద్భుతమే! నాగరికతలు ఏర్పడిన కాలం నుంచి వివిధ సంస్కృతులలో వర్షారాధన ఉండేది. వానాకాలంలో ప్రత్యేకంగా జరుపుకొనే పండుగలు ఇప్పటికీ ఉన్నాయి. ప్రాచీన సాహిత్యం మొదలుకొని ఆధునిక సాహిత్యం వరకు వర్షవర్ణన కనిపిస్తుంది. వైదిక సాహిత్యంలోని ‘పర్జన్యసూక్తం’, ‘వరుణస్తుతి’ వంటివే కాకుండా, లౌకిక సాహిత్యంలోనూ కవులు మేఘవర్ణన, వర్షవర్ణన చేశారు.

‘ఆనందదో వర్షతు మేఘ వృందః
ఆనందదా జలధరా స్సంతతం భవంతు
ఆనందదోవుణ ఏష సదాస్తుమహ్యం
ఆనందినీ రోషధయో భవంతు’
అని ‘వరుణస్తుతి’ వర్షానందాన్ని స్తుతించింది.

‘విరిసెను మేఘ పరంపరమెరసెను శాంపేయలతలు మిన్నులు మొరసెన్‌పరచెను ఝంఝానిలములుకురిసెను వర్షము కుంభగుంభితరీతిన్‌’అంటూ మబ్బులతో మొదలై కుంభవృష్టిగా మారే వర్షదృశ్యాన్ని ఆవిష్కరించారు గుంటూరు శేషేంద్రశర్మ.నాగరికతలతో పాటు సంగీత సాహిత్యాది కళలను కూడా ప్రభావితం చేసిన ప్రకృతి పరిణామం వాన. వానలు లేనిచోట జీవం ఉండదు. జీవానికి తావులేని చోట మనుగడ ఉండదు. మనుగడ లేని చోట ఇక నాగరికతలెక్కడ? సంగీత సాహిత్యాది కళావైభవాలెక్కడ? భూమ్మీద వానలు కురిసే తావులతో పాటు అక్కడక్కడా చినుకు కురవని ఎడారులు కూడా ఉన్నాయి.

ఇప్పటి ఎడారులు ఒకనాడు పచ్చని నేలలేనని, ప్రకృతి మార్పుల ఫలితంగానే అవి ఎడారులుగా మారాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే, ఆఫ్రికాలోని సహారా ఎడారి ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడేదని; ఒకప్పుడు అక్కడ జలకళతో అలరారే సరోవరాలు, నదులు ఉండేవని; వాటి ఒడ్డున పచ్చని సవన్నా గడ్డిభూములు ఉండేవని; ఆ గడ్డిభూముల్లో అనేక జంతువులు జీవించేవని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. వేలాది సంవత్సరాల పరిణామంలో భూకక్ష్యలో వచ్చిన మార్పుల వల్ల సహారా ప్రాంతంలో వానలు కురవడం ఆగిపోయి, పూర్తిగా ఎడారిగా మారిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఇటీవలి కాలంలో సహారా ఎడారిలో అక్కడక్కడా తాత్కాలికంగా పచ్చదనం కనిపిస్తోంది. ‘ఇంటర్‌ ట్రాపికల్‌ కన్వర్జెన్స్‌ జోన్‌’ ఉత్తర దిశవైపు కదిలినప్పుడు సహారా ఎడారిలో అక్కడక్కడా నాలుగు చినుకులు కురుస్తున్నాయి. ఆ చినుకుల వల్లనే ఈ ఎడారిలో తాత్కాలికంగా పచ్చదనం కనిపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వర్షారాధన సంస్కృతి
ప్రాచీన నాగరికతలు విలసిల్లిన ప్రతిచోట వర్షారాధన సంస్కృతి ఉంది. అన్ని నాగరికతలలోనూ వర్షాలకు అధిదేవతలు ఉన్నారు. భారత ఉపఖండంలో వైదికార్యులు ఇంద్రుడిని, వరుణుడిని వర్షాధిదేవతలుగా కొలిచేవారు. మన పురాణాల్లో ఇంద్ర వరుణుల ప్రస్తావన కనిపిస్తుంది. ప్రాచీన గ్రీకు ప్రజలు వర్షాల కోసం జూస్‌ అనే వర్షాధిదేవుడిని, హైయడీస్‌ అనే అప్సరసలను ఆరాధించేవారు. వర్షాల కోసం ప్రాచీన రోమన్‌లు దేవతలకు రాజైన జూపిటర్‌ను, సముద్రాధిదేవత అయిన నెప్ట్యూన్‌ను పూజించేవారు. ప్రాచీన ఈజిప్షియన్‌ ప్రజలు టెఫ్‌నట్‌ అనే వర్షదేవతను ఆరాధించేవారు. సుమేరియన్‌ నాగరికతలోని ప్రజలు ఇష్కుర్‌ అనే వర్షాధిదేవుడిని ఆరాధించేవారు.

ఇష్కుర్‌కు ‘అదాద్‌’ అనే మరోపేరు కూడా ఉన్నట్లు అకాడియన్‌ పురాణాల కథనం. మధ్య అమెరికాలోని మాయన్‌ నాగరికత ప్రజలు చాక్‌ అనే వర్షాధిదేవుడిని పూజించేవారు. ఉత్తర అమెరికాలో మూలవాసులైన నవాజో ప్రజలు టొనీనిలీ అనే వర్షాధిదేవుడిని ఆరాధించేవారు. దక్షిణ అమెరికాలో పురాతన మూయిస్కా మతస్థులు వర్షాల కోసం చిబ్‌చాకూమ్‌ అనే దేవుడిని పూజించేవారు. ప్రాచీన చైనీస్‌ ప్రజలు యుషి అనే వానదేవుడిని పూజించేవారు. జపాన్‌లోని షింటో మతస్థులు కురాఒకామి అనే వర్షాధిదేవుడిని ఆరాధించేవారు. ఆస్ట్రేలియాలోని మూలవాసులు వాంజినా అనే వర్షాధిదేవతను పూజించేవారు. వానల కోసం దేవుళ్లను, దేవతలను పూజించడం, వారి ప్రీతి కోసం రకరకాల నైవేద్యాలు సమర్పించడం, పండుగలు జరుపుకోవడం పురాతన కాలం నుంచే ఉంది. చాలాచోట్ల ఇప్పటికీ వానల కోసం ప్రత్యేకంగా పూజలు జరపడం, వేడుకలు జరపడం వంటి ఆచారాలు కొనసాగుతున్నాయి.

మన వానాకాలం పండుగలు
మన దేశంలో వానాకాలంలో వచ్చే పండుగలు ఎన్నో ఉన్నాయి. కొన్ని పండుగలను దేశవ్యాప్తంగా జరుపుకొంటే, మరికొన్నింటిని వేర్వేరు ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల ప్రజలు జరుపుకొంటారు. వానాకాలంలో వచ్చే జగన్నాథ రథయాత్ర, కృష్ణాష్టమి, వినాయకచవితి పండుగలను దాదాపు దేశవ్యాప్తంగా జరుపుకొంటారు. అలాగే, తెలంగాణలో బోనాల పండుగ, కేరళలో ఓనం పండుగ, తమిళనాడులో ఆదిపెరుక్కు తదితర పండుగలు జరుపుకొంటారు. ఉత్తరాది రాష్ట్రాలైన రాజస్థాన్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో తీజ్, లద్దాఖ్‌లో హెమిస్‌ సెచు, మేఘాలయలో భేడియేంఖ్లామ్, గోవాలో సావో జొవావో వంటి పండుగలను జరుపుకొంటారు. ఇవేకాకుండా, దేశవ్యాప్తంగా అమ్మవారి ఆలయాల్లో శాకాంబరి పూజలు జరుపుతారు.

అత్యధిక వర్షపాతం
ప్రపంచంలో కొన్నిచోట్ల దాదాపు ప్రతి ఏడాది అధిక వర్షాలు కురుస్తుంటాయి. ఇంకొన్ని చోట్ల అరుదుగా అత్యధిక వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. మేఘాలయలోని మౌసిన్‌రామ్‌ గ్రామంలో 11,872 మిల్లీ మీటర్ల వార్షిక వర్షపాతం నమోదవడంతో ఇది గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. ఒకే సంవత్సరంలో అత్యధిక వర్షపాతం రికార్డు కూడా మౌసిన్‌రామ్‌ గ్రామానికే దక్కడం విశేషం. ఈ గ్రామంలో 1985 సంవత్సరంలో ఏకంగా 26,471 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఫ్రెంచ్‌ ప్రభుత్వం అధీనంలోని రీయూనియన్‌ దీవిలోని ఫోక్‌ ఫోక్‌ ప్రాంతంలో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో అత్య«ధిక వర్షపాతం నమోదైంది. హిందూ మహాసముద్రంలో మడగాస్కర్‌కు తూర్పున ఉన్న రీయూనియన్‌ దీవిలో సముద్రమట్టానికి 2,990 మీటర్ల ఎత్తులో ఉండే ఫోక్‌ ఫోక్‌ ప్రాంతంలో 1966 జనవరి 7–8 తేదీల నడుమ ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఏకంగా 1870 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై, గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది.

వానాకాలం వెతలు
సెగలు రేపే వేసవి తర్వాత వచ్చే వర్షాలు కొంత హర్షాన్ని తెచ్చినా, తెరిపిలేని వానలు వరుసగా వెతలను కూడా మోసుకొస్తాయి. మన దేశంలోని పరిస్థితులనే చూసుకుంటే, వానలు కురిస్తే చాలు నగరాలు, పట్టణాల్లోని రహదారులన్నీ జలమయంగా మారుతాయి. మురుగునీటి ప్రవాహంతో నిండిన రోడ్లపై వాహనాల రాకపోకలకు అడుగడుగునా అవరోధాలు ఏర్పడతాయి. ఒక్కోసారి రోజుల తరబడి ముసురు విడిచిపెట్టని పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు రోజువారీ కూలీలు ఉపాధి దొరకక ఇబ్బంది పడతారు. జలమయమైన రోడ్ల మీదుగా రాకపోకలు సాగించడానికి ఉద్యోగులు, విద్యార్థులు నానా ఇక్కట్లు పడతారు. అధిక వర్షాలు కురిసినప్పుడు నదుల్లో వరద పోటెత్తి, నదీ తీరాలలో ఉండేవారికి ప్రాణనష్టం, ఆస్తినష్టం వంటి తీవ్రనష్టాలు వాటిల్లుతాయి.

వానాకాలంలో వీథులు, ఇళ్ల పరిసరాలన్నీ బురదమయంగా మారడంతో రకరకాల వ్యాధులు విజృంభిస్తాయి. పలుచోట్ల చిట్లిన మంచినీటి పైపులైన్లలోకి మురుగునీరు ప్రవేశించడంతో నీరు కలుషితమై, కలరా, టైఫాయిడ్, కామెర్లు వంటి వ్యాధులు పెరుగుతాయి. మురుగునీరు నిలిచిపోవడంతో ఈ కాలంలో దోమల బెడద పెరిగి, వాటి వల్ల వచ్చే డెంగీ, మలేరియా, చికున్‌ గున్యా వంటి వ్యాధులు సోకుతాయి. వాతావరణంలో తేమకు తోడు కాలుష్యం పెరగడం వల్ల జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ వ్యాధులు ఎక్కువవుతాయి. వానాకాలంలో ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతుంటాయి.

చాలా చోట్ల వీ«థుల్లోనే తినుబండారాలు అమ్మే దుకాణాలు, టీ షాపులు ఉంటాయి. వానాకాలంలో వీటి చుట్టూ మురుగునీరు, బురద చేరి ఉంటుంది. ఈగలు, దోమలు ముసురుతూ ఉంటాయి. పరిసరాలు అంత దారుణంగా ఉన్నా, ఉపాధి కోసం ఆ చిరువ్యాపారులు వ్యాపారాలు సాగిస్తుంటారు. అలాంటి చోట్ల తినుబండారాలు తినేవారికి వానాకాలంలో జీర్ణకోశ సమస్యలు, పరిసరాల శుభ్రత లోపించడం వల్ల రకరకాల అంటువ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువవుతాయి.

వర్షాలు అతిగా కురిస్తే రైతులకు పంటనష్టం తప్పదు. పొలాల్లో నీరు నిలిచిపోయి, నాట్లు వేసే సమయంలో అతిగా వర్షాలు కురిస్తే, సజావుగా పెరగాల్సిన మొక్కలు కుళ్లిపోతాయి. పంట చేతికి వచ్చే సమయంలో అతిగా వర్షాలు వస్తే, రైతులకు శ్రమ దండగై, పంటనష్టం జరుగుతుంది.

వానాకాలంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంటుంది. దీనివల్ల జనాల రోజువారీ పనులు దెబ్బతింటాయి. వ్యాపార లావాదేవీలకు కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. గాలి వానల ధాటికి ఒక్కోసారి స్తంభాల నుంచి విద్యుత్‌ తీగలు నేల మీదకు పడి ప్రమాదాలు కూడా సంభవిస్తుంటాయి.

చినుకు కురవని నేల
ప్రపంచంలో అతిపెద్ద ఎడారి సహారా ఆఫ్రికాలో ఉంది. మన దేశంలో థార్‌ ఎడారి ఉంది. ఈ ఎడారులు ఇసుక మేటలతో పొడి పొడిగా ఉంటాయి. వీటిలో అరుదుగా కనిపించే ఒయాసిస్సుల్లో మాత్రమే కాస్త నీటిజాడ కనిపిస్తుంది. ఇలాంటి ఎడారుల్లో కూడా అతి అరుదుగా కొద్దిపాటి చినుకులు కురుస్తుంటాయి. అయితే, ఈ భూమ్మీద చినుకు కురవని నేల ఏదైనా ఉందా అంటే, అది చిలీలోని అటకామా ఎడారి మాత్రమే! అటకామా ఎడారిలోని పలు ప్రదేశాల్లో చరిత్రలో ఏనాడూ చినుకు కురిసిన దాఖలాల్లేవు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడి ప్రదేశంగా రికార్డులకెక్కింది.

వర్షాధార దేశాలు
భూమధ్య రేఖకు ఉత్తర, దక్షిణ దిశలలోని కర్కాటక, మకర రేఖల నడుమనున్న చాలా దేశాలకు, వాటికి కాస్త అటు ఇటుగా ఉన్న దేశాలకు వర్షాలే ఆధారం. భారత్, చైనా సహా అత్యధిక జనాభా కలిగిన పలు దేశాలు ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఏటా వర్షాకాలం వస్తుంది. అలాగని, ప్రతి ఏడాది ఒకేలా వర్షాలు కురుస్తాయనే భరోసా ఉండదు. వర్షాలు సమృద్ధిగా కురిసినప్పుడు ఈ దేశాలు చక్కని పంట దిగుబడులతో కళకళలాడతాయి. తగినంత వానలు కురవనప్పుడు కరవు కాటకాలతో అల్లాడిపోతాయి. వానలు మితిమీరి కురిసినప్పుడు వరదలు ముంచెత్తి, పంటనష్టమే కాకుండా, ఆస్తినష్టం, ప్రాణనష్టాన్ని కూడా చవిచూస్తాయి. వరదలు ముంచెత్తకుండా పలుచోట్ల ఆనకట్టలు కడుతున్నా, అనావృష్టిని ఎదుర్కోవడానికి వీలుగా నీటిని నిల్వ చేసుకునేందుకు రిజర్వాయర్లు కడుతున్నా ఈ ప్రాంతాలకు తరచుగా అతివృష్టి, అనావృష్టి బాధలు తప్పడం లేదు.

భూమధ్యరేఖకు ఉత్తర, దక్షిణాలలో ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో ఏటా రుతుపవనాలు వస్తాయి. రుతుపవనాల రాకతో ఈ ప్రాంతాల్లో వానాకాలం మొదలవుతుంది. పశ్చిమ, దక్షిణ ఆఫ్రికా దేశాల్లోను; ఉత్తర అమెరికా, ఆసియా దేశాలతో పాటు యూరోప్‌ దేశాలలో ఏటా జూన్‌ నెలాఖరులోగా వానాకాలం మొదలవుతుంది. దక్షిణార్ధగోళంలోని ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాలలో సెప్టెంబర్‌ నుంచి వానాకాలం మొదలవుతుంది. వానాకాలంలోనే సముద్రంలో అల్పపీడనాలు, తుఫానులు వంటివి ఏర్పడుతుంటాయి. తుఫానుల వంటి ప్రకృతి విపత్తుల వల్ల సముద్ర తీర ప్రాంతాల్లో ఒక్కోసారి అపారనష్టం వాటిల్లుతూ ఉంటుంది. వర్షాధార దేశాలకు తఫాను ముప్పు వెన్నంటే ఉన్నా, వర్షాలు లేకుండా ఈ దేశాలు మనుగడ సాగించలేవు. ఇటీవలి కాలంలో పెరిగిన వాతావరణ కాలుష్యం, అడవుల నరికివేత వంటి చర్యల వల్ల అకాల వర్షాలు, అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు తరచుగా తలెత్తుతున్నాయి. ప్రకృతి సమతుల్యతను కాపాడుకుంటేనే సకాల వర్షాలు సజావుగా కురుస్తాయి. మానవాళికి హర్షాతిరేకాన్ని తీసుకొస్తాయి.

వానాకాలం జాగ్రత్తలు
వానాకాలంలో పుష్కలంగా వానలు కురవడం వల్ల నదులు, జలాశయాలు నీటితో నిండుతాయి. అయితే, వానాకాలంలో నీటితోనే జాగ్రత్తగా ఉండాలి. వానల ఉద్ధృతి వల్ల చెరువులు, బావుల్లో మురికి నీరు పైకి తేలుతుంది. చిట్లిన మంచినీటి పైపులైన్ల ద్వారా మురుగునీరు తాగునీటిలోకి చేరే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వానాకాలంలో నీటిని బాగా వడగట్టి, కాచి, చల్లార్చి తాగడం మంచిది. వానాకాలంలో నీటి పట్ల జాగ్రత్తలు తీసుకునేటట్లయితే చాలా వ్యాధుల నుంచి ముప్పు తప్పించుకోవచ్చు.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, వానాకాలంలో వాతావరణ కాలుష్యం వల్ల జలుబు, దగ్గు, జ్వరాలు వంటి ఇబ్బందులను తప్పించుకోవడం కష్టం. కాలంలో మార్పుల వల్ల వచ్చే ఇలాంటి సామాన్యమైన ఇబ్బందులకు దూరంగా ఉండాలంటే, రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్‌–సి వంటి పోషకాలు ఉండే పండ్లు, కూరగాయలు పుష్కలంగా తీసుకోవాలి.

వానాకాలం వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఈ కాలంలో వీలైనంత వరకు తాజా ఆహారాన్ని తీసుకోవడమే మంచిది. పరిశుభ్రమైన ఆహారం, ఇంట్లో వండుకున్న పదార్థాలు మాత్రమే తినడం అలవాటు చేసుకుంటే, వానాకాలంలో వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు. ఈ కాలంలో ఆరుబయట విక్రయించే తినుబండారాలను తినడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.

వాన కురిసే సూచన ఉన్నప్పుడు బయటకు వెళ్లాల్సి వస్తే, తప్పకుండా గొడుగు లేదా రెయిన్‌కోటు వెంట తీసుకువెళ్లడం క్షేమం. నీరు నిండిన రోడ్లపై నడవడానికి అనువైన వాటర్‌ప్రూఫ్‌ చెప్పులు ధరించడం మంచిది. అనుకోకుండా తోవలో ఎక్కడైనా వానలో తడిస్తే, ఇంటికి రాగానే తడిబట్టలను విడిచి పొడి దుస్తులను ధరించడం మంచిది. తడిసిన దుస్తులతో ఎక్కువసేపు ఉన్నట్లయితే, చర్మంపై ఫంగస్‌ పెరిగి, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.

తోవలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా వాన మొదలైతే, విద్యుత్‌ స్తంభాలు, వేలాడుతూ కనిపించే విద్యుత్‌ తీగలు లేని సురక్షితమైన ప్రదేశంలో తలదాచుకోవడం మంచిది. వాన కురిసేటప్పుడు విద్యుత్‌ పరికరాల వినియోగంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రమాదాలను నివారించుకోవచ్చు. వానలో చెట్ల కింద తలదాచుకోవడం కూడా మంచిది కాదు. గాలి తీవ్రత ఎక్కువైతే భారీ కొమ్మలు విరిగి మీదపడే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, వానాకాలాన్ని చక్కగా ఆస్వాదించవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement