మోటుమలు | Sakshi
Sakshi News home page

మోటుమలు

Published Thu, Jun 11 2015 10:58 PM

మోటుమలు

పింపుల్స్
యుక్తవయసులో వచ్చే సాధారణ సమస్య మొటిమలు. కౌమారం నుంచి యుక్తవయసులోకి వస్తుండగా... నునుపైన ముఖం కాస్తా ‘మోటు’గా మారి ఎదుటివారికి తాము అందంగా కనిపించడం లేదనే ఆందోళన కలిగిస్తుంది. అయితే కొందరిలో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంటుంది. ముఖం మోటుగా ఉండటం ఎవరికి మాత్రం ఇష్టం. అందరికీ కష్టం. అందునా లుక్స్ కోసం బాధపడే ఆ వయసులో మానసికంగానూ నష్టం. మొటిమల మోటుదనం నుంచి ఊరట పొంది ముఖాన్ని నునుపుగా ఎలా రూపుదిద్దుకోవచ్చో  చూద్దాం.
 
మొటిమలు రావడానికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి. అవి... 1) జిడ్డు స్వభావంతో కూడిన చర్మం (ఆయిలీ స్కిన్) 2) చర్మంపై ఉండే స్వేద రంధ్రాలు పూడుకుపోవడం 3) చర్మంపైని స్వేద రంధ్రాలలో బ్యాక్టీరియా చేరడం 4) ఇన్‌ఫ్లమేషన్ (నొప్పి, వాపు, మంట). సాధారణంగా చర్మకణాలు పుట్టే క్రమంలో చర్మంపై ఉండే స్వేదరంధ్రాలు పూడుకుపోతాయి. దాంతో అక్కడ చర్మాన్ని తేమగా ఉంచేందుకు పుట్టే స్రావమైన ‘సెబమ్’ బయటికి రావడానికి మార్గం ఉండదు. ఫలితంగా అక్కడ పేరుకున్న ‘సేబమ్’ బ్యాక్టీరియా పెరుగుదలకు మరింత దోహదపడుతుంది. ఫలితంగా అక్కడ వాపు వస్తుంది. ఇలా మొటిమలు వస్తుంటాయి. చాలా సందర్భాల్లో యుక్తవయసుకు రాగానే పెరిగే పురుష హార్మోన్లు మొటిమలకు కారణం అనే ఒక అభిప్రాయం ఉంది. కానీ ఇది అపోహ మాత్రమే. ఎందుకంటే మొటిమలు ఉన్న మగపిల్లల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ పాళ్లను పరిశీలిస్తే అవి నార్మల్‌గా ఉండాల్సిన మోతాదులోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే యుక్తవయసులో ఉన్న ఆడపిల్లల్లో ఈ హార్మోన్ పాళ్లు పెరగడం వల్ల రుతుక్రమం సక్రమంగా రాకపోవడం, అవాంఛిత రోమాలు కనిపించవచ్చు. అందుకే దాదాపు 25 ఏళ్లు దాటిన మహిళల్లో మొటిమలు రావడం జరుగుతుంటే వాళ్లలో హార్మోన్ అసమతౌల్యత ఉన్నట్లు అనుమానించాలి. పాలిసిస్టిక్ ఓవరీ అనే కండిషన్‌లో మహిళల్లో మొటిమలు చాలా ఎక్కువగా వస్తాయి. పైగా ఇవి చికిత్సకు ఒక పట్టాన లొంగవు. అందుకే మొటిమలు ఉన్న పురుషులలో కంటే మహిళల్లో హార్మోన్ల అసమతౌల్యతకు అవకాశాలు ఎక్కువ అని తెలుస్తుంది. కొన్ని రకాల మందులు, గర్భనిరోధక మాత్రలు వాడటం వంటివి మొటిమలను ఎక్కువగా వచ్చేలా చేస్తాయి. కొన్నిసార్లు సౌందర్యసాధనాల (కాస్మటిక్స్) వల్ల కూడా మొటిమలు రావచ్చు.

వ్యాధిగానే చూడాలి: చాలామంది తల్లిదండ్రులు దీన్ని ఒక వ్యాధిగా పరిగణించరు. కానీ చర్మానికి సంబంధించిన ఒక రుగ్మతగానే దీన్ని చూడాలి. సాధారణంగా ముఖం మీద, కొందరిలో ఛాతీ, వీపు మీద కనిపించే ఈ మొటిమలు చాలా తక్కువ తీవ్రత (మైల్డ్) మొదలుకొని తీవ్రమైన (సివియర్) వరకు వేర్వేరు స్థాయుల్లో కనిపిస్తాయి. కొందరిలో మొటిమల తీవ్రత ఎంతగా ఉంటుందంటే అది కొన్ని జీవ వ్యవస్థలను సైతం ప్రభావితం చేసేంతగా! మొటిమ తన తొలిదశలో చిన్న బొడిపెలా కనిపిస్తుంది. దీని చివరిభాగం మూసుకుపోయి తెల్లగా కనిపిస్తుంది. ఆ తర్వాతి దశలో దీని చివరిభాగం నల్లగా మారి, తెరచుకుని కూడా ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో ఇది ఎర్రగా బాగా ఉబ్బిపోయి లేదా వాపుతో కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో చర్మం గట్టిబారి పోయి ఒక పెద్దబొడిపె (నాడ్యూల్) లా అనిపించవచ్చు. ఇలా ముఖమంతా అనేక దశల్లోని మొటిమలు కనిపిస్తూ ఉండవచ్చు. ముఖం మీద ఉన్న గాట్లు వంటి భాగాలు, మచ్చలు (స్కార్స్) ఆధారంగా వీటిని ఐదు గ్రేడ్స్‌గా విభజించి చూస్తారు. కొందరిలో ఇవి నీరు నిండినట్లుగా గట్టి పెద్ద బొడిపె మాదిరిగా (నాడ్యులో-సిస్టిక్) పుండ్లలా కనిపిస్తూ జ్వరం, కీళ్లనొప్పులు కూడా కనిపించవచ్చు.  

నివారణకు ఉపయోగపడే క్లెన్సర్స్ ఇవి  మొటిమల నివారణ కోసం ముఖం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు మార్కెట్‌లో మొటిమలను నివారించడానికి చాలా క్లెన్సర్స్ లభ్యమవుతున్నాయి. ఇవి సబ్బులు, లిక్విడ్ ఫేస్‌వాష్‌ల రూపంలో లభిస్తున్నాయి. వీటిని ఉపయోగిస్తూ, ముల్తానీ మిట్టీ లాంటి వాటితో ఫేస్‌ప్యాక్‌లా వేస్తూ జిడ్డు చర్మం (ఆయిలీ స్కిన్) ఉన్నవారిలోని జిడ్డుపాళ్లను తగ్గించవచ్చు.  అయితే మొటిమలు ఒకింత ఎక్కువగా ఉన్నవారు ముఖాన్ని శుభ్రపరచుకునేందుకు ఫేషియల్ స్క్రబ్ వాడకపోవడమే మంచిది.
 పూతమందులతో చికిత్స: మొటిమలు ఉన్న స్థాయిని, తీవ్రతను బట్టి పూత మందుల్లో అనేక రకాలు లభ్యమవుతున్నాయి. ఉదాహరణకు రెటినాయిడ్స్ అనే పూత మందులు స్వేదరంధ్రాలు పూడుకుపోయిన మొటిమలకు బాగా ఉపయోగపడతాయి. ఇక రెటినాయిడ్స్‌తో పాటు క్లిండమైసిన్, అజిథ్రోమైసిన్, నాడిఫ్లోక్లసిస్ వంటి  యాంటీబయాటిక్స్ పూతమందులుగా లభ్యమవుతున్న కాంబినేషన్లు మొటిమలపై మరింత ప్రభావపూర్వకంగా పనిచేస్తాయి. అయితే కొన్ని రెటినాయిడ్ కాంబినేషన్ పూత మందుల వల్ల చర్మంపై మంట, చర్మం ఎర్రబారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. దీన్ని తగ్గించడానికి అవి పూసి ఉంచాల్సిన వ్యవధిని తగ్గించడం, వాటర్ బేస్‌డ్ మాయిశ్చరైజర్స్ వాడటం మేలు. ఒకవేళ పూతమందులతో మొటిమలు 6-8 వారాలు గడిచినా తగ్గనప్పుడు పూతమందులతో పాటు నోటిద్వారా తీసుకునే మందులు వాడాలి.

ఓరల్ థెరపీ : ఒకింత తీవ్రత కలిగిన మొటిమలు మొదలుకొని తీవ్రమైన మొటిమలకు పూతమందులతో పాటు... నోటి ద్వారా తీసుకోవాల్సిన అరిథ్రోమైసిన్, అజిథ్రోమైసిన్, డాక్సిసైక్లిన్, మినోసైక్లిన్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది. ఇవి మూడు వారాల పాటు వాడాక కూడా ఫలితం కనిపించకపోతే చికిత్స వ్యవధిని కొన్ని వారాల నుంచి నెలల వరకు పొడిగించాలి. యాంటీబయాటిక్స్‌తో కూడా ఫలితం లేనప్పుడు ఐసోట్రెటినియాన్ వంటివి  మొటిమల చికిత్సలో మంచి ఫలితాలను ఇచ్చే మందులుగా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. తీవ్రమైన మొటిమల కోసం యాంటీబయాటిక్స్ కూడా ఉపయోగపడనప్పుడు వీటిని 16 వారాలపాటు వాడాలి. మొటిమలకు కారణాలు ఏవైనప్పటికీ వాటితో నిమిత్తం లేకుండా ఫలితం చూపే మంచి మందులివి. వాటితో పాటు ఇప్పుడు చవగ్గానే లభించే డర్మారోలర్, హైస్ట్రెంత్ ట్రైక్లోరో అసిటిక్ యాసిడ్‌ను పూసే చికిత్సలూ అందుబాటులో ఉన్నాయి. శస్త్రచికిత్స: ఇక ముఖంపైన మచ్చలు, గాట్లు మిగిలిపోయినవారికి ఒక్కోసారి వాటి తీవ్రతను బట్టి శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు.
 
చికిత్స అవసరం: చాలామంది తల్లిదండ్రులు యుక్తవయసులోని తమ పిల్లలకు మొటిమలు వస్తున్నప్పుడు కొంత వయసు తర్వాత అదే తగ్గిపోతుందంటూ చికిత్స ఇప్పించరు. ఇది సరికాదు. తీవ్రమైన మొటిమలు ఉన్నప్పుడు అవి ముఖం మీద గాట్ల వంటి మచ్చలను ఏర్పరుస్తాయి. అవి ఎదిగే వయసులోని పిల్లల్లో తీవ్రమైన న్యూనతను కలిగిస్తాయి. కాబట్టి ఆ వయసు పిల్లల ఎదిగే మానసిక ఆరోగ్య వికాసాన్ని దృష్టిలో ఉంచుకుని, మంచి నాణ్యమైన జీవితం కోసం, ఆత్మవిశ్వాసం పొందించండం కోసం మొటిమలకు చికిత్స అవసరం. ఈ చికిత్స ఎంతగా జరిగితే మచ్చలను అంతగా రాకుండా చూడవచ్చు. చాలా తక్కువ తీవ్రతతో (మైల్డ్‌గా) ఉన్న మొటిమలకు పైపూతగా వాడే మందులు, క్లెన్సర్లు అందుబాటులో ఉంటాయి. అయితే మొటిమలు తీవ్రంగా ఉన్న సందర్భాల్లో పూతమందుల (టాపికల్ మెడిసిన్స్)తో పాటు నోటి ద్వారా తీసుకోవాల్సిన మందులు (ఓరల్ మెడిసిన్స్) కూడా వాడాల్సి ఉంటుంది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement