ప్రాణాయామంతో  ఏకాగ్రత మెరుగు

Improve concentration with cravings - Sakshi

యోగాలో ప్రాణాయామం అతి ముఖ్యమైన ప్రక్రియ. ఊపిరి తీసుకోవడం, వదలడంలో ఒక క్రమపద్ధతిని అనుసరించే ప్రాణాయామం ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలుసు కానీ.. ఎలా అన్నది మాత్రం ఇప్పటివరకూ చాలామందికి తెలియదు. డబ్లిన్‌లోని ట్రినిటీ కాలేజ్‌ శాస్త్రవేత్తలు ఈ లోటును భర్తీ చేశారు. ప్రాణాయామం మెదడులోని లోకస్‌ కొయిరులియస్‌ ప్రాంతంపై ప్రభావం చూపుతుందని గుర్తించారు. ఈ మెదడు ప్రాంతం నోరా అడ్రినలిన్‌ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒత్తిడి పెరిగినప్పుడు ఈ హార్మోన్‌ ఎక్కువగాను, ఆలోచనలు మందకొడిగా సాగినప్పుడు తక్కువగానూ ఉత్పత్తి అవుతుందని, ఈ రెండింటి ఫలితంగా ఏకాగ్రత కోల్పోతామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మైకేల్‌ మెలిన్‌ఛుక్‌ తెలిపారు.

ఊపిరి తీసుకుని, వదిలేసే క్రమంలో శరీరంలోని కార్బన్‌డయాక్సైడ్‌  మోతాదుల్లో మార్పులు వస్తాయని.. ఈ మార్పులకు స్పందిస్తూ లోకస్‌ కొయిరులియస్‌ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తూంటుందని వివరించారు. గాలి లోపలికి పీల్చుకున్నప్పుడు ఎక్కువగా, వదిలేసినప్పుడు తక్కువగా పనిచేసి మన ఉద్వేగాలను, ఏకాగ్రతను కూడా ప్రభావితం చేస్తుందని చెప్పారు. మతిమరపుతో బాధపడే వారికి, ఏకాగ్రత కుదరని పిల్లలకు మెరుగైన చికిత్స కల్పించేందుకు తమ పరిశోధన ఉపకరిస్తుందని మైకేల్‌ తెలిపారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top