
నిజానికి గుండెదడ ఒక జబ్బు కాదు. కాకతే కొన్ని సాధారణ లేదా తీవ్రమైన గుండె సమస్యల తాలూకు ఓ లక్షణంగా భావించవచ్చు. ఒక్కోసారి గుండె దడదడలాడుతున్న విషయం బాధితులకు ఏ ఉపకరణం లేదా ఏ టెస్ట్ సహాయం లేకుండానే తెలిసిపోతుంటుంది. ఆందోళనతో కూడా ఇలా జరగడానికి అవకాశం ఉంది. అయితే అరుదుగా కొన్ని సందర్భాల్లో మాత్రం తీవ్రమైన గుండె జబ్బులకు అదో సూచన కావచ్చు. అందుకే గుండెదడ గురించి అవగాహన కలిగి ఉండటం అవసరం. అలాంటి అవగాహన కల్పించేందుకే ఈ కథనం.
గుండెదడను వైద్యపరిభాషలో పాల్పిటేషన్ అంటారు. చాలామంది జీవితకాలంలో ఏదో ఒకసారి అనుభవించే సాధారణ లక్షణం ఇది. చాలా సందర్భాల్లో ఏదో ఒక మానసిక ఆందోళన లేదా ఉద్విగ్నత వంటి కారణాలతో కనిపించే అత్యంత మామూలు సమస్య ఇది. చాలా వరకు తీవ్రమైన సమస్య కాకపోయేందుకే అవకాశాలెక్కువ. కాకపోతే చాలా అరుదుగానే ఏదైనా తీవ్రమైన గుండె సమస్యకు సూచన అయ్యేందుకూ అవకాశాలు లేకపోలేదు.
పాల్పిటేషన్స్ అంటే...?
గుండె నిత్యం స్పందిస్తున్నప్పటికీ... అది కొట్టుకుంటున్న తీరు సాధారణంగా మన అనుభవంలోకి రాదు. కానీ కొన్నిసార్లు వేగంగా స్పందించే ఆ స్పందనలు వ్యక్తుల అనుభవంలోకి వస్తాయి. కొట్టుకుంటున్న వేగాన్ని బట్టి వాటిని ఇంగ్లిష్‌లో సాధారణంగా ఫ్లట్టరింగ్, పౌండింగ్ లేదా రేసింగ్‌గా చెబుతుంటారు. కొన్నిసార్లు వ్యక్తులు వేగంగా పరిగెత్తడం, తీవ్రమైన భావోద్వేగాలకు గురికావడం, ఉద్విగ్నతకూ, తీవ్రమైన ఆందోళనకూ గురికావడం, అలాగే తీవ్రమైన జ్వరం లేదా గర్భధారణ సమయంలో గుండెదడ (పాల్పిటేషన్స్) అనుభవంలోకి వచ్చేందుకు అవకాశాలెక్కువ.
అలాగే కొన్ని సందర్భాల్లో ఎక్కువసార్లు కాఫీ తాగడం, కొన్ని సందర్భాల్లో పొగతాగడం, మద్యం తీసుకోవడం లేదా నిద్రలేమి వంటి జీవనశైలి అలవాట్లు కూడా పాల్పిటేషన్స్‌కు దారితీయవచ్చు. సాధారణ జీవక్రియల్లో భాగంగానే ఇలా గుండెదడ రావచ్చు. అలాంటప్పుడు గుండెదడ పెద్దగా హానికరం కాదు.
మరి పట్టించుకోవాల్సిందెప్పుడంటే...
గుండెదడ (పాల్పిటేషన్ ) అకస్మాత్తుగా స్పష్టమైన కారణం లేకుండా వచ్చినప్పడు.
తలతిరుగుతుండటం, ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, స్పృహ తప్పడం వంటివి జరిగినప్పుడు.
గుండె లయ తప్పడం (అబ్‌నార్మల్ రిథమ్ లేదా అరిథ్మియా) వంటి లక్షణాలు కనిపించినప్పుడు...
పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు దాన్ని కొంత సీరియస్‌గా పరిగణించాల్సి ఉంటుంది. ఇక్కడ గుండె లయతప్పడంలో ఒక ప్రత్యేకమైన రకం గురించి చెప్పుకోవాలి. గుండె లయబద్ధంగా స్పందించడానికి వీలుగా సయనో ఏట్రియల్ నోడ్ అనే చోట ఎలక్ట్రిక్ సంకేతాలు వెలువడుతుంటాయి. వీటి కారణంగానే గుండె ఒకే రకమైన లయతో స్పందిస్తుంటుంది. ఒకవేళ అలా కాకుండా ఆ ఎలక్ట్రిక్ స్పందనలు అసాధారణంగా ఎక్కడపడితే అక్కడ (అంటే నిర్దిష్టమైన ట్రాక్‌లో కాకుండా ఒకదానిని మరొకటి బైపాస్ చేస్తూ) వెలువడుతున్నప్పుడు... గుండె తన నిర్దిష్టమైన లయతో... లయబద్ధంగా కాకుండా ఎలా పడితే అలా కొట్టుకుంటూ ఉండేందుకు అవకాశముంది.
దాంతో గుండె రిథమ్ దెబ్బతినడం వల్ల అరిథ్మియా వచ్చే అవకాశముంది. అయితే ఇలా జరిగినప్పుడు అదృష్టవశాత్తు శస్త్రచికిత్స వంటి సంక్లిష్టమైన ప్రక్రియలు అవసరం లేకుండానే ‘రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ (ఆర్‌ఎఫ్‌ఏ)’ అని పిలిచే రక్తనాళాల్లోకి పైప్‌ను పంపే క్యాథెటర్ ప్రోసిజర్స్‌తోనే ‘ఎలక్ట్రో ఫిజియాలిస్ట్‌లు’ అనే నిపుణులు ఈ సమస్యను చక్కదిద్దే అవకాశం ఉంది.
గుండెదడతో ఎవరెవరికి ముప్పు...?
స్థూలకాయం (ఒబేసిటీ), అధిక రక్తపోటు (హైబీపీ), డయాబెటిస్ లేదా గుండె జబ్బులున్నవారు గుండెదడ లక్షణాన్ని కాస్త సీరియస్‌గానే పరిగణించాలి. అందునా మరీ ముఖ్యంగా వెంట్రిక్యులార్ ట్యాకికార్డియా అనే ‘అరిథ్మియా’ (గుండె లయ తప్పడం) లేదా ఆర్టీరియల్ ఫిబ్రిలేషన్ వంటి సమస్యలు ఉన్నవారిలో గుండెదడ ఒక్కోసారి ప్రమాదకరమైన పరిస్థితికి తీసుకెళ్లి కార్డియాక్ అరెస్ట్ లేదా పక్షవాతం (స్ట్రోక్) వంటి ప్రాణహాని కలిగించేంత తీవ్రమైన ముప్పునకు కారణమయ్యే అవకాశాలుంటాయి.
అందుకే ఇక్కడ పేర్కొన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవారు గుండెదడ విషయంలో ఒకింత జాగ్రత్తగా ఉండటం అవసరం. ఇక మరో రకమైన ముప్పు ఎవరిలోనంటే... కొందరి కుటుంబాల్లో అకస్మాత్తుగా గుండె΄ోటు వచ్చి మరణించిన (సడన్ కార్డియాక్ డెత్) దాఖలాలు ఉన్న వైద్య చరిత్ర గలవారైతే... అలాంటి కుటుంబాల్లోని వ్యక్తులు గుండెదడను అంత తేలిగ్గా తీసుకోకూడదు.
ఇక కార్డియో మయోపతి (గుండె కండరానికి సంబంధించిన ఆరోగ్య సమస్య) లేదా వంశపారంపర్యంగా గుండె ఎలక్ట్రిక్ స్పందనల్లో తేడాలు కనిపించే ఛానెలోపతీస్) వంటి వారిలోగుండెదడ ముప్పుగా పరిణమించే అవకాశాలు ఉంటాయి. ఇలాంటివారు ఎలక్ట్రోఫిజియాలజిస్టుల ఆధ్వర్యంలో తరచూ వైద్యపరీక్షలు చేయించుకుంటూ ఉండటం మంచిది.
ఆధునిక కార్డియాక్ ఎలెక్ట్రోఫిజియాలజీ భూమిక...
కార్డియాక్ ఎలెక్ట్రోఫిజియాలజీ అనేది గుండె లయ (హార్ట్ రిథమ్) సమస్యలను గుర్తించడం, నిర్ధారణలతో పాటు ఆ సమస్యలకు తగిన చికిత్స అందించడానికి రూపొందిన గుండె చికిత్స విభాగం. గుండె సమస్యల నిర్ధారణ కోసం ఈసీజీ, హోల్టర్ మానిటరింగ్, ఎలక్ట్రో ఫిజియోలాజికల్ స్టడీస్, అత్యాధునిక ఇమేజింగ్ వంటి ప్రక్రియల సహాయం తీసుకుంటారు. వాటి సాయంతో ఎలక్ట్రోఫిజియాలజిస్టులు ఈ తరహా సమస్యలను గుర్తిస్తారు.
ఇక అత్యధికంగా ముప్పు ఉన్న బాధితులకు ముందుగానే ప్రమాదాలను నివారించేందుకు దేహంలో అమర్చే ఇంప్లాంటబుల్ కార్డియో–వెర్టర్ డీఫిబ్రిలేటర్స్ (ఐసీడీ) వంటి ఉపకరణాలను అమర్చుతారు. ఈ ఉపకరణాలు గుండె లయతప్పినప్పుడుల్లా చిన్న ఎలక్ట్రిక్ షాక్‌ను వెలువరించడం ద్వారా గుండె లయను మళ్లీ క్రమబద్ధీకరిస్తాయి. దాంతో గుండెనొటు వంటి ప్రాణాంతక పరిస్థితులు నివారితమవుతాయి.
చివరగా... సాధారణగా గుండెదడ అన్నది అంత హానికరం కాదనే చెప్పవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే ముప్పు ఉన్నవారిలో అవి కొంత ప్రమాద హెచ్చరికలు (వార్నింగ్ సిగ్నల్స్)గా పరిగణించవచ్చు. కాబట్టి ఆ హెచ్చరికల ఆధారంగా వైద్యులను సంప్రదించడం వల్ల ఒక రకంగా గుండెదడ మేలే చేస్తుందని కూడా చెప్పవచ్చు.
ఇప్పుడు అందుబాటులో ఉన్న వైద్య ప్రక్రియలూ, ఆధునిక చికిత్సల వల్ల ప్రమాదాలను నివారించుకునేందుకు, చికిత్సతో నయం చేసుకునేందుకు వీలుంది కాబట్టి ఆందోళన అక్కర్లేదు. కాకతే తగిన జాగ్రత్త మాత్రం అవసరమంటూ గుండెదడ ఓ వార్నింగ్ బెల్‌లా పనిచేస్తుందని చెప్పవచ్చు.
డాక్టర్ ఏ సురేశ్, సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్, హైదరాబాద్
(చదవండి: బొడ్డు తాడుని ఆలస్యంగా ఎందుకు కట్ చేస్తారంటే..?)