పరి పరిశోధన

Periodical research - Sakshi

మిల్క్‌షేక్స్‌తో గుండెకు చేటు
అసలే వేసవి. దాహార్తితో అల్లాడే జనం శీతల పానీయాల కోసం అర్రులు చాస్తారు. నిమ్మరసం మొదలుకొని నానా రకాల పండ్ల రసాలు, మజ్జిగ, లస్సీ, మిల్క్‌ షేక్‌ వంటి పానీయాలను గ్లాసుల కొద్దీ తాగేస్తారు. మిగిలిన పానీయాలు ఫర్వాలేదు గాని, మిల్క్‌ షేక్స్‌ విషయంలో కొంత జాగ్రత్త తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పుష్కలంగా మీగడ వేసి తయారుచేసే మిల్క్‌ షేక్స్‌ స్వల్ప వ్యవధిలోనే రక్తనాళాలపై, ఎర్ర రక్త కణాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తమ పరిశోధనలో తేలిందని, రుచి కోసం ఎడాపెడా మిల్క్‌ షేక్స్‌ తాగేస్తూ పోతే దీర్ఘకాలంలో గుండెకు చేటు తప్పదని జార్జియాలోని అగస్టా యూనివర్సిటీ మెడికల్‌ కాలేజీకి చెందిన నిపుణులు చెబుతున్నారు.

పరీక్షాత్మకంగా పదిమంది ఆరోగ్యవంతులకు ఒక్కో మిల్క్‌ షేక్‌ ఇచ్చారు. మిల్క్‌ షేక్‌ తాగిన నాలుగు గంటల తర్వాత వారిపై పరీక్షలు జరిపితే, వారి రక్తనాళాలు కుంచించుకుపోవడంతో పాటు, ఎర్ర రక్తకణాలు మృదుత్వాన్ని కోల్పోయినట్లు గుర్తించామని అగస్టా వర్సిటీ మెడికల్‌ కాలేజీలోని సెల్‌ బయాలజీ అండ్‌ అనాటమీ ప్రొఫెసర్‌ జూలియా బ్రిటన్‌ వెల్లడించారు.

పుట్టగొడుగులతో వార్ధక్యానికి కళ్లెం
వార్ధక్యానికి కళ్లెం వేయాలంటే నవయవ్వన గుళికల కోసం వెదుకులాడాల్సిన పనేమీ లేదు గాని, పుట్టగొడుగులను ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలని చెబుతున్నారు అమెరికన్‌ వైద్య నిపుణులు. పెన్సిల్వేనియా స్టేట్‌ సెంటర్‌ ఫర్‌ ప్లాంట్‌ అండ్‌ మష్రూమ్‌ ప్రోడక్ట్స్‌ ఫర్‌ హెల్త్‌ సంస్థకు చెందిన పోషకాహార నిపుణుడు ప్రొఫెసర్‌ రాబర్ట్‌ బీల్మాన్‌ పుట్టగొడుగులపై తాము జరిపిన పరిశోధనల్లో బయటపడిన కీలకమైన అంశాలను వెల్లడించారు.

పుట్టగొడుగుల్లో ఎర్గోథియోనీన్, గ్లూటాథియోన్‌ అనే యాంటీఆక్సిడెంట్లు అత్యధిక మోతాదులో ఉంటాయని, వార్ధక్య లక్షణాలను దూరం చేయడంలో ఈ యాంటీ ఆక్సిడెంట్లు కీలక పాత్ర పోషిస్తాయని ప్రొఫెసర్‌ బీల్మాన్‌ వివరించారు. తినడానికి పనికొచ్చే పుట్టగొడుగులన్నింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని, వాటిలో ‘పోర్సిని’ రకానికి చెందిన పుట్టగొడుగుల్లో వీటి మోతాదు మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top