స్ఫూర్తిజ్వాల

sankranthi festivel bhogimantalu - Sakshi

భోగి మంట

బద్దకాన్ని కాచి ఉత్తేజంగా మారుస్తున్నట్టు.. జీవిత లక్ష్యాన్ని రగులుస్తున్న భావన! భోగి మంట చుట్టూ ఉన్న అక్క, అన్న, తమ్ముడు, చెల్లి.. అందరం ఉత్సాహంగా.. ఉత్తేజంగా!

ఇంకా సూర్యుడు పలకరించని ఉదయం.. అయినా ఇంట్లో వాళ్లంతా లేచారు.. నువ్వుల నూనె మస్సాజ్‌ వాసన.. కాగులో వేడినీళ్లు మరుగుతున్న చప్పుడు.. వాకిట్లో భోగిమంటకు సిద్ధం చేస్తున్న సందడి.. నిద్రను సాగనంపాలని చూస్తున్నా.. వణికించే చలి.. నిద్రను దుప్పట్లో దూర్చి జోగొట్టే ప్రయత్నం చేస్తోంది. అందుకే కళ్లు తెరిచి చూసి అటు తిరిగి ఏ డిస్ట్రబెన్స్‌ను  చెవిన పడనివ్వకుండా దిండును చెవులకు అడ్డం పెట్టుకొని మళ్లీ కళ్లు మూసుకుంటుంటే.. నానమ్మ ఊరుకోలేదు. సర్రున దుప్పటి లాగేసింది. అత్తొచ్చి అమాంతం ఎత్తుకొని తీసుకెళ్లి వాకిట్లో కూర్చోబెట్టింది. అమ్మ వచ్చేసి తలకు కొబ్బరి నూనె రాసింది. పిన్ని నువ్వుల నూనె పట్టించడానికి సన్నద్ధమైంది.

అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, బాబాయ్‌లు, నాన్న, తాతయ్య ఒకటే హడావిడి. ‘‘నాన్నమ్మా.. నిన్న నేను ఏరి తెచ్చిన రేగు కంప కనపడట్లేదే?’’ ఏడుపు గొంతుతో అన్న. ‘‘అక్కడే ఉంటుంది నాన్నా.. సరిగ్గా చూ..’’ నాన్నమ్మ పూర్తి చేసేలోపే ‘‘ఆ.. దొరికింది దొరికింది’’ అంటూ దాన్ని లాక్కొచ్చే అన్నయ్య. రెండు చేతులను చాపి వాటి మీద చిన్న చిన్న కర్రపుల్లల్ని మోసుకొస్తున్న తమ్ముడు.‘‘అమ్మడూ.. ఆ పిడకల దొంత తీసుకురా...’’ అక్కకు అత్త పురమాయింపు. లోపలి నుంచి కాళ్లు విరిగిపోయిన కుర్చీని తీసుకొస్తూ ఆయాసపడుతున్న తాతను చూసి ‘‘ఏమండీ.. మామగారి చేతుల్లోంచి ఆ కుర్చీని లాక్కోండి’’ నాన్నకు అమ్మ అప్పగించిన బాధ్యత.

‘‘రంగమ్మా.. ఇద్దరం తీసుకెళ్దాం గొబ్బెమ్మలను’’ చెల్లి  (బాబాయ్‌ కూతురు) రిక్వెస్ట్‌.. మా ఇంట్లో పనులకు సహాయంగా ఉన్న రంగమ్మత్తతో .. పిడకలుగా మారిన గొబ్బెమ్మల గురించి. ఎవరూ ఖాళీగా లేరు. అందరూ కలిసి చేస్తున్న పని. సహాయం. భోగి మంట రాజుకుంది. అంతెత్తున లేచింది. అప్పటిదాకా ఒంట్లో ముసుగేసుకున్న చలి పారిపోయింది. భోగి మంట రిఫ్లెక్షన్‌లో అందరి మొహాలు వెలుగుతున్నాయి. ఆ ఫ్లేమ్‌నే తదేకంగా చూస్తుంటే.. నాలోనూ ఏదో ఉత్సాహం..  నాలో ఉన్న బద్దకాన్ని కాచి ఉత్తేజంగా మారుస్తున్నట్టు.. జీవిత లక్ష్యాన్ని రగులుస్తున్న భావన! భోగి మంట చుట్టూ ఉన్న అక్క, అన్న, తమ్ముడు, చెల్లి.. అందరినీ చూశా. అందరూ నాలాగే ఉన్నారు.

ఉత్సాహంగా.. ఉత్తేజంగా!భోగి అనగానే ఇదే సీన్‌ రిపీట్‌ అవుతూ వస్తోంది కొన్నేళ్లుగా. ఇప్పుడు అందరం పెద్దవాళ్లమయ్యాం. ఒకరి మీద ఆధారపడకుండా.. ఇంకొకరికి సాయపడేంత! అన్నట్టు మేమంతా చిన్నప్పుడు పెట్టుకున్న గోల్స్‌ని రీచ్‌ అయ్యాం. అయినా ప్రతి భోగి కొత్త లక్ష్యాన్ని నిర్దేశిస్తూనే ఉంది. సమష్టి కృషిని బోధిస్తూనే ఉంది. ఇంకా ఏదో సాధించాలన్న తపనను రగిలిస్తూనే ఉంది. ఎక్కడున్నా ప్రతి సంక్రాంతికి ఊరెళ్తాం. నానమ్మ, తాతల ఆశీస్సుల కోసం.. ఆ వాకిట్లో భోగిజ్వాల పంచే స్ఫూర్తి కోసం!
– సరస్వతి రమ

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top