
జైలు గోడల మధ్య మగ్గిపోతున్న కాలంలోనే ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు, పోరాట నాయకులు అద్భుతమైన రచనలు చేసిన సంగతి చాలామందికి తెలుసు. అయితే, అమెరికాలో జైలు గోడల మధ్య శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీ స్వయంకృషితో గణిత సాధన చేస్తూ, ప్రపంచ గణిత మేధావుల దృష్టిని ఆకట్టుకుంటున్నాడు. దృఢసంకల్పం ఉండాలే గాని, అనుకున్నది సాధించడానికి జైలుగోడలు ఆటంకం కాదని నిరూపిస్తున్నాడు.
ఆ ఖైదీ పేరు క్రిస్టఫర్ హేవెన్స్. హత్య కేసులో అతడికి 2010లో పాతికేళ్ల జైలు శిక్ష పడింది. అప్పటి నుంచి జైలులో ఒంటరి గదిలో ఉంటూ లెక్కల లోకంలో లోతుగా మునిగిపోయాడు. జైలు గదిలో చిన్న పజిల్స్‌తో మొదలైన ప్రయాణం, పెద్ద గణిత సూత్రాల వరకు వెళ్లింది. అతడు ఉండే జైలు గదిలో కంప్యూటర్ లేదు, ఇంటర్నెట్ లేదు, చేతిలో పుస్తకం, మదిలో లక్ష్యాలు తప్ప. అలా లెక్కలు వేసి వేసి నోటుబుక్కులు, జైలు గోడలు నింపేశాడు.
ఏకంగా ప్రపంచానికి కొత్త గణిత రహస్యాన్ని చూపించి, గణిత పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. క్రిస్టఫర్ ప్రయాణం అంతటితోనే ఆగలేదు. ‘నేను మాత్రమే కాదు, అందరూ గణితం నేర్చుకోవాల్సిందే!’అనే తపనతో, జైల్లో నుంచే ఖైదీల కోసం ‘ప్రిజన్ మ్యాథ్స్ ప్రాజెక్టు’ ప్రారంభించాడు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కింద అమెరికాలోని దాదాపు ముప్పై రాష్ట్రాల్లో వందలాది ఖైదీలు గణితంలో మునిగి తేలుతున్నారు. వారిని చూస్తే, నిజంగా జైలులో ఉన్నారా, లేక ఏదైనా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది.
మరో కొత్త ప్రయత్నం
ఇంతలోనే ఇంకో కొత్త ప్రయత్నం. ‘కంప్యూటర్ లేని ఖైదీలు గణితంలో సంక్లిష్టమైన లెక్కలు ఎలా చేయాలి?’ అనే ప్రశ్న తలెత్తింది. అప్పుడే హేవెన్స్‌కి తట్టిన ఆలోచన. ‘ఈమెయిలు ద్వారా కోడింగ్’ ఈ పద్ధతిలో కోడ్ లేఖలా పంపిస్తారు, ఫలితాలు తిరిగి వస్తాయి. ఈ విధానంతో జైలులో ఉండే ఖైదీ ఇప్పుడు మేఘగణన చేస్తున్నాడు.
ప్రస్తుతం క్రిస్టఫర్, జర్మనీకి చెందిన గణిత నిపుణుడితో కలిసి ‘జోప్’ అనే గణిత శ్రేణిపై పరిశోధన చేస్తున్నాడు. ఈ విషయమై హేవెన్స్ మాట్లాడుతూ, ‘న్యాయం అంటే శిక్ష కాదు, మార్పు. లెక్కలతో నా జీవితాన్ని తిరిగి రాసుకున్నా’ అని చెప్పాడు.
(చదవండి: పెయిన్ కిల్లర్స్ వాడితే..ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయకూడదా..?)