ప్లాస్టిక్‌ను తినేసే పుట్టగొడుగులు | Eating Mushrooms Magic: Fantastic Fungi Fight Plastic Waste | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ను తినేసే పుట్టగొడుగులు

Jul 20 2025 3:43 PM | Updated on Jul 20 2025 3:43 PM

Eating Mushrooms Magic: Fantastic Fungi Fight Plastic Waste

ప్లాస్టిక్‌ తెచ్చిపెట్టే అనర్థాలు ప్రపంచానికి అనుభవపూర్వకంగా తెలుసు. అయినా, ప్రపంచంలో ప్లాస్టిక్‌ ఉత్పాదనా తగ్గడం లేదు; ప్లాస్టిక్‌ వినియోగమూ తగ్గడం లేదు. ప్లాస్టిక్‌ను నేలమీద పడేస్తే, అది ఎన్నేళ్లు గడిచినా మట్టిలో కలిసిపోదు. నదుల్లోను, సముద్రాల్లోను పడేస్తే, నీటిలో కరిగిపోదు. ప్లాస్టిక్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా నేల, నీరు కలుషితమవుతున్నాయి. ప్లాస్టిక్‌ సమస్యను అరికట్టాలంటే, ప్లాస్టిక్‌ ఉత్పాదన, వినియోగం తగ్గాలని ఇప్పటివరకు చాలామంది పర్యావరణవేత్తలు చెబుతూ వస్తున్నారు. అయితే, ప్లాస్టిక్‌ సమస్యకు ప్రకృతిలోనే పరిష్కారం ఉంది. కొన్నిరకాల పుట్టగొడుగులకు ప్లాస్టిక్‌ను తినేసే శక్తి ఉంది. ప్లాస్టిక్‌ పేరుకుపోయిన ప్రదేశాల్లో ఆ పుట్టగొడుగులను పెంచితే చాలు, ప్లాస్టిక్‌ సమస్య ఇట్టే పరిష్కారమవుతుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్లాస్టిక్‌ను తినేసే పుట్టగొడుగుల గురించి తెలుసుకుందాం.

పెస్టలోటియాప్సిస్‌ మైక్రోస్పోరా
అమెజాన్‌ అడవుల్లో కనిపించే పుట్టగొడుగులు ఇవి. తొలిసారిగా వీటిని 1880లో శాస్త్రవేత్తలు గుర్తించారు. బాగా వానలు కురిసే దట్టమైన అడవుల్లో భారీ వృక్షాల కాండాలను, కొమ్మలను ఆశ్రయించుకుని, ఈ పుట్టగొడుగులు పెరుగుతాయి. ఇవి తినడానికి పనికిరావు. ఈ పుట్టగొడుగులు సునాయాసంగా ప్లాస్టిక్‌ను తినేస్తాయి. వీటికి గల ప్లాస్టిక్‌ను తినేసే లక్షణాన్ని శాస్త్రవేత్తలు 2010లో గుర్తించారు. 

ప్లాస్టిక్‌లో కీలకంగా ఉండే ‘పాలీయురెథీన్‌’ అనే పాలిమర్‌ అణువులను ఈ పుట్టగొడుగులు చాలా సులువుగా విచ్ఛిత్తి చేసేస్తాయి. ఈ ప్రక్రియ వల్ల పర్యావరణానికి ప్లాస్టిక్‌ ముప్పు తప్పుతుంది. ఈ పుట్టగొడుగుల లక్షణాలు, ప్లాస్టిక్‌లోని పాలిమర్‌ అణువులను విచ్ఛిత్తి చేయడంలో వాటి శక్తిసామర్థ్యాలపై శాస్త్రవేత్తలు మరింతగా పరిశోధనలు జరుపుతున్నారు. 

ఆయిస్టర్‌ మష్‌రూమ్‌
ఉష్ణమండల ప్రాంతాల్లోను, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లోను ఈ పుట్టగొడుగులు విరివిగా కనిపిస్తాయి. తేమ వాతావరణంలో ఇవి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి. చెట్ల కాండాలను, కొమ్మలను అంటిపెట్టుకుని, విసనికర్ర ఆకారంలో పెరిగే ఈ పుట్టగొడుగులు ఆహారంగా కూడా పనికొస్తాయి. వీటిని ఆహారంగానే కాకుండా, కృత్రిమ తోలు తయారీ కోసం, ఫర్నిచర్‌ తయారీ కోసం, ఇటుకల తయారీ కోసం కూడా వినియోగిస్తుంటారు. 

ప్లాస్టిక్‌లోని పాలిమర్‌ కణాలను ఈ పుట్టగొడులు విచ్ఛితి చేయగలవనే విషయాన్ని యేల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తొలిసారిగా 2011లో గుర్తించారు. ఆక్సిజన్‌ ఉన్న పరిస్థితుల్లోనైనా, ఆక్సిజన్‌ లేని పరిస్థితుల్లోనైనా ఈ పుట్టగొడుగులు ప్లాస్టిక్‌లోని పాలిమర్‌ కణాలను సమర్థంగా విచ్ఛిత్తి చేయగలవని వారి పరిశోధనల్లో తేలింది. ఈ పుట్టగొడుల్లో ఉండే ‘ల్యాకేస్‌’ అనే ఎంజైమ్‌కు ప్లాస్టిక్‌లోని పాలిమర్‌ కణాలను విచ్ఛిత్తి చేయగల శక్తి ఉన్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. వీటిపై వారు మరింతగా పరిశోధనలు సాగిస్తున్నారు.

ఆస్పెర్‌గిలస్‌ ట్యూబిన్‌జెన్సిస్‌
పుట్టగొడుగుల పరిమాణంలో పెరగదు గాని, ఇది కూడా ఒకరకం ఫంగస్‌. ఈ ఫంగస్‌ పెరిగిన చోట ముదురు గోధుమ రంగు లేదా ముదురు బూడిద రంగులో దట్టంగా పేరుకుని కనిపిస్తుంది. ఈ ఫంగస్‌ పరిమాణం ఒక్కొక్కటి 3 నుంచి 5 మైక్రాన్ల వ్యాసం వరకు ఉంటుంది. దీనిని శాస్త్రవేత్తలు తొలిసారిగా 1934లో గుర్తించారు. ఇది ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతుంది. 

అల్ట్రావయొలెట్‌ కిరణాలను తట్టుకుని మరీ ఈ ఫంగస్‌ బతకగలదు. తేమ వాతావరణంలో ఉష్ణోగ్రతలు 21 డిగ్రీల నుంచి 36 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉన్నట్లయితే, ఈ ఫంగస్‌ విపరీతంగా పెరుగుతుంది. ఈ ఫంగస్‌ను ఔషధ తయారీ పరిశ్రమల్లో చాలాకాలంగా వాడుతున్నారు. ఎమిలేజ్, ఫైటేజ్, యాసిడ్‌ ఫాస్ఫేటేజ్, జైలానేజ్‌ వంటి రకరకాల ఎంజైమ్‌ల తయారీ కోసం ఈ ఫంగస్‌ను వినియోగిస్తారు. చైనా, పాకిస్తాన్‌ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో 2017లో ఈ ఫంగస్‌కు ప్లాస్టిక్‌ వ్యర్థాలను నాశనం చేసే శక్తి ఉన్నట్లు వెల్లడైంది. 

పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో ఒక చెత్తకుప్పపై పెరిగిన ఈ ఫంగస్‌ను శాస్త్రవేత్తలు గమనించారు. చెత్తలోని ప్లాస్టిక్‌ పదార్థాలను ఈ ఫంగస్‌ తినేస్తూ ఉండటాన్ని వారు గుర్తించారు. దీనిపై అంతర్జాతీయంగా శాస్త్రవేత్తలు మరింతగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు.

ఆస్పెర్‌గిలస్‌ టెరోస్‌
ఇది ప్రపంచవ్యాప్తంగా కనిపించే ఫంగస్‌. శీతోష్ణ స్థితులకు అతీతంగా, కాస్తంత తేమ ఉన్న చోటల్లా ఈ ఫంగస్‌ పెరుగుతుంది. గుండ్రంగా ఉండే ఈ ఫంగస్‌ కణాలు ఒక్కొక్కటి దాదాపు 2 మైక్రాన్ల వ్యాసంలో ఉంటాయి. ఈ కణాలు గాలిలో తేలికగా కలిసిపోతాయి. తేమ ఉన్న ఉపరితలానికి చేరుకున్నప్పుడు వేగంగా పెరుగుతాయి. బాగా పెరిగినప్పుడు ఆహార పదార్థాల మీద, కట్టెల మీద దట్టంగా బూజు పేరుకున్నట్లుగా ఈ ఫంగస్‌ కనిపిస్తుంది. 

ఈ ఫంగస్‌ మనుషులకు, పశువులకు సోకినప్పుడు ఇన్ఫెక్షన్లు కలిగిస్తుంది. పంటలను ఆశించినప్పుడు పంటనష్టం కలిగిస్తుంది. ఈ ఫంగస్‌ తక్కువ సాంద్రత కలిగిన ప్లాస్టిక్‌ కణాలను నాశనం చేయగలదని 2023లో జరిపిన పరిశోధనల్లో ఆస్ట్రేలియన్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిపై వారు మరింత విస్తృతంగా పరిశోధనలు సాగిస్తున్నారు.

ప్లాస్టిక్‌ విచ్ఛిత్తి కోసం ఈ రకాల ఫంగస్‌ను వాడుకునేటట్లయితే, ప్రపంచానికి ప్లాస్టిక్‌ కాలుష్యం నుంచి ముప్పు తప్పుతుందని పర్యావరణవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు పోగుపడే ప్రతిచోటా ఈ రకాల ఫంగస్‌ను పెంచేటట్లయితే, కాలుష్యాన్ని నివారించవచ్చునని చెబుతున్నారు.

(చదవండి: జైలు శిక్షనే శిక్షణగా మార్చుకున్న జీనియస్‌ ఖైదీ..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement