బాణసంచా మనదేనట! | Manadenata fireworks | Sakshi
Sakshi News home page

బాణసంచా మనదేనట!

Nov 11 2015 1:42 AM | Updated on Sep 13 2018 5:25 PM

బాణసంచా మనదేనట! - Sakshi

బాణసంచా మనదేనట!

బాణసంచాను చైనావాళ్లు కనిపెట్టారనేది బాగా ప్రచారంలోకి వచ్చిన చరిత్ర.

పీఛేముడ్

బాణసంచాను చైనావాళ్లు కనిపెట్టారనేది బాగా ప్రచారంలోకి వచ్చిన చరిత్ర. అయితే, చైనావాళ్ల కంటే ముందే భారతీయులే బాణసంచాను కనిపెట్టి ఉంటారని జర్మన్ చరిత్రకారుడు డాక్టర్ గుస్తావ్ ఓపెర్ట్ వాదన. క్రీస్తుశకం 600-900 మధ్యకాలంలో చైనావాళ్లు తొలిసారిగా గన్‌పౌడర్‌ను కనిపెట్టినట్లు ఒక అంచనా. నవయవ్వన ఔషధాన్ని తయారు చేసే క్రమంలో చైనా రసవేత్తలు గన్‌పౌడర్‌ను తయారుచేశారని చెబుతారు. సాల్ట్‌పీటర్ (పొటాషియం నైట్రేట్), గంధకం, బొగ్గు కొన్ని నిర్దిష్టమైన పాళ్లలో కలిపి వాళ్లు గన్‌పౌడర్‌ను తయారు చేశారు. వేడుకల్లో ఉపయోగించే బాణసంచా మొదలుకొని, యుద్ధాల్లో ఉపయోగించే తుపాకులు, ఫిరంగుల వంటి ఆయుధాలలో దీని వాడుక మొదలైంది.

గన్‌పౌడర్ ఆవిష్కరణ తర్వాత యుద్ధచరిత్రలో పెనుమార్పులే వచ్చాయి. అయితే, క్రీస్తుపూర్వం మూడో శతాబ్దిలోని కౌటిల్యుడి అర్థశాస్త్రంలో గన్‌పౌడర్‌కు కీలకమైన సాల్ట్‌పీటర్ ప్రస్తావన ఉందని, దీనిని చాణక్యుడు ‘అగ్నిచూర్ణం’గా సంబోధించాడని గుస్తావ్ ఓపెర్ట్ శతాబ్దం కిందటే వెల్లడించారు. కేవలం కౌటిల్యుడి అర్థశాస్త్రమే కాదు, వైశంపాయనుడి ‘నీతిప్రకాశిక’లోను, ‘శుక్రనీతి’లోను కూడా దీని ప్రస్తావన ఉండేదని, అప్పట్లో శత్రువులను గందరగోళానికి గురిచేసేందుకు ఎండిన చెట్లబెరడుకు మంటరాజేసి, దట్టంగా పొగవచ్చేలా చేసేందుకు అందులో అగ్నిచూర్ణాన్ని (సాల్ట్‌పీటర్) వేసేవారని వివరించారు. చైనాలో గన్‌పౌడర్ ఆవిష్కరణ కంటే ముందే భారతీయులకు దీని ప్రయోజనాలు తెలుసని తన పరిశోధన ద్వారా వెల్లడించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement