చాలామంది పిల్లలు ‘అనగనగా ఒక రాజు’ లాంటి కథలు చెబితే ఆసక్తిగా వింటారు. సైన్స్, మ్యాథ్స్ విషయాలు చెప్పబోతే మాత్రం ముఖం అటువైపు తిప్పుకుంటారు.
అలాంటి వారి కోసం ‘స్టెమ్ మాన్‌స్టర్’ను ప్రారంభించింది డా. సోనాలి దాస్ గుప్తా. కథలు ఎలాగైతే ఆసక్తిగా వింటారో అంతే ఆసక్తితో సైన్స్ పాఠాలు వినేలా ‘స్టెమ్ మాన్‌స్టర్’ను డిజైన్ చేసింది సోనాలి.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దిల్లీలో భౌతిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన సోనాలి స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం)కు సంబంధించిన సంక్లిష్టమైన అంశాలు పిల్లలకు సులభంగా అర్థం చేయించడానికి ‘స్టెమ్ మాన్‌స్టర్’ మొదలుపెట్టింది. సైన్స్ సిద్ధాంతాలను వివరించడానికి ఎన్నో పరికరాలు, బొమ్మలు తయారు చేసింది. జటిలమైన సైన్స్ విషయాలను అర్థం చేసుకోవడంలో ఇవి విద్యార్థులకు బాగా ఉపయోగపడుతున్నాయి.
‘మన పాఠశాలలు సైన్స్‌కు సంబంధించి నిర్వచనాలకే పరిమితం అవుతున్నాయి. నేను ప్రపంచంలోని కొన్ని అత్యున్నత ప్రయోగశాలలలో పనిచేశాను. సైన్స్‌కు సంబంధించి జటిలమైన విషయాలను పిల్లలకు సులభంగా ఎలా వివరిస్తారో చూశాను. మన పాఠ్యాంశాలు అత్యున్నతమైనవిగా నేను భావిస్తున్నాను. కాని వాటిని మనం పిల్లలకు పరిచయం చేసే విధానంలో సమగ్ర మార్పు అవసరం. ఆ మార్పు కోసమే...స్టెమ్ మాన్‌స్టర్’ అంటుంది సోనాలిదాస్ గుప్తా. ‘స్టెమ్‌మాన్‌స్టర్’ కోర్సులను జూమ్, ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు.


