
కార్లో అక్యూటిస్‌కు మరణానంతరం ప్రకటించిన పోప్
వాటికన్ సిటీ: కార్లో అక్యూటిస్. వీడియో గేమ్స్ ఆడుతూ, పెంపుడు జంతువులతో వీడియోలు చేస్తూ సరదాగా గడిపిన టీనేజర్. అదే సమయంలో డిజిటల్ వేదికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ ప్రచారానికి ఎనలేని కృషి చేసిన ‘దైవ ప్రభావకుడు (గాడ్స్ ఇన్‌ఫ్లుయెన్సర్)’. లుకేమియా (రక్త కణజాల క్యాన్సర్) బారిన పడి 15 ఏళ్ల వయసులోనే కన్నుమూసిన కార్లోకు సెయింట్ హోదా కట్టబెట్టి క్యాథలిక్ చర్చి పెను సంచలనం సృష్టించింది.
వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో అసంఖ్యాకంగా గుమిగూడిన విశ్వాసుల సాక్షిగా.. కార్లో తల్లిదండ్రులు, కుటుంబీకుల సమక్షంలో పోప్ లియో–14 ఆదివారం స్వయంగా సెయింట్‌హుడ్ ప్రకటించారు. డిజిటల్ వేదిక ద్వారా క్రైస్తవాన్ని లక్షలాది మంది విశ్వాసులకు చేరువ చేసినందుకు గౌరవసూచకంగా కార్లోను ఈ విధంగా గౌరవించుకున్నట్టు వాటికన్ వర్గాలు తెలిపాయి. సెయింట్ హోదా పొందిన తొలి మిలీనియల్‌గా కార్లో చరిత్ర పుటలకెక్కారు.
1980–90 మధ్య పుట్టిన వారిని మిలీనియల్స్ అంటారన్నది తెలిసిందే. కార్లో లుకేమియా బారిన పడి 2006లో 15 ఏళ్లకే స్వర్గస్థులయ్యారు. దేవునికి అంకితమై కార్లో అప్పటికే తన జీవితంలో ఎన్నో అద్భుతాలను చేశారని సెయింట్‌హుడ్ కార్యక్రమంలో పోప్ కీర్తించారు.
ఆయన పోప్‌గా బాధ్యతలు చేపట్టాక ఈ కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి. ‘‘మరణానంతరం కార్లో రెండు అద్భుతాలకు కారకుడయ్యారు. పాంక్రియాటిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఓ బ్రెజిల్ చిన్నారి తల్లిదండ్రులు కార్లోను స్తుతించగా వ్యాధి నయమైంది. ప్రమాదం బారిన పడ్డ ఓ కోస్టారికా విద్యార్థి కార్లోను ప్రారి్థంచి కోలుకున్నాడు’’అని పోప్ వెల్లడించారు.
‘అత్యాధునిక’ ఆధ్యాత్మిక కెరటం!
జీన్స్. టీ–షర్ట్. స్నీకర్ షూ. అల్ట్రా మోడర్న్ టీనేజర్‌కు అచ్చమైన ప్రతీక కార్లో. కానీ పయనించిందంతా ఆధ్యాత్మిక మార్గం. ఇంతటి వైరుధ్యానికి మారుపేరుగా నిలిచిన కార్లో 1991లో ఇటాలియన్ తల్లిదండ్రులకు లండన్‌లో పుట్టారు. తర్వాత వారి కుటుంబం ఇటలీలోని మిలాన్‌కు మారింది. చిన్నతనంలో అల్లరి పిడుగే అయినా పదేళ్లు దాటకుండానే క్రైస్తవం, క్రీస్తు బోధల పట్ల అచంచల విశ్వాసం పెంచుకున్నారు.
పక్కింటి పిల్లాడిలా అత్యంత సాదాగా కనిపించినా, అసాధారణ పనులతో క్యాథలిక్ ప్రపంచంలో చెరిగిపోని పేరు సంపాదించుకున్నారు. కంప్యూటర్ కోడింగ్‌పై కార్లోకు అపారమైన పట్టుంది. క్రీస్తు బోధలను, ఆయన చూపిన అద్భుతాలను ప్రపంచమంతటికీ తెలిపే లక్ష్యంతో ‘క్యాథలిక్ ఫెయిత్’ ఏకంగా ఓ బహుభాషా వెబ్‌సైట్ పెట్టారు. లుకేమియా బారిన పడి మరణించాక ఆయన దేహాన్ని విశ్వాసుల సందర్శనార్థం ఇటలీలోని అసిసీ నగరంలో గాజుపేటికలో భద్రపరిచారు. ఆయన చివరగా ధరించిన జీన్స్, నైక్ ట్రైనర్ దుస్తుల్లోనే ఉంచడం విశేషం! దాన్ని ఏటా లక్షలాది మంది సందర్శిస్తారు.