
వయసు మీదపడ్డ తరువాత వచ్చే అనేక సమస్యలకు యువ రక్తం చెక్ పెడుతుందా? అవునంటున్నారు జెస్సీ కార్మాజిన్. అనడం మాత్రమే కాదు. అంబ్రోసియా మెడికల్ పేరుతో ఈ స్టాన్‌ఫర్డ్ వైద్యుడు ఓ కంపెనీ కూడా మొదలుపెట్టేవాడు. యువ దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ముసలివాళ్లకు ఎక్కించడం ఈ కంపెనీ పని. ఆశ్చర్యంగా ఉన్నా... ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. గత ఏడాది అంబ్రోసియా మెడికల్ కొంతమంది కార్యకర్తల సాయంతో ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. పూర్తి వివరాలేమిటన్నది కంపెనీ చెప్పకపోయినా.. మంచి ఫలితాలే వచ్చాయని అంటోంది.
తాము ఇప్పటికే దాదాపు 150 మందికి యువ రక్తం అందించామని కార్మాజిన్ తెలిపారు. రక్తం ఇచ్చిన వారి వయసు 18 – 25 మధ్య వయస్కులని... అందుకున్న వారు 35 నుంచి 92 మధ్య వయసు వారని వివరించారు. యువరక్తం అందుకున్న వయోవృద్ధుల్లో జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు నిద్ర, కండరాలశక్తి కూడా మెరుగుపడినట్లు గుర్తించామని వివరించారు. ఎలుకలపై గతంలో జరిగిన పరిశోధన కూడా యువరక్తం ఎక్కించుకోవడం ద్వారా ఆయుష్షు పెరుగుతుందని రుజువు చేసిందని చెప్పారు. అయితే కేవలం యువ రక్తం వల్లే ఈ ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతున్నాయా? లేక ఇతర కారణాలేవైనా ఉన్నాయా? అన్నది నిర్ధారించుకోవాలని కార్మిజిన్ వివరించారు.