లొట్టలేయించే రొట్టెలు!

 An Old Man From The East Godavari District Bakes Bread On A Brick Oven - Sakshi

ఫుడ్‌ ప్రింట్స్‌

భోజన ప్రియులను విభిన్న రుచులతో నోరూరిస్తుంది తూర్పు గోదావరి జిల్లా. కాకినాడ కోటయ్య కాజా, తాపేశ్వరం మడత కాజా, ఆత్రేయపురం పూత రేకులు, పెరుమాళ్లపురం పాకం గారెలు... అటువంటిదే ముక్కామల మినపరొట్టె. ఈ రొట్టెను ఏభైఏళ్లుగా లొట్టలేసుకుని తింటున్నారు. అమలాపురానికి 15 కిలోమీటర్ల దూరంలో చిన్న పల్లెటూరు ముక్కామల. తయారీ, రుచి, అన్నింటిలో అక్కడ వండే మినపరొట్టె అద్భుతంగా ఉంటుంది. ముక్కామల పంట కాల్వ గట్టుపై ఓ పూరి పాక... అందులో ఓ చెక్క పెట్టె.

కూర్చునేందుకు ఇటుకలపై అమర్చిన రెండు నాపరాతి బల్లలు... పట్టుమని పది మంది కూడా కూర్చునేందుకు జాగా లేని ఆ పూరి పాకలో ఏడు పదుల నిండిన వృద్ధుడు ఇటుకల పొయ్యిపై మినప రొట్టెలు కాల్చుతూ ఉంటాడు. రోజూ సాయంత్రం మూడు గంటలైతే చాలు ఎక్కడికెక్కడి నుంచో ఈ కాకా హోటల్‌కు వచ్చేస్తారు. ఇక్కడి రొట్లెను అరిటాకులోనే అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం ముక్కామల గ్రామంలో అబ్బిరెడ్డి సత్యనారాయణ (తాత) కాకా హోటల్‌ అంటే కోనసీమ వ్యాప్తంగానే కాదు జిల్లాలోని పలు నగరాలు, పట్టణాలకు చెందిన వారికి కూడా సుపరిచితమే.

అన్నీ ప్రత్యేకతలే
తాత వేసే మినపరొట్టె చూసేందుకు సాదాసీదాగా ఉంటుంది. అయితే ఆ రొట్టెకు అన్నీ ప్రత్యేకతలే. దాని రుచి అమోఘం. కమ్మని వాసనతో ఆవిర్లు కక్కుతుంది. కొబ్బరి చట్నీ, సెనగ చట్నీలను నంజుకుంటూ రొట్టెను తింటుంటే మెత్తని కేక్‌ ముక్క నోట్లోకి జారుతున్నట్లే ఉంటుంది. మన కళ్ల ముందే సంప్రదాయ కట్టెల పొయ్యి మీద బాణలిలో కాల్చి వేడివేడి పొగలు కక్కుతున్న రొట్టెను అరటి ఆకులో ఇస్తారు. ఆరోగ్యం, అతి«థి మర్యాదలకు వేదికగా ఉంటుంది ఈ కాకా హోటల్‌. తాత వేసే రొట్టె తినేందుకు అంతస్తు, హోదా చూసుకోరు.

రొట్టెలను కాల్చేందుకు...
నేలపై కొన్ని ఇటుకలు పేర్చి దాని మీద ఓ రేకు, దాని మీద ఇటుకలతో రెండు పొయ్యిలు ఉంటాయి. ఆ రెండింటి మీద రెండు బాణలులు ఉంటాయి. వాటిలో రొట్టె పిండి వేస్తారు. పొయ్యిని కొబ్బరి డొక్కలతో మండిస్తారు. మొదటి పొయ్యి మీద ఉన్న బాణలిలో ఓ రొట్టె కాస్త దోరగా కాలిన తర్వాత, అదే రొట్టెను పక్కనున్న మరో పొయ్యిపై ఉన్న మూకుడులో వేసి, దాని మీద ఇనుప రేకు ఉంచి దాని మీద నిప్పుల సెగ ఉంచుతారు. కింద, పైన నిప్పులతో రొట్టె సమాంతరంగా కాలి కమ్మగా తయారవుతుంది. తాత వేసే రొట్టె రుచి వెనుక రహస్యం ఇదే. ఈ కాకా హోటల్‌ రోజూ మధ్యాన్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ ఉంటుంది. ప్రతిరోజూ దాదాపు 150 నుంచి 200 మంది ఈ కమ్మటి రొట్టె రుచి చూస్తారు. ఒకసారి ఈ రుచి చూసినవారు మళ్లీ ఇటుగా వచ్చినప్పుడు రొట్టె తినకుండా వెళ్లరు.

పావలాతో మొదలైన ప్రస్థానం
అబ్బిరెడ్డి తాత సొంతూరు ముక్కామల పక్కనే ఉన్న ఇరుసుమండ. రోజూ అక్కడ నుంచి ముక్కామల కాల్వ గట్టుకు వచ్చి, ఈ పాకలో కాకా హోటల్‌ నిర్వహిస్తున్నారు. 1969లో జీవనాధారం కోసం మినప రొట్టెలు వేయడం ప్రారంభించారు. పావలాతో ప్రారంభమైన రొట్టె ధర ఇప్పుడు ఇరవై రూపాయలు మాత్రమే. కస్టమర్‌ను తాత చిరునవ్వుతో ఆహ్వానించడంలో మర్యాద కనిపిస్తుంది.
– లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి,
రాజమహేంద్రవరం ఫోటోలు: సుబ్బారావు పరసా

తిన్న ప్రతి ఒక్కరూ బాగుందంటారు...   
నా హోటల్‌కు వచ్చి మినపరొట్టె తిని వెళ్లే వారంతా ‘రొట్టె చాలా బాగుంది, చట్నీల కాంబినేషన్‌ బాగుంది’ అని చెబుతుంటే ఆనందంగా ఉంటుంది. 50 ఏళ్లుగా  రుచి అలాగే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. పిండి, ఉప్పు సమపాళ్లలో కలపడం, రొట్టెను కాల్చేటప్పుడు దోరగా ఉండేలా చూసుకోవటం వంటి కొన్ని కిటుకులు పాటించడం కారణంగానే ఇంత పేరు వచ్చిందనుకుంటాను.
– అబ్బిరెడ్డి తాత

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top