మగువలకు తెగువ పాఠాలు | Sakshi
Sakshi News home page

మగువలకు తెగువ పాఠాలు

Published Tue, Jul 5 2016 10:34 PM

మగువలకు తెగువ పాఠాలు

ఆకాశంలో సగభాగమైన మగువలు పారిశ్రామిక, ఉద్యోగ, వ్యాపార, వైమానిక, విద్యారంగాల్లో తమ సత్తాను చాటుతూ అన్నింటా పురుషులకు దీటుగా నిలుస్తున్నారు. అయినా సరే, ఢిల్లీ నుంచి గల్లీ వరకు మగువలకు తగిన రక్షణ లేక మృగాళ్ల చేతుల్లో హత్యాచారాలకు గురవుతున్నారు. గృహిణుల మెడల్లో చైన్లను పట్టపగలే తెంపుకెళ్లిపోతుంటే ఏమీ చేయలేక నిస్సహాయులవుతున్నారు. మగవారి కంటే శారీకంగా మహిళలు తక్కువ బలాన్ని కలిగి ఉంటారు. ఆ బలహీనతనే ఆసరాగా చేసుకుని కొందరు దుర్మార్గులు వారి జీవితాలను కాలరాచేందుకు సైతం వెనుకాడరు. ఇలాంటి సందర్భాల్లో కనీసం ప్రత్యర్ధిని ఏమీ చేయలేకపోయినా ధైర్యంతో తమను తాము రక్షించుకునేందుకు వీలుగా ఊరూరూ తిరుగుతూ వారికి కరాటేను నేర్పుతున్నారు కొడాలి రవిబాబు, సాగరిక దంపతులు. విజయవాడలో కరాటే శిక్షణను ఇచ్చే రవిబాబును ఏపీలోనే తొలి ఇన్‌స్ట్రక్టర్‌గా 2014లో జపాన్ కరాటే అసోసియేషన్ వారు గుర్తించి ధ్రువపత్రాన్ని అందించారు. 


సాగరిక గన్నవరంలోని ఒక ప్రైవేట్ కాలేజీలో ఫ్యాకల్టీగా పని చేస్తూ... తన భర్త అడుగుజాడల్లో నడుస్తూ మహిళల ఆత్మరక్షణకు కరాటేను నేర్పుతున్నారు. దానితోపాటు ప్రజలలో మూఢనమ్మకాలను పారదోలటానికి అవగాహనా శిబిరాలను నిర్వహిస్తున్నారు.  ‘‘మహిళలపై దాడులు ఢిల్లీ తర్వాత విజయవాడలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. 2012లో నిర్భయ హత్య జరిగినపుడు మచిలీపట్నంలో 60మంది ఆడపిల్లలకు కరాటేపై శిక్షణా శిబిరం నిర్వహించాం. అదే ఈ ఉచిత కరాటే శిక్షణాశిబిరాలకు ఆరంభం. అమ్మాయిలను అనుసరిస్తూ, వారిని కామెంట్ చేయడమే పనిగా పెట్టుకుంటారు కొందరు ఆకతాయిలు. వారికి భయపడితే అదే ఆసరాగా తీసుకుని మరో అడుగు ముందుకేస్తారు.



చైన్‌స్నాచర్లయితే, మహిళల మెడలో నుంచి చైన్లను బలవంతంగా లాగేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో ధైర్యంగా ఉంటే కనీసం ఆత్మరక్షణ చేసుకోవచ్చు. అందుకోసం కరాటేలో కొన్ని మెళకువలు ఉన్నాయి. వాటినే క్యాంప్‌ల ద్వారా ఊరూరా నేర్పుతున్నాం. అలాగే చేతబడి, బాణామతి, చిల్లంగి వంటివాటిపై ప్రజలలో ఉన్న మూఢనమ్మకాలను పారద్రోలేందుకు అవగాహన శిబిరాలను నిర్వహిస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు రవిబాబు, సాగరిక దంపతులు. వారి ప్రయత్నాలు నెరవేరాలని ఆశిద్దాం.
 - అయికా రాంబాబు  సాక్షి, గుడ్లవల్లేరు, కృష్ణాజిల్లా)

Advertisement
Advertisement