నక్క పగటి కల

Short Stories For Kids - Sakshi

బెలగాం భీమేశ్వరరావు

ఒక సింహం అడవికి రాజయ్యింది. రాజన్నాక పక్కన మంత్రి ఉండాలిగా మరి... అందుకే సింహం అదే వ్యాపకంలో పడింది. ఆ విషయం నక్కకు తెలిసింది. ఎలాగైనా అది ఆ మంత్రి పదవిని చేజిక్కించుకోవాలనుకుంది.

ఒక రోజు నక్క పనిగట్టుకొని సింహం ఉన్న గుహవైపు వెళ్లింది. ధైర్యం చేసి గుహ లోపలకు దూరింది. సింహం కనిపించింది. నక్క వెంటనే ఒక నమస్కార బాణం సింహంపై విసిరింది. 
ఆ నమస్కార బాణానికి సింహం మొహమాటంలో పడిపోయింది. ఏమిటిలా వచ్చావని నక్కతో మాట కలిపింది. కొత్తగా రాజు అయిన మిమ్మల్ని అభినందించడానికి వచ్చానని నక్క సమాధానమిచ్చింది. సింహానికి చాలా ఆనందమనిపించింది. అభినందనలు తెలిపిన నక్కకు ధన్యవాదాలు తెలిపింది.

ఆ రోజు నుంచి నక్క రెచ్చిపోయింది. రోజూ అది సింహం వద్దకు వెళ్లడం ఆరంభించింది. రోజుకొక జంతువు మీద సింహానికి ఫిర్యాదు చేస్తుండేది. ఒకరోజు సింహం కంటే ఎత్తుగా ఉంటానని ఏనుగుకి గర్వమని చెప్పింది. మరొకరోజు సింహానికి సమ ఉజ్జీనని పులి ప్రగల్భాలు పలుకుతుందని చెప్పింది. ఇంకోరోజు తనలాగ రెండు కాళ్లతో సింహం నడవలేదని ఎలుగుబంటి హేళన చేస్తుందని చెప్పింది. ఇలా రోజూ నక్క అడవిలోని ప్రతి జంతువూ సింహాన్ని తేలిక చేసి మాట్లాడుతున్నట్లు చెబుతుండేది. తానొక్కటే తమ వద్ద భయభక్తులతో ఉంటానని సింహానికి నూరి పోస్తుండేది.

రోజూ ఒకే తీరుగా నక్క చెబుతున్న మాటలు సింహం ఎన్నాళ్లు వినగలదు?! కొన్నాళ్లకు ఆ మాటలు సింహానికి విసుగనిపించాయి. ఒకసారి చిరాకు పడి ‘‘అడవిలో నేను సంచారం చేస్తున్నప్పుడు అన్ని జంతువులూ భయభక్తులు ప్రదర్శిస్తున్నాయే! అవి ఏనాడూ నన్ను చులకన చేయలేదే!’’ అని సింహం నక్కతో అంది..!

‘‘మీరు అమాయకులు! నా మాట నమ్మండి. మీరు కనిపించేసరికి జంతువులు వంకరదండాలు పెడుతున్నాయి. మీరది తెలుసుకోలేక పోతున్నారు. ఈ పరిస్థితుల్లో నాలాంటి మంత్రి మీ పక్కన ఉంటేనే మీ ప్రాణానికి భద్రత! మీ శ్రేయస్సు కోరి చెప్పాను. ఆపైన మీ ఇష్టం!’’ అని నంగనాచిలా పలికింది నక్క!

సింహానికి నక్క ఎత్తుగడ అర్థమయింది. అరికాలి మంట నెత్తికెక్కింది దానికి!
‘‘ఏయ్‌ జిత్తులమారి నక్కా! నీ పన్నాగం నాకు అర్థమైంది. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు! అన్ని జంతువులనూ చెడ్డ చేసి మంత్రి అయిపోవాలనుకుంటున్నావా? ఎవరిలోనూ మంచిని చూడలేని నిన్ను మంత్రిగా పెట్టుకుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదడానికి సిద్ధమైనట్టే! నా కోపాన్ని మరీ రెచ్చగొట్టకు పో!’’ అంది సింహం.

తన కల పగటి కలే అయిందనుకుంది నక్క. ఒక్క క్షణం కూడా సింహం ముందు నిలబడలేదు. బతుకు జీవుడా అని పారిపోయింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top