ఏకాకి జీవితంతో వ్యాధుల చికాకు.. | Social Isolation Has Been Linked To Higher Risks Of Death | Sakshi
Sakshi News home page

ఏకాకి జీవితంతో వ్యాధుల చికాకు..

Sep 21 2018 4:10 PM | Updated on Sep 21 2018 4:10 PM

Social Isolation Has Been Linked To Higher Risks Of Death - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

లండన్‌ : ఆధునిక జీవితంలో మనిషిని చిన్నాభిన్నం చేస్తున్న ఒంటరితనం మానవాళిని మింగేసే ఉపద్రవమని వైద్యులు సైతం తేల్చిచెబుతున్నారు. ఒంటరితనం ఫలితంగా శరీరం వ్యాధుల మయంగా మారుతుందనేందుకు ఇప్పటికే పలు అథ్యయనాలు ఆధారాలు గుర్తించగా ఏకాకి జీవితంతో మనిషి శరీరంలో ఏం జరుగుతుందనేది తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒంటరితనంతో బాధపడేవారికి అసలైన మందు చుట్టూ ఉన్న వారితో మమేకం కావడమేనని హార్వర్డ్‌ యూనివర్సిటీ సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ చార్లెస్‌ బుల్లక్‌ తేల్చిచెప్పారు. ప్రపంచ నాగరిక చరిత్రలోనే ఎన్నడూలేనంతగా సాంకేతికతను ప్రస్తుత తరం ఉపయోగిస్తున్నా ఒంటరితనం మాత్రం 1980లతో పోలిస్తే రెండింతలైందని మాజీ సర్జన్‌ డాక్టర్‌ వివేక్‌ మూర్తి హార్వర్డ్‌ బిజినెస్‌ రివ్యూలో పేర్కొన్నారు.

ఒంటరితనం శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. ఒంటరితనంతో బాధపడే వారిలో ఎదుటి వ్యక్తుల ముఖంలో భావాలను చదవగలిగేందుకు వీలు కల్పించే మెదడులోని కీలక గ్రే మ్యాటర్‌ తగ్గుముఖం పడుతుందని డాక్టర్‌ బుల్లక్‌ తన బ్లాగ్‌లో పొందుపరిచారు. ఒంటరితనంతో మనిషి శరీరంలో హార్మోన్లు విశృంఖలంగా ఉరకలెత్తుతాయని గుర్తించారు. ఒత్తిడి హార్మోన్‌ కార్టిసోల్‌ స్ధాయిని మించి విడుదలైతే శరీరం నియం‍త్రించుకోలేదని ఇది శరీర జీవక్రియలన్నింటినీ విచ్ఛిన్నం చేస్తుందని చెప్పారు.

వీలైనంత సమయం స్నేహితులతో గడపడం ఒంటరితనానికి విరుగుడుగా పనిచేస్తుందని డాక్టర్‌ బుల్లక్‌ చెప్పుకొచ్చారు. సమూహంలో మెలగడం ద్వారా ఉద్వేగాలను తగ్గించుకోవచ్చని, కుంగుబాటు నుంచి ఉపశమనం కలుగుతుందని, రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుందని సూచించారు. లైబ్రరీ, పార్కు, జనావాసాల్లోకి తొంగిచూడటం వంటి వాటితో మెదడులో ఆక్సిటోసిన్‌ విడుదలవడం ద్వారా ఒత్తిడి హార్మోన్‌ స్ధాయిలను తగ్గిస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement