కోవిడ్‌ దళం

Special Story About Woman Patrol Team From Thrissur Kerala - Sakshi

తమిళనాడు పోలీసులు లాక్‌డౌన్‌ సమయాన్నిఉల్లంఘించారని ఒక తండ్రీ కొడుకుల ప్రాణాలను బలిగొన్నారు. కాని కేరళలో అలాంటి ఘటనలు లేవు. ఎందుకంటే అక్కడ పర్యవేక్షిస్తున్నది స్త్రీలు కనుక. కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టడానికి కేరళలోని త్రిచూర్‌లో మొదలెట్టిన మహిళా ఆఫీసర్ల దళం నచ్చ చెప్పడంలో, బుద్ధి చెప్పడంలో మంచి ఫలితాలు సాధించింది. దాంతో ఇప్పుడు కేరళ అంతా ఇలాంటి స్త్రీ దళాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.

కరోనాపై పోరాడడానికి కేరళ రాష్ట్రం అంతా ఒక స్త్రీ రూపాన్ని తీసుకున్నదా అని అనిపిస్తున్నది. కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టడంలో కేరళ ఆరోగ్య శాఖా మంత్రి కె.కె.శైలజ ఎంత సమర్థంగా పని చేసిందో, ఐక్యరాజ్య సమితి గర్తించేంతగా ఆమె కృషి ఎలా సాగిందో, సాగుతున్నదో అందరికీ తెలుసు. ఆమె మాత్రమే కాదు పాలనా రంగంలో, వైద్య రంగంలో ఎందరో స్త్రీలు కేరళలో కోవిడ్‌పై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. వీరితో పాటు అంతే సమర్థంగా పని చేస్తున్నారు అక్కడి మహిళా పోలీసులు. ఇందుకు అక్కడి ‘బుల్లెట్‌ స్క్వాడ్‌’ ఒక ఉదాహరణ. భారతదేశం లాక్‌డౌన్‌ దశను దాటి అన్‌లాక్‌ అయ్యే దశలలో ఉంది. ఈ సమయంలో ప్రజలను సదా అప్రమత్తంగా ఉంచాలి. ఐసొలేషన్‌ వార్డులను, హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నవారిని, సమూహాలలో భౌతికదూరం పాటించనివారిని, అనుమతించిన సమయాలకు మించి బయట తిరిగేవారిని వీరందరినీ పర్యవేక్షించాలి.

కొన్నిచోట్ల మెత్తగా చెప్పాలి. కొన్నిచోట్ల గట్టిగా కేకలు వెయ్యాలి. ఈ పని మగవారి కంటే స్త్రీలు సమర్థంగా చేయగలని అనుకున్నారు కేరళ డి.జి.పి లోక్‌నాథ్‌ బెహరా. అనుకున్న వెంటనే ప్రయోగాత్మకంగా త్రిచూర్‌ పట్టణంలో 40 మంది మహిళా ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పది కొత్త బుల్లెట్లు సమకూర్చారు. ప్రత్యేకంగా ఎర్రరంగు హెల్మెట్లు ఇచ్చారు. ఒక్కో బుల్లెట్‌ మీద ఇరువురు చొప్పున రోడ్ల మీద ఎప్పుడూ 20 మంది రౌండ్లలో ఉండేలా డ్యూటీలు విధించారు. ‘చూద్దాం... ఏమవుతుందో’ అనుకున్నారు. కాని మహిళా ఆఫీసర్లు తాము ఏం చేయగలరో చేసి చూపించారు. ఈ దళం రోడ్ల మీదకు వచ్చాక త్రిచూర్‌లో గొప్ప క్రమశిక్షణ సాధ్యమైంది. కోవిడ్‌ హాస్పిటల్స్‌ దగ్గర, క్వారంటైన్‌ సెంటర్ల దగ్గర, హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న పేషెంట్ల గృహాల దగ్గర, వర్తక సముదాయాల దగ్గర వీరి పహారా అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. బుల్లెట్‌ చప్పుడు వినిపించగానే ఎక్కడి వాళ్లక్కడ సర్దుకుంటున్నారు. లేదా బుల్లెట్‌ చప్పుడు ఎప్పుడు అవుతుందా అని బుద్ధిగా ఉంటున్నారు. మెత్తగా ఉండాల్సిన చోట మెత్తగా ఉన్నా తోక జాడిస్తే మాత్రం వీరు చలాన్లు విధిస్తున్నారు.
‘మా బుల్లెట్‌ స్క్వాడ్‌ పని తీరు చాలా బాగుంది. ఇది త్రిచూర్‌ వరకే అనుకున్నాం మొదట. ఈ ఫలితాలు చూశాక రాష్ట్రమంతా మహిళా స్క్వాడ్‌లను తీసుకురానున్నాం’ అని కేరళ డి.జి.పి. చెప్పారు. ఈ స్క్వాడ్‌ను పర్యవేక్షిస్తున్న త్రిచూర్‌ పోలిస్‌ కమిషనర్‌ ఆర్‌.ఆదిత్య కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. ‘ఈ స్క్వాడ్‌కు చెప్పుకుంటే మా సమస్యలు తీరుతాయి అని కోవిడ్‌ పేషెంట్లు అనుకోవడం మంచి పరిణామం’ అని ఆయన అన్నాడు. మరోవైపు ఈ స్క్వాడ్‌ వల్ల ‘బుల్లెట్‌ బండ్ల’ కు పెరుగుతున్న గౌరవాన్ని చూసి వాటి విక్రయదారులు ఆనందపడుతున్నారు. ఇప్పటివరకూ కూడా దాదాపుగా బుల్లెట్‌ అంటే మగవారి వాహనం కిందే లెక్క. చాలా తక్కువ మంది స్త్రీలు వీటిని నడుపుతారు. అయితే ఈ మహిళా స్క్వాడ్‌ వీటిని ఉపయోగిస్తుండటంతో ఇకపై స్త్రీలు కూడా వీటిని కొనుగోలు చేస్తారని ఆశిస్తున్నారు. ఏమైనా దేశంలో కరోనా వ్యాప్తిని నిరోధించాలంటే ఇలాంటి స్క్వాడ్స్‌ అవసరం చాలా ఉంది. ప్రతి ఊళ్లో, ప్రతి నగరంలో ఇలాంటి మహిళా దళాలు తిరుగుతూ ఉంటే ఒక అప్రమత్తత ఉంటుంది. కేరళ విధానాన్ని ఇతర అన్ని రాష్ట్రాలు స్వీకరిస్తాయని ఆశిద్దాం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top