దేవుణ్ణి తప్ప ఆత్మ దేనినీ చూడదు

దేవుణ్ణి తప్ప ఆత్మ దేనినీ చూడదు


అజ్ఞానం అనే ఇనుప తలుపులు మన కళ్ళను మూసేస్తాయి. కానీ ప్రేమ ఆ తలుపులను తెరుస్తుంది. తలుపు తెరిచే శబ్దం నిద్రపోతున్న సుందరాంగిని మేల్కొల్పుతుంది. జ్ఞానప్రపంచంలో తలుపులు మూసి ఉండవు. వాటిని తట్టవలసిన అవసరం ఉండదు. అవి తెరిచే ఉంటాయి.

 

 ఒక జ్ఞాని దగ్గరకు ఒకతను వచ్చి ‘‘నేను దేవుడిని చూడటం సాధ్యమేనా?’’ అని అడిగాడు.

 ‘‘అనుమానం ఎందుకు? నిక్షేపంగా చూడవచ్చు’’ అన్నాడు జ్ఞాని.

 ‘‘కానీ నేను చూడలేకపోతున్నాను స్వామీ’’ అని బాధపడ్డాడు.

 ‘‘ఏం ఫరవాలేదు. నువ్వు చూడగలవు. కానీ నీ కళ్ళు ప్రస్తుతం మూసుకుపోయి ఉన్నాయి. కళ్ళు తెరు. దేవుడు అంతటా ఉన్నాడు’’ అన్నాడు జ్ఞాని.

 

ఆ జ్ఞాని చెప్పింది అక్షరాలా నిజం. మనం హృదయనేత్రాలు విప్పార్చి చూస్తే... దేవుడు ప్రతి పువ్వులోనూ ఉన్నాడు. నవ్వుతున్నాడు కూడా. ఒక్కొక్క సూర్యకిరణంతో వచ్చి ‘క్షేమమేగా’ అని పలకరిస్తుంటాడు కూడా. రాత్రి పూట నక్షత్రాలనే అక్షరాలుగా చేసుకుని ఉత్తరం కూడా రాస్తుంటాడు. మెరుపుతో సంతక ం చేస్తాడు. కోకిల అతని వేణువై ఉంది. కానీ మనమే అతనిని చూడలేకపోతున్నాం. వినలేకపోతున్నాం. ఇక్కడ అజ్ఞాన ం అడ్డుగోడై ఉంది. అయితే ఈ అడ్డుగోడను తొలగించడం ఎలా? ‘జ్ఞానమే ఈ గోడను తొలగించాలి’ అని అందరూ చెప్పేదే. కానీ కబీర్ మాత్రం ‘ప్రేమతోనే ఈ అడ్డుగోడను తొలగించవచ్చు’ అంటాడు.

 

అజ్ఞానం అనే ఇనుప తలుపులు మన కళ్ళను మూసేస్తాయి. కానీ ప్రేమ ఆ తలుపులను తెరుస్తుంది. నిద్రపోతున్న సుందరాంగిని మేల్కొల్పుతుంది. జ్ఞానప్రపంచంలో తలుపులు మూసి ఉండవు. వాటిని తట్టవలసిన అవసరం ఉండదు. అవి తెరిచే ఉంటాయి. అజ్ఞానమే ఆ తలుపును మూస్తోంది. అజ్ఞానానికి మూయడమే తెలుసు. దాని పనే అది. తలుపును మూసేసి దేవుడి దర్శనం కలగడం లేదని బాధపడటం సబబు కాదు. అయితే ఆ తలుపును ప్రేమ తెరుస్తుంది. ప్రేమ ఒక తాళంచెవి వంటిది. అది అన్ని తలుపులను తెరుస్తుంది. ప్రేమించి చూస్తే అదేంటో తెలుస్తుంది. తలుపులు తెరిచే శబ్దం వినిపిస్తుంది. అప్పటిదాకా చూడనిది కనిపిస్తుంది.

 

నిజానికి తలుపై అడ్డుగోడలా ఉన్నది మన అహంకారమే. తనకొక్కడికే అన్నీ తెలుసు అనే అహంకారాన్ని పెంచుతుంది. అప్పుడు తలుపు తెరచుకోదు. అంతేకాదు, తాళమూ వేస్తుంది. అయితే ఈ తలుపును ప్రేమ తెరుస్తుంది. ఎందుకంటే ప్రేమ అహంకారాన్ని రూపుమాపుతుంది. ప్రేమ అనేది ఒక అమ్మాయిని ప్రేమించడం మాత్రమే కాదు. ఎవరు ఎవరినైనా ప్రేమించవచ్చు. ఇష్టమున్న వారినే కాదు పగవారిని సైతం ప్రేమించవచ్చు. ప్రేమనేది తనను తాను మరచిపోవడం. తనను అర్పించుకోవడం. అది అహంకారాన్ని సమూలంగా నాశనం చేస్తుంది. అందుకే కబీర్ ‘ప్రేమ తలుపులు తెరుస్తుంది’ అన్నాడు. అంతేకాదు, తలుపు తెరిచే శబ్దం నిద్రపోతున్న సుందరిని మేల్కొల్పుతుంది. ఇంతకూ ఈ సుందరి ఎవరు? అది మన ఆత్మే. అది మనలో నిద్రపోతున్నది. ప్రేమే దానిని మేల్కొల్పే సుప్రభాతం.

 

ఓ దే శంలో ‘నిద్రపోతున్న యువరాణి’ అని ఒక రాజకుమారి కథ ఉంది. అందులో ఒక దేవత  శాపం వల్ల యువరాణి నిద్రపోతుంది. దాంతో అందరూ నిద్రపోతారు. యావత్ దేశం నిద్రావస్థలో ఉంటుంది. మరో దేశపు యువరాజు అక్కడికి వస్తాడు. యువరాణి పెదవులపై ముద్దు పెడతాడు. యువరాణి మేల్కొంటుంది. దేశమూ నిద్రావస్థ నుంచి లేస్తుంది. ఇది కూడా ఒక జ్ఞానకథనమే. ఆత్మే నిద్రపోతున్న యువరాణి. ప్రేమే యువరాజు ముద్దు. ఆత్మ మేల్కొంటే మనలో అన్నీ నిద్రావస్థ నుంచి లేచి  చైతన్యవంతమవుతాయి. కనులు తెరచుకుంటాయి. మన కళ్ళు దేవుడిని తప్ప మిగిలిన అన్నింటినీ చూస్తుంటాయి. ఆత్మ దేవుడిని తప్ప మరేదీ చూడదు.

 

- యామిజాల జగదీశ్

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top