
అడవిని నమ్ముకుని జీవించే ఆదివాసీలు తినే ఆహారంలో ప్రతీ ఒక్కటి.. ఏదో ఒక ప్రత్యేకత, ఔషధ విలువలు కలిగి ఉంటాయి. అందుకే ఆదివాసీల్లో రోగనిరోధక శక్తి అధికం. వారు తీసుకునే అటవీ ఉత్పత్తుల్లో.. వర్షాకాలం ప్రారంభంలో మాత్రమే లభించే పుట్ట గొడుగులు (మష్‌రూమ్స్) ప్రత్యేకం.
ఇవి ఎక్కువగా పుట్టపైనే పుడతాయి. విప్పుకున్న తర్వాత గొడుగు ఆకారంలో ఉండటంతో.. వాటికి పుట్టగొడుగు అని పేరు వచ్చింది. వీటిని ఆదివాసీలు ఎంతో ఇష్టపడి తింటారు. శుభ్రం చేసిన పుట్టగొడుగులను నేరుగా లేదా కూర వండుకుని తినడం వీరి ఆనవాయితీ. వీటిలోని పోషకాలను గుర్తించిన నాగరికులు కృత్రిమంగా ఇంట్లో పెంచే విధానంతో లక్షలు సంపాదిస్తున్నారు. మార్కెట్‌లో కిలోకు రూ.350 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు.
పోషక విలువలు అధికం..
కప్పు పుట్టగొడుగుల్లో 15 కేలరీల శక్తి, 2.2 గ్రాముల ప్రొటీన్, 2.3 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 0.7 గ్రాముల ఫైబర్, విటమిన్ బి, బి2, బి9, బి3లు, పొటాషియం, రైబోఫ్లావిన్, నియాసిన్‌లతో పాటు విటమిన్ ఈ, ఇర్గొథియోనైన్, సెలీనియంలు పుష్కలంగా ఉంటాయి. ఇతర ఆహార పదార్థాల్లో లభించని విటమిన్ డి పుట్టగొడుగుల్లో ఉండటం ప్రత్యేకం.
కేన్సర్, మధుమేహానికి చెక్..
పుట్టగొడుగుల్లో ఎన్నో ఔషధ విలువలు ఉన్నాయి. ఇవి తినడం వల్ల కేన్సర్, మధుమేహం, ఊబకాయం, గుండె సంబంధ వ్యాధులు రాకుండా కట్టడి చేయవచ్చు. ఉన్నవారు త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడతాయి. రక్తపోటు (బీపీ)ను అద్భుతంగా నియంత్రిస్తుంది. పుట్టగొడుగుల్లోని కాపర్ ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి, వాటి సామర్థ్యం పెంచి మెదడు, ఇతర కండరాలకు ఆక్సిజన్ అందించడానికి దోహదపడతాయి.
అన్నీ తినేవి కావు..
ఫంగీ జాతికి చెందిన మొక్కల్నే పుట్టగొడుగులుగా పిలుస్తారు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. అన్ని రకాల పుట్టగొడుగులు తినడానికి ఉపయోగపడవు. కొన్ని రకాలు విషపూరితంగా ఉంటాయి. వీటి గురించి తెలిసిన వారు మాత్రమే అడవుల నుంచి సేకరించాల్సి ఉంటుంది. ఆదివాసీలకు మాత్రం ఏవి తినాలో, ఏవి తినకూడదో తెలుసు.
ఇష్టంగా తింటాం
ఆదివాసీలకు.. అడవికి ఉన్న సంబంధానికి ప్రతీకలు పుట్టగొడుగులు. వాటిని ఎంతో ఇష్టంగా తింటాం. ఆదివాసీల ఆహార నియమాలపై జరిగిన పరిశోధనలో.. పుట్టగొడుగుల ప్రాధాన్యం తెలుసుకుని ఆధునిక ప్రజలు ఆహారంలో ఉపయోగిస్తున్నారు. పంటగా సాగు చేసి పండిస్తున్నారు.
– పుల్సం సాంబయ్య,
విలువైన ప్రొటీన్లు పుష్కలం
పుట్టగొడుగుల్లో ఎంతో విలువైన ప్రొటీన్లు, విటమిన్లు ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. అనుదినం ఆహారంలో పుట్టగొడుగులను చేర్చుకోవడం ఎంతో మంచిది. గర్భిణులకు చాలా ఉపయోగం.
జనప్రేమి వనప్రేమి అవార్డు గ్రహీత, ఉపాధ్యాయుడు.
– డాక్టర్ రవీందర్‌నాయక్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మహబూబాబాద్ మెడికల్ కళాశాల
(చదవండి: గుండెదడ ఎందుకొస్తుంది..? ఆరోగ్యానికి ప్రమాదకరమా..?)