చిన్నక్క కబుర్లు

చిన్నక్క కబుర్లు


రేడియో అంతరంగాలు

 

ఆలిండియా రేడియోలో ఓ నటిగా, రచయిత్రిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు రతన్‌ప్రసాద్. శ్రోతలందరికీ ఆమె ‘చిన్నక్క’గా సుపరిచితురాలు. అనౌన్సర్ అంటే ఇలా ఉండాలని చూపించదగ్గ గొప్పతనం ఆమెకుంది. ఏ కార్యక్రమానికి ఎలా మాట్లాడాలనే దానిపై ఆమెకున్న పట్టు సాటిలేనిది. సినీతారలకే కాదు రేడియో కళాకారులకు కూడా ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో ఆమె మాటలు వింటే తెలుస్తుంది. ‘‘తప్పు జరిగింది, క్షమించండి’’ అని చెప్పాల్సిన పరిస్థితిని ఆమె తన నలభై ఏళ్ల సర్వీసులో ఏనాడూ తెచ్చుకోలేదు. ప్రముఖ రేడియో కళాకారిణి శారదా శ్రీనివాసన్ ఈ వారం ప్రఖ్యాత రేడియో ఆర్టిస్ట్ అయిన 83 ఏళ్ల రతన్‌ప్రసాద్‌ను పలకరించారు. ఆత్మీయంగా పంచుకున్న ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...

 

దక్కన్ రేడియోలో క్యాజువల్ ఆర్టిస్ట్‌గా నా రేడియో జీవితాన్ని ప్రారంభించాను. అప్పుడు అక్కడ  కేశవపంతుల నరసింహ శాస్త్రిగారు, కుప్పుస్వామిగారు ఉండేవారు. తర్వాత దక్కన్ రేడియో ‘ఆలిండియా రేడియో’గా రూపాంతరం చెందాక 1958లో నేను అనౌన్సర్‌గా ఉద్యోగంలో చేరాను. అది అనుకోకుండా జరిగి పోయింది. అసలు నేను వాద్యసంగీతం ఆడిషన్‌కు వెళ్లాను. ఆ ఆడిషన్‌లో వాద్యాల మధ్య నేను మాట్లాడిన మాటలను విని, నా కంఠ స్వరంలో ప్రత్యేకత ఉందని చెప్పి అక్కడి జడ్జీలు నన్ను అనౌన్సర్‌గా తీసుకున్నారు.

 

కార్మికుల కార్యక్రమం
ఈ కార్యక్రమం నా జీవితాన్నే మలుపు తిప్పిందని చెప్పాలి. ఇప్పటికీ ప్రజల్లో ‘చిన్నక్క’, ‘ఏకాంబరం’ పాత్రలు గుర్తున్నాయంటే అది మా అదృష్టం. ఈ కార్యక్రమంలో మొదట కొన్నేళ్లు నేను రమణక్కగా తెలంగాణ మాండలికంలో మాట్లాడేదాన్ని. తర్వాత నా పాత్ర పేరును రమణక్క నుంచి చిన్నక్కగా, సత్యనారాయణ పోషించే పాత్ర పేరును జగన్నాథం నుంచి ఏకాంబరంగా మార్చారు.  అలా 10 ఏళ్లు రమణక్కగా, 30 ఏళ్లు చిన్నక్కగా రేడియోలో కార్యక్రమాలు చేశాను. అలాగే కుటుంబ నియంత్రణపై మేం చేసిన కార్యక్రమాలు మాకు మంచి పేరు తెచ్చి పెట్టాయి.ఏనుగు అంబారీదివిసీమ ఉప్పెన సమయంలో తుపాను బాధితుల సహాయార్థం విరాళాలు సేకరిద్దామని నేను, వి.సత్యనారాయణ (ఏకాంబరం పాత్రధారి), జీడిగుంట రామచంద్రమూర్తి (బాలయ్య పాత్రధారి)లతో మహబూబ్‌నగర్ జిల్లాల్లోని వనపర్తి, గద్వాల్, కొల్లాపూర్ ప్రాంతాల్లో పర్యటించాం. సినీ తారలకు నీరాజనం పట్టినట్టే మాకూ ఘనస్వాగతం పలికారు ప్రజలు. అలాగే జగిత్యాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు నన్ను ఏనుగుపై ఊరేగించి సన్మానం చేశారు. ఆ సన్మానం నాకు జరిగినట్టుగా నేనెప్పుడూ భావించలేదు. అది ఆకాశవాణికే జరిగిందని నమ్ముతాను.భాగ్యనగరంలో కలకలం1970లో గండిపేట తెగిపోయి హైదరాబాద్ నగరం మునిగిపోతుందని వదంతులు చెలరేగాయి. అప్పుడు ప్రజల్లో భయాందోళనలు తొలిగించేందుకు కృషి చేయాల్సిందిగా పోలీసులు మమ్మల్ని కోరారు. దాంతో ప్రతి అయిదు నిమిషాలకోసారి ఈ అంశంపై వివిధ రకాలుగా అనౌన్స్ చేశాను. మరుసటి రోజు పోలీసు కమిషనర్ వచ్చి ‘‘మేం చేయలేకపోయిన పనిని మీరు విజయవంతంగా చేశార’’ని ప్రశంసించారు.ప్రజలు మెచ్చిన ప్రోగ్రామ్స్స్త్రీల కార్యక్రమంలో ‘రంగవల్లి’లో ‘అమ్మ ఒడి’ అనే ధారావాహిక శీర్షిక నిర్వహించాను. ఈ కార్యక్రమంలో చిన్న పిల్లల భాషలోనే కథలు చెప్పేదాన్ని. ‘గ్రామసీమలు’ కార్యక్రమంలో రామాయణం చదివి వినిపించాను. మునిమాణిక్యం గారి ‘కాంతం కథలు’ చదివాను. 1962లో చైనా యుద్ధ సమయంలో సైనిక సోదరులు తమ భార్యలకు రాసినట్టుగా మేం ప్రసారం చేసిన ‘హంస సందేశం’ అనే దేశభక్తిపూరిత ధారావాహిక ఉత్తరాల కార్యక్రమం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ‘వన్నెల విసనకర్ర’ శీర్షికతో మహిళా వస్త్రధారణ, నగలకు సంబంధించిన కార్యక్రమం చేశాను.అలుపెరుగని కృషి..నేను పత్రికలకు రాసిన ‘ఆవలి తీరానికి’, ‘ఎప్పటికీ ఏమీకాను’, ‘తెర తొలగింది’లాంటి నవలలకు బహుమతులు అందుకున్నాను. సెక్షన్ గ్రేడ్ అనౌన్సర్‌గా 1992లో రిటైర్ అయ్యాను. ఇప్పటికీ హైదరాబాద్ స్టేషన్ వారు మూడు, నాలుగేళ్లకోసారి నిర్వహించే జాతీయ నాటకానికి దర్శకత్వం వహించే బాధ్యతను నాకే అప్పగిస్తారు. ప్రస్తుతం ‘అమృతవాణి’లో చిన్నారులకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను.

 ..:: ప్రెజెంటేషన్: నిఖితా నెల్లుట్ల

 ఫొటోలు: ఎన్.రాజేశ్‌రెడ్డి

 

కత్తిమీది సాము
అనౌన్సర్ ఉద్యోగం కత్తి మీద సాము లాంటిది. అయితే వీరికి బాహ్య శత్రువులంటూ ఎవరూ ఉండరు. తమ కళ్లు, నాలుక, చేతులే విరోధులు. అవెలాగంటారా... స్క్రిప్టులోని అక్షరాలు అప్పుడప్పుడు కంటిని తప్పు దారి పట్టిస్తాయి. దాంతో నాలుక తప్పు చదువుతుంది. ఇక చేయి విషయానికొస్తే అనౌన్సర్లు మిషన్లతో వేగంగా పని చేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం పొరపాటు జరిగినా అంతే ఇంక.

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top