సింహళ మయూరం | Simhala Mayuram | Sakshi
Sakshi News home page

సింహళ మయూరం

Feb 1 2015 10:52 PM | Updated on Sep 2 2017 8:38 PM

సింహళ మయూరం

సింహళ మయూరం

గౌతమిలో తెలుగుదనం ఉట్టిపడడానికి రెండు కారణాలు.

గౌతమిలో తెలుగుదనం ఉట్టిపడడానికి రెండు కారణాలు. ఒకటి ఆమె పేరు. ఇంకొకటి ఆమె అభిరుచి. శ్రీలంకకు చెందిన ఈ సింహళ జాతీయురాలికి కూచిపూడిలో చక్కటి ప్రావీణ్యం ఉందని చెప్పడం కన్నా,  కూచిపూడి అంటే ఆమెకు ప్రాణం అని చెప్పడం సముచితంగా ఉంటుంది. ఆమెకు మన భాష తెలీదు. మన భావం తెలీదు. అయినప్పటికీ కీర్తనలను అర్థం చేసుకుంటూ కూచిపూడిని అభినయిస్తున్నారు. ప్రశంసలూ అందుకుంటున్నారు. భర్త ఉద్యోగరీత్యా రెండేళ్లుగా విశాఖ జిల్లా అచ్యుతాపురంలో ఉంటున్న గౌతమి ఇటీవలే శ్రీలంకలో కూడా కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చి వచ్చారు.
 
గౌతమి పూర్తి పేరు గౌతమి నిరంజల గమాగే. శ్రీలంకలో ఫైన్‌ఆర్ట్స్‌లో డిగ్రీ చేశారు. కొంతకాలం ప్రభుత్వ పాఠశాలలో డ్యాన్స్ టీచర్‌గా ఉన్నారు. పదేళ్ల క్రితం టీవీలో ఎవరిదో కూచిపూడి ప్రదర్శన చూసి ఆమె ఆ నాట్యం వైపు ఆకర్షితురాలయ్యారు. నృత్య భంగిమలు, అభినయమే గాక అందులోని అలంకరణ కూడా ఆ ఆకర్షణకు ఒక కారణమని గౌతమి అంటారు. గౌతమి భర్త కపిల్ సంజీవర్ ఒక కంపెనీలో ఉన్నతోద్యోగి.
 
‘‘మాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి. అబ్బాయి. వైజాగ్ ప్రకృతి అందంతో పాటు ఇక్కడి మనుషుల ఆత్మీయత నాకెంతో నచ్చింది. ఇక్కడికొచ్చిన రెండు నెలల్లోనే సాయినాథ కళాసమితిలో కూచిపూడి శిక్షణకు చేరా. వీకెండ్స్‌ని పూర్తిగా కూచిపూడి నేర్చుకోవడానికి కేటాయించా. నాట్యాచార్యులైన అరుణ్ సాయికుమార్, పేరిణికుమారి దంపతులు సంకీర్తనల్లో భావాన్ని ఇంగ్లిషులో వివరిస్తూ నాకు కూచిపూడి నేర్పించారు. అలా నేర్చుకునే వైజాగ్‌లోని దేవాలయాల్లో ఇప్పటి వరకు పది ప్రదర్శనలు ఇచ్చా.  

అందరూ నన్ను ప్రశంసిస్తూ ఉంటే ఆ ఆనందంతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇంత స్పందన వస్తుందని నేను ఊహించలేదు’’ అని చెప్పారు గౌతమి. అంతేకాదు, తన స్వదేశం తిరిగివెళ్లిన తర్వాత పూర్తి సమయాన్ని కూచిపూడి శిక్షణ ఇవ్వడానికే వినియోగించే ఉద్దేశంలో ఉన్నారామె.  ‘‘దీన్నో దైవకార్యంగా భావిస్తా. మా అమ్మాయి రసంధికీ కూచిపూడిలో శిక్షణ ఇప్పిస్తున్నా. ఆమెను అంతర్జాతీయ స్థాయి నృత్యకారిణిగా చూడాలనేది నా కోరిక’’’ అని గౌతమి అంటున్నారు.
- అల్లు సూరిబాబు, సాక్షి, విశాఖపట్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement