కుటుంబ ఆరోగ్యం కోసం ప్రకృతి సేద్యంలోకి..

Nature Farming for Family Health and Zero Budget Natural Farming ... - Sakshi

ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మహిళా రైతు

రాళ్లు రప్పలున్న భూమిలో డ్రిప్‌తో పండ్ల తోటలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయల సాగు

పొలంలోనే సొంత ఖర్చుతో వాతావరణ కేంద్రం ఏర్పాటు

40 ఎకరాల వ్యవసాయ క్షేత్రం పర్యవేక్షణకు డ్రోన్‌ వినియోగం

చుట్టూతా ఉన్న బంధుమిత్రుల్లో అక్కడొకళ్లు, ఇక్కడొకళ్లు.. కేన్సర్‌తో అకాల మరణం పాలవుతుంటే తల్లడిల్లిన ఆ కుటుంబం మిన్నకుండిపోలేదు. దీనికి మూల కారణం రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారోత్పత్తులేనని గుర్తించింది. సేంద్రియ ఆహారోత్పత్తులు మార్కెట్‌లో అందుబాటులో లేకపోయినా సరిపెట్టుకోలేదు. వ్యవసాయం అంటే బొత్తిగా తెలియకపోయినా.. 40 ఎకరాల పొలం కొని సుమారు ఐదేళ్ల క్రితం నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు మహిళా రైతు గుళ్లపల్లి సుజాత. ప్రకృతి వ్యవసాయం గురించి మాటసాయం చేసే వాళ్లు కూడా దగ్గర్లో లేకపోయినా పట్టువీడలేదు. ప్రకృతి సేద్యం గురించి పుస్తకాల ద్వారా మౌలిక పరిజ్ఞానాన్ని పెంచుకొని, పాలేకర్‌ శిక్షణ ద్వారా పరిపుష్టం చేసుకున్నారు.

మొక్కవోని దీక్షతో ఆచరణ ద్వారా స్వానుభవం పొందారు. పండించుకున్న అమృతాహారాన్ని తాము తింటూ.. తమ బంధుమిత్రులకు కూడా ఆనందంగా అందిస్తున్నారు సుజాత. మెకానికల్‌ ఇంజనీరైన తన భర్త తోడ్పాటుతో సొంత ఖర్చుతో పొలంలో వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని వాతావరణానికి అనుగుణంగా పంటలు సాగు చేస్తున్నారు. డ్రోన్‌ను వినియోగిస్తున్నారు. వృత్తి వ్యాపారాలలో స్థిరపడి, ఆదాయ వనరులకు లోటు లేని మధ్యతరగతి ప్రజలు సైతం.. తమ వంతు బాధ్యతగా రసాయన రహిత ఆహారాన్ని పండించుకోవాల్సిన ఆవశ్యకతను ఆచరణాత్మకంగా చాటిచెబుతున్న సుజాతకు, సుస్థిర సేద్యమే జీవనంగా మలచుకున్న అక్క చెల్లెళ్లందరికీ మహిళా రైతుల దినోత్సవం సందర్భంగా అభినందనలు..

గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి గ్రానైటు ఎగుమతి వ్యాపారంలో అనుభవం గడించిన ప్రకాశం జిల్లా వాస్తవ్యురాలు గుళ్లపల్లి సుజాతకు వ్యవసాయంలో పూర్వానుభవం బొత్తిగా లేదు. అయినా, రసాయనిక అవశేషాల్లేని ఆహారాన్ని స్వయంగా పండించుకొని తినటం ద్వారా ఆరోగ్యదాయకమైన జీవనం సాగించాలన్న పట్టుదలతో ప్రకృతి వ్యవసాయంలో లోతుపాతులను అధ్యయనం చేశారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం పెదారకట్ల గ్రామ పరిధిలో రాళ్లు, రప్పలతో కూడిన 40 ఎకరాల భూమిని కొనుగోలు చేసి గత ఐదేళ్లుగా వ్యయప్రయాసలకోర్చి రాజీ ఎరుగని రీతిలో ప్రకృతి సేద్యం చేస్తున్నారు.
 

కేన్సర్‌ బెడదతో సేద్యం దిశగా కదలిక..
ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చిన తీరును సుజాత ఇలా వివరించారు.. ‘‘అప్పట్లో మేం చెన్నైలో ఉండేవాళ్లం. మా దగ్గరి బంధువుల్లో అనేక మంది వైద్యులు ఉన్నారు. ఆహారం గురించి, ఆరోగ్య రక్షణ గురించి చాలా జాగ్రత్తలు తీసుకునేవాళ్లం.. అయినా.. బంధుమిత్రుల్లో కొందరు కేన్సర్‌ తదితర దీర్ఘరోగాలతో అకాల మరణాల పాలయ్యే వారి సంఖ్య చూస్తుండగానే పెరిగిపోతుండటం మాకు చాలా ఆందోళన కలిగించింది. ఈ దుస్థితికి రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారమే మూల కారణమని గ్రహించాం.

ఐదేళ్ల క్రితం సేంద్రియ ఆహారోత్పత్తుల కోసం, సేంద్రియ కూరగాయల కోసం చెన్నై నగరమంతా గాలించినా.. దూరంగా ఎక్కడో ఒక చోట దొరికేవి. కూరగాయలు దొరికేవి కాదు. అటువంటి పరిస్థితుల్లో మనమే ఎందుకు ప్రకృతి వ్యవసాయం చేపట్టకూడదన్న ఆలోచనతో.. పెదారకట్ల గ్రామంలో పొలం కొన్నాం. పాలేకర్‌ పుస్తకాలతోపాటు వివిధ పత్రికలు చదువుతూ ప్రకృతి వ్యవసాయంలో మౌలిక విషయాలను ఒంటపట్టించుకున్నాను. రైతుకు అవసరమైన విషయాలన్నీ పుస్తకాల్లో దొరకవు కదా.. సుస్థిర వ్యవసాయ కేంద్రం వంటి స్వచ్ఛంద సంస్థలను, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ పరిజ్ఞానాన్ని పెంచుకున్నాను..’’ అన్నారామె.

ఏడాదిలో పూర్తి అవగాహన
పట్టుదల ఉంటే ప్రకృతి వ్యవసాయం నేర్చుకోవడానికి ఒక సంవత్సరం చాలని సుజాత స్వానుభవంతో చెబుతున్నారు.. ‘‘ఆవు పేడ, మూత్రం తొలి దశలో పొదిలిలోని గోశాల నుంచి సేకరించి తీసుకెళ్లి జీవామృతం, వివిధ ఔషధ మొక్కల ఆకులు అలములను సేకరించి కషాయాలను స్వయంగా నేనే తయారు చేశాను. దగ్గరుండి పంటలకు వాడించాను. మా వారు కోటేశ్వరరావు గారు ఆస్ట్రేలియా షిప్పింగ్‌ కంపెనీలో మెకానికల్‌ ఇంజనీర్‌గా పని చేస్తూ.. తనకు వీలైనప్పుడల్లా పొలం పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ప్రోత్సహించారు. తొలుత విద్యుత్‌ సదుపాయం లేకపోవడంతో సోలార్‌ పంపుతోనే డ్రిప్‌తో పంటలు పండించాము.

సొంతంగా అన్ని పనులూ చక్కబెట్టుకుంటూ, తెలియని విషయాలను వాళ్లనూ వీళ్లనూ అడిగి తెలుసుకుంటూ.. పాలేకర్‌ పుస్తకాల్లో చెప్పినవి తు.చ. తప్పకుండా ఆచరించే ప్రయత్నం చేయడంతో మొదటి సంవత్సరం పూర్తయ్యే నాటికే నాకు ప్రకృతి వ్యవసాయ మౌలిక భావనలపై అవగాహన, అనుభవం వచ్చాయి. మొదటి పంట మొక్కజొన్న అద్భుతంగా పండే సరికి ధైర్యం వచ్చింది. కినోవా కూడా పండించాను. అయితే, ప్రాసెసింగ్‌ సదుపాయాల్లేక చెన్నై తీసుకెళ్లి ప్రాసెస్‌ చేయించుకోవాల్సి వచ్చింది...’’ అంటూ తన ప్రకృతి వ్యవసాయ ప్రయాణాన్ని వివరించారామె. మా కుటుంబాలకు, సిబ్బంది కుటుంబాలకు సరిపడా అన్ని రకాల కూరగాయలను పొలంలో పండించుకొని తింటున్నాం. అందరమూ ఆరోగ్యంగా ఉన్నామన్నారు.  

గత ఏడాది ఒకటే వర్షం..
ఒంగోలుకు 75 కి.మీ. దూరంలోని వ్యవసాయ క్షేత్రంలో మొత్తం 40 ఎకరాలకు గాను 20 ఎకరాల్లో మామిడి, నేరేడు, దానిమ్మ, సీతాఫలం, అరటి, జామ, బొప్పాయి, నిమ్మ, సపోట తదితర పండ్ల తోటలతోపాటు అంతర పంటలను సుజాత సాగు చేస్తున్నారు. మిగతా పొలంలో అపరాలు, చిరుధాన్యాలు, అన్ని రకాల కూరగాయ పంటలను పంటల మార్పిడి పద్ధతిలో సాగు చేస్తున్నారు. 5 ఎకరాల్లో మామిడి ప్రధాన పంటగా పాలేకర్‌ చెప్పిన విధంగా 5 అంతస్తుల సేద్యం ప్రారంభించారు. అరెకరంలో పశుగ్రాసాన్ని సాగు చేస్తున్నారు. కేవలం పక్షుల ఆహారం కోసం పొలం చుట్టూ కొన్ని సాళ్లలో జొన్న పంట వేస్తున్నారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటలకు గుంపులుగా వచ్చే పక్షులు జొన్న గింజలు తిని వెళ్తుంటాయని.. అవి ఇతర పంటల జోలికి ఎప్పుడూ రాలేదని ఆమె తెలిపారు.

పాలేకర్‌ పద్ధతిపై కుదిరిన నమ్మకం
తమ ప్రాంతంలో గత ఏడాది తీవ్ర కరువు పరిస్థితుల్లో ఒక్కటే వర్షం కురిసినప్పుటికీ కందులు, మినుములు, కొర్రలు, జొన్న, శనగ వంటి పంటలు పండించగలిగానని సుజాత తెలిపారు. ఆ ప్రాంతంలో భూములన్నీ బీళ్లుగా ఉన్న రోజుల్లో తాము ప్రకృతి సేద్యం ప్రారంభించి.. వివిధ పంటలు సాగు చేస్తుండటంతో స్థానికులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడు చాలా పొలాల్లో పంటలు సాగవుతున్నాయని ఆమె సంతృప్తిగా తెలిపారు. గత ఏడాది తీవ్ర కరువు పరిస్థితుల్లో తమ ప్రాంతంలో రసాయనిక వ్యవసాయం చేసిన వారికి తీవ్రనిరాశే మిగిలిందని, తాము చెప్పుకోదగిన దిగుబడి పొందగలిగామన్నారు.

పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై తమకు నమ్మకం కలిగినందున ఇతర సేంద్రియ సాగు పద్ధతులను పట్టించుకోలేదని ఆమె తెలిపారు. ఈ ఏడాది పొలం అంతటా జనుము, జీలుగ సాగు చేసి పచ్చిరొట్ట ఎరువుగా కలియదున్నుతున్నారు. అరెకరంలో వరి సాగు చేస్తున్నారు. గత ఏడాది 100 మిరప మొక్కలు సాగు చేయగా మంచి దిగుబడినిచ్చాయి. ఆ స్ఫూర్తితో ఈ ఏడాది 15 ఎకరాల్లో మిరప తోట సాగు చేయాలనుకుంటున్నానని సుజాత చెప్పారు.

మార్కెటింగ్‌ సమస్యే లేదు..
వ్యవసాయం చేసిన అనుభవం లేకపోయినా పొలం కొని పట్టుదలగా ఏడాది కష్టపడి ప్రకృతి వ్యవసాయంలో లోతుపాతులను ఔపోశన పట్టాను. గత నాలుగేళ్లుగా మొక్కజొన్న మొదలుకొని కినోవా వరకు అనేక రకాల పంటలను పండించిన అనుభవం గడించాను. కందులు, మినుములు, కొర్రలు తదితర పంటలను గత ఏడాది తీవ్ర కరువులోనూ చక్కగా పండించాను. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో బెట్టను తట్టుకొని, తక్కువ నీటితో సాగు చేస్తున్నాను. ఈ ధైర్యంతోనే ఈ ఏడాది 15 ఎకరాల్లో మిరపను ప్రధాన పంటగా సాగు చేయబోతున్నాను.

మేం పండించిన ఉత్పత్తులను మొదటి ఏడాది బంధుమిత్రులకు ఉచితంగా ఇచ్చి రుచి చూపించాం. తర్వాత నుంచి మా ఇంటికి వచ్చి మరీ కొనుక్కెళ్తున్నారు. చెన్నైలో బంధుమిత్రులు, వైద్యులతో పాటు స్థానిక వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు సైతం మా ఇంటికి వచ్చి కొనుక్కెళ్తున్నారు. కిలో కందిపప్పు రూ. 180, మినప్పప్పు రూ.150, శనగలు రూ. 80, రాగులు, జొన్నలు, సజ్జలు రూ. 50 చొప్పున అమ్ముతున్నాం. నమ్మకంగా, రాజీలేకుండా ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల మా ఆహారోత్పత్తులకు మార్కెటింగ్‌ సమస్యే రాలేదు.
– గుళ్లపల్లి సుజాత (94942 59343), ప్రకృతి వ్యవసాయదారు, పెదారకట్ల, కొనకనమిట్ల, ప్రకాశం జిల్లా  

వ్యవసాయ  క్షేత్రంలో సొంత వాతావరణ కేంద్రం!
గుళ్లపల్లి సుజాత తన భర్త కోటేశ్వరరావు తోడ్పాటుతో తమ వ్యవసాయ క్షేత్రంలో వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సొంత ఖర్చుతో ఆస్ట్రేలియా నుంచి తెప్పించిన యంత్రపరికరాలతో దీన్ని నెలకొల్పారు. దీని ద్వారా సేకరించే తాజా సమాచారం ద్వారా వర్షం రాకపోకల గురించి, వాతావరణ మార్పుల గురించి కచ్చితమైన ముందస్తు సమాచారం తెలుసుకోగలగడం చాలా ఉపయోగకరంగా ఉందని కోటేశ్వరరావు తెలిపారు. ఈ రోజు వర్షం వస్తుందన్న సూచన ఉన్నప్పుడు పురుగుల మందు చల్లడం లేదని, నీటి తడి ఇవ్వటం లేదని.. ఆ విధంగా వనరుల వృథా తగ్గిందని అంటున్నారు.

వాతావరణ సూచనలను బట్టి పొలం పనుల ప్రణాళిక ఎప్పటికప్పుడు సవరించుకుంటూ ప్రయోజనం పొందుతున్నామన్నారు. వర్షం, ఉష్ణోగ్రత, గాలిలో తేమ, గాలుల తీవ్రతపై ఈ కేంద్రం అందించే సమాచారం 5 కిలోమీటర్ల పరిధిలోని రైతులకు కూడా ఉపయుక్తంగా ఉంటాయన్నారు. ఇటీవల ఒక డ్రోన్‌ను కొనుగోలు చేశారు. పంటలు, తోటల తీరుతెన్నుల పరిశీలన, పర్యవేక్షణ ఇక మరింత సులభతరం కానుందని కోటేశ్వరరావు, సుజాత చెప్పారు. తమ ప్రాంతంలో ఇతర రైతులకు కూడా సేవలందించాలన్న ఆలోచన ఉందన్నారు.
– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌
ఇన్‌పుట్స్‌: నాగం వెంకటేశ్వర్లు, సాక్షి, కొనకనమిట్ల, ప్రకాశం జిల్లా
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top