సేమ్‌ జెండర్‌ అడ్డా

Peoples Choice Cafe Opens At Sainikpuri In Hyderabad - Sakshi

కొన్నాళ్ల కిందట. బెంగళూరులోని ఓ కేఫ్‌. చేతిలో చేయి వేసుకుని నిలబడ్డ సేమ్‌ జెండర్‌ జంటొకటి కేఫ్‌లో కాస్త మూలగా ఉన్న చోట టేబుల్‌ కోసం చూస్తోంది. టేబుల్‌ దొరికింది. వెళ్లి కూర్చోబోతుంటే  ‘‘మీరిలా కూర్చోడానికి మిగిలిన కస్టమర్స్‌ ఇష్టపడరు’’ అంటూ వాళ్లను కూర్చోనివ్వలేదు ఆ కేఫ్‌ సిబ్బంది. అంతేకాదు, వాళ్ల పట్ల చాలా అభ్యంతరకరంగా కూడా ప్రవర్తించారు. అప్పుడు అక్కడే ఉన్న హెప్సీబా స్మిత్‌ అనే అమ్మాయి వాళ్లను గమనించింది.

ఆ కేఫ్‌ సిబ్బంది తీరు ఆమెకు నచ్చలేదు. బాధేసింది కూడా. ఒకే జెండర్‌ వాళ్లిద్దరూ చేతిలో చేయి వేసుకుని వచ్చినంత మాత్రాన వాళ్లు స్వలింగ సంపర్కులన్నట్టేనా? ఒకవేళ అయితే రెస్టారెంట్‌ సిబ్బందికొచ్చిన ఇబ్బంది ఏంటీ? అనుకుంది. ఎల్‌జీబీటీ (లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్‌) వాళ్ల కోసమే ప్రత్యేకంగా ఓ చోటు కల్పిస్తే బాగుంటుంది కదా అని కూడా ఆలోచించింది బైసెక్సువల్‌ అయిన హెప్సీబా. ఆ నిశ్చయంతోనే అప్పటిదాకా ‘తాజ్‌ వెస్టెండ్‌’ లో బార్‌టెండర్‌గా చేస్తున్న పనిని వదిలేసి సొంతూరైన హైదరాబాద్‌కు వచ్చేసింది.

పీపుల్స్‌ చాయిస్‌
తన క్లాస్‌మేట్, స్నేహితుడూ అయిన  మహ్మద్‌ ఆదాంతో కలిసి తొమ్మిది నెలల కిందట ఎల్‌జీబీటీక్యూ కోసం సైనిక్‌పురిలో ‘పీపుల్స్‌ చాయిస్‌’ పేరుతో  కేఫ్‌ను స్థాపించింది. ఇది పెట్టడానికి రెండేళ్లు పట్టిందట! తన ఆలోచన గురించి మహ్మద్‌కు చెప్పినప్పుడు.. ‘‘ముందు ఖ్వీర్‌ కమ్యూనిటీ గురించి తెలుసుకోవాలి, వాళ్లతో స్నేహం చేసి వాళ్లలో కలిసిపోయి వాళ్ల అభిరుచులు, ఇష్టాయిష్టాలు తెలుసుకున్నాకే దానికి తగ్గట్టే కేఫ్‌ ప్లాన్‌ చేసుకోవాలి’’ అని సలహా ఇచ్చాడట ఆదాం.. హెప్సీబాకు. అతను చెప్పినట్టే చేసింది.

‘ఎల్‌జీబీటీ ప్రైడ్‌ మార్చ్‌’లో కూడా పాలుపంచుకున్నారిద్దరూ. ఇంత పరిశీలన, అధ్యయనం తర్వాతే ‘పీపుల్స్‌ చాయిస్‌’ కేఫ్‌కు రూపమిచ్చారు. వీళ్లిద్దరూ మంచి పాకశాస్త్ర ప్రవీణులు కూడా. కేఫ్‌లో వంటపనీ చేస్తుంటారు. పీపుల్స్‌ చాయిస్‌లో లైవ్‌ పెర్‌ఫార్మెన్స్‌తో పాటు ఈవెంట్స్‌నూ నిర్వహిస్తుంటారు. దేశంలో ఎల్‌జీబీటీక్యూ కోసం నడుస్తున్న అతి కొద్ది కేఫ్‌లలో ‘పీపుల్స్‌ చాయిస్‌’ ఒకటిగా.. వాళ్లకోసం ఉన్న అద్భుతమైన స్పేస్‌గా పేరు తెచ్చుకుంది.

చుట్టుపక్కల వాళ్లతో..!
అయితే ఈ ప్రయాణమంతా ఇక్కడ చెప్పుకున్నంత సాఫీగా సాగలేదు. కేఫ్‌ చుట్టుపక్కల వాళ్ల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. ‘‘ఒకసారైతే ఈవెంట్‌ జరుగుతుంటే చుట్టుపక్కల వాళ్లొచ్చి కేఫ్‌ ప్రాంగణంలో ఉన్న చెట్టు కొమ్మల్ని విరిచేశారు. సామాన్లను పడేసి.. చిందర వందర చేశారు. ‘‘పోలీస్‌ కంప్లయింట్‌ ఇచ్చాం. అదృష్టం ఏమంటే పోలీసులు మా వైపు నిలబడ్డారు. వెంటనే వాళ్లను పంపించి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఆ సంఘటన ఇప్పటికీ నన్ను వెంటాడుతూంటుంది’’ అంటుంది హెప్సీబా.  

చదువే పరిష్కారం
కొంతమంది స్నేహితులతో కలిసి పేదరికంలో ఉన్న ఎల్‌జీబీటీ వాళ్లకు చదువు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు హెప్సీబా, మహ్మద్‌. ‘‘మారుమూలన  ఉన్న వాళ్లు హైదరాబాద్‌కు రాలేరు. అందుకే మేమే తరచుగా అలాంటి వాళ్ల దగ్గరకు వెళ్లి చదువు చెప్తున్నాం. ‘‘ఈ రెండేళ్లలో నేనూ చాలా నేర్చుకున్నాను. ఈ భూమ్మీద గౌరవం అందుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. మనుషులందరూ సమానమే. ఆ సమానత్వాన్ని తెచ్చే, ఇచ్చే సాధనం చదువొక్కటే. దానికోసమే మా ఈ ప్రయత్నం’’అంటుంది హెప్సీబా.
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top