
భారీ వరదలకు దూప్‌సింగ్ తండాలో పూర్తిగా దెబ్బతిన్న ఇంటి వద్ద దిగాలుగా వృద్ధురాలు
కామారెడ్డి జిల్లాలో రూ.350 కోట్ల మేర నష్టం
రోడ్ల పునర్నిర్మాణానికే రూ.50 కోట్లకు పైగా వ్యయం!
పోచారం కట్ట పునరుద్ధరణకూ భారీగానే ఖర్చు
మెదక్ జిల్లాలో రూ.18.60 కోట్ల నష్టం
సాక్షి ప్రతినిధులు/సాక్షి నెట్‌వర్క్: ఒక్కసారిగా వరుణుడు సృష్టించిన బీభత్సం కామారెడ్డి జిల్లాను వణికించింది. బుధ, గురువారాల్లో జిల్లాలో దంచికొట్టిన వానలతో అపార నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా వరదలతో అన్ని విధాలుగా దాదాపు రూ.350 కోట్ల మేర నష్టం జరిగినట్టు తెలుస్తోంది. రోడ్లు కొట్టుకుపోయి, వంతెనలు దెబ్బతిని ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖలకు నష్టం వాటిల్లింది. పోచారం ప్రాజెక్టు దెబ్బతినడం, ఆపై 62 చెరువులు తెగిపోవడంతో నీటిపారుదల శాఖకు కూడా భారీ నష్టం జరిగింది.
జిల్లాలో దాదాపు రూ.150 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇక భారీ వరదలతో జిల్లాలో పలు రోడ్లు విధ్వంసానికి గురయ్యాయి. 44వ నంబరు జాతీయ రహదారి పలు చోట్ల కోతకు గురయ్యింది. 375 డీ నంబరు గల జాతీయ రహదారిపై పోచారం ప్రాజెక్టు దిగువన వంతెన దెబ్బతినడంతో రాకపోకలు ఇప్పట్లో మొదలయ్యే పరిస్థితి లేదు. తాత్కాలిక మరమ్మతులు చేసినా, పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టేందుకు రూ.60 కోట్ల మేర అవసరం అవుతాయని అంటున్నారు.
జిల్లా మొత్తంగా 13 ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతినడంతో వాటి పునర్నిర్మాణానికి రూ.35 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. పంచాయతీరాజ్ రోడ్లకు రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లింది. పోచారం ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగి ప్రాజెక్టు కట్టకు కొంతమేర నష్టం జరిగింది. తాత్కాలికంగా మరమ్మతుల కోసం రూ.25 లక్షల వరకు ఖర్చవుతుండగా, దెబ్బతిన్నదాన్ని పునరుద్ధరించడానికి అంచనాలు వేయాల్సి ఉంది.
దానికి రూ. కోట్లల్లోనే వ్యయం అవుతుందని నీటి పారుదల శాఖ అధికారులు అంటున్నారు. తెగిపోయిన 62 చెరువులను పూర్తి స్థాయిలో పునర్నిర్మించడానికి దాదాపు రూ.10 కోట్లు ఖర్చవుతాయని భావిస్తున్నారు. ఇక జిల్లాలో విద్యుత్తు శాఖకు రూ.5 కోట్ల మేర నష్టం వాటిల్లింది. 763 కరెంటు స్తంభాలు పడిపోగా, 147 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి.
ఇళ్లు గుల్ల..: జిల్లా కేంద్రంలోని జీఆర్ కాలనీ, హౌసింగ్‌బోర్డు కాలనీలలో 107 ఇళ్లల్లోకి వరద రావడంతో ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫర్నిచర్, వంట పాత్రలు, తిండిగింజలు, బట్టలు మొత్తం నాశనమయ్యాయి. ఐదారు కార్లు కొట్టుకుపోగా, నీట మునగడంతో 15 కార్లు, 40 బైకులు దెబ్బతిన్నాయి. ఒక్కో ఇంట్లో కనీసం రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కొందరి ఇళ్లు వరద తాకిడికి దెబ్బతిన్నాయి. జిల్లాలో 487 ఇండ్లు పాక్షికంగా, 14 ఇండ్లు పూర్తిగా కూలిపోయాయి. అన్ని నష్టాలు లెక్కిస్తే రూ.10 కోట్ల మేర నష్టం జరిగినట్టు అంచనా.
మెదక్ జిల్లాలో రోడ్లు ధ్వంసం.. తెగిన చెరువులు
భారీ వర్షాలతో మెతుకుసీమకు అపారనష్టం జరిగింది. 77 కిలోమీటర్ల పొడవు పీఆర్, ఆర్‌అండ్‌బీ రోడ్లు ధ్వంసం కాగా, 92 చెరువులు, కుంటలు, కల్వర్టులు తెగిపోయాయి. వేలాది విద్యుత్ స్తంభాలు, వందలాది ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. ఈ నాలుగు శాఖల పరిధిలో రూ.18.60 కోట్ల పైచిలుకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా 681 ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా, 4 ఇళ్లు నేలమట్టం అయినట్లు అధికారులు తెలిపారు.
దూప్‌సింగ్ తండా దుఃఖం
రెండు రోజులుగా వరద నీటిలో చిక్కుకుపోయిన మెదక్ జిల్లా దూప్‌సింగ్ తండా కన్నీరు పెడుతోంది. గంగమ్మ వాగు ఉప్పొంగడంతో వరద తాకిడికి గుడిసెలు నేలమట్టం కాగా, ఇళ్లలోకి బురద చేరి నివాసం ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇళ్లల్లో బురద పేరుకుపోయిందని, తాము ఎక్కడ తలదాచుకోవాలంటూ తండా వాసులు కన్నీరు మున్నీరవుతున్నారు.
ఇంట్లో ఉన్న బియ్యం వంటి నిత్యావసరాలు తడిచిపోవడంతో సరైన ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం యశోద అనే మహిళ తడిచిపోయిన ఐదు క్వింటాళ్ల బియ్యాన్ని చూపిస్తూ విలపించింది. ఇంట్లో చేరిన బురదతో తాము ఎట్లా ఉండాలంటూ వనిత కంట నీరు పెట్టుకుంది.తన పూరి గుడిసె కూలిపోవడంతో బీమ్లీ అనే వృద్ధురాలు నిరాశ్రయురాలైంది. విద్యుత్ స్తంభాలు పూర్తిగా కూలిపోయి తండాలో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. స్థానికులు శుక్రవారం కూడా చీకట్లోనే గడిపారు. ఈ తండాలో సుమారు 41 కుటుంబాలు నివసిస్తున్నాయి.