నో ఫ్రూట్... నో డాక్టర్...!

నో ఫ్రూట్... నో డాక్టర్...!


హ్యూమర్ ప్లస్

 


ఈ మధ్య పత్రికల్లో ‘పండ్ల గూర్చి’ వచ్చిన వార్తలతో అదిరిపడ్డాడు భీమశంకరం. వెంటనే అన్ని పేపర్ కట్టింగులు పట్టుకుని బావగారైన బంగారం దగ్గరికి వెళ్లాడు. బలవంతాన బావచేత చదివించాడు. వెంటనే 10 లక్షల పాలసీకి ఆరోగ్య బీమా సంతకం పెట్టించాడు. పదిమంది మిత్రులకి ఫోన్ చేసి త్వరగా పాలసీలు చేయించండి అని పురమాయించాడు. పెళ్లాన్ని పిలిచి... ‘‘ఈ రోజు నుంచి పండ్లు, పండ్ల రసాలు బంద్.. నాక్కూడా అన్నం వండు... నాలిక్కి కారం తగిలి ఎన్నాళ్లయిందో’’ అని వాపోయాడు. భీమశంక రం కలిసిన వాళ్లందరూ పాలసీలు తీసుకుంటామన్నారు. ఇంటికి వెళ్లి భార్య చింతామణికి చెప్పాడు. మనకిక చింతలు లేవని. గురకపెట్టి పడుకున్నాడు.

   

వీధి సందులో అప్పుడే ప్రాక్టీసు పెట్టిన కుర్ర డాక్టర్ డాంబిక్... క్లినిక్కి కొత్త హంగులు అమర్చాడు... పాత బోర్డులు మార్చేశాడు. ‘ఆపిల్స్ తిన్నారా... మమ్మల్ని సంప్రదించండి’, ‘పండ్లు కొంటే... ఫ్రిజ్ కరెంట్ వేస్ట్’, ‘పండ్లు తింటే... మీ ఆరోగ్యానికి టెస్ట్’..  ప్రాక్టీసు పుంజుకుంది.

 పక్కవీధిలో ఆయుర్వేదం డాక్టర్ ‘పది పండ్ల కన్నా పచ్చి గడ్డి నయం’ అంటూ ఏ పండు ద్వారా అనారోగ్యం ఏర్పడ్డా ఒక ఆకు పసరుతో నయం చేస్తానని ఛాలెంజి చేస్తున్నాడు. బడి పక్కన హోమియోపతి డాక్టర్ ఊరుకోలేదు. ఎంత పెద్ద పండు తిన్నా ఫరవాలేదు... చిన్న మాత్రతో రోగం పోగొడ్తానంటున్నాడు. మసీదు పక్కన యునానీ డాక్టర్ ఏవో కొత్త మందులు నూరడం మొదలు పెట్టాడు. ఊరంతా డాక్టర్లు మంచి ప్రాక్టీస్ చేసుకుంటున్నారు.



మందుల కంపెనీ వాళ్లు ఏ పండు తింటే ఏ జబ్బు వస్తుందో రీసెర్చ్ మొదలుపెట్టారు. సర్వేలు నిర్వహించారు... అరటి పండు తిని ఆరోగ్యం పోగొట్టుకున్నవారు 62 శాతం అని తేలింది. సంపన్న వర్గాలవారు ఆపిళ్లు, సపోటాలు తిని 89 శాతం ఆనారోగ్యం పాలయ్యారు. అన్నీ కొత్త జబ్బులు బయటపడ్డాయి. పండు పరిమాణానికి, జబ్బుకి తీవ్రతకి సంబంధం లేదన్నారు. మానసికంగానే కాకుండా అంగవైకల్యానికీ దారి తీస్తుందంటున్నారు. జబ్బులకి ఏ పేరు పెట్టాలో తెలియక పండు పేరు పెట్టాలని నిర్ణయించారు. సామాజిక స్పృహ గల కవులు, గాయకులు ఎన్నో పాటలు రాశారు... ‘పండ్లు తినకండోయ్ బాబు కళ్లు తెరవండోయ్’ అన్న పాట ప్రతి నోట నానుతోంది. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వెలిసాయ్, కౌన్సిలింగ్‌లు మొదలయ్యాయ్... ‘నోఫ్రూట్... నో డాక్టర్’ అని సందేశాలు మొదలు.



ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దూకింది. ప్రతి పండు మీద... ‘పండ్లు తినడం శ్రేయస్కరం కాదు... ఆరోగ్యానికి హానికరం’ అని ఒక ట్యాగ్ ఉండాలి అని ఆదేశాలు జారీ చేసింది. హోటలు వాళ్లు ‘నో ఫ్రూట్ సలాడ్’ బోర్డ్ పెట్టారు. కొంతమంది ‘మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది’ అని చేతులు దులుపుకున్నారు.. కొన్ని కార్యాలయాల్లో ‘నో ఫ్రూట్స్ ప్లీజ్’ అని అంటే కొంతమంది ‘నో ఫ్రూట్ జోన్’ అని బోర్డులు తగిలించారు. మున్సిపాలిటీ వాళ్లు ‘పండ్ల తొక్కలు’ పారవేయటానికి కొత్తవి, ప్రత్యేకమైనవి ‘డస్ట్‌బిన్’ అమర్చారు. వీటి వలన వెలువడే వ్యర్థపదార్థాలు, విష వాయువులను నియంత్రించటానికి ఒక సాంకేతిక సంస్థని స్థాపించారు. ఇందులో డాక్టర్లు కూడా ఉన్నారు. మానవహక్కుల పరిరక్షణ సంఘం... సంపన్నులు పుణ్యం పేరుతో యాచకులకు పండ్లు ఇవ్వడాన్ని తప్పు పట్టింది. పిల్లలకు, వృద్ధులకు, రోగులకు, గర్భిణీ స్త్రీలకు పండ్ల పంపకం సముచితం కాదని నొక్కి వక్కాణించారు.



దేవాలయాల్లో అర్చకులు భక్తులకి గాని, దేవుడికి గాని పండ్లని కానుకగా సమర్పించకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. పురోహితుల సంఘం ప్రజాహితం కోసం పండ్లకి బదులుగా ప్రత్యామ్నాయ వస్తువుల కోసం అన్వేషణ చేస్తోంది. గుళ్లలో పండ్ల రసాలతో అభిషేకాన్ని నిర్వహించటం నిలిపివేశారు. శిశుసంఘాలు, మహిళా సంఘాలు ఆడవారిని పండ్లతో పోల్చటాన్ని తీవ్రంగా అభ్యంతరం వెళ్లబుచ్చారు. అలాగే గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించేటప్పుడు ‘పండంటి పిల్లల్ని కనమ్మ’ అనటం సముచితం కాదన్నారు. చంటిపిల్లల్ని దబ్బపండుతో, పనసపండుతో పోల్చటం వారిని అవమానించటమేనని బాలల హక్కుల సంఘం అభిప్రాయపడింది. శరీర సౌందర్యం పరిరక్షణ / సంరక్షణ విషయంలో పండ్లని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఘన రూపంగా గాని, ద్రవ రూపంగా గాని వాడరాదని నిపుణులు తెలియజేస్తున్నారు.



రెవెన్యూ అధికారులు పండ్లు పండించే భూములు మీద భూమి శిస్తుని పదిరెట్లు పెంచారు. లారీలు, ఇతర ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు యజమానులు చార్జీలు రెట్టింపు చేశారు. రైల్వే సరకు రవాణా చార్జీలు రేట్లు పెంచారు. విమాన సర్వీసులు అదనంగా సుంకం చెల్లించమంటున్నారు, టోల్ గేటు రేట్లు రెండింతలు చేశారు. ఇటువంటి పండ్లు పండించే వారికి శిక్షగా ఆ పండ్లే వారిచేత తినిపించాలని న్యాయవాదుల సంఘం అభిప్రాయపడింది.



ఇదంతా స్వయంగా చూసిన నారదులవారు వెంటనే విష్ణుమూర్తిని కలిసి వేడుకున్నారు. అంతా ఆలకించిన తర్వాత లోకకల్యాణం కోసం సహజంగా పండిన పండు వాడాలని అలా కాని పక్షంలో ఇక నుంచి నోముల, వ్రతాలు, శుభ అశుభ కార్యాల్లో, దానాల్లో, ధర్మాల్లో, గుళ్లల్లో, సత్కారాల్లో పండ్ల పందేరం మానవచ్చని చెప్పారు. ప్రత్యామ్నాయంగా... ఆకులతో/గడ్డితో సరిపడవచ్చని కూడా సెలవిచ్చారు.

   

 భీమశంకరానికి మెలకువ వచ్చింది. ఉదయం 6 గంటలు అయింది. ఇదంతా నిజమని భయపడ్డాడు భీమశంకరం. ఇంతలో భీమశంకరం ముద్దుల చెల్లెలు పండరీ ప్రత్యక్షం అయింది.



 ‘‘పండూ ఎప్పుడు వచ్చావమ్మా’’...

 ‘‘ఇప్పుడే వచ్చానన్నయ్యా...ఈ రోజు 16 పండ్ల నోము చేసెయ్యమన్నారు. రేపే అమెరికా ప్రయాణం... 16 రకాల పండ్లు రకానికి 16 చొప్పున తెచ్చాను. వేరే గుమ్మం ఎక్కక్కర్లేదు. మన ఇంట్లోనే నోము. నేను తప్ప మీ అందరు ఎంచక్కా తినవచ్చు’’ అని గలగల చెప్పి లోపలికి వెళ్లింది. భీమశంకరం నోట్లో ‘పచ్చి వెలక్కాయ’ నిజంగానే పడింది.

 - కే.సీహెచ్.ఏ.వీ.ఎస్.ఎన్. మూర్తి

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top