ప్రాణాల కోసం ప్రయాణం

Road safety awareness by ram - Sakshi

ప్రాణాల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టుగా డ్రైవ్‌ చేసే యువతలో అవేర్‌నెస్‌ కలిగించడం కోసం రామ్‌ చల్లా చార్మినార్‌ టు థేమ్స్‌ ప్రయాణించబోతున్నారు. రోడ్డు మీద 19000 కి.మీలు. సింగిల్‌ డ్రైవింగ్‌. యాభై రోజుల ట్రిప్‌. ఇలా ప్రయాణించే మొదటి తెలుగు వ్యక్తి ఇతడే.

నేను ఎంబిఏ చదువుకున్నాను. నాన్నగారు చల్లా రాధాకృష్ణ పోలీసు శాఖలో పని చేసేవారు. తల్లి వసంతకుమారి నల్గొండ స్కూల్‌ ప్రిన్సిపాల్‌గా చేసి రిటైరయ్యారు. నాకు ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు. ప్రస్తుతం యుకేలోని యుఏఈ ఎక్స్‌చేంజ్‌లో పనిచేస్తున్నాను.

‘‘నాలుగు సంవత్సరాల క్రితం అంటే 2014లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మా నాన్నగారు మరణించారు. అది ఆయన చేసిన తప్పు కారణంగా కాదు. ఇతరులు చేసిన తప్పు వల్ల. కాని ఫలితం? చిన్న వయసులోనే నేను తండ్రిని కోల్పోవాల్సి వచ్చింది. నాన్నగారు ట్రాఫిక్‌ రూల్స్‌ మాత్రమే కాదు అన్ని విషయాలలోనూ చాలా క్రమశిక్షణతో ఉండేవారు. రోడ్డుకి ఎడమపక్కగా వెళ్లడం, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఫాలో కావడం... అన్నీ పద్ధతిగానే ఉండేవారు. ఆ రోజు ఇంటి నుంచి కారులో బయటకు పని మీద బయలుదేరారు. సీటు బెల్టు పెట్టుకున్నారు. నెమ్మదిగానే కారు నడుపుతున్నారు. అంతలోనే రాంగ్‌రూట్‌లో పదిహేడు సంవత్సరాల ఒక కుర్రాడు కారులో వేగంగా వచ్చాడు.

నాన్న కారుని గట్టిగా ఢీకొట్టాడు. అక్కడికక్కడే నాన్న కన్ను మూశారు. ఆ కుర్రవాడికి కనీసం డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా లేదు. బాధ్యత తెలియని ఒక కుర్రవాడు చేసిన తప్పుకి నా తండ్రి బలి కావలసి వచ్చింది. అప్పటికి నేను లండన్‌లో ఉన్నాను. ఆయన సడెన్‌గా పోవడంతో నాలో ఏదో తెలియని దిగులు బయలుదేరింది. జీవితం గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. మన టైమ్‌ లిమిటెడ్‌ అనే విషయం ఈ సంఘటన ద్వారా ప్రాక్టికల్‌గా అర్థం అయ్యింది. ఆరు నెలల వరకు కోలుకోలేకపోయాను. మరో ఆరు నెలల వరకు ఏం చేయాలా అనే విషయం మీద ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చాను. 2006 నుంచి నాతో స్నేహంగా ఉన్న కొందరు మిత్రులతో కలిసి సేవా కార్యక్రమాలు ప్రారంభించాను.

పెద్ద స్థాయిలో కాకపోయినా, చేతనైన పనులు చేయడం మొదలుపెట్టాను. ఒక సంస్థగా రిజిస్టర్‌ చేశాం. 2015 లో నా మిత్రుడు కల్యాణ్‌తో కలిసి, ఎన్‌జీవోని ఏడుగురు బోర్డు సభ్యులతో సొసైటీగా రిజిస్టర్‌ చేశాం. చాలా మందికి ఎన్‌జీవో అనగానే... 50 సంవత్సరాలు దాటినవారనో, సోమరిగా ఉండేవారనో ఒక ముద్ర పడిపోయింది. ఎవ్వరి దగ్గరా ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఈ ఆర్గనైజేషన్‌ని ప్రారంభించాను. మా సంపాదనలో నుంచే ఇందులో 17 లక్షలు పెట్టుబడి పెట్టాం. సేవా కార్యక్రమాలతో పాటు డ్రైవింగ్‌ పట్ల చైతన్యం కలిగించడమే మా ప్రధాన కార్యక్రమం. అయితే ఏదైనా పెద్ద పని చేసి ఆ విషయంలో అందరి దృష్టిని ఆకర్షించాలనిపించింది. ఆలోచించగా నాకు వచ్చిన ఆలోచనే చార్మినార్‌ నుంచి లండన్‌ వరకు రోడ్‌ ట్రిప్‌.

ఇదీ ప్రయాణం
చార్మినార్‌ నుంచి లండన్‌ బ్రిడ్జి వరకు ప్రయాణించేలా రెండు చారిత్రాక ప్రదేశాలను ఎంచుకున్నాను. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకుంటున్నాను. 50 రోజుల పాటు ఒంటరి ప్రయాణం. ఇలా ఒంటరిగా డ్రైవ్‌ చేసుకుంటూ ప్రయాణిస్తున్న మొదటి తెలుగు వ్యక్తిని నేనే. ఇతర రాష్ట్రాల నుంచి కొందరు ఇలా ప్రయాణించారు. అయితే ఇద్దరు ముగ్గురు కలిసి టీమ్‌గా వెళ్లారు. ముంబై నుంచి ఎస్‌యువి మహీంద్రా మోటార్‌ కార్‌ స్పాన్సర్‌ చేస్తారని భావిస్తున్నాను.

ఈ ప్రయాణం ఖర్చు 50 లక్షలు. జూన్‌ 1 వ తేదీన ఇక్కడ నుంచి బయలుదేరాలనుకుంటున్నాను. మొత్తం 19000 కి.మీ. ప్రయాణం. అన్ని దేశాల నుంచి లెటర్స్‌ తీసుకున్నాను. ‘కార్నెట్‌’ అని వెహికల్‌ పాస్‌పోర్టు ఉంటుంది. అది కూడా తీసుకున్నాను. ‘అలెర్ట్‌ టుడే అలైవ్‌ టుమారో’ అనేది మా స్లోగన్‌. కజగిస్థాన్‌లో కూడా తెలుగు ఎంబసీలు ఉంటారు. ఇలా ప్రతి దేశంలోనూ ఉన్న ఎంబసీలను ముందుగానే అవేర్‌నెస్‌ కోసం కలిసినవారితో మాట్లాడతాను. దారిలో ఎన్నో ఇబ్బందులు ఎదురవ్వచ్చు కానీ, అన్నిటినీ అధిగమించడానికి మానసికంగా సంసిద్ధంగా ఉన్నాను. అంతా సవ్యంగా సాగితే యాభై రోజులలో పూర్తవుతుంది.

ఇలా ప్లాన్‌ చేసుకుంటున్నాను
ఈ ప్రయాణం కోసం డైట్‌ ప్లాన్‌ చేసుకుంటున్నాను. బయటి ఆహారం తీసుకోకుండా, నాకు నేను స్వయంగా వండుకునేలా అన్నీ సమకూర్చుకుంటున్నాను. బేసిక్‌ ఫిట్‌నెస్‌ గురించి జాగ్రత్త పడుతున్నాను. ప్రతి నాలుగు గంటలకి కారు ఆపి, సుమారు అరగంటసేపు వాకింగ్‌ చేస్తాను. రోజూ తొమ్మిది గంటలకు మించకుండా డ్రైవ్‌ చేస్తాను.అది కూడా బ్రేకులు తీసుకుంటూ. నైట్‌ డ్రైవ్‌ చేయను.

సాధారణమైన హోటల్స్‌లో అకామడేషన్‌ ముందుగానే బుక్‌ చేసుకుంటున్నాను. చిన్న చిన్న అనారోగ్యాలకు సంబంధించిన మందులు నా వెంట తీసుకువెళ్తాను. కారు రిపెయిర్‌ వస్తే, నేనే స్వయంగా బాగుచేసుకునేలాగ పది రోజులు ట్రయినింగ్‌ తీసుకుంటున్నాను.  జంప్లీడ్‌ బ్యాటరీ, జిపిఎస్‌ ట్రాకింగ్, ఫిజికల్‌ మ్యాప్స్‌ నాతో తీసుకువెళ్తాను. లోకల్‌గా ఉండే ఎంబసీ కాంటాక్ట్‌ నంబర్లు ఉంచుకుంటున్నాను. ఇంతకుముందు ఇలా లాంగ్‌ డ్రైవ్‌ చేసినవారి నుంచి వారి అనుభవాలు, ఇతర సమాచారం సేకరించాను.

నా ఆశయం అక్కడ మొదలవుతుంది...
తిరుగు ప్రయాణంలో పాఠశాలలకి, కాలేజీలకు వెళ్లి రోడ్‌ సేఫ్టీ గురించి వివరించాలనుకుంటున్నాను. జాగ్రత్తగా ప్రయాణిస్తే ఎంత దూరమైనా ప్రయాణించవచ్చనడానికి నేనే ఉదాహరణ అని చూపిస్తాను. యాక్సిడెంట్‌ వీడియోలను ప్రదర్శిస్తూ, చిన్న చిన్న విషయాలే ఎడ్యుకేట్‌ చేయాలనుకుంటున్నాను. నాన్నగారి పట్ల నాకున్న గ్రాటిట్యూడ్‌ను ఇలా చూపించాలనుకుంటున్నాను.

సురక్షిత ప్రయాణం కోసం
ఎక్కడకు వెళ్లాలన్నా ముందుగానే ప్లాన్‌ చేసుకోవాలి. సరైన సమయానికి బయలుదేరాలి. సేఫ్టీ రూల్స్‌ను అనుసరించాలి. ఇంట్లో వారిని గుర్తు చేసుకోవాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top