ప్రేమ బేకరీ

Special story on christmas cakes - Sakshi

చక్కెర తీపి కంటే..  తేనె తీపి కంటే తియ్యనైనది ప్రేమ. పంచే కొద్దీ.. ఇచ్చే కొద్దీ పెరిగేది ప్రేమ. చర్చి గంటల్లా ఘనమైనది  క్రిస్మస్‌ ట్రీలా వెలుగులు విరజిమ్మేది శాంటాక్లాజ్‌ కానుకల్లో ఉన్నది ప్రేమ. క్రిస్మస్‌ అంటే ప్రేమ. ప్రేమగా చేసుకునే ఈ పండుగనుప్రియమైన వ్యక్తులతో పంచుకోవడానికి ఈ గుప్పెడు కుకీస్‌ మీకోసం...

శాంటాక్లాజ్‌  స్వీట్‌ బ్రెడ్‌
కావలసినవి: మైదా పిండి – రెండు కప్పులు; బటర్‌ – 2 టేబుల్‌ స్పూన్లు; కోడి గుడ్డు – 1 (బాగా గిలకొట్టాలి); ఉప్పు – చిటికెడు; గోరువెచ్చని పాలు – ఒక కప్పు; పంచదార – 2 టేబుల్‌ స్పూన్లు; డ్రై ఈస్ట్‌ – ఒక ప్యాకెట్‌

తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, బటర్, కోడిగుడ్డు సొన, ఉప్పు వేయాలి ∙చిన్న పాత్రలో గోరు వెచ్చని పాలు, పంచదార, డ్రై ఈస్ట్‌ వేసి స్పూనుతో బాగా కలిపి, మైదా పిండి మిశ్రమానికి జత చేయాలి ∙బీటర్‌ సహాయంతో బాగా గిలకొట్టాలి ∙మూత పెట్టి సుమారు రెండు గంటలు వదిలేయాలి ∙ఈ మిశ్రమం అంతా బాగా పొంగుతుంది ∙అప్పుడు ఆ పిండి ముద్దను తీసుకుని రెండు సమాన భాగాలుగా చేయాలి ∙పీట మీద పొడి పిండి వేసి రెండు భాగాలను విడివిడిగా ఒత్తుకోవాలి ∙ఒక భాగాన్ని శంఖం ఆకారంలో పొడవుగా ఒత్తుకోవాలి ∙రెండో భాగాన్ని గుండ్రంగా ఒత్తుకుని, రెండు భాగాలుగా కట్‌ చేయాలి ∙పైభాగాన్ని చాకుతో అడ్డంగా అంగుళం దూరంలో పొడవుగా కట్‌ చేయాలి ∙కింది భాగాన్ని నిలువుగా శాంటాక్లాజ్‌ గడ్డం వచ్చేలా దగ్గర దగ్గరగా కట్‌ చేసి, కింది భాగాన్ని వేరుచేయాలి ∙శంఖం ఆకారంలో ఒత్తుకున్న దాని కింది భాగంలో గడ్డం భాగం ఉంచాలి ∙కట్‌ చేసిన భాగాలను చేతితో బాగా మెలితిప్పాలి ∙పై భాగంలోఉన్న వాటిని గడ్డం అతికించిన  భాగానికి పైన ముఖం ఆకారంలో వచ్చేలా ఒక్కో ముక్కను అమర్చాలి ∙చాకొలేట్‌ చిప్స్‌తో కళ్లు తయారుచేయాలి ∙ కోడి గుడ్డు పచ్చ సొనను బాగా గిలకొట్టి, కొంత భాగం తీసి, ఎరుపు రంగు మిఠాయి రంగు జతచేసి, వేరే పాత్రలో ఉంచాలి ∙తయారుచేసి ఉంచుకున్న శాంటాక్లాజ్‌ మీద బ్రషింగ్‌ చేయాలి ∙ టోపీ, ముక్కు భాగంలో ఎరుపు రంగును బ్రష్‌ చేయాలి ∙350 డిగ్రీల దగ్గర అవెన్‌ను ప్రీహీట్‌ చేయాలి ∙తయారుచేసి ఉంచుకున్న శాంటాక్లాజ్‌ను అవెన్‌లో ఉంచి, అర గంట బేక్‌ చేసి బయటకు తీయాలి ∙తియ్యటి జామ్‌ను పూసి తియ్యతియ్యగా తినాలి. 

క్రిస్మస్‌ బెల్స్‌ 
కావలసినవి: డార్క్‌ బ్రౌన్‌ సుగర్‌ – ఒకటిన్నర కప్పులు; అన్‌సాల్టెడ్‌ బటర్‌ – ఒక కప్పు; డార్క్‌ కార్న్‌ సిరప్‌ – పావు కప్పు; పెద్ద కోడి గుడ్డు – 1; నిమ్మ రసం – ఒకటిన్నర టీ స్పూన్లు; మైదా పిండి – మూడున్నర కప్పులు; ఇన్‌స్టెంట్‌ ఎస్‌ప్రెసో – ఒక టేబుల్‌ స్పూను; అల్లం తురుము – ఒకటిన్నర టీ స్పూన్లు; దాల్చిన చెక్క పొడి – ఒక టీ స్పూను; బేకింగ్‌ సోడా – అర టీ స్పూను; ఉప్పు – అర టీ స్పూను
ఫిల్లింగ్‌ కోసం: డార్క్‌ బ్రౌన్‌ సుగర్‌ – పావు కప్పు; చెర్రీ జ్యూస్‌ – ఒక టేబుల్‌ స్పూను; చాకొలేట్‌ చిప్స్‌ – తగినన్ని; అన్‌సాల్టెడ్‌ బటర్‌ – ఒక టేబుల్‌ స్పూను; చెర్రీలు – తగినన్ని .

తయారీ:  
ఫిల్లింగ్‌ తయారీ... ∙ఒక పాత్రలో బ్రౌన్‌ సుగర్, చెర్రీ రసం, బటర్‌ వేసి బాగా బ్లెండ్‌ చేయాలి. చాకొలేట్‌ చిప్స్‌ జత చేయాలి.  పిండి తయారు చేసుకోవడం...
∙ఒక పాత్రలో బ్రౌన్‌ సుగర్, బటర్‌ వేసి మిక్సర్‌లో వేసి సుమారు మూడు నిమిషాలు పాటు మిక్సీ పట్టి, ఒక పాత్రలోకి తీసుకోవాలి (మిశ్రమం బాగా నురుగులా రావాలి) ∙వేరొక పాత్రలో కార్న్‌ సిరప్, కోడి గుడ్డు సొన. క్రీమ్, నిమ్మ రసం వేసి బాగా బీట్‌ చేయాలి ∙మైదా పిండి, ఇన్‌స్టెంట్‌ ఎస్‌ప్రెసో, అల్లం తురుము, దాల్చిన చెక్క పొడి, బేకింగ్‌ సోడా, ఉప్పు వేసి కలుపుకోవాలి ∙బటర్‌ మిశ్రమానికి కొద్దికొద్దిగా జత చేస్తూ కలపాలి ∙మిశ్రమాన్ని చపాతీ ముద్దలాగ చేసి, పైన ప్లాస్టిక్‌ పేపర్‌తో చుట్టేసి, సుమారు రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో చిల్లర్‌లో ఉంచాలి ∙మిశ్రమాన్ని బయటకు తీసి, పొడి పిండి అద్దుతూ, కొద్దిగా మందంగా ఒత్తాలి ∙కుకీ కటర్‌తో గుండ్రంగా కట్‌ చేయాలి ∙త్రికోణాకారంలో అంటే బెల్‌ షేప్‌లో మడవాలి ∙బేకింగ్‌ షీట్‌ మీద దూరం దూరంగా వరుసలో అమర్చాలి ∙తయారు చేసి ఉంచుకున్న ఫిల్లింగ్‌ మిశ్రమం కొద్దిగా తీసుకుని వీటిలో అమర్చి, పైన సగం చెర్రీ ముక్క ఉంచాలి ∙350 డిగ్రీల దగ్గర అవెన్‌ను ప్రీ హీట్‌ చేయాలి ∙తయారుచేసుకున్న వాటిని అవెన్‌లో ఉంచి సుమారు పావు గంట సేపు బేక్‌ చేయాలి ∙ఐదు నిమిషాలయ్యాక బయటకు తీయాలి ∙బాగా చల్లారాక ప్లేట్‌లోకి తీసి అందించాలి.

చాకొలేట్‌ డెకొరేటివ్‌  బాల్స్‌
కావలసినవి: పాల పొడి – ఒకటిన్నర కప్పులు; కోకోపొడి – 5 టేబుల్‌ స్పూన్లు; బటర్‌ – పావు కప్పు; పంచదార – ముప్పావు కప్పు; నీళ్లు – అర కప్పు
తయారీ: ∙పాలపొడిని, కోకోపొడిని జల్లించి పక్కన ఉంచాలి ∙ఒక పాత్రలో నీళ్లు, పంచదార వేసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙మంట తగ్గించి, తీగ పాకం వచ్చేవరకు కలుపుతుండాలి ∙ బటర్‌ జత చేసి బాగా కరిగేవరకు కలిపి దింపేయాలి ∙కోకో పొడి, పాల పొడి జత చేసి ఆపకుండా కలుపుతుండాలి ∙ఒక ప్లేట్‌కి నెయ్యి పూసి అందులో ఈ మిశ్రమం వేసి స్పూన్‌తో సమానంగా పరవాలి ∙పావుగంట తరువాత చేతితో ఉండలుగా చేసి, ఆ ట్రేను ఫ్రిజ్‌లో ఉంచి సుమారు అర గంట తరువాత బయటకు తీసి అందించాలి.

క్రిస్మస్‌  ట్రీ  స్వీట్‌ పఫ్‌
కావలసినవి: పఫ్‌ పేస్ట్రీ – 2 షీట్లు (సూపర్‌ మార్కెట్‌లో దొరుకుతాయి); న్యుటెల్లా – 50 గ్రా. (సూపర్‌ మార్కెట్‌లో దొరుకుతుంది); బాదం పప్పుల తరుగు – ఒక టేబుల్‌ స్పూను; కోడి గుడ్డు – 1 (పచ్చ సొన మాత్రమే); పంచదార  పొడి – ఒక టేబుల్‌ స్పూను.

తయారీ: ∙పఫ్‌ పేస్ట్రీ షీట్‌ని క్రిస్మస్‌ ట్రీ ఆకారంలో కట్‌ చేయాలి ∙దాని మీద న్యుటెల్లా సమానం పూయాలి ∙ఆ పైన బాదం పప్పుల తరుగు సమానంగా పరవాలి ∙రెండవ పఫ్‌ పేస్ట్రీ షీటును పైన ఉంచి చేతితో నెమ్మదిగా అదమాలి ∙రెండు వైపులా క్రిస్మస్‌ ట్రీ ఆకారంలో వచ్చేలా చాకుతో జాగ్రత్తగా కట్‌ చేయాలి ∙అలా కట్‌ చేసిన ఒక్కో భాగాన్ని చేతితో జాగ్రత్తగా మెలిపెట్టినట్టు చేయాలి ∙పేస్ట్రీ షీట్‌లో మిగిలిన భాగంతో నక్షత్రం ఆకారం చేసి పైన ఉంచాలి ∙కోడిగుడ్డు పచ్చ సొనను బాగా గిలకొట్టాలి ∙క్రిస్మస్‌ ట్రీ మీద బ్రష్‌ చేయాలి ∙అవెన్‌ను 220 డిగ్రీల దగ్గర ప్రీ హీట్‌ చేయాలి ∙తయారుచేసుకున్న క్రిస్మస్‌ ట్రీని అవెన్‌లో ఉంచి 20 నిమిషాలు బేక్‌ చేసి బయటకు తీయాలి ∙వేడిగా ఉండగానే పై భాగంలో పంచదార పొడి చల్లాలి ∙కొద్దికొద్దిగా కట్‌ చేసుకుంటూ తినాలి.

స్టార్‌ ఐడ్‌  క్రిస్మస్‌  కుకీస్‌
కావలసినవి: స్టార్‌ ఆకారంలో ఉండే ప్రెట్‌జెల్స్‌ – ఒక ప్యాకెట్‌ (సూపర్‌ మార్కెట్‌లో దొరుకుతాయి); పీనట్‌ బటర్‌ చాకొలేట్‌ క్యాండీస్‌ (ఎరుపు, ఆకుపచ్చ రంగులు) – ఒక ప్యాకెట్‌; మిల్క్‌ చాకొలేట్‌ కిసెస్‌ – 3 ప్యాకెట్లు

తయారీ: ముందుగా అవెన్‌ను 170 డిగ్రీల దగ్గర ప్రీహీట్‌ చేయాలి ∙ప్రెట్‌æజెల్స్‌ను ఒక ప్లేట్‌లో వేసుకోవాలి (విరిగిపోయిన వాటిని వేరుచేయాలి) ∙వ్యాక్స్‌ పేపర్‌ మీద ఒక వరుసలో ఉంచాలి 
∙మిల్క్‌ చాకొలేట్‌ కిసెస్‌ను ఒక్కో ప్రెట్‌æజెల్‌ మీద ఒక్కోటి ఉంచాలి 
∙ఈ విధంగా కుకీస్‌ షీట్‌ మీద ఉన్న అన్ని ప్రెట్‌తజెల్స్‌ మీద ఒక్కోటి ఉంచాలి 
∙ఈ షీట్‌ను ప్రీహీట్‌ చేసిన అవెన్‌లో ఉంచాలి ∙ఆరు నిమిషాల పాటు బేక్‌ చేయాలి ∙బయటకు తీయగానే సగం సగంగా కరిగిన కిసెస్‌ మీద పీనట్‌ బటర్‌ చాకొలేట్‌ క్యాండీని ఉంచాలి ∙ఇలా ఒకటి ఎరుపు, ఒకటి ఆకుపచ్చరంగు క్యాండీలు ఉంచిన వెంటనే, కుకీస్‌ షీట్‌ను ఫ్రిజ్‌లో ఉంచి, కుకీస్‌ పూర్తిగా తయారయ్యేవరకు కదపకుండా ఉంచాలి ∙వచ్చిన అతిథులకు క్యూట్‌ హాలిడే బ్యాగ్‌లో పెట్టి, అందించాలి ∙వారు ఇవి చూడగానే చాలా బాగా ఎంజాయ్‌ చే స్తూ తింటారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top