నేను ఇలా చెయ్యడం సముచితమేనా? 

Is it appropriate for me to do this? - Sakshi

చెట్టు నీడ 

ఆయన ఓ సాధువు. ఆయన దగ్గర బోలెడంత మంది శిష్యులున్నారు. ఓ రోజు ఆయన వద్దకు ఓ పాత శిష్యుడు వచ్చాడు. గురువుగారికి నమస్కరించాడు. అవీ ఇవీ మాట్లాడుకున్నాక అతను ‘‘గురువుగారూ నాకో సందేహం. మనసెప్పుడూ గందరగోళంగా ఉంటోంది’’ అన్నాడు శిష్యుడు.‘‘ఎందుకు?’’ గురువుగారు ప్రశ్నించారు.‘‘నేను మీ దగ్గరున్న రోజుల్లో పద్ధతి ప్రకారమే ధ్యానపద్ధతులు నేర్చుకున్నాను. అంకితభావంతోనే అనుసరించాను. ఆ ధ్యానపద్ధతులు నాకు తగిన ప్రశాంతతనే ఇచ్చాయి. మంచి ఆలోచనలు చేయగలుగుతున్నాను కూడా. ఇది అనుభవపూర్వకంగానే తెలుసుకున్నాను’’ అన్నాడు ఆ పాత శిష్యుడు. ‘‘అటువంటప్పుడు సంతోషమేగా... మరెందుకు గందరగోళం?’’ అన్నాడు గురువు.‘‘నేను ధ్యానంలో లేనప్పుడు పూర్తి మంచి వాడిగా ఉంటున్నానో లేదో అనే సందేహం కలుగుతోంది. ఆ విషయం నాకే తెలుస్తోంది. కొన్నిసార్లు సరిగ్గా లేనని అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడూ ఒకటి రెండు తప్పులు కూడా చేస్తున్నాను.

ధ్యానం తెలిసిన నేను ఇలా చేయడం సముచితమేనా. అది ఆలోచించినప్పుడు నా మనసు కలవరపడుతోంది’’ అన్నాడు శిష్యుడు.అతను చెప్పిన మాటలన్నీ విన్న గురువుగారు ఓ నవ్వు నవ్వారు.‘‘ఆహా, నువ్వు ధ్యానమూ చేస్తున్నావు. తప్పులూ చేస్తున్నావు. అంతేగా నీ మాట’’ అన్నాడు గురువు.‘‘అవును గురువుగారూ...’’ అది తప్పు కదా అని అడిగాడు గురువు.‘‘కాదు. నువ్వు రోజూ ధ్యానం చెయ్యి. తప్పులూ చెయ్యి. ఇలాగే చేస్తూ ఉండు. ఏదో రోజు ఈ రెండింట్లో ఏదో ఒకటి ఆగిపోతుంది’’ అన్నాడు గురువు.‘‘అయ్యో.. గురువుగారూ అలా అంటే ఎలాగండీ... ఒకవేళ తప్పులకు బదులు ధ్యానం ఆగిపోతే..?’’ అని ప్రశ్నార్థకంగా చూశాడు శిష్యుడు గురువు వంక.‘‘అదీ మంచిదేగా....నీ నైజమేంటో నీ సహజత్వమేదో తెలిసొస్తుంది కదా’’ అన్నాడు గురువు. అర్థమైందన్నట్లుగా చిరునవ్వుతో తల పంకిస్తూ గురువుగారికి నమస్కరించాడతను. 
యామిజాల జగదీశ్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top