5 ప్రభుత్వ ఉద్యోగాల అరవిందుడు | Young Police officer And Family BackGround | Sakshi
Sakshi News home page

5 ప్రభుత్వ ఉద్యోగాల అరవిందుడు

Jul 20 2025 2:05 PM | Updated on Jul 20 2025 2:09 PM

Young Police officer And Family BackGround

అంతా వ్యవసాయ, పేద, కూలీ కుటుంబాలే.. 

 ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎస్‌ఐలుగా బాధ్యతలు  

కడు దయనీయ కుటుంబాల నుంచి వచ్చిన మహిళా ఎస్‌ఐలు 

తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలం వీరు  

కష్టపడి చదివి ఎస్‌ఐ జాబ్‌లు కొట్టారు

దుబ్బాక/దుబ్బాకటౌన్‌: రెక్కాడితే గాని డొక్కాడని పేద, వ్యవసాయ ,కూలీ కుటుంబాల పిల్లలు వీరూ..అయితేనేం చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించారు. ఓ వైపు తల్లిదండ్రులతో పాటు వ్యవసాయం, కూలి పనులు చేస్తూనే కష్టపడి చదువుకొని ఎస్‌ఐలుగా జాబ్‌లు సాధించారు. 21 నెలలు వివిధ అంశాలపై శిక్షణ తీసుకుని ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వివిధ స్టేషన్లలో బాధ్యతలు తీసుకున్న యువ ఎస్‌ఐలు, వారి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రుల కష్టం, తదితర అంశాలపై సాక్షి ప్రత్యేక కథనం.  

తండ్రి టైలరింగ్‌.. కొడుకు ఎస్‌ఐ
దుబ్బాక పట్టణానికి చెందిన ఐరేని శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మీ దంపతుల కుమారుడు భార్గవ్‌ గౌడ్‌. నా తండ్రి టైలరింగ్‌ చేస్తూ కుటంబాన్ని పోషించాడు. గతంలో అస్సాం రైఫిల్‌మెన్‌గా, సీఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాను. ఆర్మీ అధికారి కావాలని కష్టపడి చదివాను. పోలీస్‌ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో ఎస్‌ఐ పరీక్షకు సిద్ధమై జాబ్‌ సాధించి కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట ఎస్‌ఐగా సేవలందిస్తున్నా. ఇటు ఎస్‌ఐగా పనిచేస్తూనే నాకు సమయం దొరికినప్పుడు అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఆర్మీ పరీక్షకు సన్నద్ధమవుతున్నా.  
– భార్గవ్, నాగిరెడ్డి పేట ఎస్‌ఐ

అమ్మ కూరగాయలు విక్రయించి..
మాది కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌. నాన్న గతంలో మృతి చెందాడు. అమ్మ కూరగాయలు విక్రయిస్తూ ముగ్గురు ఆడపిల్లలను చదివించింది. ఇద్దరు అక్కలు ఉద్యోగాలు సాధించారు. నా విద్యాభ్యాసం కరీంనగర్‌లోనే పూర్తి చేశా. నేను కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించి ఎస్‌ఐ జాబ్‌ కోసం కష్టపడ్డా. మా అమ్మ కష్టానికి ఈ ఎస్‌ఐ ఉద్యోగంతో ప్రతిఫలం దక్కింది.
– బోయిని సౌజన్య, బెజ్జంకి ఎస్‌ఐ

అమ్మ కష్టానికి ప్రతిఫలం  
మాది కరీంనగర్‌ టౌన్‌. నాన్న మల్లేశం, అమ్మ లీలా. నాన్న ఎనిమిదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కుటుంబ భారం అమ్మపై పడింది. నాకు ఒక తమ్ముడు, అక్క ఉన్నారు. మా ముగ్గురిని అమ్మ చిన్న ఉద్యోగం చేస్తూ చదివించింది. నేను బీటెక్‌ చదువుతూనే పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేవాన్ని. బీటెక్‌ పూర్తి కాగానే పోలీస్‌ శాఖ నోటిఫికేషిన్‌ రాగానే కష్టపడి చదివి ఉద్యోగం సాధించా.  
– ప్రశాంత్, అక్కన్నపేట, ఎస్‌ఐ

4 ఏళ్ల  పాప ఉన్నా.. గురి తప్పలేదు   
పెళ్లయితే అమ్మాయిలు ఏం సాధించలేరు, ఇంటికే పరిమితం అంటుంటారు. కానీ భర్త, కుటుంబం ప్రోత్సహిస్తే ఏదైనా సాధించవచ్చు. నాకు 6 సంతవ్సరాల పాప ఉంది. మాది కామారెడ్డి జిల్లా తాడ్వాయి గ్రామం. నాన్న వివేకానందరెడ్డి హోంగార్డ్, అమ్మ శారద టైలరింగ్‌ చేసేది. భర్త సుమంత్, తమ్ముడు సంతోష్‌ ప్రోత్సహించారు. నా ట్రైనింగ్‌ సమయంలో పాపకు నాలుగేళ్లు. నా భర్త పాపను చూసుకునేవాడు. 
– సుచిత, ఎస్‌ఐ

తండాలో తళుక్కుమన్న నరేశ్‌..
తండా ప్రజలు వ్యవసాయానికే పరిమితం ఏం సాధించలేరనేది ఒక్కప్పటి మాట. ఆ మాట మూగపోయేలా అనుకున్న లక్ష్యం కోసం ఎంతో కష్టపడ్డాను. మాది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రామం. నాన్న లాల్‌బహదూర్, అమ్మ హంసీ. వ్యవసాయం చేసేవారు. నేను ఉన్నత స్థానంలో ఉండాలనేది నా తల్లిదండ్రుల కోరిక. 22ఏళ్లకే ఉద్యోగం సాధించా. ఎస్‌ఐ జాబ్‌ వచ్చినప్పుడు వాళ్ల కళ్లలో ఆనందం, మాటల్లో చెప్పలేనిది.  
– మాలోత్‌ నరేష్‌  ఎస్‌ఐ

తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు.. కూతురు ఎస్‌ఐ  
దుబ్బాక మండలం చీకోడ్‌ గ్రామానికి చెందిన నందిరి రాజయ్య, సత్తవ్వ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె జ్యోతి. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ జ్యోతిని చదివించారు. తల్లిదండ్రులకు గౌరవం దక్కేలా..జ్యోతి ఎస్‌ఐ జాబ్‌ సాధించి ఔరా అనిపించింది. కాగా దుబ్బాక మండలంలో 2వ మహిళా ఎస్‌ఐగా జాబ్‌ సాధించిన ఘనత జ్యోతికే దక్కింది. 
– జ్యోతి, ఎస్‌ఐ

5 ప్రభుత్వ ఉద్యోగాల అరవిందుడు
మాది కామారెడ్డి జిల్లా పిట్లం మండలం పోతారెడ్డి పల్లి స్కూల్‌ తండా. నాన్న లక్ష్మణ్, అమ్మ, జమునా వ్యవసాయం చేసేవారు. తండాలో పుట్టి పెరిగిన నేను చిన్నప్పటి నుంచి ఎస్‌ఐ అవ్వాలన్న లక్ష్యంతో చదివాను. నాకు 5 గురు అక్కాచెల్లెల్లు. ఎస్‌ఐ పరీక్షకు సన్నద్ధమవుతూనే.. 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినా పోస్టింగ్‌ తీసుకోలేదు. కష్టపడితే సాధించలేనిదంటూ.. ఏమి లేదు. ఇదే యువతకు ఇచ్చే సందేశం.                
– హలావత్‌ అరవింద్‌ కుమార్, ఎస్‌ఐ  

కీర్తిని గడించేలా.. 
కామారెడ్డి జిల్లా బిర్కూర్‌ గ్రామం మాది. అమ్మ భారతి, నాన్న నాగరాజు వ్యవసాయం చేçస్తూ నన్ను చదివించారు. నేను వరంగల్‌లో బీటెక్‌ పూర్తి చేశా. పోలీస్‌ అవ్వాలన్నది నా కోరిక. దాని కోసం పడిన కష్టం వర్ణణాతీతం. తల్లిదండ్రుల కీర్తిని పెంచేలా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తా.  
– కరీన కీర్తిరాజ్, దుబ్బాక, ఎస్‌ఐ

కానిస్టేబుల్‌ టూ..ఎస్‌ఐ 
మాది కరీంనగర్‌ జిల్లా గుంటూర్‌పల్లి. అమ్మ తాహేర బేగం, నాన్న షేక్‌ అహ్మద్‌. నాన్న వ్యాపారం చేస్తూ చదివించాడు. నేను  2020లో కానిస్టేబుల్‌గా ఎంపికై విధులు నిర్వహించా. 2023 ఎస్‌ఐ నోటిఫికేషన్‌లో కష్టపడి చదివి ఎస్‌ఐగా ఎంపికయ్యాను. చిన్నకోడూర్‌ ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించా. 
–  సైఫ్‌ అలీ, చిన్నకోడూర్‌ ఎస్‌ఐ

తండ్రి కష్టమే నన్ను ఎస్‌ఐని చేసింది  
మాది కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్‌. అమ్మానాన్నలు కుంచెం రాజేశ్వరి, కనకయ్య. సోదరి, సోదరుడు ఉన్నారు. తన కష్టం పిల్లలకు రాకూడదని తల్లిదండ్రులు కష్టానికి వెనుకాడకుండా చదివించారు. ఎస్‌ఐగా ఎంపికయ్యాను అని తెలియగానే నా తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు.   
– మానస, రాయపోల్‌ ఎస్‌ఐ  

ఎస్‌ఐ ఉద్యోగంపై ఇష్టంతో..   
2018లో కానిస్టేబుల్‌కి ఎంపికైనా ఎస్‌ఐ పోస్టుపై ఇష్టంతో వెళ్లలేదు. తల్లిదండ్రుల కలను సాకారం చేయడానికి ఎస్‌ఐగా ఎంపికై దౌల్తాబాద్‌లో సేవలు అందిస్తున్నాను. కరీంనగర్‌ జిల్లా గంగాధర గ్రామానికి చెందిన అరుణ్‌ కుమార్‌కి నలుగురు అన్నదమ్ములు. నాన్న చంద్రయ్య, అమ్మ కాంతమ్మ వ్యవసాయం చేసేవారు. ఎస్‌ఐ ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చడంతో సంతోషంగా ఉంది. 
– గంగాధర అరుణ్‌కుమార్, దౌల్తాబాద్, ఎస్‌ఐ

మొదటి ప్రయత్నంలోనే..  
మాది కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం సిరి బీబీపేట గ్రామం. నాన్న భీమరి పోచయ్య 2011లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అమ్మ మంజుల వ్యవసాయం చేస్తూ తమ్ముడిని, మా ముగ్గురు అక్క చెల్లెళ్లను పోషించింది. నేను ఇప్పటి వరకు ఎలాంటి పోటీ పరీక్షలు రాయలేదు. మొదటి ప్రయత్నంలోనే ఎస్‌ఐ ఉద్యోగం సాధించాను. నా ఉద్యోగ ప్రయత్నానికి  మేనమామ దేషెట్టి లింగం సపోర్టు చేశాడు.  
– సృజన, ఎస్‌ఐ  

తండ్రి కూలీ..
మాది కరీంనగర్‌. నాన్న వెంకన్న, అమ్మ కనకమ్మ ఇద్దరు కూలీపని చేసేవారు. నేను బీటెక్‌ పూర్తి చేశాను. నన్ను చదివించేందుకు అమ్మానాన్న రెక్కలు ముక్కలు చేసుకోవడం స్వయంగా చూసిన. నా కుటుంబ నేపథ్యాన్ని సవాల్‌గా తీసుకొని పట్టుబట్టి ఎస్‌ఐ ఉద్యోగం సాధించాను. 
– నవీన్,ఎస్‌ఐ చేర్యాల 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement